विवेचन सारांश
మహాభారత యుద్ధ సేనల వైశిష్ట్యం
అనేక జలధారలు సమ్మేళనం జరిగినప్పుడు ప్రవాహం ఎలా పెరిగిపోతుందో అలానే, గీతా ప్రేమికులు ఆనందమయి యాత్రలో కలిసినప్పుడు ఆ గీతా ప్రేమికుల సంగమం ద్వారా ఆ ప్రేమ పెరుగుతూ ఉంటుంది. గురువందనం, సరస్వతీ ప్రార్ధనతో సంప్రదాయ అనుసారంగా ప్రథమ అధ్యాయం పూర్వార్ధం వివేచన సత్రం మొదలైంది.
ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् ।
अद्वैतामृतवर्षिणीं भगवतीम्-अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्- गीते भवद्वेषिणीम् ॥ १॥
नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र ।
येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः ॥ २॥
భగవద్గీత అర్జునుడికి భగవంతుడైన నారాయణుడిచే స్వయంగా బోధించబడినది. మహాభారతం మధ్యలో బోధింపబడ్డ భగవద్గీతను సనాతన ఋషి వ్యాసుడు రచించాడు. ఓ దివ్య మాతా, మాపై అద్వైత అమృతాన్ని కురిపించే మాతా, ఓ పద్దెనిమిది అధ్యాయాల మాతా, నేను నిన్ను ధ్యానిస్తున్నాను. భగవద్గీత సంసారం వల్ల కలిగే భ్రాంతిని నశింప చేస్తుంది. ఇలా గీతా గొప్పతనాన్ని మననం చేసుకుంటూ గీత ధ్యాన శ్లోకం పఠనం తో వివేచన సత్రం ప్రారంభమైనది. విశేషమేమిటంటే ఈ ప్రథమ అధ్యాయంలో భగవంతుని ఉపదేశం మనకు ఇంకా ప్రాప్తించదు. అయితే గీతా మహత్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ ప్రథమ అధ్యాయాన్ని బాగా అవగతం చేసుకోవాలి. గురుదేవుని సూచన ఏమిటంటే వేదాల సారం మహాభారతంలో ఉంటుంది. అలాగే మహాభారతం యొక్క సారం భగవద్గీతలో ఇమిడి ఉంటుంది. మరియు అర్జునుని మనోభావాలను అర్థం చేసుకుంటూ పఠనం చేయాలి. శ్లోక పఠనం మనసుకి ఊరట కలిగిస్తుంది. సంస్కృతం ఎంతో శక్తివంతమైన భాష. గీత లో చెప్పబడిన 700 శ్లోకాలలో జీవన సారం ఇమిడి ఉంది అని. ఆశయంలో మహోన్నతమైనది ఆకృతిలో బహు చిన్నది అని జ్ఞానేశ్వరిలో చెప్పారు జ్ఞానేశ్వర్ మహారాజ్. సుమారు 5000 సంవత్సరాలు లేదా అంతకన్నా ముందు ఈ జ్ఞాన ధార స్వయంగా పరమాత్ముని నోటి వెంట నుంచి ప్రవహించింది. అప్పటి భౌగోళిక పరిస్థితులు ఇప్పటికన్నా వేరు. మునుపటితో చూసుకుంటే ఇప్పుడు వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధి చెందాము. కాని మనిషి యొక్క మానసిక ప్రవృత్తి మాత్రం మారలేదు. అందుకని భగవద్గీత ఇప్పుడు కూడా మనందరికీ చక్కగా వర్తించే మనో వైజ్ఞానిక గ్రంథము.
मलिनिर्चमोनं पुंसां जलस्नानं दिने दिने ।
सकृद्गीतामृतस्नानं संसारमलनाशनम् ॥
అనగా…నీళ్లలో స్నానం చేయడం ద్వారా రోజూ తనను తాను శుభ్రపరుచుకోవచ్చు, కాని భగవద్గీతలోని పవిత్ర గంగా జలంలో ఒక్కసారైనా స్నానం చేస్తే, అతనికి భౌతిక జీవితంలోని మలినం పూర్తిగా నశిస్తుంది. బాహ్య ప్రక్షాళన స్నానంతో అవుతుంది. కాని అంతర ప్రక్షాళన గీతామృతంతో మాత్రమే సాధ్యమవుతుంది.
