विवेचन सारांश
కర్మఫల త్యాగికి కర్మ బంధముల నుండి విముక్తి
ప్రారంభ ప్రార్థన, దీప ప్రజ్వలన తర్వాత, ఆదరణీయ గీతా విశారద్, శ్రీ శ్రీనివాస్ వర్నేకర్ గారు, 18వ అధ్యాయమగు మోక్ష సన్యాస యోగ ప్రథమార్థ వివేచనను ప్రారంభించారు. గురు దేవులకు మరియు శ్రీకృష్ణ భగవానులకు వందనములర్పించి, గీతాసాధకులకు హృదయపూర్వక అభివాదములు తెలియజేసి, గీతా పరివార్ మాధ్యమం ద్వారా భగవద్గీతా అధ్యయనం చేస్తున్న్నట్లు తెలిపారు. శ్రీమద్భగవద్గీతా మందిరానికి 18 వ అధ్యాయం కలశము వంటిదని పేర్కొన్నారు. 12వ అధ్యాయాన్ని ఆ మందిరానికి గర్భగృహంగా పరిగణిస్తాము. 15వ అధ్యాయాన్ని ఆ మందిరంలోని స్థాపిత విగ్రహ మూర్తిగా భావిస్తాము. మందిరానికి వెళ్లి భగవానులను దర్శించుకోలేనప్పుడు, దూరం నుండే మందిర కలశాన్ని దర్శనం చేసుకొని, పుణ్య ప్రాప్తిని పొందుతాము. భగవద్గీతా సారమే ఈ అధ్యాయం. మొదటి అధ్యాయం ద్వారా అర్జునుడి మనఃస్థితి మరియు ఆ కాల పరిస్థితి తెలుస్తుంది. ద్వితీయ అధ్యాయం నుండి భగవానులు అర్జునుడికి ఉపదేశం ఆరంభిస్తారు. కర్మయోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, ఆత్మ సంయమ యోగములను వివిధ రూపాలలో భగవానులు అర్జునుడికి తెలియజేస్తారు. 15వ అధ్యాయంతో భగవద్గీతా పరిపూర్ణమవుతుంది. 16వ అధ్యాయంలో కొన్ని పరిపూర్ణ అంశాలైనట్టి దైవాసుర లక్షణాలను తెలియజేశారు. 17వ అధ్యాయంలో మూడు రకాల శ్రద్ధలను గూర్చి విస్తారంగా తెలిపారు. అప్పటికి చెప్పవలసినవన్ని సంపూర్ణంగా చెప్పడం జరిగింది. అర్జునుడు భగవద్గీతా ద్వారా అమితానంద ప్రాప్తిని పొందాడు. వారికి ఈ సంవాదము పూర్తి కాకూడదని ఆకాంక్ష. లేగ దూడ తల్లి నుండి పాలు త్రాగిన తర్వాత కూడ, దూరంగా పోకుండా తల్లిని అంటిపెట్టుకొని ఉన్నట్లు, అర్జునుడికి భగవానులు ఇంకా చెప్పుతూనే ఉండాలనే అభిప్రాయం కనపరిచాడు. ఇదియే భగవానుల పట్ల గల ప్రేమ. 18వ అధ్యాయం సంక్షిప్త గీతా గా పరిగణించబడుతుంది. అర్జునుడు నిమిత్తమాత్రంగా, తిరిగి భగవానులను క్రింది విధంగా ప్రశ్నించాడు.
18.1
అర్జున ఉవాచ
సన్న్యాసస్య మహాబాహో, తత్త్వమిచ్ఛామి వేదితుమ్ ।
త్యాగస్య చ హృషీకేశ, పృథక్కేశినిషూదన ॥18.1॥
రాక్షసులను సంహరించిన గొప్ప భుజములు కలవాడిగా, ఇంద్రియాల యొక్క నియామకుడిగా భగవానులను అర్జునుడు స్తుతించాడు. సన్యాసం అనే శబ్దం యొక్క భావార్థం తెలుసుకోగోరాడు. కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసుల యొక్క బాహ్య స్వరూపాన్ని మనం చూస్తాము. ఆ విధంగానే త్యాగం యొక్క అర్థాన్ని కూడ తెలియ జేయాలని విజ్ఞప్తి చేశాడు. బాగుగా తెలుసుకుని చేసిన త్యాగమే సన్యాసం.సన్యాసం మరియు త్యాగం మధ్య అంతరమేమిటి ?
