विवेचन सारांश
ఆత్మ జ్ఞానము యొక్క విభిన్న విశిష్టతలు

ID: 5888
तेलुगू - తెలుగు
ఆదివారం, 17 నవంబర్ 2024
అధ్యాయము 2: సాంఙ్ఖ్య యోగము
4/7 (శ్లోకము 29-40)
వివేచకులు: గీత విదూషి సౌ.వందనా వర్ణేకర్ గారు


ప్రారంభ ప్రార్థన, దీప ప్రజ్వలన మరియు గురు ప్రార్థన తరువాత గీతా విధూషీ శ్రీమతి వందనా జీ వార్నేకర్ గారిచే వివేచనా సత్రము ప్రారంభించబడింది. భగవద్గీతా అత్యంత పవిత్రమైన, అనుపమేయమైన శాశ్వతమైన జ్ఞాన ప్రసాదము. ప్రత్యక్షయుద్ధ సమరాంగణములో భగవంతుని ముఖారవిందముచే వెలువడిన జ్ఞాన ప్రవాహము మన జీవనాన్ని పవిత్రము చేస్తుంది మరియు మన అంతరంగాన్ని శుభ్రపరుస్తుంది, శుద్ధి గావిస్తుంది. మన అందరి ఆనంద మార్గాన్ని సుగమము చేస్తోంది. జ్ఞానేశ్వర్ మహారాజు చెప్పినట్లుగా, భగవద్గీతార్థముతో సంపూర్ణ విశ్వము నిండి యుండు గాక ! స్వధర్మముతో సంపూర్ణ విజయమును పొందుదురు గాక !  ఒకరికొకరు పరస్పర సహకారంతో మనుష్య జాతి కళ్యాణకరమగు గాక ! ఈ మనుష్యులందరిలో ఆనందముప్పొంగు గాక! గీతా పఠనంతో పైవన్నీ సిద్ధించు గాక! భగవద్గీతా అనుపమేయమైన పవిత్రమైన మరియు అంతిమ లక్ష్యాన్ని ప్రాప్తింప చేయు గ్రంథము. గీతా పఠనం ద్వారా మన జీవితంలో నిత్య నూతన భావములు ఏర్పడతాయి. గీతాపఠన అభ్యాసముతో, లోతైన జ్ఞానములో మునిగి తేలి భగవంతుని తీరాలకు చేరుటకు ఈ వివేచనములు చాలా ఉపయుక్తమైనవి. దేహబుద్ధితో వ్యామోహితుడైన అర్జునుడికి, ఆత్మ బుద్ధి కోసమై భగవంతుడు ప్రబోధిస్తూ, కర్తవ్య పరాయణుడిని చేస్తున్నాడు. అబేధ్యమైన ఈ ఆత్మశక్తి ఎప్పటికి నశింపబడదు కానీ ఈ రూపాంతరము చెందుతూ ఉంటుందని చెబుతూ, ఆత్మ తత్వం యొక్క అనేక లక్షణాలను వివరిస్తున్నారు. ధర్మ శబ్దముతో ప్రారంభించబడిన భగవద్గీతాలో స్వధర్మమే ముఖ్య ఉద్దేశ్యముగా సాగుతోంది. ధర్మమనగా మన జీవన పద్ధతి. ధర్మమనగా మన కర్తవ్యము. ధర్మము మన జీవనంలో అంతర్భాగముగా ఉండాలన్నదే భగవద్గీతా ముఖ్య ఉద్దేశ్యము. ఆత్మ తత్వము గూర్చి తెలుసుకున్న జ్ఞానులలో కూడా అనేక శ్రేణులు ఉంటాయని వివరిస్తున్నారు భగవానులు.


2.29

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమ్,
ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః৷
ఆశ్చర్యవచ్ఛైనమన్యః(శ్) శృణోతి,
శ్రుత్వాప్యేనం(వ్ఁ) వేద న చైవ కశ్చిత్॥2.29॥

ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని (ఈ ఆత్మను ) ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్త్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేఱొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ   విన్నవారిలో కూడ కొందరు దీనినిగూర్చి  ఏమియు ఎఱుగరు.