లోకమాన్య బాలగంగాధర్ తిలక్, భగవద్గీత సంపూర్ణ భారతీయ వాంగ్మయానికి కోహినూరు వజ్రం లాంటిది అన్నారు.
మనమందరం జీవితంలో సుఖాన్ని వెతుక్కుంటూ దుఃఖంలో పడతాం. సుఖాన్వేషణలో దుఃఖాన్ని ఎదుర్కొంటాం. సుఖాన్వేషణలో ఎంతగా పడతామంటే మరణం తప్పదని తెలిసినా ఆ విషయం మనల్ని భయభీతులను చేస్తుంది. భగవద్గీత దుఃఖమయమైన ఈ సంసార సాగరం నుంచి మనల్ని బయట పడవేయడానికి సహకరిస్తుంది.
1.1
ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే, సమవేతా యుయుత్సవః ৷
మామకాః(ఫ్) పాణ్డవాశ్చైవ, కిమకుర్వత సఞ్జయ॥1.1॥
ప్రప్రధమంగా ధృతరాష్ట్రుని నోటి నుండి వెలువడిన మాటలతో గీతా శుభారంభం అవుతుంది. ధృతరాష్ట్రుడు కౌరవులకు పిత్రుడు మరియు అంధుడు. తన తమ్ముడైన పాండు రాజుకి చెందిన కురు రాజ్యాన్ని పాండు రాజకుమారులకు తిరిగి ఇవ్వకుండా చేజిక్కించుకున్నాడు. పిదప, కౌరవులైన ధృతరాష్ట్ర పుత్రులు కపటంతో జూదమాడి వారి రాజ్యాన్ని వశం చేసుకున్నారు. శకుని తండ్రి ఎముకలతో తయారు చేసుకున్న మాయ పావులతో జూద మాడారు. కపట జూదంలో ఓడిన పాండవులు తమ రాజ్యం సర్వస్వం కోల్పోయి 12 సంవత్సరాల వనవాసం పూర్తి చేశారు. వనవాసం మరియు ఆజ్ఞాతవాసం పూర్తి అయిన తర్వాత తమ ఇంద్రప్రస్థ రాజ్యం తిరిగి ఇవ్వమని కోరారు. అయితే కౌరవులు దీనికి నిరాకరించారు. చివరికి పాండవులు దూతను పంపి పంచ పాండవులకి పంచ గ్రామాలుఅయినా ఇవ్వమని అడిగారు. దుర్యోధనుడు సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వను అని స్పష్టం చేశాడు. ఫలితంగా మహాభారత సంగ్రామానికి నాంది పలికారు. అంధుడైన ధృతరాష్ట్రుడికి యుద్ధ భూమిలో జరిగే విషయాలను అప్పటికప్పుడు తెలుసుకోవాలని కాంక్ష కలిగింది. వేద వ్యాసుడు సంజయునికి దివ్యదృష్టి ప్రసాదించి యుద్ధభూమిలో జరిగే సంఘటనలను వీక్షించే అదృష్టాన్ని కలిగించాడు. తన సారధి అయిన సంజయునికి అలా దివ్యదృష్టి ప్రాప్తి కలిగింది.
ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏమేమి జరుగుతున్నవి అని ధృతరాష్ట్రుడు సంజయుడిని ప్రశ్నించాడు. ఆ ధర్మ భూమిలో యుద్ధానికి సన్నద్ధమై ఉన్న నా పుత్రులు మరియు పాండు పుత్రులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఏమి చేయుచున్నారు? మనిషి ఈ శరీరాన్ని తానే అనుకుంటాడు. అందువలన దేహం మీద మక్కువ ఉంటుంది. ప్రతిఫలంగా నాది, ఇతరులది అనే భేదభావం కలుగుతుంది. అలాగే ధృతరాష్ట్రునికి కూడా తన పుత్రుల మీద ఎంతో మమకారం. అందుకనే నా పుత్రులు అని స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. కురుక్షేత్రము అనగా కర్మ జరిగే క్షేత్రము అని కూడా మరొక అర్థం వస్తుంది.
