विवेचन सारांश
సంసార విముక్తికి అసంగమే ఆయుధం !

ID: 6308
तेलुगू - తెలుగు
శనివారం, 25 జనవరి 2025
అధ్యాయము 15: పురుషోత్తమ యోగము
1/2 (శ్లోకము 1-6)
వివేచకులు: గీతా విశారద డా. ఆశూ గోయెల్ గారు


జై శ్రీ కృష్ణ ! పరమ కృపాళువైన ప్రభువు శ్రీకృష్ణుల వారి చరణాలకు వందనాలు సమర్పిస్తూ, గీతా రసికులందరికి 15వ అధ్యాయమగు పురుషోత్తమయోగ పూర్వార్థ సత్రానికి తొలుత స్వాగతం పలకడమైనది. పరమ పూజ్య స్వామీ శ్రీ గోవిందదేవ్ గిరీ జీ  మహరాజ్ జన్మదిన సందర్భంగా గీతా భక్తి దివస్ ను జరుపుకుంటున్నామని, వారికి శతకోటి వందనాలు సమర్పిస్తూ, సత్ర శుభారంభాన్ని ప్రారంభ ప్రార్థనతో ఆరంభించారు. సత్య, విశ్వాస దీప ప్రజ్వలన ప్రకాశంతో  మనోవికారాలను దూరం చేయడానికి జ్యోతి ప్రజ్వలన గావించడం జరిగింది. తర్వాత గీతాపరివార్ లో గీతా సేవలు అందించడానికి అందరికి విజ్ఞప్తి చేస్తూ,  వివేచన సత్రానికి లర్న్ గీతా ప్రోగ్రాం అంతర్ రాష్ట్రీయ కార్యాధ్యక్షులు, గీతా విశారద్, డాక్టర్ ఆశూజీ గోయల్ గారిని తమ వివేచన నిమిత్తం ఆహ్వానించడమైనది. వారు దైవ ప్రార్ధన అనంతరం తమ వివేచనను అరంభించారు. మానవ జీవితాన్ని సఫలం చేసుకోవడానికి, ఇహపర లోకాలలో విజయం సిద్ధించడానికి, మానవ జీవిత ఉత్థానానికి శ్రీమద్భగవద్గీతాను ఉచ్చారణ చేయడానికి, అర్థం చేసుకోవడానికి, చింతన చేయడానికి మనం ప్రయాస చేస్తున్నామని తెలిపారు. ఇది మన పూర్వజన్మ పుణ్యం కావచ్చును, మన పూర్వజుల పుణ్యఫలితం కావచ్చును, ఈ జన్మలో సంత మహాపురుషుల కృపాదృష్టి వల్ల కావచ్చును, శ్రీమద్భగవద్గీతాతో మనకు అనుసంధానం కలిగింది. మనం భగవద్గీతా చదవడానికి భగవానులచే ఎంపిక చేయబడ్డవారము. భగవత్ కృప లేకుండా ఇది సాధ్యం కాదు. 18వ అధ్యాయంలో భక్తులు నన్ను పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదని సాక్షాత్ పరమాత్మ ప్రామాణికంగా తెలిపారు. ఒకసారి బుుషికేష్ లో పరమ శ్రద్ధేయ స్వామి రామసుఖదాస్ మహరాజ్ ప్రవచనం జరుగుతుంది. వారు అక్కడ కూర్చున్న భక్తులందరు గీతాధ్యయనం చేస్తారు కాబట్టి, వారందరికి భగవత్ ప్రాప్తి నిశ్చితమైనదని తెలిపారు. అందరూ పరంధామ ప్రాప్తి లభ్యమైనదని పరమానంద భరితులయ్యారు. స్వామీజీ మౌనంగా ఉన్నారు. కాని ఎప్పుడు లభ్యమవుతుందనేది వారి కృషిపై ఆధారపడి ఉంటుందని తెలియజేశారు. కొందరికి రెండు జన్మలు పట్టవచ్చును, కొందరికి పది జన్మలు పట్టవచ్చును. మనం ఒక గమ్యం చేరడం మన ప్రయాణ మాధ్యమాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మధ్యలో విక్షేపణలు రాకూడదు. భగవద్గీతా కేవలం 700 శ్లోకాలు ఉన్న చిన్న గ్రంథం. ఎంతో మంది దేశ, విదేశీ దార్శనికులు భగవద్గీతా మాహాత్మ్యాన్ని గూర్చి కీర్తించారు. గీతా ప్రెస్ గోరఖ్ పూర్ వ్యవస్థాపకులైన శ్రీ జయదయాళ్ గోయంకా గారు అనేక హిందూ శాస్త్ర గ్రంథాలను జన బాహుళ్యంలోకి తీసుకుని వచ్చారు. గీతా ప్రస్తావనలో వారు గీతాకు సమానమైన మానవ కళ్యాణకారి గ్రంథం మరొకటి లేదని ప్రస్తుతించారు. సమస్త వేదోపనిషత్తుల సారం శ్రీమద్భగవద్గీతా. శ్రీమాన్ రామానుజాచార్యుల వారు “ గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైఃష్ శాస్త్రవిస్తరైః । యా స్వయం పద్మనాభస్య ముఖపద్మద్వినిఃశ్రుతా ॥ అని వ్యాఖ్యానించారుట. ఒక్క గీతా చదివితే, అన్య శాస్త్రాల అధ్యయనం అవసరం లేదు. భగవానులు భక్తుల లక్షణాలను 12 వ అధ్యాయంలోని 13 నుండి 19 శ్లోకాల ద్వారా తెలియజేశారు. ఈ లక్షణాల ఆచరణ వల్ల జీవితంలో వచ్చిన మార్పు ప్రధానం. సాత్వికత, దైవీ గుణాలు ఎంత మేరకు పెరిగాయన్నది ముఖ్యం. పూజలు, అభిషేకాలు, ఉపవాసాలు, కేవలం భక్తికి సూచనలు కాని, జీవితంలో పరివర్తనకు అవి దోహదం చేయాలి. పూజల వల్ల పుణ్యం లభిస్తుంది. మనం భక్తుల లక్షణాలను అలవర్చుకున్నప్పుడే భగవానులకు ప్రియమైతాము. మనలో మార్పు రానంత కాలం భగవానులకు దూరంగానే ఉంటాము. ధర్మరాజు ఉండగా భగవానులు అర్జునుడికి భగవద్గీతా ఎందుకు తెలియజేయాల్సి వచ్చింది ? భగవద్గీతాలో అర్జునుడిని వేరువేరు చోట్ల వేరువేరు నామాలతో భగవానులు పిలుస్తారు. అందులో, అనఘా అనగా పాపం చేయని వాడని అర్థం.  మహాభారతం చదివాక, మనం అర్జునుడి గుణగణాలను కీర్తిస్తాము. జూదంలో ఓడిపోయిన ధర్మరాజును ద్రౌపది, భీమ, నకుల సహదేవులు ప్రశ్నించారు కాని, అర్జునుడు మౌనంగా ఉన్నాడు. మహావీరుడైన అర్జునుడు రాజసూయ యాగం చేయడానికి అందరికంటే ఎక్కువ ధనం ఆర్జించి ధనంజయుడుగా పిలవబడ్డాడు. వారు మహాదేవుడిని యుద్ధంలో ఓడించినారు. విరాట యుద్ధంలో అర్జునుడు కౌరవసేనలోని ప్రముఖుల నందరిని ఒంటరిగా పరాజితులను చేశారు. ఎవరిని నిందించని లక్షణంతో అనసూయగా పేరుగాంచారు. వారి గుణముల పట్ల భగవానులు మోహితులయ్యారు. పద్మవ్యూహంలో అభిమన్యుడిని అశస్త్రుడిని చేసి కౌరవులు వధించిన తర్వాత, మరుసటి రోజు యుద్ధంలో జయద్రధుడిని వధిస్తానని, లేనట్లైతే తాను అగ్నికి ఆహుతుడిని అవుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేసి విశ్రమించాడు. రాత్రి భగవానులు వారి దగ్గరికి వెళ్లి నిశ్చింతగా, ఆందోళన రహితంగా ఎలా విశ్రమిస్తున్నావని విచారించగా, ఎవరి గురించి అయితే పరమాత్మ చింతిస్తారో, వారికి ఎందుకు చింత అని అర్జునుడు సమాధానం ఇస్తారు. యుద్ధం ప్రారంభానికి ముందు, భగవానుల సహాయానికి వెళ్లి, ఒక అక్షౌహిణి నారాయణి సేనను వదిలి, నిరాయుధుడిగా ఉంటానన్న భగవానులను అర్జునుడు ఎన్నుకున్నారు. అర్జునుడు భగవానులకు భక్తుడు, సఖుడు. ఖాండవ వన దహన సమయంలో అగ్నిదేవుడు అర్జునుడికి గాండీవాన్ని, దివ్యరథాన్ని ప్రసాదించినారు. అలాగే మానవుడిగా అవతరించిన నారాయణడైనట్టి శ్రీకృష్ణ భగవానులను కూడ వర ప్రసాదాన్ని కోరుమనగా, అర్జునుడితో తనకు ప్రియమైత్రిని ప్రసాదించమన్నారు. మహాభారత యుద్ధానికి ముందు అర్జునుడు మోహగ్రస్తుడయ్యాడు. అర్జునుడిని నిమిత్తమాత్రుడిగా చేసి, మానవజాతి కల్యాణానికి భగవానులు భగవద్గీతాను ప్రసాదించారు.


