विवेचन सारांश
పరమాత్ముడి విశ్వవ్యాపకత్వము.

ID: 6358
तेलुगू - తెలుగు
శనివారం, 01 ఫిబ్రవరి 2025
అధ్యాయము 9: రాజవిద్యా రాజగుహ్య యోగము
2/3 (శ్లోకము 11-21)
వివేచకులు: గీతావిశారద డా. సంజయ్ మాల్పాణి గారు


శ్రీకృష్ణ ప్రార్ధన, సరస్వతీ ప్రార్ధన మరియు దీపప్రజ్వలనముతో వివేచనా కార్యక్రమము ప్రారంభమైనది. శ్రీ సంజయ్ మల్పాని గారు గురువందనతో తమ వివేచనను మొదలుపెట్టారు. మనం ఇప్పుడు రాజ విద్యా రాజ గుహ్యయోగం యొక్క వివేచన చేసుకుంటున్నాము. మనం గత సత్రంలో "మయాధ్యక్షేన ప్రకృతిః సూయతే సచరాచరం"అన్న శ్లోకం చెప్పుకున్నాము. పరమ పూజనీయులైన శ్రీ గురు గోవింద్ జీ మహారాజ్ గారి అధ్యక్షతన ఈ మొత్తం గీతా పరివారం నడుస్తోంది. మనం అపురూపమైన ధనాన్ని ఇనపెట్టెలో చాలా భద్రంగా దాచినట్టు ఈ అధ్యాయం మహాభారతంలో భగవద్గీతా మధ్యలో ఉంది. ఈ అధ్యాయము తెలిస్తే, అర్థమైతే అన్ని విద్యలు తెలిసినట్టే. అసలు భగవద్గీతా అన్ని శాస్త్రముల, ఉపనిషత్తుల యొక్క సారము. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భక్తియోగాన్ని చెప్పడానికి భగవద్గీతా చెప్పలేదు. భగవద్గీతా యొక్క ప్రధానమైన ఉద్దేశము అర్జునుడు గెలవడం. మనలోని అర్జునుడు గెలవాలని పరమాత్ముడు గాఢంగా కోరుకుంటాడు. అందుకే కర్మ ఫలితం మీద ఆపేక్ష లేకుండా కర్మలను ఆచరించడం అనే కర్మయోగాన్ని వివరించాడు.
"అనపేక్ష శుచర్దక్ష ఉదాసీనో గత వ్యథః"అన్నాడు. ఈ విధంగా కర్మఫలాన్ని త్యాగం చేయడం అన్నది అభ్యాసం వలన ఒనగూడుతుందని కూడా చెప్పాడు. ఆ విధంగా కర్మ ఫలాన్ని కోరకుండా కర్మలని చేసినప్పుడు శాంతి లభిస్తుందని చెప్పాడు."త్యాగాత్ శాంతిరనంతరం". ఇక్కడున్న అందరూ కూడా జీవితంలో శాంతిని కోరుకుంటారు. నేను ఈ మధ్య పదవ తరగతి ,12వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఉన్నాను. ఒక విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆపిల్ ఫోన్ తీసిస్తానని వాళ్ళ నాన్న మాట ఇచ్చాడు. తెలివి, సమర్థత ఉన్న ఆ విద్యార్థి ఇప్పుడు చదువు ఆపిల్ ఫోన్ కోసమే చదువుతాడు; జ్ఞాన సముపార్జన కోసం కాదు! అతడికి ఆపిల్ ఫోన్ అన్న ఫలితం కళ్ళ ముందు కనిపించడం వలన పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ రావాలన్న ఒత్తిడి మొదలవుతుంది. అటువంటి ఒత్తిడి వలన చదువు మీద ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది.   