నిత్యజీవితంలో చేయవలసిన, చేసే కర్మలన్నీ ఎంతో సంఘర్షణతోనే కూడి ఉంటాయి. . మరాఠా రాణి అహల్యా దేవి హోల్కర్కికి భగవద్గీత నేర్పించడం కోసం ఒక పండితుడిని నియమించారు. రాజ్యాన్ని పరిపాలించే క్షత్రియులకి ఇలా ధర్మ గ్రంథమైన భగవద్గీత సముపార్జన ఒక ఆనవాయితీ. ఎందువలనంటే భగవద్గీత వారికి నిష్పక్షపాతంగా, నిర్ద్వంద్వంగా ఉత్తమ అధికారిగా రాజ్య పాలక నిర్ణయాలు తీసుకోవడానికి దోహదం చేస్తుంది. అహల్యా దేవికి క్షేత్రే మరియు ధర్మ, ప్రప్రథమంగా ఉన్న ఈ రెండిటి పదాలలోనే మొత్తం భగవద్గీత అర్థం ఇమిడి ఉంది అని అనిపించింది. ఎవరి క్షేత్రంలో అనగా వారి రంగంలో ధర్మం అనుసరించడం ఎవరికి వారి ప్రధాన కర్తవ్యం.
సఞ్జయ ఉవాచ
దృష్ట్వా తు పాణ్డవానీకం(వ్ఁ) , వ్యూఢం(న్) దుర్యోధనస్తదా
ఆచార్యముపసఙ్గమ్య, రాజా వచనమబ్రవీత్॥1.2॥
సంజయుడు ఇలా పలికాడు. ఎంతో పకడ్బందీగా రచించిన పాండవ సైన్యాన్ని చూసి రాజు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఇలా అన్నాడు. ఇక్కడ రాజు అనగా దుర్యోధనుడు. దుర్యోధనుడు యువరాజైనా, అతనిని రాజు అని దృతరాష్ట్రుడిని సంతోష పెట్టడం కోసం సంబోధించాడు.
సంజయుడు ధృతరాష్ట్రునికి చాలా నమ్మకమైన సలహాదారుడు అయినా అతని మనసు సాత్వికమైనది, ధర్మాన్ని అనుసరించేది. దుర్యోధనుడు మహల్ లో అల్లరిగా అత్యంత గారాబంలో పెరిగాడు. రాజు గారి కోటలో అన్ని వసతులతో, సుఖాలతో విలాసవంతంగా పెరిగినా కూడా, అతనిలో లోభం ఎక్కువ, పరుల రాజ్యం కోసం దురాశ. అది చేజిక్కించుకోవడం కోసం కపటమైన పనులు చేశాడు. ఇతరులకు కష్టం కలిగించాడు. పాండవులు వనములలో కందమూలాలు తింటూ ఋషుల సాంగత్యంలో సాత్వికంగా పెరిగారు. చిన్నతనంలో సంగ్రహించిన విలువలు చాలా బలంగా లోతుగా అలవడుతాయి. అందుకే వారి మనస్తత్వాలలో చాలా వ్యత్యాసం.
పశ్యైతాం(మ్) పాణ్డుపుత్రాణామ్, ఆచార్య మహతీం(ఞ్) చమూమ్ ৷
వ్యూఢాం(న్) ద్రుపదపుత్రేణ, తవ శిష్యేణ ధీమతా॥1.3॥
తన గురువు గారైన ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్లి తమ శిష్యుడు, ద్రుపద పుత్రుడైన దృష్టద్యుమ్నుని చే వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయబడ్డ సైన్యాన్ని వీక్షించమని ప్రేరేపిస్తున్నాడు. అవహేళనగా మాట్లాడుతున్నాడు. దుర్యోధనుడి ఈర్ష్య, అసూయలతో కూడిన మనస్తత్వం ఇక్కడ కూడా ప్రతిబింబిస్తుంది. ఇక్కడ ప్రత్యేకించి దృష్టద్యుమ్నుని, అందులోనూ తమ శిష్యుడు అని ద్రోణాచార్యులకు ఎత్తి చూపించడంలో ఒక కారణం ఉంది. దృష్టద్యుమ్నుడు కారణజన్ముడు, ద్రోణాచార్యులను వధించడం కోసమై యజ్ఞంలో జన్మించినవాడు.
