विवेचन सारांश
కర్మలు - వాటి విశిష్టత

ID: 3156
तेलुगू - తెలుగు
శనివారం, 24 జూన్ 2023
అధ్యాయము 3: కర్మ యోగము
1/4 (శ్లోకము 1-12)
వివేచకులు: గీత విశారద శ్రీ శ్రీనివాస వర్ణేకర్ గారు/


పరంపరానుసారంగా ప్రార్థన మరియు దీప ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనది. పరమ ఆదరణీయ, గీతావ్రతి, గీతావిశారద్ శ్రీ శ్రీనివాస్ వార్ణేకర్ గారి ద్వారా మూడవ అధ్యాయం వివేచన మొదటి భాగం ప్రారంభమైనది. గురు ప్రార్థన, కృష్ణ భగవానుని ప్రార్థన, గీతా ధ్యానం, సద్గురు శ్రీ గోవింద్ దేవ్ గిరీ జీ మహారాజ్ చరణములకు వందనము, గీతా సాధకులకు, గీతా ప్రేమికులకు హృదయాభివాదము చేసిన తరువాత వివేచనను ఆరంభించారు. మీరు మొదటి అధ్యాయం చింతన చేసియున్నారు. యుద్ధం ప్రారంభమవ్వబోతుండగా, యుద్ధాన్ని ఆపడం ఇక సాధ్యం కాదన్న పరిస్థితులలో అర్జునిని మనసులో ఉదయించిన మోహానికి, “న యోత్స్య ఇతి గోవిన్దమ్, ఉక్త్వా తూష్ణీం(మ్) బభూవ హ” (2.9) - నేను యుద్ధం చేయను అంటూ మౌనంగా రథంలో కూర్చుండి పోయిన అర్జునునికి, “రథోపస్థ ఉపావిశత్ । విసృజ్య సశరం(ఞ్) చాపం(మ్), శోకసంవిగ్నమానసః” (1.47) - అస్త్రములను త్యజించి, శోకముతో రథములో కూర్చుండి పోయిన అర్జునునికి భగవంతుడు రెండవ అధ్యాయం పదకొండవ శ్లోకం నుంచి ఉపదేశం ప్రారంభిస్తాడు. రెండవ అధ్యాయం రెండవ శ్లోకంతోనే భగవంతుడు అర్జునిని మందలించడం ప్రారంభిస్తాడు. అయినా కాని అర్జునుడు నాకు అర్థం కావడం లేదు, మీ శరణాగతుడుని, నాకు ఉపదేశం చేయండని అభ్యర్థిస్తాడు. “శిష్యస్తే౽హం(మ్) శాధి మాం(న్) త్వాం(మ్) ప్రపన్నమ్” (2.7) అంటూ భగవంతుని శరణుజొచ్చినప్పుడు, భగవంతుడు ఉపదేశం ప్రారంభిస్తాడు. రెండవ అధ్యాయం భగవద్గీతకు విషయ సూచికవంటిది. రెండవ అధ్యాయంలో భగవద్గీతలోని ముఖ్య తత్వాలన్నిటినీ భగవంతుడు చెబుతాడు. ఆత్మ తత్వం, జ్ఞాన మార్గం, కర్మ మహత్వం, స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి యొక్క లక్షణాలను వివరించాడు. ఇవి విన్న అర్జునునికి, భగవంతుడు కర్మ, జ్ఞాన మార్గాలు రెండూ మహత్తరమైనవే అంటున్నాడు ఎందుకన్న సందేహం జనిస్థుంది. సందేహనివృత్తికై అర్జునుడు మూడవ అధ్యాయం ప్రారంభంలోనే ప్రశ్నిస్తాడు. భగవంతుడు రెండవ అధ్యాయంలో అర్జునునితో “దూరేణ హ్యవరం(ఙ్) కర్మ, బుద్ధియోగాద్ధనఞ్జయ ౹ బుద్ధౌ శరణమన్విచ్ఛ, కృపణాః(ఫ్) ఫలహేతవః” (2.49) - కర్మ కంటే జ్ఞానము శ్రేష్ఠమైనదని చెబుతాడు. అలాగే “కర్మణ్యేవాధికారస్తే, మా ఫలేషు కదాచన” (2.47) - ఈ శ్లోకాలలో కర్మ యొక్క మహాత్వం గురించి కూడా చెబుతాడు. అర్జునిని మనసులో ఈ కారణంగా సందేహం ఉదయించింది. అర్జునుడి మనసులో ఏమిటి భగవంతుడు కాసేపు జ్ఞానము మహాత్వమైనదని, కాసేపు కర్మ మహత్వమైనదని చెబుతున్నాడు? అంతేకాక నన్ను యుద్ధం చేయమని ప్రేరేపిస్తున్నాడు? అందుకే అర్జునుడు భగవంతుణ్ణి ఇలా అడుగుతున్నాడు ...

3.1

అర్జున ఉవాచ
జ్యాయసీ చేత్కర్మణస్తే,మతా బుద్ధిర్జనార్దన
తత్కిం(ఙ్) కర్మణి ఘోరే మాం(న్), నియోజయసి కేశవ॥1॥

అర్జునుడు పలికెను - ఓ జనార్దనా! కేశవా! నీ అభిప్రాయమును బట్టి కర్మకంటెను జ్ఞానమే శ్రేష్ఠమైనచో, భయంకరమైన ఈ యుద్ధకార్యమునందు నన్నేల నియోగించుచున్నావు ?

అర్జునుడు ఇక్కడ భగవంతుడుని జనార్ధన, కేశవ అనే రెండు పేర్లతో సంభోదిస్తున్నాడు. మనం ఎప్పుడైనా ఏదైనా విషయాన్ని కొంచెం గట్టిగా చెప్పాలనుకున్నప్పుడు ఆ మనిషిని మాటిమాటికీ పేరుతో పిలుస్తాము. ఇక్కడ అర్జునుడు భగవంతుడుని రెండుసార్లు పేరుతో పిలుస్తున్నాడు. కర్మ కంటే జ్ఞానము శ్రేష్ఠమైనది అనిపిస్తే, మరి నన్నెందుకు యుద్ధం లాంటి ఘోరమైన కర్మ చేయడానికి ప్రేరేపిస్తున్నావు, నియమిస్తున్నావు? జ్ఞానము శ్రేష్ఠమైనదైతే నేను కూడా అదే కోరుకుంటున్నాను. యుద్ధం లాంటి ఘోరమైన పని చేయవలసిన ఆవశ్యకత ఏమి ఉన్నది?

3.2

వ్యామిశ్రేణేవ వాక్యేన , బుద్ధిం(మ్) మోహయసీవ మే
తదేకం(వ్ఁ) వద నిశ్చిత్య , యేన శ్రేయో౽హమాప్నుయామ్॥3.2॥

కలగాపులగమువంటి నీ మాటలతో నా బుద్ది భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు. కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెల్పుము.