15.1

శ్రీ భగవానువాచ
ఊర్ధ్వమూలమధః(శ్) శాఖమ్,అశ్వత్థం(మ్) ప్రాహురవ్యయమ్।
ఛన్దాంసి యస్య పర్ణాని,యస్తం(వ్ఁ) వేద స వేదవిత్॥15.1॥

శ్రీ భగవానుడు పలికెను - ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్యశాఖగా(కాండముగా), వేదములే పర్ణములు(ఆకులు)గా గల ఈ సంసారరూప-అశ్వత్థవృక్షము నాశరహితమైనది(శాశ్వతమైనది). ఈ సంసార వృక్షతత్త్వమును మూలసహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎఱిగిన వాడు.

పురుషోత్తమ యోగము చిన్న అధ్యాయమే కాని, మహత్వపూర్ణమైనది. ఈ అధ్యాయాన్ని శాస్త్ర ప్రమాణమైనదిగా భగవానులు తెలియజేశారు. ఈశ్వరుడు, ప్రకృతి, జీవుడి తత్వాన్ని గూర్చి ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము. భోజన సమయంలో, ప్రయాణ సమయంలో, మరణం సంభవించిన సందర్భంలో, వివాహాది మంగళ కార్యాలలో,  భగవద్గీతా లోని ఒకే అధ్యాయం చదవాల్సిన సందర్భంలో, మనం 15వ అధ్యాయాన్ని అధ్యయనం చేయవచ్చును. భగవానుల గోప్యమైన పురుషోత్తమ స్వరూపాన్ని ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము. భగవద్భక్తికి ఆధారమగు, విరక్తి భావ పోషకమగు, ఈ దృశ్యరూప సంసారాన్ని తలక్రిందులుగా ఉన్న అశ్వత్థ వృక్షముతో పోల్చడం జరిగింది. దీని వేళ్ళు పై వైపు,  శాఖలు క్రింది వైపు ఉంటాయి. పరమాత్మ నుండి సమస్త జగత్తు ఆవిర్భవించింది. ఊర్ధ్వంగా నున్న పరమాత్మయే క్రిందనున్న జగత్తుకు మూలం. ఈ బ్రహ్మాండమే శాఖల వలే పైకి, క్రిందికి విస్తరించి ఉంది. ఈ శరీరంలో, పాదాల నుండి పైకి ఏ అవయవాన్ని కోల్పోయినా జీవించ వచ్చును.  కాని శిరస్సు లేకుండా జీవించలేము. శ్వః అనగా రేపు, నస్తః అనగా ఉండనిది. రేపు ఉండునో, లేదో తెలియనిది ఈ సంసారమనే అశ్వత్థ వృక్షం. ఈ దేహము క్షణికమైనది, శాశ్వతత్వం లేనిది. ఈ సంసారం ప్రతిక్షణం మార్పుకు లోనవుతూ ఉంటుంది. రావి ఆకులు గతిశీలమైనవి. చంచల స్వభావం కలిగి, ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. కావున ఈ సంసార జీవితాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చడం జరిగింది. సంసార వృక్ష రూపం మారినా నాశరహితమైనది. అనేక జన్మల పర్యంతం, జ్ఞాన ప్రాప్తి సిద్ధించే వరకు ఈ జీవుడు కొనసాగుతూనే ఉంటాడు. ఈ సంసార వృక్షానికి వేదాలు పత్రాలుగా ఉన్నాయి. సంసార అశ్వత్థ వృక్షం గురించి జ్ఞానం కలిగినప్పటికి, మనం పొందిన జ్ఞాన స్థాయిలో బేధాలు ఉంటాయి. కావున ఈ జగత్తునకు ఆధారం పరమాత్మయే అని  ఎఱిగిన వాడు వేద జ్ఞానాన్ని పొందిన వాడిగా పరిగణిస్తాము.