ఆత్మ తత్వం యొక్క జ్ఞానులు అనేక రకాలుగా ఉంటారు. ఆత్మానందాన్ని అనుభూతి పొందుతూ, ఆత్మానందంలోనే రమిస్తూ, ఆత్మజ్ఞాన తత్త్వంతో మునిగిపోయి ఉంటారు. వారు కూడా ఆత్మ తత్వ అనుభూతి పొందిన తర్వాత కూడా ఆశ్చర్యంతోనే అగుపిస్తూ ఉంటారు.  సాగరంలో అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. ఈ సాగరంలోని అలలకు కారణము సాగరము మాత్రమే. కానీ సాగరానికి కారణం అలలు కాదు. అలాగే ఈ అదృశ్య కార్యాచరణమంతా అదృశ్య తెరపై జరుగుతూ ఉంటుంది. కొంతమంది తత్వ జ్ఞానులు కూడా , ఈ అవినాశి తత్వాన్ని వర్ణన కూడా చేయలేరు. వర్ణన చేయడానికి ప్రయత్నం చేసినా సంపూర్ణంగానూ చేయలేరు. అలాగే మరికొందరు అనగా మనలాంటి వారు, ఆత్మజ్ఞానాన్ని వింటారు. కానీ అనుభూతి పొందే ప్రయత్నం కూడా చేయలేరు. జ్ఞాన ప్రాప్తి ప్రయత్నం కూడా చేయలేరు. అనగా ఆత్మ తత్వ జ్ఞానం పొందిన తర్వాత కూడ, దానిని అనుభూతి పొందడానికి చాలా కష్టపడాలి.

2.30

దేహీ నిత్యమవధ్యో౽యం(న్), దేహే సర్వస్య భారత৷
తస్మాత్సర్వాణి భూతాని, న త్వం(మ్) శోచితుమర్హసి৷৷30॥

ఓ అర్జునా! ప్రతిదేహమునందును ఉండెడి ఈ ఆత్మ వధించుటకు వీలుకానిది. కనుక  ఏ ప్రాణిని గూర్చియైనను నీవు శోకింపదగదు. 

అందరి దేహాలలోనూ సూక్ష్మతత్వంగా ఉన్న ఈ ఆత్మ నాశరహితమైనది. వధించుటకు వీలు లేనిది. ఈ సూక్ష్మతత్వం గురించి తెలుసుకున్న ఎవ్వడునూ శోకించడు.  భగవద్గీతాలో మొదటి శబ్దము ధర్మ శబ్దము. చివరి శబ్దము మమ. అనగా భగవద్గీతా సారాంశం అంతయునూ మమ ధర్మము. అనగా స్వధర్మం. అనగా మన స్వకర్తవ్యము. హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, ఎవరైనా కూడా స్వధర్మ పరాయణులై ఉండటమే శ్రేయస్కరము.

2.31

స్వధర్మమపి చావేక్ష్య, న వికమ్పితుమర్హసి৷
ధర్మ్యాద్ధి యుద్ధాఛ్రేయో౽న్యత్,క్షత్రియస్య న విద్యతే৷৷31॥

అంతేగాక  స్వధర్మమునుబట్టియు నీవు భయపడనక్కరలేదు. ఏలనన క్షత్రియునుకు ధర్మయుద్ధమునకు మించినట్టి  శ్రేయస్కరమైన కర్తవ్యము మఱియొకటి  ఏదియును లేదు.

స్వధర్మ పాలనకై క్షత్రియుడు యుద్ధ భూమిలో ఎప్పుడు వెనుతిరగకూడదు. పోరాడటమే వారి ప్రథమ కర్తవ్యము. ప్రతి సైనికుడికి కూడా యుద్ధమే  ప్రథమ కర్తవ్యంగా ఉంటుంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకానొకప్పుడు రష్యాలో భగవద్గీతాను  తాత్కాలికంగా నిషేధించారు. ఎందుకంటే ఇది కర్తవ్యంలో భాగంగా యుద్ధ ప్రేరితమైన బోధన. అర్జునుడు కూడా ఇక్కడ భ్రమ పీడితుడయ్యాడు. మనకు ఇంట్లో తల్లిదండ్రుల సేవయే ప్రథమ కర్తవ్యంగా ఉంటుంది. పొరుగింటి వారితో మన కర్తవ్యం వేరుగా ఉంటుంది. అలాగే మన జీవితాలలో ప్రతి దశలోనూ మన కర్తవ్యం మారుతూ ఉంటుంది. మన కర్తవ్యాన్ని మనము అన్నివేళలా సరిగా నిర్వర్తించాలి. 