మిశ్రితమైన భాషలో నీవు మాట్లాడుతున్నావు. ఒకసారి జ్ఞానము గొప్పది అంటావు, మరొకసారి కర్మ గొప్పదంటావు. కళ్యాణకరమైన మార్గం కొరకు నేను నీ శరణు కోరాను. రెండు వేరువేరు మార్గాలు చెప్పి నన్ను ఎందుకు గందరగోళానికి గురి చేస్తున్నావు? నా బుద్ధిని మోహంలో పడేస్తున్నావు. అసలే ఏమి చేయాలో తెలియక ఉన్న నాకు మరింత గందరగోళాన్ని కలిగిస్తున్నావు. నిశ్చితమైన ఒక మార్గాన్ని నాకు చెప్పు, దాన్ని అనుసరించి నేను ఉన్నతిని సాధిస్తాను. ఏమి చేస్తే నేను విజయం సాధిస్తాను, రాజ్యాన్ని పొందుతాను, సంపత్తిని పొందుతాను అని అర్జునుడు అడగటం లేదు. ఇక్కడ అర్జునుడు ఏమి ఆశిస్తున్నాడు అన్నది అత్యంత మహత్వపూర్ణమైనది. శ్రేయః- అంటే శ్రేష్ఠమైనది, ఉన్నతమైనది, నేను ఉన్నతిని సాధించడానికి ఒక మార్గం చెప్పమంటున్నాడు. రెండో అధ్యాయంలో కూడా అర్జునుడు భగవంతుని శరణు కోరినప్పుడు “యచ్ఛ్రేయః(స్) స్యాన్నిశ్చితం(మ్) బ్రూహి తన్మే, శిష్యస్తే౽హం(మ్) శాధి మాం(న్) త్వాం(మ్) ప్రపన్నమ్” (2.7) - నాకు శ్రేయస్కరమైనది చెప్పమంటాడు. కాల్పనికతలో అయినా భగవంతుడు మనకు ప్రత్యక్షమై వత్సా నీకేమి కావలెను అని అడిగితే, ధన ధాన్యాలా, బుద్ధా, జ్ఞానమా, భగవంతుని ఏమి కోరాలన్నది మన మనసులో నిశ్చయమై ఉండాలి కదా. ఇక్కడ అర్జునుడు భగవంతుని కోరినది చాలా మహత్వపూర్ణమైనది, నాకు ఏమి తెలియడం లేదు, శ్రేయస్కరమైన దేదో అది, ఒక నిశ్చితమైన మాట చెప్పండి. శ్రేయ- ప్రేయ రెండు పదాలు. ప్రేయ అనగా ప్రియమైనది. మనకి ప్రియమైనదేదో మనకి తెలుస్తుంది కాని మనకి శ్రేయస్కరమైనదేదో అడగవలసి ఉంటుంది. మనం వైద్యుని దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అని అడుగుతాము. దేనివల్ల మంచి జరుగుతుందో అడగవలసి ఉంటుంది. అందుకే జ్ఞానేశ్వర్ మహరాజ్ ఒక సుందరమైన మాటను విశదీకరించారు. ముందు నుంచే అయోమయం లో ఉన్న నాకు మీరు మిశ్రితమైన భాషలో చెబితే ఏం చేయాలి? మీ ఉపదేశం ఎలా ఉందంటే ఒక అంధుడు ఎలా వెళ్లాలి అని అడిగితే ఇటైనా వెళ్ళవచ్చు అటైయినా వెళ్ళవచ్చు అని చెప్పినట్టు ఉంది. ఏదో ఒక నిశ్చితమైన దారి చెప్పవచ్చును కదా. భగవంతుడు అర్జునుని గందరగోళం దూరం చేయడానికి ఈ విధంగా చెబుతున్నాడు ...

3.3

శ్రీ భగవానువాచ
లోకే౽స్మిన్ద్వివిధా నిష్ఠా, పురా ప్రోక్తా మయానఘ
జ్ఞానయోగేన సాఙ్ఖ్యానాం(ఙ్), కర్మయోగేన యోగినామ్॥3॥

శ్రీభగవానుడు పలికెను- ఓ అనఘా! అర్జునా! ఈ లోకమున రెండు నిష్ఠలు గలవని ఇంతకుముందే చెప్పియుంటిని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగముద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును.

భగవంతుడు అర్జునునికి ఎంతో ప్రేమతో వివరించాడు. నేను ఈ రెండు విషయాలను ముందు కూడా చెప్పి ఉన్నాను, “లోకే౽స్మిన్ద్వివిధా నిష్ఠా, పురాప్రోక్తా మయానఘ”. గమ్యాన్ని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉండవచ్చును. నీవు ఈ రెండు మార్గాల ద్వారా కూడా గమ్యాన్ని చేరుకోవచ్చు. ఏ మార్గం ద్వారా చేరుకోవాలన్నది యోగ్యతపై ఆధారపడి ఉంటుంది. జ్ఞాన మార్గము, కర్మ మార్గము అనేవి రెండు చెప్పాను. ఎవరు ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అన్నది వారి ప్రకృతి స్వభావం మరియు యోగ్యతపై ఆధారపడి ఉంటుంది. అందుకే జ్ఞానేశ్వర్ మహారాజ్ స్పష్టంగా వివరించారు. మామిడి చెట్టుపై ఉన్న పండ్లను తినడానికి పక్షి ఎగిరి వెళ్లి నచ్చిన పండుని తినవచ్చును, అదే మనిషి అయితే కొమ్మలపై ఎక్కి కావలసిన పండుని కోయవలసి ఉంటుంది. ఆ పండుని సాధించడానికి మనిషికి ఉన్న మార్గం వేరు, పక్షికి ఉన్న మార్గం వేరు. పక్షికి యోగ్యత ఉంది కాబట్టి ఎగిరి వెళ్ళగలదు. అందుకే మనిషికి ఉన్న యోగ్యతను బట్టి మార్గం ఎంచుకోవాల్సి ఉంటుంది. కర్మ యోగం గురించి చెబుతూ అవసరం పడింది కాబట్టి జ్ఞాన యోగం గురించి కూడా చెప్పాను. నీ యోగ్యతను బట్టి నీ మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలి. కర్మ యోగంలో క్రియాశీలత ప్రధానమైనదైతే, జ్ఞాన యోగములో చింతన, మనన, బుద్ధి ప్రధానమైనవి. ఈ రెంటిలో దేనిని అనుసరించాలి అన్నది ఆ వ్యక్తి స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఒక సంత్ మహరాజ్ ఆశ్రమం ముందు రహదారి నిర్మాణంలో ఉన్నప్పుడు అనేకమంది కూలీలు రాళ్లను ముక్కలు చేయడంలో నిమగ్నమై ఉండేవారు. ఆశ్రమానికి కొంతమంది భక్తులు వచ్చి ధ్యానంలో గడుపుతూ మధ్యాహ్నం భోజనం చేసి మరల కాసేపు ధ్యానం చేసుకుని వెళ్లేవారు. దీనిని గమనించిన కూలీలు వీరి పని బాగుంది, ఏమీ చేయవలసిన అవసరం లేదు, కళ్ళు మూసుకొని కూర్చుని, తరువాత చక్కగా భోజనం చేసి ఆపై మరలా కాసేపు కూర్చుని వెళుతున్నారు అనుకోవడం మహారాజ్ చెవులకు చేరుతుంది. మహారాజ్ వారిని పిలిచి ఈ రాళ్లను పగలగొట్టే పనిచేయటం వల్ల మీకు రోజూ ఎంత డబ్బు వస్తుంది అని అడుగుతారు. చాలా పాతకాలం నాటి మాట, రోజుకి నాలుగు అణాలు లభిస్తుందని చెబుతారు. మహారాజ్ వార్ని రేపటి నుంచి మా ఆశ్రమానికి రండి, మీకు రోజుకు ఎనిమిది అణాలు ఇస్తాను అంటారు. దానికి వారు ఏమి పని చేయాల్సింది ఉంటుంది అని అడుగుతారు. ఎక్కువ కష్టమైనది కాదు, రేపు మీరు రండి అని మహారాజ్ అంటారు. మర్నాడు రోజు కూలీ ఎక్కువ దొరుకుతుందన్న ఆశతో ఆశ్రమానికి వచ్చిన కూలీలకు మహారాజ్ తలొక జపమాల ఇచ్చి ఇక్కడ కూర్చుని శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్ అంటూ చెబుతూ ఉండమంటారు. ఒకటి రెండు మాలలు జపించిన తరువాత వారిలో ఇలాగే జపిస్తూ కూర్చోవాలా అన్న అసహనం మొదలైనది. ఒక్కొక్కరుగా లేచి మాలను మహారాజ్ కి ఇచ్చి, మహారాజ్ మీ మాలను మీ దగ్గరే ఉంచుకోండి మా పనిని మేము చేసుకుంటాం అంటూ వెళ్లిపోతారు. మనిషి తన స్వభావానుసారంగానే ఏదైనా చేయగలుగుతాడు. రాళ్లను కొట్టే వారికి నాలుగు గంటలు ఒక చోట కూర్చుని ఉండటం వారి స్వభావానికి విరుద్ధం. భగవంతుడు అర్జునునితో ఈ రెండు మార్గాలు ఉన్నాయి, వీటిలో ఎవరికి ఏది అనువైనదో దాన్ని అనుసరించాలి అంటాడు. అర్జునుడు క్షత్రియుడు, క్రియా ప్రధానమైన వాడు కావటం వల్ల భగవంతుడు కర్మయోగాన్ని విశదీకరిస్తున్నాడు.