ధ్రుష్టద్యుమ్నుడి తండ్రి ద్రుపద రాజు, ద్రోణాచార్యులు చిన్నతనంలో మంచి మిత్రులు. ఒకే గురుకులంలో చదివారు. ద్రోణాచార్యుల కుటుంబం వారి ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉండేది. ద్రోణాచార్యుల వారికి ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే తప్పక తనను సంప్రదించాలని, తాను తప్పక సహాయం చేయగలనని చిన్నతనంలో ద్రుపద మహారాజు మాట ఇచ్చారు. ద్రోణాచార్యుల పెళ్లి అయిన తర్వాత వారికి అశ్వత్థామ అని బాలుడు జన్మించాడు. ఇంకా వారి ఆర్థిక పరిస్థితి అలాగే ఉండేది. చిన్న పిల్లవాడికి గోధుమ పిండి నీళ్లలో కలిపి అదే పాలలాగా తాగించేవారు. ఒకసారి అశ్వత్థామ సంపన్నుల ఇంటికి వెళ్ళినప్పుడు నిజమైన పాలు తాగి అప్పటినుంచి అదే కావాలని గొడవ చేసేవాడు. పేదరికంలో తనయుడు, భార్య కృపి బాధ చూడలేక ద్రోణాచార్యులు, ద్రుపద మహారాజు మాట గుర్తుకు వచ్చి సహాయం కోరుదామని వెళ్లారు. ద్రుపద మహారాజు ద్రోణాచార్యుల వారికి సహాయం చేయకపోగా వారిని సభ నుంచి వెళ్లగొట్టారు. ద్రోణాచార్యులు ఆ అవమానం భరించలేక పోయారు. కౌరవ పాండవుల విద్యాభ్యాసం తర్వాత గురుదక్షిణగా ద్రుపద మహారాజుని ఓడించి తీసుకురమ్మని అడిగారు. భీమార్జునులు ఆ పని మీద వెళ్లగా, అర్జునుడు ద్రుపద మహారాజుని ఓడించి బందీగా తెచ్చి గురుదక్షిణగా సమర్పించాడు. తిరిగి వెళ్ళిన ద్రుపద మహారాజు ద్రోణాచార్యుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ ఫలంగా ద్రోణాచార్యుల వధ కొరకై దృష్టద్యుమ్నుడు జన్మించాడు. దృష్టద్యుమ్నుడి విద్యాభ్యాసం కొరకు మహారాజు అతడిని ద్రోణాచార్యుల వద్దకు పంపారు. మరి మిమ్మల్ని వధించడం కోసం పుట్టిన వాడని తెలిసీ అతనికి ధనుర్విద్య మర్మాలన్నీ నేర్పారు కదా అని దుర్యోధనుడు, ద్రోణాచార్యుల వారిని ఇప్పుడు పరిహసిస్తున్నాడు.
అత్ర శూరా మహేష్వాసా, భీమార్జునసమా యుధి ৷
యుయుధానో విరాటశ్చ, ద్రుపదశ్చ మహారథః॥1.4॥
ధృష్టకేతుశ్చేకితానః(ఖ్), కాశిరాజశ్చ వీర్యవాన్ ৷
పురుజిత్కున్తిభోజశ్చ, శైబ్యశ్చ నరపుఙ్గవః॥1.5॥
యుధామన్యుశ్చ విక్రాన్త, ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ৷
సౌభద్రో ద్రౌపదేయాశ్చ, సర్వ ఏవ మహారథాః॥1.6॥
దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని ఇంకా వర్ణిస్తున్నాడు. ఎంతోమంది శూరులు, ధనుర్దారులు, భీమార్జునులకు సరి సమానమైన యుద్ధ వీరులు ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి మహారథులు ఉన్నారు. శిశుపాలుని కుమారుడు ధృష్టకేతుడు , వారి మిత్రుడు చేకితానుడు, వీరుడైన కాశీరాజు, కుంతి మాత సోదరులైన పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శిబి దేశ రాజు శైబ్యుడు, వీరందరూ ఉత్తమ వీరులే. మహా పరాక్రమవంతులైన యుధామన్యుడు, ఉత్తమౌజుడు, వీరు అర్జునుడి రథానికి ఇరువైపులా రక్షణగా నిలుచుని ఉన్నారు. ఇంకా సుభద్రా పుత్రుడు, మరియు ద్రౌపదీ పుత్రులైన, ప్రతి వింధ్య, శ్రుత సోమ, శ్రుత కర్మ, శతానిక మరియు శ్రుతసేన ఉన్నారు. వీరందరూ శ్రేష్టమైన మహారథులు. ఒక్క మహారథి పదివేల మంది సాధారణ యోధుల శక్తితో సమానం.