2.32

యదృచ్ఛయా చోపపన్నం(మ్), స్వర్గద్వారమపావృతమ్৷
సుఖినః క్షత్రియాః(ఫ్) పార్థ, లభన్తే యుద్ధమీదృశమ్৷৷32॥

 ఓ పార్థా! యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెఱచిన ద్వారము వంటిది. 

భగవానుడు అర్జునుడితో చెబుతూ, నీవు యుద్ధము కోరుకోలేదు, నీకు ఈ యుద్ధం కర్తవ్య రూపంలో ప్రాప్తించింది. నీవు ఎక్కడ అధర్మానికి పాల్పడలేదు. మాయా జూదంలో ఓడించి, రాజ్యాన్ని హరించారు. అరణ్యవాసము మరియు అజ్ఞాతవాసము తర్వాత కూడా మీ రాజ్యము తిరిగి ఇవ్వబడలేదు. అన్యాయానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులు దాటి పోయాయి. భగవంతుడు కూడా యుద్ధము ఎప్పుడు చేయాలో, ఎంతవరకు చేయాలో, ఎప్పుడు యుద్ధము విరమించాలో కూడా చాలాసార్లు, చాలా సందర్భాలలో చెప్పాడు. అర్జునుడి కోసం స్వర్గ ద్వారము తెరవబడిందని కూడా చెప్పాడు.  కొంతమంది తల్లిదండ్రులు భారత్ లోనే ఉన్నా, పిల్లలు మాత్రం విదేశాలలో ఉంటారు. విదేశాలలో ఉన్న వారు, వారి కర్తవ్యాలను నిర్వర్తించి, తల్లిదండ్రుల సేవలు చేసిన వాళ్లకే కర్తవ్య పుణ్యము ప్రాప్తిస్తుంది. అన్ని ప్రమాదాలలో కూడా వారికి సహాయం చేయడానికి అందరికీ అవకాశం లభించదు. భారత స్వాతంత్రోద్యమంలో కూడా కొందరికి త్యాగము చేసే అవసరం ప్రాప్తించింది. రాయబారిగా శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో చెబుతూ ఇంద్రప్రస్థం పాండవులు గెలిచిన రాజ్యము. అలాంటి ఇంద్రప్రస్థము ఇవ్వలేకపోయినా, కనీసం ఐదు ఊర్లు అయినా ఇమ్మని అడిగాడు. కానీ దుర్యోధనుడు సూది మొనంత భూమిని కూడా ఇవ్వనని చెప్పాడు. శాంతి రాయబార సమయంలో ద్రౌపది కూడా తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసింది. తన శిరోజాలను ఎప్పటికీ వదిలివేసానని, ఆ అవమానం నేను ఎలా భరించాలని కూడా అడిగింది. శ్రీకృష్ణుడు దానికి సమాధానం చెబుతూ, మనము రాయబారం చేయనట్లయితే ఈ యుద్ధ పాపమంతా నీ కేశాలకే చుట్టుకుంటుంది అని చెప్పాడు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా రష్యా ఉక్రెయిన్ల యుద్ధ సమయంలో, శాంతి ప్రస్తావనతో రెండు దేశాల నేతలతోనూ చర్చించాడు. 

2.33

అథ చేత్త్వమిమం(న్) ధర్మ్యం(మ్), సఙ్గ్రామం(న్) న కరిష్యసి৷
తతః(స్) స్వధర్మం(ఙ్) కీర్తిం(ఞ్) చ, హిత్వా పాపమవాప్స్యసి৷৷33॥

ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో  నీ స్వధర్మమునుండి  పాఱిపోయినవాడవు అగుదువు. దానివలన కీర్తిని  కోల్పోవుదువు. పైగా నీవు పాపము చేసినవాడవగుదువు.

అర్జునుడు చాలా కీర్తిని గడించాడు. ధనుర్దారిగా పేరుగాంచాడు. స్వర్గలోకానికి వెళ్లి దివ్యస్త్రాలను సంపాదించాడు. యుద్ధము చేయని యెడల ఈ కీర్తి అంతయు నాశనం అవుతుంది. ధర్మముగా తన కర్తవ్యం నిర్వర్తించనట్లయితే, అనగా ఈ యుద్ధము చేయనట్లయితే ఘోరమైన దోషములు, పాపములు కలుగుతాయని భగవానులు అర్జునుడితో హెచ్చరిస్తున్నారు. 