3.4

న కర్మణామనారమ్భాన్, నైష్కర్మ్యం(మ్) పురుషో౽శ్నుతే
న చ సన్న్యసనాదేవ, సిద్ధిం(మ్) సమధిగచ్ఛతి॥4॥

మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్ఠాసిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్ఠను అతడు పొందజాలడు.

ఇక్కడ భగవంతుడు అర్జునునికి చెప్పిన దాంట్లో రెండు మహత్వపూర్వమైన మాటలు ఉన్నాయి, నైష్కర్మ్యం మరియు సిద్ధిం. నైష్కర్మ్యం అంటే మోక్షావస్థగా చెప్పుకోవచ్చును, పరమ సిద్ధి- పరమాత్మను సిద్ధించు కోవడం. ఇది సాధించిన వారికి ఏ పని చేయవలసిన అవసరం లేదు. నైష్కర్మ్య సిద్ధి పొందినవారు అన్నీ చేస్తూనే ఏమి చేయరు, ఏమీ చేయకుండానే అన్ని చేస్తారు. దీనిని అర్థం చేసుకోవడానికి సూర్యభగవానుని ఉదాహరణగా తీసుకుందాం. సూర్య భగవానుడు రోజూ ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, అందువలన రోజంతా మనం పనులు చేసుకోగలుగుతాం, చెట్టు చేమల పోషణ జరుగుతుంది, వర్షాలు కురుస్తాయి. ఒకరు సూర్యభగవానునికి నమస్కరిస్తూ, అర్ఘ్యాన్ని అర్పిస్తూ నువ్వు రోజు ఎంత పని చేస్తున్నావో, ఈ విశ్వంలో నీలాగ పనిచేసేవారు ఎవరూ కనిపించరు అంటే, సూర్య భగవానుడు అంటాడు నేనేమీ చేయను, ఉదయించను, అస్తమించను, నేను నా స్థానంలో ఉంటాను, భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల మీకు ఉదయిస్తాను, అస్తమిస్తాను అనిపిస్తుంది. అయితే సూర్య భగవానుడు వాస్తవంగా ఏమైనా చేస్తున్నాడా, వాస్తవంగా ఏమీ చేయడం లేదు కాని సూర్యుడు లేకుండా మనకి ఇక్కడ ఒక ఆకు కూడా కదలదు. సూర్యుని వలనే భూమిపై అన్నీ జరుగుతాయి కాని సూర్యుడు మాత్రం ఏమీ చేయటం లేదు. ఆయన ఏమీ చేయకుండానే అన్నీ జరుగుతున్నాయి. మన అస్తిత్వమే ఆయనవల్ల ఉంది. నైష్కర్మ్య సిద్ధి అంటే అలాంటి అవస్థ. పరమ సిద్ధిని సాధించడం. దీనిని మోక్షం అని కూడా అనవచ్చును. మోక్షము అనగా దుఃఖం నుంచి ముక్తి. దుఃఖం నుంచి ముక్తి లభించాలని అందరూ కోరుకునేదే. దీనికి భగవంతుడు “న కర్మణామనారమ్భాన్, నైష్కర్మ్యం(మ్) పురుషో౽శ్నుతే” అని చెబుతున్నాడు. ఎవరికైనా సరే కర్మలు చేయకుండా మోక్షప్రాప్తి లభించదు. నైష్కర్మ్య సిద్ధి లభించిన వారికి ఇక కర్మలు చేయవలసిన ఆవశ్యకత ఉండదు. భక్త తుకారాం మహారాజ్ ఏమి చెబుతున్నారంటే మోక్షం తో నా వివాహం జరిగిపోయింది అని. దేహదారులైన వ్యక్తులకు ఈ అవస్థను చేరుకోవడం కర్మలు చేయకుండా సాధ్యం కాదు. “న చ సంన్యసనాదేవ” - అన్నీ వదిలి సన్యాసం తీసుకున్నంత మాత్రాన మోక్షం లభించదు. ముందు కర్మయోగాన్ని ఆచరించవలసి ఉంటుంది. మోక్షప్రాప్తికి ఎవరైనా సరే కర్మలను ఆచరించవలసినదే, కర్మలను ఆచరించకుండా ఒక్క క్షణం కూడా ఎవరూ ఉండలేరని ముందు ముందు భగవంతుడు చెబుతున్నాడు ...