శ్రీ భగవానువాచ
కామ్యానాం(ఙ్) కర్మణాం(న్) న్యాసం(మ్), సన్న్యాసం(ఙ్) కవయో విదుః ।
సర్వకర్మఫలత్యాగం(మ్), ప్రాహుస్త్యాగం(వ్ఁ) విచక్షణాః ॥18.2॥
భగవానులు పండితుల యొక్క ఉద్దేశ్యాన్ని ఇచ్చట తెలియజేస్తున్నారు. సంస్కృతంలో జ్ఞానులను కవులుగా పేర్కొంటారు. విచక్షణ గల పండితులు కూడా ఉంటారు. ఏ కర్మ చేయడం వలన మన కోరిక తీరుతుందో, దానిని కామ్యకర్మ అంటారు. స్త్రీ ప్రాప్తి, పుత్ర ప్రాప్తి, ధనప్రాప్తి, గృహప్రాప్తి మొదలైన కోరికలను తీర్చుకునే కర్మలే కామ్య కర్మలు. అట్టి కామ్య కర్మల త్యాగమే సన్యాసం. కామ్య కర్మలను వదలుకొనుటయే సన్యాసమని కొందరు జ్ఞానులు అంటారు. కర్తవ్యాన్ని ఆచరిస్తూ, దాని ఫల త్యాగం చేయడమే త్యాగంగా కొందరు పండితులు పేర్కొంటారు. యజ్ఞయాగాదులు చేయడం, వర్ణాశ్రమ ధర్మాలు పాటించడం, తల్లిదండ్రుల సేవ చేయడం ద్వారా పొందే ఫలితాన్ని వదలుకోవడమే త్యాగమని అర్థం.
త్యాజ్యం(న్) దోషవదిత్యేకే, కర్మ ప్రాహుర్మనీషిణః ।
యజ్ఞదానతపఃకర్మ, న త్యాజ్యమితి చాపరే ॥18.3॥
దోష భూయిష్టమైన కర్మలను విడిచిపెట్టవలెనని కొందరు బుద్ధిమంతులు చెబుతారు. మరి కొంతమంది జ్ఞానులు యజ్ఞ, దాన, తపస్సులనే కర్మలను వదిలి పెట్టకూడదని తెలుపుతారు. ఇవి పండితుల యొక్క భిన్నాభిప్రాయములు.
నిశ్చయం(మ్) శ్రృణు మే తత్ర, త్యాగే భరతసత్తమ ।
త్యాగో హి పురుషవ్యాఘ్ర, త్రివిధః(స్) సమ్ప్రకీర్తితః ॥18.4॥
త్యాగం అనే విషయం పట్ల, భగవానులు తన నిశ్చితాభిప్రాయాన్ని వినవలసిందిగా, పురుష శ్రేష్టుడగు అర్జునుడికి తెలుపుతున్నారు. అట్టి త్యాగం మూడు విధములుగా చెప్పబడుచున్నది.
యజ్ఞదానతపఃకర్మ, న త్యాజ్యం(ఙ్) కార్యమేవ తత్ ।
యజ్ఞో దానం(న్) తపశ్చైవ, పావనాని మనీషిణామ్ ॥18.5॥
యజ్ఞ, దాన, తపస్సులనబడు కర్మలు త్యజింపతగినవి కావు. మహాభారతం, భగవద్గీతా విషయంలో చాలా దుష్ప్రచారం జరిగింది. మహాభారత గ్రంథాన్ని ఇంట్లో ఉంచకూడదని, అది సహోదరుల మధ్య వివాదానికి దారి తీస్తుందని ప్రచారం చేశారు. కాని మహాభారతం జయ కారకమైన ఇతిహాసం. పవిత్ర గ్రంథమైన భగవద్గీతాను పిల్లలకి నేర్పిస్తే, సన్యాసం తీసుకుంటారని తప్పుడు విషయాలు ప్రచారం చేశారు. అర్జునుడు భగవద్గీతా విని సన్యాసం తీసుకున్నాడా ? యజ్ఞ, దాన, తపస్సులు చేయదగిన కార్యములు. నిష్కామ కర్మలనాచరించు వారికి పవిత్రతను, చిత్తశుద్ధిని కలుగజేస్తాయి. సామూహిక పుణ్య, హిత కర్మలను యజ్ఞములంటారు. వ్యక్తిగత ఔన్నత్యానికి తపస్సు, దానము చేస్తారు. భగవంతుడి నుండి, సమాజం నుండి పొందిన వాటికి ప్రతిగా దానం చేయాలి. బ్రహ్మచర్యాశ్రమంలో జ్ఞానాన్ని గ్రహించాలి. గృహస్థాశ్రమంలో తిరిగి ఇతరులకు ప్రధానం చేయాలి. మనం అధ్యాత్మకంగా ఉత్థానం చెందడానికి శరీరానికి తాపాన్ని కలగ చేస్తాము. శ్రమదానం, విత్త దానం, జ్ఞాన దానం, సమయ దానం, రక్త దానం, అన్నదానం మొదలగునవి కర్తవ్యభావంతో చేయాలి. ఉపకార దృష్టితో కాదు. గీతా పరివార్ నుండి పొందిన దానికి, తిరిగి తమ కర్తవ్యంగా భావించి, సమయ దానం చేయడం ఉత్తమం.