ఫస్ట్ ర్యాంకు వస్తుందో రాదో అన్న భయం మొదలవుతుంది. అందుకే దైవీగుణాలలో 'అభయం' అన్నదాన్ని మొదటి దైవీగుణంగా చేర్చారు.అలా కాక ఏ ఫలితాన్ని ఆశించకుండా పూర్తి ఏకాగ్రతతో చదివితే ఫస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. మన దుఃఖాలన్నింటికీ కారణం కోరికలు. కొంతమంది "నా కొడుకు నన్ను సరిగా చూడడు... నా కోడలు నన్ను గమనించదు".. అని వాపోవడం చూస్తాము. వారు తమను చూడాలన్న ఆశ పెట్టుకోవడమే ఈ దుఃఖానికి కారణం. వైరాగ్యము, దైవచింతన అలవరుచుకున్నప్పుడు ఎటువంటి ఆపేక్షలూ ఉండవు. ఫలితం మీద కోరిక లేకుండా పనులను చేసినప్పుడు ఫలితం దొరకదని అనుకోకూడదు. ఆ విధంగా పనిచేసినప్పుడు ఇంకా ఉత్తమమైన ఫలితం దొరుకుతుంది. మనం మామిడి చెట్టు విత్తనాలను నాటితే మామిడి చెట్టే మొలుస్తుంది. నల్ల తుమ్మ విత్తనాలను నాటితే నల్ల తుమ్మనే మొలుస్తుంది. కర్మను బట్టి ఫలితం దొరుకుతుంది. ఒకచోట ఒక కోతుల గుంపు ఉండేది. అవి ఒకసారి మామిడి పండ్ల తోటకు వెళ్లి కావలసినన్ని మామిడి పండ్లు తిన్నాయి. నిజానికి కోతులు సృష్టిలో ఉన్న ఫలాలన్నీ వాటి కోసమే అని అనుకుంటాయి. తోటమాలి అది గమనించి ఒక బడితె తీసుకొని వాటిని బాగా కొట్టాడు. అవి ఒక నది ఒడ్డున కూర్చుని ఏడవ సాగాయి. వాటిలో ఒక ముసలి కోతి వాటన్నింటితో మనమే మామిడి విత్తనాలను నాటి మామిడి తోట తయారు చేసుకుందామని చెప్పింది. ఈ ఆలోచన వాటికి బాగా నచ్చి అవన్నీ కలిసి ఒకచోట మామిడి టెంకలను నాటాయి. ఎనిమిది రోజులవుతూనే వాటికి ఇంకా మొలకలు రాలేదన్న చింత మొదలైంది. అవి ఆ టెంకలను పెకలించి చూసాయి. చిన్న చిన్నగా మొలకలు వస్తున్నాయి. ఆ వృద్ధ వానరం వాటితో చెప్పింది ఇలా మధ్య మధ్యలో తీసి చూడకూడదు మొలకలు రావడానికి చాలా సమయం పడుతుంది నిదానంగా వాటికి నీరు పోసి వేచి చూస్తూ ఉండాలి. కాని ఈ కోతులు ఉండబట్ట లేకపోయాయి. ప్రతి ఎనిమిది రోజులకి ఆ టెంకలని పెకలించి చూడ సాగాయి. దాంతో మామిడి మొలకలు అసలు రానేలేదు. కర్మఫలం మీద కోరిక పెట్టుకుని చేసే పనులన్నింటికీ ఫలితం ఈ విధంగానే ఉంటుంది.