2.34

అకీర్తిం(ఞ్) చాపి భూతాని, కథయిష్యన్తి తే౽వ్యయామ్৷
సమ్భావితస్య చాకీర్తిః(ర్), మరణాదతిరిచ్యతే৷৷34॥

లోకులెల్లరును బహుకాలమువఱకును నీ అపకీర్తినిగూర్చి చిలువలు పలువలుగా చెప్పికొందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణముకంటెను బాధాకరమైనది. 

ఒకవేళ మానసిక స్వభావము వలన యుద్ధము చేయనట్లయితే, మన మానసిక స్వభావాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. ఈ అపకీర్తిని జనులు చిరకాలం కథలు కథలుగా చెప్పుకుంటారు. కానీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, అపకీర్తి మరణం చాలా దారుణమైనదని భగవానుడు అర్జునుడికి నచ్చజెబుతున్నాడు.

2.35

భయాద్రణాదుపరతం(మ్), మంస్యన్తే త్వాం(మ్) మహారథాః৷
యేషాం(ఞ్) చ త్వం(మ్) బహుమతో, భూత్వా యాస్యసి లాఘవమ్৷৷35॥

ఈ మహారథులదృష్టిలో  ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు.  యుద్ధవిముఖుడవైనచో   వీరి దృష్టిలో  నీవు ఎంతో చులకన అయ్యెదవు. అంతేగాక  నీవు పిరికివాడవై యుద్ధమునుండి పారిపోయినట్లు వీరు భావింతురు. 

అర్జునుడు  ధార్తరాష్ట్రేయులకు భయపడ్డాడు. భయంతో యుద్ధం నుండి పారిపోయాడు. ఈ పారిపోయిన దాని గురించి ఇతిహాసంలో శాశ్వతంగా లిఖించబడుతుంది. ఇది ఏ మాత్రం కళ్యాణకారకము కాదు. ఇలా పలు విధాలుగా శత్రువులు నిజంగా చెప్పుకుంటారని సముదాయిస్తున్నాడు. గురువు రూపంలో ఉన్న భగవానుడు శిష్యుడి రూపంలో ఉన్న అర్జునుడితో, ఆత్మవిశ్వాసము కోల్పోయిన వాడికి మరల ఆత్మవిశ్వాసము జాగృతపరుస్తున్నాడు భగవంతుడు. అందుకే భగవద్గీతా ఒక మనో వైజ్ఞానిక గ్రంథము. అసమానమైన కీర్తియును, ముల్లోకాలలో నిరుపమానమైన గుణాలు కలిగిన వాడివని భగవానుడు అర్జునుడికి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నాడు. ఎప్పుడైనా, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారి ఆలోచనాశక్తి అంతయు కోల్పోతారు. అప్పుడు వారి గుణాలను గుర్తు చేయడం ద్వారా మరల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది.

2.36

అవాచ్యవాదాంశ్చ బహూన్, వదిష్యన్తి తవాహితాః৷
నిన్దన్తస్తవ సామర్థ్యం(న్), తతో దుఃఖతరం(న్) ను కిమ్৷৷36॥

నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు. అంతకంటె విచారకరమైన విషయమేముండును? 

"నీయొక్క మంచి గుణాలన్నీ అవలక్షణాలుగా మారిపోతాయి. దీని వలన వచ్చిన అపకీర్తి నిన్ను వెన్నంటే ఉండి, నిన్ను క్షోభకు గురి చేస్తూనే ఉంటుంది. నీ చెడును కోరుకునే వాళ్లంతా నీ అసహాయతను, అసమర్థతను గురించి నిందిస్తూనే ఉంటారు" అని భగవంతుడు అర్జునుడికి హెచ్చరిస్తున్నాడు.

2.37

హతో వా ప్రాప్స్యసి స్వర్గం(ఞ్), జిత్వా వా భోక్ష్యసే మహీమ్৷
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ, యుద్ధాయ కృతనిశ్చయః৷৷37॥

ఓ  అర్జునా! రణరంగమున మరణించినచో నీకు వీర స్వర్గము ప్రాప్తించును   యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. 

చనిపోయిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుందని నానుడి. యుద్ధంలో మరణించినట్లయితే స్వర్గం ప్రాప్తిస్తుంది. కానీ యుద్ధంలో గెలిచినట్లయితే, ఈ రాజ్యసంపదలని, భోగాలన్నీ అనుభవించవచ్చు. అందువలన మనము మన కర్తవ్యాన్ని అనుసరించి యుద్ధానికి సిద్ధం కావాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే, మనము మన కర్తవ్యం పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి, ఎప్పుడు సిద్ధంగా ఉండాలి.

2.38

సుఖదుఃఖే సమే కృత్వా, లాభాలాభౌ జయాజయౌ৷
తతో యుద్ధాయ యుజ్యస్వ, నైవం(మ్) పాపమవాప్స్యసి৷৷38॥

జయాపజయములను, లాభనష్టములను, సుఖదుఃఖములను సమానముగా భావించి, యుద్ధసన్నద్దుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. 

ఎవరైనా పరీక్షకి వెళ్లినా, ఇంటర్వ్యూలకి వెళ్లినా, సెమినార్లకు వెళ్లినా, ఒలంపిక్స్ లోకి వెళ్ళినా, దేనికోసమైనా కర్తవ్యం నిర్వర్తించడానికి వెళ్ళినప్పుడు, వాటి యొక్క పర్యవసానాలను గురించి ఆలోచించినట్లయితే, మన సామర్థ్యం తప్పనిసరిగా 100% ఉండదు. దానికన్నా తగ్గుతుంది. భగవంతుడికి ప్రియమైన శబ్దాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఎక్కువసార్లు ఉపయోగించారు. అవి జ్ఞానము, యజ్ఞము, సమత్వము మరియు శ్రద్ధ మొదలగునవి. సమత్వము యోగము లాంటిదని ముందే చెప్పారు. ప్రతి ఒక్కరిలోనూ జయాపజయాలు,  లాభనష్టాలు మరియు అనుకూలత ప్రతికూలతలు అన్ని సంభవిస్తూ ఉంటాయి. కానీ మనము అనుకూలంగా ఉండాలనే కోరుకుంటాము. ప్రతికూలంగా ఉండకూడదనే కోరుకుంటాము. చిన్న చిన్న అపజయాలను కూడ మనము భరించలేకపోతున్నాము ఈ రోజుల్లో. చిన్నపిల్లలను కూడా ఆస్తమానం వారిని, మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తుంది. చిన్న చిన్న అపజయాలను గాని, అవమానాలను కానీ భరించి నట్లయితే, నిజంగా మన మనో బలము మరింత పెరగాలి. మనం చేసే దిన చర్యలలో కూడా, ముఖ్యమైన సిస్టమ్స్ పనిచేయడం లేదంటే, వాటిని పునరుద్ధరించడానికి చాలా కష్టపడతాము. దాని వలన మన మనోబలము పెరుగుతుంది. "ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటి"- పిల్లలకు అనేక సదుపాయాలు కల్పించడం వలననే, వారికి కష్టాలు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి కోల్పోతున్నారు. అనగా మనకు అన్ని విజయాలే కావాలని కోరుకోవడం వల్లనే, మనము కష్టాలను ఎదుర్కొనే మానసిక ధైర్యం కోల్పోతున్నాము. ఈ రోజుల్లో పిల్లలు ఏదైనా చెప్పినట్లయితే, వద్దని చెప్పే ధైర్యం కూడా పెద్దలు కోల్పోతున్నారు. అనుకూలత కోసం మనము ప్రాకులాడి, ప్రాకులాడి ప్రతికూలత ఎదురైనప్పుడు మనము దానిని ఎదుర్కొనే సహన శక్తిని కోల్పోతున్నాము. 

2.39

ఏషా తే౽భిహితా సాఙ్ఖ్యే, బుద్ధిర్యోగే త్విమాం(మ్) శృణు৷
బుద్ధ్యాయుక్తో యయా పార్థ, కర్మబన్ధం(మ్) ప్రహాస్యసి৷৷39॥

ఓ పార్థా! ఈ  (సమత్వ)  బుద్ధిని ఇంతవఱకును జ్ఞానయోగ దృష్టితో తెల్పితిని. ఇప్పుడు దానినే కర్మయోగదృక్పథముతో వివరించెదను, వినుము దానిని  ఆకళింపుచేసికుని, ఆచరించినచో కర్మబంధములనుండి నీవుముక్తుడవయ్యెదవు.