ఏతాన్యపి తు కర్మాణి, సఙ్గం(న్) త్యక్త్వా ఫలాని చ ।
కర్తవ్యానీతి మే పార్థ, నిశ్చితం(మ్) మతముత్తమమ్॥18.6॥
భగవానులు తన నిశ్చితమైన, శ్రేష్టమైన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. మూడు విధములైన యజ్ఞ, దాన, తప కర్మములు మరియు ఇతర కర్తవ్యాలు కూడ ఫలాపేక్ష రహితంగా చేయాలి. సాధారణంగా ఒక కర్మనాచరించడం వల్ల తనకేమి ప్రయోజనమని మనుష్యులు భావిస్తారు. గీతా చదవడం వల్ల నాకేం లాభం ? ఏది లభించనప్పుడు నేను ఎందుకు కర్మలను ఆచరించాలనే స్వభావం ఉంటుంది. మనం కర్తవ్యంగా భావించిన కర్మలను విధిగా, అసంగత్వంతో చేయడం అలవర్చుకోవాలి. ఫలితాన్ని గూర్చిన చింతన వదిలి పెట్టాలి. భగవానులు మూడు రకాల త్యాగాలను గూర్చి తెలియజేస్తున్నారు.
నియతస్య తు సన్న్యాసః(ఖ్), కర్మణో నోపపద్యతే ।
మోహాత్తస్య పరిత్యాగః(స్),తామసః(ఫ్) పరికీర్తితః ॥18.7॥
సత్వ, రజో, తమో గుణములచే ఆవహించబడిన ప్రకృతి వల్ల సంసారం నడుస్తుంది. మన భావాలు కూడా త్రిగుణాత్మకంగా ఉంటాయి. త్యాగం కూడా మూడు గుణాలతో కూడి ఉంటుంది. శాస్త్ర విహిత కర్మలు హితకరమైనవి. నాలుగు వర్ణాలకు కూడా విహిత కర్మలు నిర్ధేశించబడినాయి. బ్రహ్మచర్యాశ్రమంలో విద్యలను నేర్చుకొనుట విహిత కర్మ. అది సాహిత్యమా, వైద్యమా, గణితమా, లేదా ఎంచుకున్న వివిధ శాస్త్రాల అధ్యయనం నియత కర్మలనబడుతాయి. ధర్మాన్ని అనుసరించి, గృహస్థుడు ధనాన్ని ఆర్జించుట కూడా విహిత కర్మయే అవుతుంది. వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం మొదలగునవి నియత కర్మలవుతాయి. విహిత కర్మలు మరియు నియత కర్మల యొక్క పరిత్యాగం యుక్తము కాదు. అర్జునుడు తన నియత కర్మయగు యుద్ధాన్ని ఆచరించకుండా, సన్యాసం కోరడం త్యాగం అనబడదు. మోహం వల్ల, అజ్ఞానం వల్ల కర్మను వదిలిపెడితే, అది తామస త్యాగం అవుతుంది. కాబట్టి శాస్త్ర ప్రకారం చేయదగిన కర్మలన్నియు జీవుడి ధర్మము కాబట్టి, అవి జీవుడి ఉన్నతికి దోహదం చేస్తాయి.