9.11

అవజానన్తిమాం(మ్) మూఢా, మానుషీం(న్) తనుమాశ్రితమ్
పరం(మ్) భావమజానన్తో, మమ భూతమహేశ్వరమ్।।11।।

నా పరమభావమును ఎఱుగని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడను (ప్రభువును) ఐన నన్ను లోకకల్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్యమానవునిగా భావించి, తక్కువగా ఊహింతురు.

"సామాన్య మానవులు నా పరమ భావాన్ని గ్రహించలేరు. సర్వ జీవరాశుల యందు చైతన్య రూపంగా భాసిస్తున్న నన్ను కేవలం మానవ మాత్రుడిగా పరిగణించి నిర్లక్ష్యం చేస్తారు." మనం మానవులము కనుక దేవుడిని కూడా మనుష్య రూపంలోనే పూజిస్తాము. మనం పూజించే ప్రతిమలు సర్వవ్యాపి అయిన ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని చేరుకోవడానికి సాధనలు మాత్రమే అని మనం గుర్తు పెట్టుకోవాలి. మనం సాధననే సాధ్యంగా భ్రమిస్తాము. ఉదాహరణకి మనము పూణే నుంచి ముంబైకి అతి విలువైన మర్సిడిస్ కారులో బయలుదేరాము. దారిలో లోనావాలా దగ్గర వచ్చాక అక్కడి పర్వతశ్రేణులు, చెట్లు ,ప్రకృతి సౌందర్యము మన కారులోనే కూర్చుని చూస్తూ ఉంటే మనం ముంబై చేరగలమా? మనం శ్రీకృష్ణుడిని ఎంతో భక్తితో మనసులో ఊహించుకుంటాము. శ్రీకృష్ణుడి తల మీది నెమలి పింఛం, ఆయన నుదుటి మీద కస్తూరీ తిలకం, విశాలమైన కరుణను వర్షించే కళ్ళు, మెడలో తులసి మాలలు, వక్షస్థలంలో కౌస్తుభము, చేతిలో మోహనమైన మురళి, కాళ్ళకు చిన్ని మువ్వల గజ్జలు, మనసును దోచే ఆయన నీలివర్ణము... ఈ విధంగా ఇంట్లో కూడా మనం ఆయన మూర్తిని అలంకరిస్తూ ఆనందిస్తాము. కాని ఇది పరమాత్ముడిని చేరడానికి ఒక సాధన మాత్రమే. మనకు ఆ పరబ్రహ్మ పరమాత్మలో ఏకాగ్రత కుదరడానికి మనం చేసుకున్న ఒక సాధన. కొంతమందికి కృష్ణుడి రూపం కూడా ఇలా ఉంటేనే పూజ చేయాలని ఉంటుంది. మరొక రకంగా ఉన్న కృష్ణుడిని కూడా వారు పూజించరు. మహారాష్ట్రలో స్వామి సమర్థ అన్న గొప్ప అవధూత ఉండేవారు. ఆయన భక్తులలో రెండు రకాల సంప్రదాయాలు మొదలయ్యాయి. కొంతమంది భక్తులు నిలబడి ఉన్న స్వామి సమర్థనే పూజిస్తారు. వారు కూర్చుని ఉన్న స్వామి సమర్థని పూజించరు. మరొక సాంప్రదాయంలోని భక్తులు కేవలం కూర్చుని ఉన్న స్వామి సమర్థని పూజిస్తారు. ఇది ఒక రకంగా చూస్తే మంచిదే ఎందుకంటే రెండు నావలలో కాళ్లు పెట్టి ప్రయాణించడం కుదరదు. కాని స్వామి సమర్థ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కూర్చునే ఉంటారు కదా! నిలబడే అయితే ఉండలేరు. ఎప్పుడైతే మన గమ్యం ఏమిటి అన్న దానిలో నిర్దిష్టమైన అవగాహన ఉంటుందో అప్పుడు సాధన కన్నా గమ్యం ముఖ్యమని అర్థమవుతుంది. అప్పుడు రాముడు అన్నా, కృష్ణుడన్నా ఏ పేరుతో పిలిచినా మనం చేరాల్సింది ఒకే పరమాత్మ అన్నది చక్కగా విశదం అవుతుంది. కామెర్ల రోగికి ప్రపంచమంతా పచ్చగా కనిపించినట్టు మనం మనుష్య రూపంలో ఉన్నప్పుడు పరమాత్ముడు కూడా మనుష్య రూపంలోనే ఉంటాడని మనం భావిస్తాము. జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా అవుతుంది. పాలు కూడా చేదుగానే అనిపిస్తుంది. నిజానికి పాలు తీయగానే ఉంటాయి జ్వరం వచ్చిన నోటికి అవి చేదు అవుతాయి.   పరమాత్ముడిని ఒక మూర్తిగా భావించి  పూజించడం, పరమాత్ముడిని చేరేందుకు చేసే సాధనలో మొదటి మెట్టు మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. పరమాత్మ సర్వవ్యాపకత్వాన్ని ,సర్వ సామర్థ్యాన్ని, అనంత బ్రహ్మాండ రూపాన్ని మనం గ్రహించడానికి మరింత సాధన అవసరం. అర్జునుడు కూడా ముందు శ్రీకృష్ణుడిని తన బావగా, ఒక మానవ మాత్రుడిగా మాత్రమే భావించాడు. తనను తెలుసుకోవడానికి పరమాత్ముడు ఈ అధ్యాయాన్ని భూమికగా ఉపయోగించాడు. పదవ అధ్యాయంలో విభూతి యోగంలో తన దివ్య విభూతులను గురించి చెప్పాడు. 11వ అధ్యాయంలో విశ్వరూప దర్శనాన్ని చూపించాడు. ఇంత తెలుసుకోలేని మామూలు మనుషులు పరమాత్ముడి అవతారాలని కేవలం సామాన్య మానవులుగా పరిగణిస్తారు.