15.2

అధశ్చో౽ర్ధ్వం(మ్ ) ప్రసృతాస్తస్య శాఖా, గుణప్రవృద్ధా విషయప్రవాలాః |
అధశ్చ మూలాన్యనుసన్తతాని, కర్మానుబన్ధీని మనుష్యలోకే ।।15.2।।

ఈ సంసారవృక్షమును త్రిగుణములనెడిజలములు తడుపుచుండును. ఆ జలములచే వృద్ధిపొందు శాఖలే దేవమనుష్యతిర్యగ్యోనులలో జన్మించుప్రాణులు, చిగుళ్లే విషయభోగములు. ఈ శాఖలు, చిగుళ్ళు సర్వత్ర వ్యాపించియున్నవి. మనుజులను కర్మాను సారముగా బంధించు అహంకార మమకార వాసనలనెడి వేర్లు, ఊడలు అన్నిలోకములలోను క్రింద, పైన వ్యాపించి ఉన్నవి.

ఈ సంసార అశ్వత్థ వృక్షం విశాలమైనది. అనాది కాలము నుండి అనేక జన్మలుగా వేళ్ళతో దృఢపడి, శాఖోప శాఖలుగా విస్తరించబడి ఉంది. కర్మ వాసనలే దీనికి వేళ్ళు. ఈ వాసనలు బలపడితే, వేళ్ళు కూడా దృఢపడి, పైకి కిందకి విస్తరిస్తూనే ఉంటాయి. ఈ సంసార వృక్షానికి మూలం పరమాత్మ. బ్రహ్మ ప్రధాన కాండం. దానికి సత్వ, రజో, తమో గుణాలు ప్రధాన శాఖలుగా ఉన్నాయి. పైకి పోయే శాఖలు దేవయోనికి చెందినవి, మధ్యన గల శాఖలు మనుష్యయోనులకు చెందినవి, క్రిందికి వెళ్లే శాఖలు తిర్యక్ యోనులకు చెందినవి. భూలోకానికి పైన ఆరు, క్రింద ఏడు లోకాలు ఉన్నాయి. క్రింది లోకాలు నీచ యోనులకు ఆవాసం. త్రిగుణాలతో కూడిన వాసనలచే, రాగ ద్వేషాలనే చివుళ్ళు వృద్ధి చెంది, జీవులను కర్మ ఫలాలచే బంధిస్తాయి. త్రిగుణాలచే పంచ మహాభూతాలు నిర్మాణమైనాయి. పంచ భూతాల నుండి రస, గంధ, రూప, శబ్ద, స్పర్శలనే పంచతన్మాత్రలు ఏర్పడినాయి. వీటి ద్వారా మనుష్యులు కర్మబద్ధులవుతారు.

15.3

న రూపమస్యేహ తథోపలభ్యతే, నాన్తో న చాదిర్న చ సంప్రతిష్ఠా |
అశ్వత్థమేనం( మ్ ) సువిరూఢమూలమ్, అసఙ్గశస్త్రేణ దృఢేన ఛిత్త్వా ।।15.3।।

ఈ సంసారవృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణంపబడిన రీతిగా లభ్యముగాదు. ఏలనన ఇది ఆదియు, అంతము, సరియైన స్థితియు లేనిది. కనుక అహంకారమమకారవాసనారూపములైన ధృఢమైన వేర్లు, ఊడలు గల ఈ సంసారరూప అశ్వత్థవృక్షమును నిశితమైన వైరాగ్యమనెడి శస్త్రముతో ఖండించి.