దుఃఖమిత్యేవ యత్కర్మ, కాయక్లేశభయాత్త్యజేత్ ।
స కృత్వా రాజసం(న్) త్యాగం(న్), నైవ త్యాగఫలం(ల్ఁ) లభేత్ ॥18.8॥
శరీరానికి కష్టం కలుగజేయునదిగా భావించి ప్రయాసగా భావించి, కర్తవ్య కర్మను వదలినచో, అది రాజస త్యాగమనబడుతుంది. దాని వలన ఎలాంటి ఫలితం లభించదు. సోమరితనమే దీనికి ప్రధాన కారణం. అట్టి సోమరితనాన్ని త్యజిస్తే, చివరికి ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.
కార్యమిత్యేవ యత్కర్మ, నియతం(ఙ్) క్రియతే౽ర్జున ।
సఙ్గం(న్) త్యక్త్వా ఫలం(ఞ్) చైవ, స త్యాగః(స్) సాత్త్వికో మతః ॥18.9॥
శాస్త్రం ద్వారా చేయ తగిన నియత కర్మలను ఫలాసక్తి లేకుండా ఆచరించడమే సాత్విక త్యాగమనబడుతుంది. త్యాగమనగా కర్మ త్యాగము కాదు, కర్మఫల త్యాగం మాత్రమే. ఇది ఉత్తమమైన త్యాగం. ఒక అంధుడు రోడ్డు దాటవలసి ఉంటుంది. తన కర్తవ్యంగా భావించి, వారిని రోడ్డు దాటించడం సాత్విక త్యాగమవుతుంది. దానివల్ల ఆత్మానందం లభిస్తుంది. ఆసక్తిని, తనకు ప్రాప్తించ వలసిన దానిని వదలడం త్యాగమనబడుతుంది . అంతేకాని కర్మను వదిలిపెట్టడం కాదు. కర్తవ్య పాలనలో మనకు ఎవరు సహకరించవలసిన అవసరం లేదు. రామాయణంలో హనుమానుల వారికి ఏ పదవి లేదు. కాని, తన సమస్త కర్తవ్య కర్మలను నిర్వహించాడు. వారు లేకుండా రామాయణమే లేదు. పరమాత్మ అయినట్టి శ్రీకృష్ణ భగవానులు తన కర్తవ్యంగా భావించి, అర్జునుడికి రథ సారథిగా తన విధిని నిర్వర్తించారు. ఆ విధంగానే వారు యుద్ధరంగంలో ఉపదేశం చేశారు కూడ. యుద్ధ విరామ సమయంలో, గాయపడిన అశ్వాలకు స్వయంగా చికిత్సను అందజేశారు.
న ద్వేష్ట్యకుశలం(ఙ్) కర్మ, కుశలే నానుషజ్జతే ।
త్యాగీ సత్త్వసమావిష్టో, మేధావీ ఛిన్నసంశయః ॥18.10॥
ప్రజ్ఞాశాలి, సంశయ రహితుడైన, సాత్విక త్యాగశీలుడు అశుభమగు, దుఃఖకరములగు కర్మలను ద్వేషించడు మరియు శుభ కర్మలందు, సుఖ కర్మలందు ఆసక్తుడు కాడు. నియత కర్మలు ఇష్టమైనవి కావచ్చును లేదా అయిష్టమైనవి కావచ్చును. ఇట్టి సాత్విక త్యాగి ఇచ్ఛాద్వేష రహితుడై, ద్వంద్వము లందు సమబుద్ధిని కలిగి ఉంటాడు. భగవానులు ఎంగిలి విస్తరాకులు తీశారు, భగవద్గీతా ఉపదేశం కూడ చేశారు.
న హి దేహభృతా శక్యం(న్), త్యక్తుం(ఙ్) కర్మాణ్యశేషతః ।
యస్తు కర్మఫలత్యాగీ, స త్యాగీత్యభిధీయతే ॥18.11॥
దేహధారి అయిన జీవుడికి కర్మలను త్యాగం చేయుట అసంభవం. దేహ సంరక్షణార్థము అవి అవసరం. భోజన, ఉద్యోగ ధర్మాలు తప్పనిసరి. “ న హి కశ్చిత్క్షణమపి….ప్రకృతిజైర్గుణైః “(భ.గీ.3-5)-ఏ మనుష్యుడైనను, ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడ కర్మలను ఆచరించకుండా ఉండలేడు. మనుష్యులందరు ప్రకృతి జనితములైన గుణములకు లోబడి, కర్మలు చేయుటకు బాధ్యులౌతారు. ఇందులో సందేహం లేదని భగవానులు తెలిపారు. అట్టి కర్మల ఫలమును విడిచివాడే సాత్విక త్యాగి.