3.5

న హి కశ్చిత్క్షణమపి, జాతు తిష్ఠత్యకర్మకృత్
కార్యతే హ్యవశః(ఖ్) కర్మ, సర్వః(ఫ్) ప్రకృతిజైర్గుణైః॥5॥

ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము గూడ కర్మను ఆచరింపకుండ ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకును తావులేదు. ఏలనన మనుష్యులందఱును ప్రకృతిజనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే యుండును.

ఏ ప్రాణి ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేదు. ఒకసారి ఆలోచించండి, ఎవరైనా కర్మ చేయకుండా ఉండగలరేమో. ఎవరైనా అనవచ్చును నేను ఏమీ చేయకుండా ఇక్కడే కూర్చుని ఉంటాను అని, కాని అది సంభవం కాదు. మనలో చాలా క్రియలు మన ధ్యాస లేకుండానే నడుస్తూ ఉంటాయి. శ్వాస ప్రక్రియను ఆపలేము కదా. భోజనం చేయకుండా ఎంతకాలం ఉండగలం, భోజనం చేయాలంటే ఎంతోకొంత సంపాదించాలి కదా. కొంతమందికి బహుశా సంపాదించాల్సిన అవసరం ఉండకపోవచ్చును కాని తయారై ఉన్న భోజనాన్ని భుజించాలి కదా. మనుషులు ఎవరైనా కర్మ చేయాల్సిందే. ఏ సమయంలోనూ కూడా కర్మ చేయకుండా ఏ మనిషి ఉండలేడు. ఎందుకంటే “కార్యతే హ్యవశః(ఖ్) కర్మ, సర్వః(ఫ్) ప్రకృతిజైర్గుణైః” - కారణమేమిటంటే మనం ఈ శరీరంలో ఉంటాము, ఈ శరీరము ప్రకృతి నుంచి వచ్చినది. మీరు 14 వ అధ్యాయము నేర్చుకున్నప్పుడు ప్రకృతి సత్వ, రజస్ మరియు తమస్ అనే మూడు గుణములతో ఉంటుందని తెలుసుకున్నారు. మనం ఈ శరీర బంధములో ఉన్నాము. శరీరంలో ఉన్నంతకాలం మనం శ్వాస తీసుకోవాల్సిందే, నీరు తాగాల్సిందే, భోజనం చేయవలసిందే. అందువల్ల మనం కర్మలు చేయకుండా ఉండలేము. ఎవరినైనా బంధించి ఒక రథంలో పడేస్తే ఆ రథం ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళవలసినదే. అలాగే ఈ శరీర బంధంలో ఉన్నంతకాలం దాని నిర్వహణకై కర్మలను చేయవలసినదే. కర్మలు చేయకుండా మనం ఉండలేము.

3.6

కర్మేన్ద్రియాణి సంయమ్య, య ఆస్తే మనసా స్మరన్
ఇన్ద్రియార్థాన్విమూఢాత్మా, మిథ్యాచారః(స్) స ఉచ్యతే॥6॥

బలవంతముగా, బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి, మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అనియందురు.

ఒకవేళ పనులను ఆపివేసినా, వాటిపై ఆలోచనలు వస్తూనే ఉంటాయి, మన మనసు ఆలోచిస్తూనే ఉంటుంది. మనసు చేసే కర్మ జరుగుతూనే ఉంటుంది. ఎవరైనా కర్మేంద్రియాలను నిగ్రహించి ఈరోజుకి భోజనం చేయను అని అన్నా, భోజన సమయానికి మనసు వంటింటి వైపు పరిగెడుతుంది. ఇవాళ ఏమి వండి ఉంటారు, ఈ కూర అయితే నాకు చాలా ఇష్టమైనది, నేను ఈరోజుకు బదులుగా రేపు ఈ నియమాన్ని పాటిస్తే బాగుండేది అంటూ మనసులో అనేక రకములైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. కర్మేంద్రియాలు ద్వారా నియంత్రించినా, మనసు మాత్రం ఆ విషయాలనే స్మరిస్తోంది. ఇది ఒకటే కాదు, మనసు అనేక విషయములపై ఆలోచిస్తూ ఉంటుంది. మనం ఇక్కడ కూర్చున్నా, మన మనసు మాత్రం ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. చదువుకుంటున్న బాలుడికి పక్క గదిలో టీవీలో వచ్చే క్రికెట్ ఆటపై మనసు పరుగెడుతూ ఉంటుంది, ఏమై ఉంటుంది, ఎవరు నెగ్గి ఉంటారు లాంటి అనేక రకములైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. కర్మేంద్రియాలను బలవంతంగా నియంత్రించుకుంటూ అదే విషయాలపై మనసు ఆలోచించడం అపేక్ష కాదు, భగవంతుడట్టివారిని మిథ్యాచారులంటున్నాడు. ఒకసారి ఇద్దరు యోగ సన్యాసులు అడవి గుండా వెళుతున్నారు. దారిలో ఒక నదిని దాటవలసి వచ్చినది. నదిలో నీరు ఎక్కువ లోతు లేనప్పటికీ ప్రవాహం చాలా అధికంగా ఉంది. ఇంతలో ఒక యువతి నేను మునిగి పోతున్నాను, రక్షించండి అంటూ చేసిన ఆర్తనాదాలు వినిపిస్తాయి. ఒక సన్యాసి అటువైపు చూడలేదు, రెండవ సన్యాసి మాత్రం పరుగున వెళ్లి ఆ యువతిని ఒడ్డుకు లాగుతాడు. ఆ యువతి ఇంటిదగ్గర బాలుడైన తన కుమారుడు వేచి చూస్తున్నాడని, రక్షించినందుకు కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయింది. సన్యాసులు ఇద్దరూ కూడా ఆశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమ ప్రవేశ సమయంలో సన్యాసులకి ఆడువారిని, బంగారాన్ని ముట్టుకోరాదన్న నియమాన్ని తన మిత్రుడైన రెండవ సన్యాసి ఉల్లంఘించాడని మనసులో ఆలోచన తొలచడం ప్రారంభమైనది. రెండవ రోజు ఉదయం ఆ సన్యాసి తన గురువు గారిని, మీరు ఇతనికి సన్యాస దీక్ష ఇచ్చారు, కాని ఇతడు నిన్న ఒక స్త్రీని ముట్టుకున్నాడు, ఇది ఎంతవరకు ఉచితమని ప్రశ్నించాడు. గురువుగారు రెండవ సన్యాసిని పిలిచి నీవు స్త్రీని ముట్టుకున్నావా అని అడుగగా, అతడు తనకు ఏమి గుర్తు లేదని చెప్పాడు. అప్పుడు గురువు గారు నిన్న నది దగ్గర ఒక స్త్రీని ముట్టుకున్నావా అని అడుగగా, శిష్యుడు గుర్తొచ్చింది, ఒక స్త్రీ మునిగిపోతుంటే ఆమెను రక్షించి అక్కడే వదిలి పెట్టాను అంటాడు. అప్పుడు గురువు గారు మొదటి సన్యాసిని అతడు అక్కడే వదిలి పెట్టేసాను అంటున్నాడు నీవు మాత్రం ఇంకా దాన్నే పట్టుకుని వేలాడుతున్నావా అంటాడు. ఒక సన్యాసి తన కర్తవ్య కర్మను నిర్వహించి దాని గురించి అక్కడే మరచిపోయాడు, రెండవ సన్యాసి మాత్రం దాన్ని మనసులోనే ఉంచుకున్నాడు. భగవంతుడు చెప్పేదేమంటే నీవు నీ కర్తవ్య కర్మలను నిర్వహించు , కాని ఆ విషయాలను మనసులో పెట్టుకోకు అని. మిథ్యాచారాన్ని గురించి చెప్పిన తర్వాత భగవంతుడు సరియైనదేదో కూడా చెబుతున్నాడు ...