ఈ సంసార అశ్వత్థ వృక్షము వర్ణించబడినట్లుగా కనపడదు. దీనికి ఆది, మధ్య, అంత్య స్థితులు లేవు. బాగా వేళ్లూనుకొని బలంగా ఉన్న ఈ వృక్షాన్ని, సంసారం నందు రమించువారు అర్థం చేసుకోలేరు. రాగద్వేషాలు, మమతానురాగాలతో పోషించబడుతున్న ఈ వృక్షాన్ని, ప్రాపంచిక విషయములందు అనురక్తి లేని అసంగమనే బలమైన ఆయుధంచే ఖండించి వేయాలి. 84 లక్షల యోనులలో అనాదికాలం నుండి, పాప పుణ్య కర్మల వల్ల, మరల మరల జన్మిస్తూ బంధీలగుచున్నారు. శుక మహాముని మొదటిసారిగా భాగవత కథను పరీక్షిత్ మహారాజ్ కి వినిపించారు. వారు వేదవ్యాస భగవానుల పుత్రులు. వారు అత్యంత వైరాగి. వారి జ్ఞానం పరిపూర్ణం కాలేదు. వేదవ్యాసుల వారు ఒక ప్రశ్నకు సమాధానంగా, శుకుని రాజర్షి జనక మహారాజ్ వద్దకు వెళ్ళమన్నారు. జనక మహారాజు అనునది ఒక పదవి. భాగవతంలో 73 జనకులను గూర్చి తెలిపినారు. అందులో 49వ జనకుడి పేరు శిరధ్వజుడు. వారు సీతామాత యొక్క తండ్రి. తండ్రి మాట శుకుడికి రుచించలేదు. 4 వేదాలు, 18 పురాణాలు వ్రాసిన వేదవ్యాసుని కంటే జ్ఞాని ఎవరుంటారని వారి భావన. ఒక క్షత్రియుడి వద్దకు జ్ఞానార్జనకై వెళ్లడం శుకుడికి నచ్చలేదు. కాని తండ్రి ఆజ్ఞానుసారం, చాలా రోజులు ప్రయాణం చేసి మిథిలా నగరానికి చేరుకున్నాడు. తాను వేదవ్యాసుల వారి పుత్రుడనే అహంకార భావన మనసులో కలదు. బ్రహ్మ జ్ఞాని, తత్వవేత్త, కృష్ణ ద్వైపాయనుడు, మహాముని, వేదవ్యాసుల వారి పరమ ప్రియ శిష్యులు, బ్రహ్మచారి, సర్వజ్ఞుడు, అత్యంత జ్ఞాని, ముని శ్రేష్ఠుడు, శాస్త్రానుసారి, గుణాతీతుడైన శుకదేవ మహాముని వచ్చినట్లుగా, మహారాజుకి తెలియజేయవలసిందిగా అక్కడి ద్వార పాలకుడిని కోరినారు. వారు వెళ్లి జనకులకు సమాచారం అందించారు. సాధారణంగా ముని శ్రేష్ఠులు వారి దర్శనార్థం వెళ్ళినప్పుడు, జనకుల వారే స్వయంగా స్వాగతం పలుకుతారు. కాని ద్వారపాలకుడి ద్వారా విషయం విన్నాక, తాను కార్యనిమగ్నులై ఉన్నట్లు, వారిని వేచి ఉండమని తెలిపారు. ద్వారపాలకుడు ఆశ్చర్యంగా, సంకోచ భావంతో వెళ్లి శుకుడికి విషయం తెలిపి నిరీక్షించమని కోరాడు. ఒక మహాముని పట్ల రాజు వైఖరికి శుకుల వారి మనస్సు  నొచ్చుకుంది. వారిని ఆసీనులు కమ్మనగా వినలేదు. నిరీక్షించ సాగాడు. సాయంకాలం అయింది. మరో ద్వారపాలకుడు వచ్చాడు. వారితో తిరిగి తన సుదీర్ఘ పరిచయం తెలుపుతూ, మహారాజుకు తెలియజేయమన్నారు. వేచిచూడమన్నట్లు రాజు గారి సందేశాన్ని ద్వారపాలకుడు తెలిపాడు. రాత్రి గడిచింది. మరునాడు మూడవ ద్వారపాలకుడు వచ్చాడు. తన పరిచయ వాక్యాన్ని తగ్గించుకొని తిరిగి మహారాజుకి తెలుపమన్నారు. రోజు రోజుకి తన పరిచయాన్ని తగ్గిస్తూ, మహారాజుకు కబురు పంపాడు. అలా ఏడు రోజులు నిల్చుని ఎదురు చూశాడు. ఏడవ రోజు తన విశేషణలను వదిలి, జ్ఞానప్రాప్తి ఆకాంక్షతో అరణ్యం నుండి శుకదేవులు వచ్చారని తెలపమన్నారు. అప్పుడు వెంటనే జనక మహారాజు వారిని లోనికి తీసుకురమ్మన్నారు. పుష్పాలతో స్వాగతించి, అర్ఘ్య పాదాదులు ఇచ్చి, సేవలు చేసి, ఉచిత ఆసనము వేసి, భోజనం ఏర్పాటు చేసి, వారిని విశ్రమించమని కోరారు. ఆ రోజు మిథిల నగరం యొక్క ముఖ్య దేవీ పూజ ఉందని, ఆ పూజ పరంపరలో భాగంగా, ఎవరైనా బ్రహ్మచారియగు మహాత్ముడి ద్వారా, ఒక తైల పాత్రను నగర ప్రదక్షిణ గావించి, ఆ రాత్రికి ఆ తైలంతో దేవికి పూజ చేస్తామని తెలిపారు. అందుకు శుక దేవుడి కంటే ఉత్తమమైన వారెవరు ఉండరని, వారిని తైల పాత్రతో నగర ప్రదక్షిణ చేయాలని జనక మహారాజు విజ్ఞప్తి చేశారు. పెద్దదై న తైలపాత్ర నుండి ఒక్క నూనె బిందువు కూడ క్రింద పడకూడదని, అలా జరిగితే పూజార్హం కాదని తెలిపారు. శుక దేవులకు ఆ కార్యం నచ్చకపోయినా తప్పింది కాదు. జాగ్రత్తగా ఆ పాత్రను స్వీకరించి, తలపై పెట్టుకొని, సైనికులు వెంటరాగ, మిథిల నగర పరిక్రమనకు బయలుదేరారు. అందుకు ఆరు గంటల సమయం పట్టింది. ప్రదక్షిణ పూర్తయ్యాక, జనకులు శుక దేవులకు ప్రణామాలు చేసి, తాము ధన్యులమైనామని తెలిపారు. సుందరమైన మిథిలా నగరం, తమ ప్రదక్షిణ సమయంలో ఎలా అగుపడిందని జనకులు శుకుడుని ప్రశ్నించారు. అందుకు తన ధ్యాస పాత్ర పైన మాత్రమే ఉందని, ఇతరత్రా లేదని తెలిపారు. ఆ మాటకు జనక మహారాజు మందస్మితులై, మీ మొదటి పరీక్ష పూర్తయినదని తెలిపారు. ఈ సంసారంలో బాహ్య దృష్టిని వీడి, సంపూర్ణ ధ్యానాన్ని పరమాత్మపై నిలిపి, అసంగ భావంతో ఉండాలని జనకులు తెలిపారు. ప్రాపంచిక ఆకర్షణల నుండి దూరంగా ఉండాలి. బురదలో నుండి కమలం అమలినంగా బయటికి వచ్చినట్లు, సంసార బంధాలకు దూరంగా ఉండాలి. ఆ మాటలు విని శుక దేవులు ప్రసన్నుడైనాడు. ఈ రకంగా జనక మహారాజు నుండి ఏడు శిక్షణలు పొందినాడు.