9.12

మోఘాశా మోఘకర్మాణో, మోఘజ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం(ఞ్) చైవ, ప్రకృతిం(మ్) మోహినీం(మ్) శ్రితాః।।12।।

వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులుగల అజ్ఞానులు రాక్షసీ-ఆసురీ - మోహినీ స్వభావములను ఆశ్రయింతురు.

వ్యర్థమైన ఆశలతో, పనికిరాని కర్మలతో, అనవసరమైన జ్ఞానంతో మతులు చెడి భ్రాంతి గొలిపే రాక్షసిక, ఆసురిక ప్రవృత్తికి లోనవుతారు. అటువంటి మూర్ఖులు అణువణువునా నిండిన నా పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోలేరు. ఎడారిలో ఎండమావి వెనుక తీవ్రమైన ఎండలో పరిగెత్తే జింకపిల్ల ఆ ఎండమావి ఒక పెద్ద అబద్ధమని, కేవలం కల్పితమని అర్థం చేసుకోలేదు. మాంత్రికులు సృష్టించిన గంధర్వ నగరం ఒక కల్పన కాని నిజం కాదు. గుడ్డివాడి చేతిలో ఒక మంచి ముత్యాన్ని పెడితే దాని అందాన్ని అతడు ఆస్వాదించలేడు. కోతికి కొబ్బరికాయ ఇస్తే దానిలో రుచి దానికి అర్థం కాదు. అదేవిధంగా మూఢులు తమ సంకుచితమైన స్వభావంతో పరమాత్మ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మనలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. తాము ఏ పరమాత్ముడిని పూజిస్తున్నామో, ఆ పరమాత్ముడిని తప్ప వేరే రూపాన్ని కూడా పూజించకూడదన్న మూఢ విశ్వాసాలని ప్రతిపాదించేలాంటివి. అర్జునుడు మొదట నావారు, నా గురువులు, తాతలు, తండ్రులు, అన్నదమ్ములు, మేనమామలు, పిల్లనిచ్చిన మామలు... వీరిని ఎలా చంపడం అన్న భావంతో ఉన్నాడు. నా వారు నుంచి ,నేను అన్నదాకా వచ్చింది. కాని ఇంకా అతడి మనసులో ఎన్నో సంశయాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఎంతవరకు అహంకారం ఉంటుందో అంతవరకు ఆత్మసాక్షాత్కారం జరగదు. పరమాత్మ ప్రాప్తి దొరకదు. ఇప్పుడు అర్జునుడు తీరానికి కొంత దూరంలోనే ఉన్నాడు. ఈ చరాచర సృష్టి అంతా వ్యాపించిన భగవంతుడి స్వరూపాన్ని తెలుసుకోవడానికి తగిన సాధన అవసరం. శ్రీ శ్రవణానంద స్వామీజీ గారి గురించిన ఒక కథ ఉంది. ఆయన ఒక రాయిలో కూడా