ఇప్పటివరకు సాంఖ్యము గురించి వివరించబడింది. ఆత్మజ్ఞాన ప్రకాశము వలన, కర్మబంధనముల నుండి ఎలా విడుపడాలో, మనము బుద్ధి యోగముతో ఈ స్థితిని ఎలా సాధించాలో బుద్ధిమంతుడిగా వినవలసినదిగా భగవంతుడు కోరుతున్నాడు.

2.40

నేహాభిక్రమనాశో౽స్తి, ప్రత్యవాయో న విద్యతే৷
స్వల్పమప్యస్య ధర్మస్య, త్రాయతే మహతో భయాత్৷৷40॥

ఈ (నిష్కామ) కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికిని బీజనాశము లేదు. దీనికి విపరీత ఫలితములే  యుండవు. పైగా ఈ (నిష్కామ) కర్మయోగమును ఏ కొంచెము సాధనచేసినను అది జన్మమృత్యురూప మహాభాయమునుండి కాపాడును.

కర్తవ్య పాలన వలన మనము ఆరంభించిన దాని ఫలితము ఎప్పటికీ నాశనం అవ్వదు. అలాగే దాని పర్యవసానము లేదా దుష్పరిణామాలు కూడా  ఉండవు. ఎవరైనా మన వాళ్లకు అనారోగ్యం చేసినప్పుడు, వారికి మన కర్తవ్యం ప్రకారము ఏమాత్రం సహాయం చేసినా, ఏమాత్రం పరామర్శలు చేసినా,  అది చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడమే ఇక్కడ చెప్పడంలో చాలా అత్యంతమైన మధురమైన రహస్యము. ఆ కర్తవ్యపాలన చిన్నదా? పెద్దదా? అని కూడా మనము చూడనవసరం లేదు కానీ దాని ఫలితం మాత్రం చాలా పెద్దగానే ఉంటుంది.   సనాతన ధర్మాన్ని కాపాడటం మనందరి కర్తవ్యము. సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళని రక్షించుకోవడం కూడ మన బాధ్యత. సనాతన ధర్మాన్ని కాపాడడం వలన, మనము భవిష్యత్తులో భయాలకు దూరంగా ఉండవచ్చు.
 జై శ్రీ కృష్ణ!!!

ప్రశ్నోత్తర సమయము

1.ప్రశ్న, పద్మిని ఆగర్వాల్
భగవద్గీతా భగవంతుడు యొక్క వాజ్ఞయ స్వరూపం అని చెప్పారు కదా ! దీని గురించి మరింత వివరంగా చెప్పగలరు.
జవాబు.
ఏదైనా ఒక గ్రంథము భగవంతుడికి యథాతథ స్వరూపముగా ఉండదు. గ్రంథకర్త యొక్క భావజాలం ప్రతిభింభిస్తుంది. భగవద్గీతా జ్ఞాన ప్రధానమైనది. కానీ ఇందులో భక్తి మరియు అన్ని విషయాలు దాగి ఉంటాయి. అలాగే భాగవతం భక్తి రస ప్రదానంగా సాగుతుంది. ఇందులో జ్ఞానం మరియు అన్ని విషయాలు దాగి ఉంటాయి. అలాగే తులసీదాసు యొక్క రామచరితమానస్ కూడా భక్తి రస ప్రధానంగా సాగుతుంది.

2. ప్రశ్న, శివ నాథ్ కుమార్ 
మా అబ్బాయిలు చాలా పెద్ద చదువులు చదివి, బీహెచ్ఈఓ గోల్డ్ మెడల్ వచ్చినా, చిన్న ఉద్యోగంలోనే స్థిరపడ్డాడు. మేము ఏమి చెప్పినా కానీ వినడం లేదు. దీనికి తరుణోపాయం ఏంటి?
 జవాబు. చదువులు పెద్దవైనా చిన్నవైనా, ఉద్యోగం చిన్నదైనా పెద్దదైన మనకు సంతృప్తినిస్తుందా లేదా అన్నదే ముఖ్యమైన విషయం. మనసుకి ఆనందాన్ని ఇచ్చే పని ఏదైనా సంతోషంగా స్వీకరించాలి. మన స్థాయి పని అవునా కాదా అన్నది మనమే నిర్ణయించుకోవాలి, వేరేవాళ్లు కాదు. సానుకూలంగా చెప్పి చూడాలి లేదంటే, అది  విపరీత పరిస్థితులకు దారితీస్తుంది.