3.7

యస్త్విన్ద్రియాణి మనసా, నియమ్యారభతేర్జున
కర్మేన్ద్రియైః(ఖ్) కర్మయోగమ్, అసక్తః(స్) స విశిష్యతే॥7॥

కాని, అర్జునా! మనస్సుతో ఇంద్రియములను వశపఱచుకొని, అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు.

ఎవరైతే ఇంద్రియములను తన మనసుతో నియంత్రించి, కర్మేంద్రియాలతో కర్మలు చేస్తారో, అటువంటి వారు మనసులో ఆ విషయములపై ఆలోచించరు. అటువంటివారిని భగవంతుడు విశిష్టమైన వారుగా, శ్రేష్ఠమైన వారుగా చెబుతున్నాడు. ఏ పని చేసినా అది పూర్తయిన తరువాత నా గురించి ఆలోచించకుండా తరువాతి పనిలో నిమగ్నం కావాలి. ఇద్దరు మిత్రులు జగన్నాథ దర్శనానికై పూరి బయలుదేరారు. మద్యలో భువనేశ్వర్ చేరుకున్నాక ఒక మిత్రుడు ఈరోజు మంచి క్రికెట్ మ్యాచ్ ఉన్నది చూసి రేపు జగన్నాథ దర్శనానికై పూరి వెళదాం అంటాడు. దానికి రెండవ మిత్రుడు మనం జగన్నాథ దర్శనానికి వచ్చాము కాబట్టి ముందు అక్కడికే వెళదాము అంటాడు. ఇద్దరికీ అభిప్రాయాలు కుదరక ఒక మిత్రుడు మ్యాచ్ చూడడానికి భువనేశ్వర్లో ఉండిపోతే రెండవ మిత్రుడు మాత్రం జగన్నాథ దర్శనానికి వెళతాడు. జగన్నాథ దర్శనం సమయంలో నా మిత్రుడు భువనేశ్వర్లో మ్యాచ్ చూస్తూ ఆనందిస్తూ ఉంటాడని ఆలోచిస్తూ ఉంటాడు. మ్యాచ్ చూస్తున్న మిత్రుడు నేను ఇక్కడున్నాను, నా మిత్రుడు జగన్నాథ దర్శనం చేసుకుంటూ ఉంటాడు అని ఆలోచిస్తున్నాడు. ఎప్పుడూ కూడా మనం, మన మనసు ఒకే చోట ఉండాలని భగవంతుడు చెబుతున్నాడు. దీని కొరకై మనసును అభ్యాసం ద్వారా దారికి తెచ్చుకుని దానిద్వారా ఇంద్రియములను నియంత్రించగలిగే వారు శ్రేష్ఠులు అని భగవంతుడు చెబుతున్నాడు. కర్మ యోగం లో మనం ఒక్కొక్క మెట్టు చూసుకుంటూ వెళుతున్నాము. మొదటి మెట్టు- కర్మలు చేయకుండా మనం ఎప్పుడూ ఉండలేము. కర్మ చేయవలసిందే. ఎలా చేయాలంటే, మనసు ద్వారా నియంత్రిస్తూ చేయాలి, మనసు ఇంద్రియ వస్తు విషయములలో చిక్కుకోకుండా చేయాలి. ఒక పని చేసిన తరువాత మరో పనిలో నిమగ్నం అవ్వాలి.

3.8

నియతం(ఙ్) కురు కర్మ త్వం(ఙ్), కర్మ జ్యాయో హ్యకర్మణః
శరీరయాత్రాపి చ తే, న ప్రసిద్ధ్యేదకర్మణః॥8॥

నీవు శాస్త్రవిహితకర్తవ్యకర్మలను ఆచరింపుము. ఏలనన, కర్మలను చేయకుండుటకంటెను చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణముగూడ సాధ్యము గాదు.

శరీరయాత్రాపి చ తే, నప్రసిద్ధ్యేదకర్మణః” - ఏ పనీ చేయకపోతే నీ శరీర పోషణ కూడ జరగదు. భోజన పానీయాలు, నివాసము లాంటివన్నీ కావాలి. ఎలాంటి పనులు చేయాలన్నదానికి భగవంతుడు “నియతం(ఙ్) కురు కర్మత్వం(ఙ్), కర్మజ్యాయో హ్యకర్మణః” - నీ విధిత కర్మలను నీవు చేయి. చాలా రకములైన కర్మలున్నాయి. విధిత కర్మ, విహిత కర్మ, నిత్య కర్మ, నైమిత్తిక కర్మ లాంటివి. అందులో విధిత కర్మలనగానేమి? ఇవి విహిత కర్మలలో ఒక భాగం. విహిత కర్మలు ఎవరు ఎప్పుడు చేయాలన్నది వేదములలో చెప్పబడినది. నాలుగు వర్ణములు చెప్పబడినవి, అంటే నాలుగు రకాలైన పనులు చేసేవారు. మనం చెప్పుకున్నట్లుగా కూలీలు రాళ్లను తేలికగా బద్దలు కొడతారు, కాని వారికి జపం చేయడం కష్టమవుతుంది. ఒక రకమైన పనులను చేయడం వారి స్వభావంగా మారుతుంది. క్షత్రియులకు క్షాత్ర వృత్తి, వైశ్యులకు వ్యాపార వృత్తి ఉన్నాయి. అది వారి స్వభావం మరియు సహజసిద్ధంగా వస్తుంది. ఆశ్రమం ఆధారంగా కూడా చేయవలసిన పనులు చెప్పబడ్డాయి. బ్రహ్మచర్య ఆశ్రమం లో ఉంటే ఏమి చేయాలి?, గృహస్థ ఆశ్రమంలో ఉంటే ఏమి చేయాలి?, వానప్రస్థ ఆశ్రమంలో ఉంటే ఏమి చేయాలి?, విధిత కర్మలన్నియు వేరువేరుగా ఉంటాయి. విహిత కర్మలు కూడా వేరుగా ఉంటాయి. విద్యార్థులైతే చదవడం, వ్యాయామం చేయడం లాంటివి. ఏ పనులలో అయితే వారి హితము ఉంటుందో వాటిని విహిత కర్మలు అంటారు. తరువాత ఆ విద్యార్థి వైద్యశాస్త్రంలో చేరితే ఆ శాస్త్ర అభ్యాసము అతని విధిత కర్మ అవుతుంది. మీ వర్ణాశ్రమము ప్రకారము ఏదైతే విధిత కర్మ అవుతుందో ఆ కర్మలను చేయమని భగవంతుడు చెబుతున్నాడు. ఏ కర్మ చేయకపోవడం కన్నా కర్మలను చేయడం శ్రేష్ఠం, అందుకే నీవు నీ విధిత కర్మలనాచరింపుము. విధిత కర్మలను ఎవరూ చేయకపోతే ఏమౌతుంది? ఒక న్యాయాధీశుడు న్యాయం చెప్పకపోతే ఎలా? ఎవరి విధిత కర్మలను వారు ఆచరించాలి. అది వారి కర్తవ్యం. ఏది సరైనదో, ఏ పరిస్థితులలో చేయాలో ఆ కర్మలను ఆచరించాలి. నిత్య కర్మ - మనం రోజు చేయవలసిన పని చేస్తూనే ఉండాలి. నైమిత్తిక కర్మలంటే పితృదేవతలకు పిండ ప్రధానం, శ్రాద్ధ కర్మలు లాంటివి. వీటిని మనం నిమిత్తులమై ఆచరించాలి. సరి అయిన, ఆవశ్యకమైన పనులు చేస్తూనే ఉండాలి.