15.4


తతః(ఫ్)పదం (న్) తత్పరిమార్గితవ్యం(య్ఁ) ,
యస్మిన్గతా న నివర్తన్తి భూయః।
తమేవ చాద్యం(మ్) పురుషం(మ్) ప్రపద్యే,
యతః(ఫ్ )ప్రవృత్తిః(ఫ్)ప్రసృతా పురాణీ॥15.4॥

అనంతరము ఆ పరమపదరూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగ అన్వేషింపవలెను. ఆ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగిరారు. అట్టి పరమేశ్వరునినుండియే ఈ పురాతన సంసారవృక్షపరంపర విస్తరించియున్నది. అట్టి ఆదిపురుషుడైననారాయణునే శరణుపొంది, దృఢనిశ్చయముతో ఆ పరమేశ్వరుని మనన, నిధిధ్యాసాదులు చేయవలెను.

ఈ సంసార వృక్ష ఛేదనం గావించిన పిదప, ఏ పరమేశ్వరుడి నుండి జగత్తు వ్యాపించి ఉందో, అట్టి ఆది పురుషుడగు పరమాత్మను శరణు వేడాలి. ఆ పరమ పదమును గూర్చి అన్వేషణ చేయాలి. అట్టి పరమపదాన్ని పొందినవారు, దుఃఖప్రదమైన ఈ జగత్తులోకి తిరిగి రారు. అది శాశ్వత పదం.