3. ప్రశ్న, 
ఆత్మ, జీవాత్మ, ప్రేతాత్మ మరియు పరమాత్మల మధ్య భేదం ఏంటి?
జవాబు:
ఈ విషయము చాలా నిగూఢమైనది. పరమాత్మ స్వరూపము నిరాకారమైనది. ఆ పరమాత్మ యొక్క అంశమే మనలో ఆత్మగా చేరుతుంది. మన దేహముతో కలిసి జోడించబడి, గత జన్మల యొక్క విషయ వాసనలతో, పూర్వజన్మ దుష్కృతాలతో, అశుద్ధంగా మారిపోయి జీవాత్మగా మారుతుంది. ఆ పాపాలన్నింటినీ, పూర్వజన్మ దుష్కృతాలన్నింటిని, మనము శుద్ధి పరచాలి. అప్పుడే జీవాత్మ ఆత్మ గా మారుతుంది. తరువాత పరమాత్మలో ఐక్యమవుతుంది. దీనికి ఒక ఉదాహరణ, ఒక విద్యుత్ సబ్ స్టేషన్ లో విద్యుత్ నిక్షేపమై ఉంటుంది. అది వివిధ మార్గాల ద్వారా, మన ఇంటిలో నున్న విద్యుత్ పరికారాలలో ప్రవేశిస్తుంది. ఈ విద్యుత్ పరికరాలలో విద్యుత్ ప్రవహించినప్పుడే ఆ పరికరం పనిచేస్తుంది. విద్యుత్తు అయిపోగానే లేదా ఆగిపోగానే ఆ పరికరం పనిచేయదు. అలాగే మొత్తము విద్యుత్ అంతా పరమాత్మ స్వరూపము లాంటిది. వివిధ పరికరాలలో చేరు విద్యుత్తు ఆత్మ స్వరూపము లాంటిది. ప్రతి పరికరాలలోనున్న విద్యుత్తు , స్థూల విద్యుత్ పరిమాణంలో అంశాలు మాత్రమే. అలాగే మనలో ఉన్న ఆత్మ కూడా పరమాత్మ యొక్క అంశము మాత్రమే. వివిధ నిమ్నజాతి యోనులలో చేరు ఆత్మ, వివిధ దుర్గంధాలకు లోను కాబడినందువల్ల, వాటిని ప్రేతాత్మగా కొందరు పేర్కొంటారు. కానీ ఆ పదాన్ని ఉచ్చరించడం, ఆ పదము గురించి మాట్లాడం అంత ఉచితం కాదు. అది కేవలం చెడు విషయాలను పోల్చడానికి మాత్రమే వాడు పదము. కానీ ఇవన్నీ అనుభూతి ద్వారానే తెలుసుకోగలము లేదా సంపూర్ణ జ్ఞానాన్ని పొందగలము.

4. ప్రశ్న
మనము తల్లిని, తండ్రిని, బంధువులందరినీ పేర్లతో పిలవము కదా ! మరి భగవంతుడిని పేర్లతో ఎందుకు సంభోదిస్తున్నాము?
జవాబు.
భగవంతుడిని మనం అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తిగా, స్వరూపంగా, అత్యంత ఆత్మీయతతో సంబోధించదలుచుకుంటాము. ఎలాగైతే మన అత్యంత సన్నిహితులను, స్నేహితులను పేర్లతో పిలుస్తామో, అలాగే భగవంతుడిని కూడా పేర్లతో పిలవడానికే ఇష్టపడతాము. మనకు ఇష్టమైన పేరుతో, ఇష్టం ఉన్నంత దగ్గరగా భగవంతుడిని పిలవవచ్చును, మాట్లాడవచ్చును. భగవంతుడిని పేర్లతో పిలవడం వల్ల మనకు ఎక్కువగా ఆనందం కలుగుతుంది.