3.9

యజ్ఞార్థాత్కర్మణో౽న్యత్ర, లోకో౽యం(ఙ్) కర్మబన్ధనః
తదర్థం(ఙ్) కర్మ కౌన్తేయ, ముక్తసఙ్గః(స్) సమాచర॥9॥

ఓ అర్జునా! యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలయందు నిమగ్నులగుటవలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుదురు. కనుక నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్యకర్మలను చక్కగా ఆచరింపుము.

ఇక్కడ యజ్ఞ శబ్దము వచ్చింది. గీతలో ఇది భగవంతునికి అత్యంత ప్రియమైన శబ్దము. యజ్ఞము అనగానే అగ్నిగుండము, దానిలో ఆహుతి ఇచ్చే పదార్థాలు స్మరణకు వస్తాయి. అది యజ్ఞమే కాని భగవద్గీతలో యజ్ఞం అనే మాటకు విశాలమైన అర్థం ఉన్నది. తరువాతి అధ్యాయంలో భగవంతుడు అనేక రకములైన యజ్ఞములను గురించి చెబుతాడు. యజ్ఞం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. వేరు వేరు దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి అగ్నిగుండంలో ఆహుతి ఇస్తూ యజ్ఞం చేస్తాము. యజ్ఞం భావనతో చేసే ఏ కర్మ అయినా యజ్ఞార్థ కర్మ అని భగవంతుడు చెబుతాడు. యజ్ఞార్థ కర్మ కాని కర్మలు మనుష్యులను బంధనములలో పడవేస్తాయి. ఈ కర్మలను చేసినవారు, నేనే చేశాను కాబట్టి ఫలితాన్ని నేనే అనుభవించాలి అన్న భావనలో ఉంటారు. సంచిత కర్మ ఫలము ప్రారబ్ధ రూపములో జమ అవుతూ ఉంటుంది. కాని యజ్ఞం కోసం చేసే కర్మలతో మనుష్యులు బంధవిముక్తులవుతూ ఉంటారు. మనం ఒక కుటుంబంలో, ఒక సమాజంలో, ఒక దేశంలో ఉన్నాము. చిన్నప్పటినుంచి అనేకమైన మాటలను నిలబెట్టుకోవడానికి ఎన్నో కర్మలను చేసి ఉంటాము. మనం వెళ్లే పాఠశాలను మనం కట్టించ లేదు, మనం వెళ్లే ఆసుపత్రిని మనం కట్టించ లేదు, మనం చదువుకునే గ్రంథాలయాలను మనం కట్టించ లేదు, మనం నడిచే దారి మనం వేయించ లేదు. ఏ చెట్టు పండు తింటున్నామో, ఆ చెట్టు మనమే వేయించామన్న ఆవశ్యకత లేదు. సమాజంలో వేర్వేరు వ్యక్తులు చేసిన కర్మల సహాయంతో మన జీవనం సాగుతుంది. ఈ జీవన ప్రయాణంలో సహజ భూతులైన వీరందరి పై మనకు కృతజ్ఞతా భావం ఉండాలి. సహజభూతులే కాకుండా ఎందరో మనకు కనిపించకుండా సూక్ష్మరూపంలో సహాయం చేస్తుంటారు. ఉదాహరణకు మన ఈ వివేచన సత్రలో నేను చెబుతున్నాను, మీరు వింటున్నారు. నేను మీరే కాకుండా ఎందరో సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమం జరగటానికి తెరవెనుక నుంచి సూక్ష్మరూపంలో సహాయం చేస్తున్నారు. ఇలాంటి వారందరి సహాయంతో మన జీవనం సాగుతుంటుంది. వీరందరి కొరకై, సమాజం కొరకై మనకి కర్తవ్యం ఉంటుంది. దీన్నే రుణం అంటారు, మనం ఈ రుణాన్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. ఇది మన విధిత కర్మ అయినప్పటికీ కొంతమంది అంగీకరించకుండా నా సంపాదన నేను తింటున్నాను అంటారు. ఈ రుణాన్ని తీర్చుకోవడానికి యజ్ఞార్థ కర్మలు చేయవలసి ఉంటుంది. నాలుగు రకాల రుణాలు ఉంటాయి - పితృ రుణం, ఋషి రుణం, దైవ రుణం మరియు సమాజ రుణం. ఎందరో దేవతలు మనకు సహాయపడుతూ ఉంటారు. మన ఇంద్రియములు కూడా దేవతలే. రుచికి దేవత అగ్ని. మన కళ్ళకు దేవత సూర్య భగవానుడు. ఇలాంటి దేవతలందరూ సూక్ష్మరూపంలో మనకు సహాయం చేస్తుంటారు. వీచే గాలి మనవల్ల కాదు. మన భారాన్ని మోసే ఈ భూమిని మనం పుట్టించ లేదు. ఈ ప్రపంచంలో జరిగే అన్ని క్రియలతో మనకు సహాయం లభిస్తుంది. వర్షఋతువు ప్రారంభమైనది అంటే దాని వెనుక ఎంతటి కార్యం జరుగుతోందో కదా. వీటన్నిటికీ, సమాజం పైన కృతజ్ఞతా భావంతో పరోపకారార్థం కొరకు పనులు చేయాలి. ఈ పనులు ఒక సంఘటిత రూపంలో చేసినప్పుడు దానిని యజ్ఞం అంటారు. అందుకే మనం గీతా పరివార్ ఒక మహా యజ్ఞం చేస్తోంది అంటాం. అందరము కలిసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఈ కార్యక్రమం నిరపేక్ష భావనతో చేయాలి. యజ్ఞంలో అపేక్ష లేకుండా ఆహుతి ఇవ్వబడుతుంది. చివరలో మిగిలిన దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇలా నిరపేక్షతో, సంఘటిత రూపంలో చేసే కర్మలు బంధనాలకు గురి చెయ్యవు. అందుకే భగవంతుడు అర్జునునితో యజ్ఞార్థ భావంతో, సమాజ శ్రేయస్సుకై కర్మల నాచరించమని చెబుతున్నాడు. ఋషి రుణం - పూర్వకాలం నుంచి ఎందరో ఋషి వర్యులు మనకి విజ్ఞానాన్ని కలుగజేసి, అలాగే ఎందరో వైజ్ఞానికులు కొత్త ఆవిష్కరణలతో మన జీవనాన్ని సులభతరం చేయడానికి సహాయం చేస్తున్నారు. వీరిపై కూడా మనకు కొన్ని కర్తవ్యములున్నవి. మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలపై కూడా మనకు కొన్ని కర్తవ్యము లున్నవి. వీటినే పితృ ఋణం అంటారు. సృష్టి కల్యాణానికై అపేక్ష లేకుండా మనము ఏ కర్మ చేసిన దానిని యజ్ఞార్థ కర్మ అంటారు. ఎంతోకొంత ఇలాంటి కర్మలను చేయమని భగవంతుడు అంటున్నాడు. రోజంతా చేయలేకపోతే కొన్నైనా అపేక్ష లేని కర్మలు చేయవలెను. ఇవి పరోపకారార్ధం చేసేవి. వీటితో మోక్షం కలగకపోయినా దానికి అవసరమైన మనశ్శాంతి లభిస్తుంది. మనిషి జీవితంలో భౌతిక అభ్యుదయం సాధించవచ్చును కాని మనశ్శాంతి కూడా అవసరం. అందుకే యజ్ఞార్థ కర్మలు చేయవలసి ఉంటుంది. జ్ఞానేశ్వర్ మహారాజ్ దీనిపై ఒక సుందరమైన మాట చెబుతారు. మన స్వధర్మాన్ని పాటించడమే, తమ కర్తవ్యాన్ని తాము అపేక్ష లేకుండా నిర్వహించడమే నిత్య యజ్ఞము అంటారు.