అనిష్టమిష్టం(మ్) మిశ్రం(ఞ్) చ, త్రివిధం(ఙ్) కర్మణః(ఫ్) ఫలమ్ ।
భవత్యత్యాగినాం(మ్) ప్రేత్య, న తు సన్న్యాసినాం(ఙ్) క్వచిత్ ॥18.12॥
మూడు రకాల కర్మ ఫలాలు, కర్మఫల త్యాగం చేయని వారికి లభిస్తాయి. ఇష్ట ఫలాలు అనగా సుఖ/స్వర్గ ఫలాలు, అయిష్ట ఫలాలు అనగా దుఃఖ/నరక ఫలాలు మరియు ఇష్టాయిష్ట ఫలాలు అనగా సుఖ దుఃఖములతో కూడిన మిశ్రమ ఫలాలు మనుష్యులకు మరణాంతరం అందుతాయి. అవి స్వర్గ, నరక, మనుష్య జన్మలకు దారితీస్తాయి. కర్మ ఫలాసక్తి విడవని వాడు కర్మ ఫలాలు అనుభవించవలసినదే. ఈ జన్మలో కాకపోతే, మరుజన్మలో నైనా కర్మ ఫలాలకు బాధ్యులవుతారు. కర్మ ఫల త్యాగం చేసినవారికి, కర్మబంధం ఏర్పడదు. జన్మ రాహిత్యం సిద్ధిస్తుంది. ఆరవ అధ్యాయంలో భగవానులు తెలిపారు. “ అనాశ్రితః(ఖ్) కర్మఫలం(జ్)…చాక్రియః ॥”(భ.గీ.6-1)
త్యాగం మరియు సన్యాసం యొక్క అర్థం ఒకటే. కర్మ ఫల త్యాగమే సన్యాసం. కర్మ ఫలమును ఆశ్రయించక, కర్తవ్య కర్మలను ఆచరించు వాడే నిజమైన సన్యాసి మరియు యోగి. కేవలం కర్మ త్యాగం వల్ల, అగ్ని కార్యముల త్యాగం వల్ల సన్యాసి కాలేడు.
పూర్ణ కర్మలు ఎలా అవుతాయి, ఏ కారణం వల్ల అవుతాయి, కర్మలు నెరవేరుటకు గల ఐదు కారణముల గూర్చి రాబోయే సత్రంలో తెలుసుకుంటామని చెబుతూ, ఈనాటి సత్రాన్ని భగవత్ చరణాలకు అర్పిస్తూ, వివేచకులు ప్రశ్నోత్తరములను చేపట్టినారు.
ప్రశ్న: భగవద్గీతాలో అతి విశిష్టమైన అధ్యాయం ఏది ? జవాబు: గంగా నది గంగోత్రి నందు ఆవిర్భవిస్తుంది. కాశీలో ఉంది, రిషికేష్ లో కలదు, హరిద్వార్ లో కలదు. అంతటా అది పవిత్రమే. మొదటి అధ్యాయం నుండి 18 వ అధ్యాయం వరకు అన్ని ఉత్తమ అధ్యాయాలే. మొదటి అధ్యాయానికి కూడ విశిష్టత కలదు. అర్జునుడి మనఃస్థితి, ఆనాటి పరిస్థితుల ప్రభావం మిగతా అధ్యాయాలకు భూమికగా ఉంటాయి. ఆదిశంకరుల దృష్టిలో రెండవ అధ్యాయం నుండి భగవద్గీతా మొదలవుతుంది. సామాన్యుల దృష్టిలో, మొదటి అధ్యాయాన్ని అర్థం చేసుకుంటేనే, మిగతా అధ్యాయాల యొక్క విశిష్టత అర్థమవుతుంది.
ప్రశ్న: గాయత్రీ మంత్ర పఠనానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయా ?
జవాబు : ఇది శాస్త్రానికి సంబంధించిన విషయం. జ్ఞానుల నుండే వివరణ కోరవలసి ఉంటుంది. భగవానుల నామస్మరణకు సమయమంటూ లేదు. వైదికపరమైన విశేష మంత్రాలు శక్తిపూరితాలు కాబట్టి, వాటి ఉచ్ఛారణ నియమాలు, సమయపాలన గూర్చి తెలుసుకొని పాటించాలి.