పరమాత్ముడిని చూపిస్తారు. మనము సరిగ్గా అవలోకిస్తే జీవితంలో ఎన్నో ప్రమాణాలు దొరుకుతాయి. ఒకసారి మా కాలేజీకి హాస్టల్ భవనం కడుతూ ఉన్నప్పుడు, ఆ భవనం గోడకి ఒక బాదం చెట్టు అడ్డం వస్తుందని దాన్ని కొట్టేయాలని చెప్పారు. నేను మూడు అడుగుల వెనక్కి ఆ గోడ కడితే ఆ బాదాం చెట్టు కొట్టకుండా అలాగే ఉంచేయవచ్చని చెప్పాను. ఆర్కిటెక్ట్ నా మాట విని ఆ చెట్టును కొట్టేయలేదు. ఆ భవన నిర్మాణపు ప్లాన్ లో మార్పులు చేశాడు. ఆ తర్వాత నాలుగేండ్లు గడిచిపోయాయి. ఇంకా రెండు అంతస్తులు పెంచాలన్న ఉద్దేశంతో నిర్మాణపు పనులు మొదలుపెట్టాము. ఆ నిర్మాణం కోసం హాస్టల్  రెండవ అంతస్తు యొక్క పిట్టగోడని తీసేయాల్సి వచ్చింది. ఆ అంతస్తులో ఒక గదిలో ఉంటున్న విద్యార్థిని రోజూ ఆ పిట్టగోడ మీదే ఉతికిన బట్టలు ఆరేసేది. ఆ పిట్టగోడను కొట్టేసిన సంగతి ఆమెకు తెలియదు. కనుక రాత్రివేళ ఆమె  బట్టలు ఆరేయడానికి వచ్చిన ఆ అమ్మాయి అక్కడి నుంచి రెండంతస్తులు కిందికి పడిపోయింది. ఆ పడడం ఆ అమ్మాయి బాదాం చెట్టు మీద పడింది. బాదం చెట్టు కొమ్మలు మెట్ల వలె ఒకదాని కింద ఒకటి పెరుగుతాయి. వెంటనే అమ్మాయిని వైద్య పరీక్ష చేశాము. ఆ అమ్మాయికి కొంచెం కూడా గాయం కాలేదు. ఆ చెట్టు ఆ అమ్మాయిని కాపాడింది. అదేవిధంగా మా ఇంటి ముందర ఒక తీయటి నేరేడు పండ్ల చెట్టు ఉండేది. ఆ కాయలు కిందపడి దానికి ఎక్కువగా ఈగలు ముసిరి చాలా చీదరగా ఉండేది. అందువల్ల మా అమ్మ ఆ చెట్టును కొట్టేద్దామని చెప్పేది. కాని ఆ కాయలు కింద పడకుండా దాని కింద ఒక వలను ఏర్పాటు చేశాను. చెట్టు కొట్టకూడదని నా అభిమతం. ఆ తర్వాత కొన్నాళ్ళకి మా అమ్మ ఆరోగ్యం కొంత పాడయింది. మా కాంపౌండ్ లో తిరుగుతూ తూలి కింద పడబోయింది. ఆ చెట్టు కొమ్మనే పట్టుకుని నిలబడగలిగింది. చెట్టు హరితానికి సంకేతం. హరితం అంటే అందులో హరి,హరుడు ఇద్దరూ ఉంటారు. ఈ చరచర సృష్టిలో ప్రతిష్టితమై ఉండే పరమాత్ముడు ఏదో ఒక రూపంలో అందరినీ రక్షిస్తూనే ఉంటాడు. అందుకే ఆయన అన్నాడు "యోగక్షేమం వహామ్యహం" అని.