15.5

నిర్మానమోహా జితసఙ్గదోషా, అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః |
ద్వన్ద్వైర్విముక్తాః(స్) సుఖదుఃఖస ఞ్జ్ఞైః(ర్), గచ్ఛన్త్యమూఢాః (ఫ్)పదమవ్యయం(న్) తత్ ।।15.5।।

దురభిమానమును, మోహమును త్యజించినవారును, ఆసక్తియను దోషమును జయించినవారును, ప్రాపంచికవాంఛలనుండి పూర్తిగా మఱలినవారును, పరమాత్మ స్వరూపమునందు నిత్యస్థితులైనవారును, సుఖదుఃఖాదిద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు.

అట్టి పరమ పదమును పొందుటకు కావలసిన లక్షణాలను భగవానులు తెలుపుచున్నారు. అవివేకం లేని, దృశ్య పదార్థములందు ఆసక్తిని వీడి, నిరంతరం ఆత్మ నిష్ఠ కలిగి, సంపూర్ణ వాసన రాహిత్యం కలిగి, సుఖదుఃఖ ద్వంద్వ భావములను లేక, అజ్ఞానాన్ని వీడిన వాడికి ఆ పరమపదం లభిస్తుంది. విషయాలు, వ్యక్తుల పట్ల ఆసక్తిని వీడాలి. ఎల్లవేళలా దైవ భావంతో కూడి ఉండాలి. తద్వారా మాయకు ఆధీనులం కాము. వాసనా రాహిత్యం తప్పనిసరి. తద్వారా ద్వంద్వములకు అతీతంగా ఎదగవచ్చును.

15.6

న తద్భాసయతే సూర్యో, న శశాఙ్కో న పావకః| యద్గత్వా న నివర్తన్తే,తద్ధామ పరమం(మ్) మమ ।।15.6।।

స్వయంప్రకాశస్వరూపమైన నాపరంధామమును సూర్యుడుగాని, చంద్రుడుగాని , అగ్నిగాని ప్రకాశింప జేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మఱల ఈ జగత్తున ప్రవేశింపరు. అనగా జన్మింపరు.

అట్టి శ్రేష్టమైన పరమపదమును పొందిన వారికి పునరావృత్తి లేదు. 14 లోకాలకు, బ్రహ్మ లోకానికి వెళ్లినా, నరక లోకానికి వెళ్లినా, తిరిగి జన్మ తీసుకొని రావలసిందే. అట్టి పరమాత్మ స్థానాన్ని సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ప్రకాశింపచేయజాలవు. కారణం అది స్వయం ప్రకాశకం. తర్వాతి మూడు శ్లోకాలలో, పరమాత్మ జీవాత్మ యొక్క వర్ణన చేశారు. వచ్చే సత్రంలో వీటిని గూర్చి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని వివేచకులు తెలిపారు. హరినామ సంకీర్తన తర్వాత ప్రశ్నోత్తరాలను చేపట్టినారు.

ప్రశ్న : ఈ కాలంలో మంచి గురువుల వల్ల ఉన్నత జీవనాన్ని పొందు చున్నారు. మహా గురువులు ఉన్న ద్వాపర యుగంలో కూడ కురుక్షేత్ర సంగ్రామం ఎలా జరిగింది ?

జవాబు : సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగ, కలి యుగాల్లో కూడ, సత్వ, రజో, తమో గుణ ప్రవృత్తి గల వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు. మంచి చెడులు ఎప్పుడూ ఉంటాయి. చెడు వల్లనే మంచి యొక్క విశిష్టత తెలుస్తుంది.

ప్రశ్న : భగవద్గీతా 12, 15 అధ్యాయాలతో శిక్షణ ఎందుకు మొదలుపెట్టబడింది ?

జవాబు: భగవద్గీతాను నవల లాగా ఒకటవ పేజీ నుండి చివరి పేజీ వరకు చదువలేము. శాస్త్రాలను అధ్యయనం చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. శిష్యుడి మనఃస్థితిని బట్టి, యోగ్యతను బట్టి ఎక్కడినుండి అధ్యయనం ప్రారంభించాలో గురువు గారు నిర్ణయిస్తారు. ముందు యోగ్యత పొందిన తర్వాత జ్ఞానము పొందడానికి మార్గం ఏర్పడుతుంది. 12వ అధ్యాయం చిన్నది మరియు సరళమైనది. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. అర్జునుడు దుఃఖ స్థితిలో ఉన్నాడు. 12వ అధ్యాయం భక్తి యోగం. పరమాత్మను పొందడానికి కావలసిన భక్తుడి లక్షణాలు అందులో తెలుపబడినాయి. భగవద్గీతాలోని ప్రతి అధ్యాయ పఠనానికి ఫలితం ఒక్కటే. 15వ అధ్యాయాన్ని రహస్యమైన శాస్త్రంగా భగవానులు తెలియజేశారు. ఈ అధ్యయన విధానం ఒక పరంపర.