అస్మాకం(న్) తు విశిష్టా యే, తాన్నిబోధ ద్విజోత్తమ ৷
నాయకా మమ సైన్యస్య, సఞ్జ్ఞార్థం(న్) తాన్బ్రవీమి తే॥1.7॥
ద్విజులలో ఉత్తమమైన ద్రోణాచార్యా ! మన పక్షంలో ఉన్న విశిష్టమైన వీరులను, సేనా నాయకులను కూడా తెలుసుకోండి. సైన్యాధ్యక్షులైన మీరు తెలుసుకొనుటకై పేర్కొంటున్నాను.
భవాన్భీష్మశ్చ కర్ణశ్చ, కృపశ్చ సమితిఞ్జయః ৷
అశ్వత్థామా వికర్ణశ్చ, సౌమదత్తిస్తథైవ చ॥1.8॥
అన్యే చ బహవః(శ్) శూరా, మదర్థే త్యక్తజీవితాః ৷
నానాశస్త్రప్రహరణాః(స్), సర్వే యుద్ధవిశారదాః॥1.9॥
అపర్యాప్తం(న్) తదస్మాకం(మ్), బలం(మ్) భీష్మాభిరక్షితమ్ ৷
పర్యాప్తం(న్) త్విదమేతేషాం(మ్), బలం(మ్) భీమాభిరక్షితమ్॥1.10॥
అయనేషు చ సర్వేషు, యథాభాగమవస్థితాః ৷
భీష్మమేవాభిరక్షన్తు, భవన్తః.(స్) సర్వ ఏవ హి॥1.11॥
తస్య సఞ్జనయన్హర్షం(ఙ్) , కురువృద్ధః(ఫ్) పితామహః
సింహనాదం(వ్ఁ) వినద్యోచ్చైః(శ్) , శఙ్ఖం(న్) దధ్మౌ ప్రతాపవాన్॥1.12॥
తతః(శ్) శఙ్ఖాశ్చ భేర్యశ్చ, పణవానకగోముఖాః ৷
సహసైవాభ్యహన్యన్త, స శబ్దస్తుములో౽భవత్॥1.13॥
తతః(శ్) శ్వేతైర్హయైర్యుక్తే, మహతి స్యన్దనే స్థితౌ ৷
మాధవః(ఫ్) పాణ్డవశ్చైవ, దివ్యౌ శఙ్ఖౌ ప్రదధ్మతుః॥1.14॥
పాఞ్చజన్యం(మ్) హృషీకేశో, దేవదత్తం(న్) ధనఞ్జయః ৷
పౌణ్డ్రం(న్) దధ్మౌ మహాశఙ్ఖం(మ్), భీమకర్మా వృకోదరః॥1.15॥
అనన్తవిజయం(మ్) రాజా, కున్తీపుత్రో యుధిష్ఠిరః ৷
నకులః(స్) సహదేవశ్చ, సుఘోషమణిపుష్పకౌ॥1.16॥
ప్రశ్న: సాత్యకి ఎవరు? అతని పేరు ఎక్కడ రాలేదే?
సమాధానం: మహావీరుడైన యుయుధానుడికి మరొక పేరు సాత్యకి. ధనుర్విద్యలో అర్జునుని శిష్యుడు.
ప్రశ్న: గురు పూర్ణిమ గురించి చెప్పండి? ఇది టీచర్స్ కి సంబంధించినదా?
సమాధానం: శిక్షకునికి, గురువుకి ఎంతో వ్యత్యాసం ఉంది. శిక్షకుడు లౌకిక జ్ఞానం అందిస్తాడు. గురువు అలౌకిక జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించి మనకు మార్గదర్శనం చేస్తాడు. సమర్పిత భావంతో గురు చరణములకు మనల్ని అర్పించుకుంటేనే మనకు మార్గదర్శనం సులువు అవుతుంది. ఇవాళ వ్యాస పూర్ణిమ. వ్యాస ఉచ్చిష్టం జగత్ సర్వం అనగా మనకు లభించిన సర్వ వేదములు, వ్యాసుడి ఎంగిలి గా లభించినవే.
ప్రశ్న: అక్షౌహిణి గురించి మళ్ళీ చెప్పండి?
సమాధానం: ఒక అక్షౌహిణిలో 21,870 రథాలు, 21,870ఏనుగులు, 65,610 horses గుర్రాలు and 109,350 సైనికులు. అనగా మొత్తం 218,700 సేన.
జయ శ్రీకృష్ణ