9.13

మహాత్మానస్తు మాం(మ్) పార్థ, దైవీం(మ్) ప్రకృతిమాశ్రితాః
భజన్త్యనన్యమనసో, జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్।।13।।

కాని ఓ పార్థా! దైవీప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూలకారణముగను, అవ్యయునిగను (అక్షరస్వరూపునిగను) తెలిసికొని, నిశ్చలమనస్కులై నిరంతరము నన్నే భజింతురు.

మహాత్ములైన వారు దైవీ ప్రకృతిని ఆశ్రయించి సమస్త భూత రాశికిని ఆదియై, నాశనం లేని వాడిని గా పరమాత్ముడిని తెలుసుకొని అనన్య మనసుతో సేవిస్తారు. వారు అవ్యయమైన పరమాత్మ తత్వాన్ని గ్రహించి ఆరాధిస్తారు. విశ్వంలోని సకల జీవులలోనూ పరమాత్ముడిని దర్శించడమే అనన్య భక్తి. ఒక దుకాణదారుడు రోజూ తన దుకాణం వద్దకు వచ్చే ఒక కుక్కకు రోజూ తను భోజనం చేసేటప్పుడు ఒక రొట్టె ఇచ్చేవాడు. అది ఆనందంతో తోక ఆడిస్తూ ఉండేది. ఆశీర్వదిస్తుందా అన్నట్టుగా అనిపించేది. ఒకరోజు పొద్దున్నే దుకాణదారుడు దుకాణానికి వెళ్ళగానే దుకాణం తాళం తీసి ఉండడం గమనించాడు. దొంగతనం ఏమైనా జరిగిందేమో అని దుకాణంలోకి వెళ్లి చూశాడు. తర్వాత సీసీ కెమెరాలు చూస్తే, నిజంగానే దొంగలు దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. ఈ కుక్క అక్కడికి వచ్చి చాలా గట్టిగా మొరగడంతో భయపడి వారు పారిపోయారు. ఒక రొట్టె ముక్క ఇచ్చిన దానికి అది తన ప్రేమను అలా చూపింది. అందుకే సమస్త జీవులలోనూ పరమాత్ముడిని దర్శించి, ఇవ్వడం అనే గుణాన్ని అలవరచుకోవాలి. సమస్త జీవుల పట్ల ప్రేమను, కరుణను చూపగలగాలి. అదే పరమాత్ముడి పట్ల మనం చూపే నిజమైన భక్తి. అర్జునుడు కృష్ణుడిని ఇంకా తన బావగా, స్నేహితుడిగానే భావిస్తున్నాడు. కృష్ణుడితో కలిసి ఆడాడు. కృష్ణుడితో కలిసి ఒకే మంచం మీద పడుకున్నాడు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. కృష్ణుడితో పరాచికాలు ఆడాడు. శ్రీకృష్ణుడు పరమాత్మ అని ఇంకా గ్రహించలేకపోతున్నాడు. ఊరికే విని తెలుసుకోవడం వేరు. బుద్ధితో గ్రహించడం వేరు. మనం కళ్ళతో చూసినదే నమ్ముతాము. ఇంకా శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపాన్ని ప్రదర్శించలేదు. ఎలాగైనా పరమాత్మ ని దర్శించే మార్గం అతడికి చూపాలని ప్రయత్నిస్తున్నాడు.

9.14

సతతం(ఙ్) కీర్తయన్తో మాం(య్ఁ) , యతన్తశ్చ దృఢవ్రతాః
నమస్యన్తశ్చ మాం(మ్) భక్త్యా , నిత్యయుక్తా ఉపాసతే॥9.14॥

ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము వాద్యబృందముతో కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నింతురు. పదేపదే నాకు ప్రణమిల్లుదురు. సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు. అనన్య భక్తితో నన్ను ఉపాసింతురు.

9.14 writeup

9.15

జ్ఞానయజ్ఞేన చాప్యన్యే, యజన్తో మాముపాసతే
ఏకత్వేన పృథక్త్వేన, బహుధా విశ్వతోముఖమ్।।15।।

మఱికొందరు జ్ఞానయోగులు నిర్గుణనిరాకారబ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞనముద్వారా అభేదభావముతో ఉపాసించుచుందురు. మఱికొందరు అనంతరూపములతో ఒప్పెడి నా విరాట్ స్వరూపమును పృథక్ భావముతో ఆరాధించుచుందురు.