3.10

సహయజ్ఞాః(ఫ్) ప్రజాః(స్) సృష్ట్వా, పురోవాచ ప్రజాపతిః
అనేన ప్రసవిష్యధ్వమ్, ఏష వో౽స్త్విష్టకామధుక్॥10॥

కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగ ప్రజలను సృష్టించి, "మీరు ఈ యజ్ఞములద్వారా వృద్ధిచెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోర్కెలనెల్ల తీర్చును" అని పల్కెను.

బ్రహ్మదేవుడు పురాతన కాలంలో ఈ విశ్వాన్ని సృష్టించి నప్పుడు యజ్ఞాలతోపాటు సృష్టించాడు. ప్రతీ జీవి తన నిశ్చితమైన కర్తవ్యంతో జన్మిస్తుంది. దాని స్వధర్మం, యజ్ఞధర్మం నిశ్చితమై ఉంటాయి. విశ్వ సృష్టి చేసిన తర్వాత బ్రహ్మదేవుడు నీ స్వధర్మం పాలనతో, యజ్ఞాలు చేస్తూ ఉన్నతిని సాధించు. నీతో పాటు అందరి ఉన్నతికై పని చెయ్యి అంటాడు. అందరూ స్వధర్మం పాటిస్తూ కర్మలను చేసినట్లైతే అందరూ ఉన్నతిని సాధిస్తారు కదా. అందరూ తమ విధిత కర్మలను శ్రద్ధగా చేస్తే సమాజమంతా చక్కగా ఉంటుంది. ఈ యజ్ఞం మీ కోరికలన్నీ తీర్చేదిగా ఉంటుంది అంటూ బ్రహ్మదేవుడు ఆశీర్వదించాడు.

3.11

దేవాన్భావయతానేన,తే దేవా భావయన్తు వః
పరస్పరం(మ్) భావయన్తః(శ్), శ్రేయః(ఫ్) పరమవాప్స్యథ॥11॥

ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపఱచుడు. మఱియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు. నిస్స్వార్థభావముతో మీరు పరస్పరము సంతృప్తిపఱుచుకొనుచు పొందగలరు. అని పల్కెను.

దీని ద్వారా నీవు దేవతలు, నీకు సూక్ష్మరూపంలో సహాయం చేస్తున్న వారి హితం కోసం పని చేయి. ఒకరికి ఒకరు పని చేస్తూ ఉండండి. దేవతలు కూడా మీకు కళ్యాణం చేస్తారు, ఆశీర్వదిస్తారు. మనం ప్రకృతిలోని చెట్టు చేమలు, నదులు వంకలు, చెరువులను రక్షించి బాగా ఉంచితే అది మన మంచి కోసమే కదా. దేవతలు కూడా మీ ఉన్నతి కై నిస్వార్థ భావంతో పని చేస్తారు. ఒకరి కోసం ఒకరు పని చేస్తూ ఉండండి. ఒకసారి ఒక యువకుడు వర్షాకాలంలో ఒక వృద్ధుడు మామిడి టెంక లను నాటడం చూసి దీనివల్ల నీకు లాభం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. మీ జీవిత కాలంలో దీని పండ్లను తినలేరు. వృద్ధుని సమాధానం విన్న యువకుడు ఆశ్చర్యచకితుడవుతాడు. వృద్ధుడు నేను తిన్న మామిడి పండ్ల చెట్లను కూడా నేను నాట లేదు, ఈ పని చేయడం భావితరాలకై నా కర్తవ్యం అంటాడు. ఇంట్లో పెద్దవారు చిన్నవారి హితం కోసం పని చేస్తుంటారు. వారికి మంచి భోజన సదుపాయాలు కల్పించి, బాగా చూసుకుంటారు. ఆ పిల్లలే పెద్దవాళ్ళై ఇంట్లోని ముసలి వారికి సేవ చేస్తుంటారు. వారు ఒకరికొకరు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. జీవితంలో ప్రతి మెట్టు దగ్గర మీ కర్తవ్య పాలన చేసి శ్రేష్ఠతను సాధించమని సృష్టికర్త బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇక్కడ యోగేశ్వరుడైన భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పింది ఏమంటే కర్మలు చేయకుండా ఉండరాదు మరియు విధిత చేస్తూనే ఉండాలి. దీనివల్ల ఒకరికొకరికి మేలు జరుగుతుంది. అందరి మేలు జరగాలన్న భావనతో, సంఘటిత రూపంలో చేసే కర్మలను యజ్ఞము అంటారు. ఇది అందరికీ కళ్యాణకారి అవుతుంది.

3.12

ఇష్టాన్భోగాన్హి వో దేవా, దాస్యన్తే యజ్ఞభావితాః
తైర్దత్తానప్రదాయైభ్యో,యో భుఙ్క్తే స్తేన ఏవ సః॥12॥

యజ్ఞములద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు (మానవులకు) అయాచితముగనే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగ దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆదేవతలకు నివేదనచేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే.