ప్రశ్న : గీతా జ్ఞానం ఉన్నవారు, గీతా జ్ఞానం లేని వారి మధ్య నిత్య సంఘర్షణ ఉంటుంది. అది కుటుంబ సభ్యులు కావచ్చును, ఇతరులు కావచ్చును. ఏ విధంగా దీనిని అర్థం చేసుకోవాలి ?

జవాబు : గీతా చదువుకున్నాక, అర్థం చేసుకునే ప్రయత్నం చేశాక, జీవితంలో దానిని అన్వయించుకోవాలి. అప్పుడు ఇతరులు తమ పట్ల శత్రుభావంతో ఉన్నా, తాము మాత్రం మిత్ర భావంతో హితకారిగా ఉంటారు. సమభావం మనలో వర్ధిల్లుతుంది. అది ప్రశాంతతను కలుగజేస్తుంది. ఇతరులను మనం సంస్కరించలేము కాని, మనల్ని మనం నియంత్రించుకోవచ్చును.

ప్రశ్న : భగవానులు పురుషోత్తములు ఎలా అయ్యారు ?

జవాబు : భగవానులు నచ్చిన చోట, నచ్చిన విధంగా జన్మ తీసుకోగలరు. సకల జీవరాశి వారి యొక్క అంశ. వారు మనల్ని సృజిస్తారు కాని, మనం వారిని సృజించలేము. అందుకే వారు పురుషోత్తములు.

ప్రశ్న : స్నానం చేయకుండా భగవద్గీతా చదువ వచ్చునా ?

జవాబు: భగవద్గీతా సర్వకాల సర్వావస్థల యందు పాడుకోవచ్చును. సాధారణ అధ్యయనానికి, పూజా విధులకు వేరు వేరు పుస్తకాలు ఉంచుకోవడం మంచిది.

ప్రశ్న : భగవానులు పాండవులతో నిరంతరం ఉన్నారు. మనం కూడ భగవానులను ప్రార్ధన చేస్తాము. కాని మన మధ్యకి వారు ఎందుకు రారు ?

జవాబు : అనేక కోట్ల సంవత్సరాలలో భగవానులు పదిసార్లు మాత్రమే వచ్చారు. కాని సంతులు, మహాపురుషులు, సాధువుల రూపంలో భగవానులు ప్రకటితమవుతూనే ఉంటారు. మహా కుంభమేళాలో కనిపించే సంతులంతా భగవానుల యొక్క ప్రతిరూపాలు. భగవానులకు జీవితాన్ని అర్పణం చేసుకున్న ప్రతివారికి ప్రత్యక్ష రూపంలో వారు ప్రకటితమౌతారు.

ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళా లో భాగంగా, పూజ్య స్వామీజీ గారి 76 వ జన్మదిన వేడుకలు “గీతా భక్తి దివస్” గా నిర్వహించబడినాయి. వారి ఆశీస్సులు మరియు ప్రయాగరాజ్ దివ్య క్షేత్ర ఆశీస్సులు అందరికి ప్రసరింపజేయాలని ప్రార్థించడం జరిగింది. సరళ అర్థ వివేచన లింక్ ని తమ బంధుమిత్రులకు, అర్థవివేచన నిమిత్తం తెలియజేయవలసిందిగా కోరటమైనది. అలాగే గీతా పరివార్ లో  “గీతా సేవీగా” సేవలు అందజేయడానికి గాను సమస్త సాధకులకు విజ్ఞప్తి చేయడమైనది.

మహా కుంభమేళాలో ప్రత్యక్ష అర్థ వివేచన చేసినటువంటి వివేచకులకు ప్రణామాలు సమర్పిస్తూ, సమస్త గీతా సాధకులకు, సమస్త సాంకేతిక వర్గానికి ధన్యవాదాలు సమర్పిస్తూ, సమర్పణ ప్రార్ధన తర్వాత, సామూహిక హనుమాన్ చాలీసా పఠనానంతరం సత్రం ముగిసింది.