ప్రశ్న: నేను భగవద్గీతాను త్రికరణ శుద్ధిగా నిత్య జీవితంలో పాటిస్తాను కాని, కుటుంబ సభ్యుల దృష్టిలో నేను నిరర్థకుడను. నేనేం చేయాలి ?
జవాబు: ధర్మార్థ కామ మోక్షాలలో ధర్మము అతి విలువైనది. ధర్మాన్ని పాటించిన వారికి, ఇతర అంశాలు ప్రాధాన్యం కావనే చెప్పాలి. కుటుంబ సభ్యులు అర్థానికి విలువ ఇచ్చినప్పటికి, మనం కర్తవ్య ధర్మాన్ని వదలకూడదు. కామనలు ఎప్పుడూ సంపూర్ణము కావు.
ప్రశ్న : భగవద్గీతా చదివినప్పుడు ఉచ్ఛారణ బాగానే అనిపిస్తుంది. కంఠస్థీకరణ సాధ్యం కావడం లేదు.
జవాబు: బాల్యంలో కంఠస్థీకరణ చేయడం సులువు. క్రమక్రమంగా వయసుతో జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. అందుకు చింతపడవలసిన అవసరం లేదు. కాని ప్రయాస మాత్రం చేస్తూ ఉండాలి. మన ప్రయాణం ఈ జన్మతోనే పూర్తికాదు. తాను ఆత్మ స్వరూపులని తెలుసుకున్నాక, దేహంతో ఉన్నా, లేకున్నా ముక్తులే అవుతారు. భగవద్గీతా, భగవానులతో సంపర్కం ఎప్పుడు వీడకూడదు. తాను అనాదిగా, అనంతుడిగా తెలుసుకోవాలి.
ప్రశ్న : మనం కర్తవ్య పాలన చేయాలి. కాని ఆ కార్యం సరైనదా, కాదా అని ఎలా తెలుసుకోవాలి ?
జవాబు : భగవానులతో అనుసంధానమై, భగవానులు తనకు అప్పగించిన కార్యమని భావించి, నిర్వహించే కార్యం సత్కార్యమవుతుంది. అందులో లాభనష్టాలతో పనిలేదు. ఆ కార్యం యొక్క యోగ్యతను గూర్చి మాత్రమే ఆలోచించాలి. భగవానులతో అనుసంధానమైతే, ఉచితకార్యమేదో అంతరాత్మకు సమాధానం లభిస్తుంది. “ ఉపద్రష్టనుమన్తా చ … పరః ॥”(భ.గీ.13-22)- భగవానులు సాక్షిభూతులు, సమ్మతి నిచ్చువారు, ధరించి, పోషించువారు, భోక్త, మహేశ్వరులు మరియు పరమాత్మ స్వరూపులు. మనకు మార్గదర్శనం చేస్తారు. “ ఓం తత్సదితి నిర్దేశో…పురా ॥ “(భ.గీ.17-23)- ‘ఓం’ అంటూ కార్యాలు మొదలుపెట్టి, ‘తత్’ అంటూ భగవత్ కార్యంగా నిర్వహించాలి. కార్యం పూర్తి కాగానే ‘సత్’ అంటూ, వారికి అర్పణ చేయాలి. అప్పుడు అది సత్కార్యమవుతుంది.
ప్రశ్న: గృహిణి యొక్క కర్తవ్యాలు ఏమిటి ?
జవాబు : చేయదగిన గృహస్థ కర్మలను కుటుంబ సభ్యుల గూర్చి మరియు ఇతరుల గూర్చి కూడా చేస్తూ ఉండాలి. కర్మలు ఆచరించే విషయంలో నాలుగు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు, కర్మలు చేయడం ఆవశ్యకం కాబట్టి చేస్తారు. రెండవ రకం వారు, కర్మలు చేయుట ఆవశ్యకమైనా చేయరు. మూడవ రకం వారికి కర్మలు చేయుట ఆవశ్యకం కాదు. అయినా, పరుల హితం కోరి చేస్తూ ఉంటారు. నాలుగవ రకం వారికి కూడ కర్మలు చేయుట ఆవశ్యకము కాదు, కాబట్టి చేయరు. నలుగురిలో ఎవరు ఉత్తములు ? కర్మలు చేయవలసిన అవసరం లేకపోయినా, కర్మలు నిర్వర్తించేవారు ఉత్తములు.
సమస్త సాంకేతిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతిమ ప్రార్థన తర్వాత, సామూహిక హనుమాన్ చాలీసా పఠనానంతరం సత్రం ముగిసింది.