మనం దేవి దేవతల కోసం యజ్ఞం చేస్తూ ఉంటాము, ఇంట్లో పెద్దవారి కోసమై యజ్ఞం చేస్తాము, చిన్న పిల్లల కోసం యజ్ఞం చేస్తాము, దీనితో వారందరూ ప్రసన్నులు అవుతారు. యజ్ఞంతో సంతృప్తి చెందిన దేవతలు మన అవసరాలను తీరుస్తారు, ఆశీర్వదిస్తారు, మనకి ఇష్టాలు, భోగాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. మనం సమాజం కొరకై పని చేసినట్లైతే సమాజం కూడా మనకి హితం చేస్తుంది. ఒకరికి ఒకరు పని చేసినట్లైతే మనకు ఆవశ్యకమైన ఇష్టాలు ప్రాప్తిస్తుంటాయి. ఇష్టాలూ, భోగాలు అందరూ కలిసి పని చేయటం వల్లనే లభించాయి అందువల్ల అవి నా ఒక్కడివే కాదు. ఇది తెలుసుకోకుండా, ఇదంతా నా పని వల్లనే వచ్చింది, అంతా నేను లేదా నా కుటుంబీకులు మాత్రమే అనుభవించాలని అనుకోవడం, కేవలం తమ స్వార్థం కోసమే జీవించడం, ఎవరి ద్వారా వచ్చిందో వారితో పంచుకోకపోవడం, అంతా తానే భోగించాలి అనుకునే వారు దొంగలు అని భగవంతుడు అంటున్నాడు. ఎవరైతే విధిత, యజ్ఞార్థ కర్మలు చేయరో అటువంటి వారు దొంగలు అని భగవంతుడు చెబుతున్నాడు. కాని ఇవి చేసేవారికి ఏమి ప్రాప్తిస్తాయి, ఎలా ముక్తులు అవుతారు అన్నది ముందు ముందు భగవంతుడు చెబుతాడు. అందరికోసం పని చేసేవారు, ఉన్నదంతా తమకే అనుకోని మనుషులు ఆనందంతో ఉంటారు. ఈ వివేచన సత్ర కూడా అలాంటిదే. ఇది గురుదేవుల ప్రసాదము మనం అందరం కలిసి ఆస్వాదించాలి.
ఆ పరమేశ్వరుని చరణములకు సమర్పణ చేసి వివేచన కార్యక్రమానికి విరామం ఇచ్చారు. అనంతరం ప్రశ్నోత్తరాలు మొదలైనవి.
ప్రశ్నోత్తరాలు
ప్రశ్న - ఏడవ శ్లోకానికి మరొక్కసారి అర్థం చెప్పండి
సమాధానము - ఎవరైతే మనసు ద్వారా ఇంద్రియములను నియంత్రించి భగవంతుని చింతనలో ఉంటారో అటువంటి వారి మనసు ఇంద్రియ విషయముల వైపు పరిగెత్తదు. మన జ్ఞానేంద్రియములు - కళ్ళు, ముక్కు, చర్మం, చెవులు, నాలుక అలాగే మన కర్మేంద్రియములు - కాళ్లు, చేతులు లాంటివి. ఇవే కాకుండా మనసు, బుద్ధితో కూడా పనులు జరుగుతూ ఉంటాయి. భగవంతుడి చెప్పేదేమంటే ఎవరైతే మనసులో పెట్టుకోకుండా కేవలం ఇంద్రియములతో పని చేస్తారో వారు ఉచ్చతమ యోగ స్థితిలో ఉన్నట్లు, కేవలం కర్మేంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరణలో పెట్టడం. వారు యజ్ఞార్థ కర్మలు చేస్తారు. ఈ దేహం భగవంతుడి ఇచ్చినది, దీనిని పరిశుభ్రంగా ఉంచడము, పరివార జనుల కొరకు శ్రమించడం లాంటి భావనతో కర్మయోగంలో కర్మల ననుసరించాలి. నేను కష్టపడ్డాను నాకు ఏమిటి ప్రయోజనం అన్న చింతన లేకుండా పని చేయాలి. మనసు ఇంద్రియ వస్తు విషయముల చిక్కులలో పడరాదు. పిల్లల్ని పైకి తీసుకు రావడం మన కర్తవ్యం. వారు ఎదిగి మనల్ని తిరిగి చూస్తారు అన్న భావనతో చేయరాదు. కర్తవ్య భావంతో పనులు చేసేవారు విశేషమైన వారు.

ప్రశ్న - 11వ శ్లోకంలో మీరు దేవతలకు ఉన్నతిని కల్పించండి, దేవతలు మీకు ఉన్నతిని కలుగ చేస్తారు అన్నారు. దేవతలు మనుషులకు ఉన్నతి కలుగ చేయగలరు కాని మనుషులు దేవతలకు ఏ రీతిగా ఉన్నతిని ఇవ్వగలరు?
సమాధానము - దేవతల కొరకై యజ్ఞాలు చేస్తూ, పూజల ద్వారా, వారికి ఆహుతులు అర్పించడం ద్వారా ఉన్నతిని కలిగించగలరు. సృష్టిలో వృక్షాలను పరిరక్షించడం ద్వారా, నదులను స్వచ్ఛంగా ఉంచడం ద్వారా మనం ప్రకృతిని ఉన్నత స్థితిలో ఉంచ గలుగుతాము. ఈ పనులన్నీ కూడా దేవతలకు చేసిన పూజలు గానే చూడాలి. పర్వతానికి పూజలు చేయడం ద్వారా శ్రీకృష్ణుడు ఈ పనులన్నీ యజ్ఞమే అని సందేశం ఇచ్చాడు.

ప్రశ్న - స్థూల శరీరము మరియు సూక్ష్మ శరీరములలో తేడా ఏమిటి?
సమాధానము - మనకు కనిపించేది స్థూల శరీరము. ఇందులో కూడా కొన్ని ఇంద్రియాలు మనకు కనిపించవు అయినా అవి ఉన్నాయని మనకు తెలుసు. ఉదాహరణకు మనసు- అది మనకు కనిపించదు, కాని అది మన శరీరంలో సూక్ష్మరూపంలో ఉంటుంది. స్థూల రూపానికి అస్తిత్వం ఉన్నట్లే సూక్ష్మ రూపానికి కూడా అస్తిత్వం ఉంటుంది. మరణానంతరం శరీర భాగాలన్నీ యధావిధి గానే ఉన్నా అవి వాటి పనిచేయవు ఎందుకంటే సూక్ష్మ రూపంతో బంధం తెగిపోయింది. స్థూల రూపంలో గంగా మాత ఒక నది, కాని మనం అందులో ఒక దేవతను చూస్తాము. గంగ దగ్గరకు వెళ్ళినప్పుడు దేవత కనిపించకపోయినా ఒక అనుభూతి కలుగుతుంది. మనసు కనిపించకపోయినా దాని అనుభూతి కలుగుతుంది.