నిత్య యుక్తా ఉపాసతే...
అన్న ఈ వాక్యము మనకు 12 వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. భక్తి సరైన స్థాయికి చేరినప్పుడు భగవంతుడికి భక్తుడికి తేడా లేకుండా పోతుంది. మీరా బాయి "మైనే  రామ రతన్ ధన పాయోజీ"అని పాడింది. త్యాగయ్య గారు 'కనుగొంటిని శ్రీరాముని 'అన్నారు. రామరత్నం అనే ధనాన్ని పొందడానికి మనము ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. జీవితాన్ని రామునికి అర్పించాలి. మీరా పరమాత్ముడిలో ఎంతగా లీనమైపోయిందంటే, ఆ విధమైన పవిత్రత వలన ఆమెను విషం కూడా ఏమీ చేయలేకపోయింది. భగవంతుడి గుణాలను గానం చేస్తూ ఆమె నిరంతరం నాట్యం చేసేది. పరమాత్ముడి నిజమైన భక్తులు ఎల్లప్పుడూ ఆయననేకి కీర్తిస్తూ దృఢమైన నిష్ఠతో సాధన చేస్తూ, భక్తితో ఆయనకు నమస్కరిస్తూ నిత్య యుక్తులై ఉపాసిస్తారు. శబరికి రామనామమే ఉపాసన అయింది. నిత్యం రాముడి రాక కోసం ఎదురుచూసింది. ఏ చిన్న సవ్వడైనా నా రాముడు వచ్చాడేమో అని  ఉలిక్కిపడి చూసేది. రామయ్య,లక్ష్మణుడితో కూడి చివరకు ఆమెను చూడడానికి వచ్చాడు. భక్తి భావంతో ఉప్పొంగిపోయింది. కన్నీటితో శ్రీరామచంద్రుడి కాళ్లు కడిగింది. మనకి పూజ చేసేటప్పుడు, దేవుడిని ప్రార్థించేటప్పుడు ఎప్పుడైనా కన్నీళ్లు వస్తాయా? ఆలోచించుకుందాము. మనం పూజ చేస్తున్నా మన మనసంతా మొబైల్ మీదే ఉంటుంది. పూజ చేస్తుందంతసేపు నేను, పరమాత్ముడు ఇంకెవరూ లేరు అన్నట్టుగా ఉండాలి. ఆ పూజలో తాదాత్మ్యం చెందినప్పుడు, నేను కూడా సమసి పోతుంది. కేవలం పరమాత్ముడు మాత్రమే ఉంటాడు. అటువంటి భక్తిని చూపడానికి మారుగా మనం పరమాత్ముడితో వ్యాపారం చేస్తాం. నాకు ఈ పని జరిగితే నీకు 11 రూపాయలు దక్షిణ ఇచ్చి టెంకాయ కొడతాను... అని మొక్కుకుంటాము. ఈ విశాల విశ్వంలోని ఐశ్వర్యాన్ని కంతా అధికారి అయిన పరమాత్ముడికి మన 11 రూపాయలు, టెంకాయ కావాలా?   మన ప్రవర్తన ఎలా ఉండాలంటే కేవలం నిరాపేక్షగా పనిచేయాలి. ఆ పని సిద్ధిస్తే పరమాత్ముడి ముందు కృతజ్ఞతతో చేతులు మోడ్చి "స్వామీ! నీవు నాకు అర్హత కన్నా ఎక్కువగా ప్రసాదించావు. ఏ విధంగా నీకు కృతజ్ఞతలు చెప్పగలను" అని నమస్కరించాలి. మన హృదయం పిడికిలి ప్రమాణంలో ఉంటుందని మనకు తెలుసు. పరమాత్ముడితో "స్వామి, నీ ముందర నేను నా పిడికిలిని తెరిచి పెట్టాను. అంటే నా హృదయాన్ని నీ ముందర పరిచాను. నీ హృదయంతో నన్ను దరి చేర్చుకో" అని వేడుకోవాలి. అందువల్లనే మనం నమస్కరించేటప్పుడు రెండు చేతులు హృదయం దగ్గర చేర్చి నమస్కరిస్తాము. మనం భగవంతుడి వైపుకు రెండు అడుగులు వేస్తే పరమాత్ముడు నాలుగు అడుగులు వేసి మనకోసం పరిగెడుతూ వస్తాడు అన్నది మాత్రం నిజం. నిత్య యుక్తమైన భక్తికి ఉదాహరణగా, మన హృదయాన్ని ఆర్ద్రం చేసే లాంటి ఒక కథ ఉంది. బృందావనంలో పాగల్ బాబా మందిర్ అని ఒక మందిరం ఉంది. ఇదేమి ఇలాంటి పేరు అని మీకు ఆశ్చర్యం కలుగుతుంది. దీని వెనకాల ఉన్న కథ ఏమిటంటే... భోలా అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు పడవ నడిపి, దాని వలన వచ్చే డబ్బుతో ఎంతో సంతృప్తితో జీవించేవాడు. ఆ ఊరిలో ఉన్న రఘునాథ్ మందిర్ లో ఉన్న శ్రీరామచంద్రుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించేవాడు. ఎవరు తక్కువ డబ్బు ఇచ్చినా, ఎక్కువ డబ్బు ఇచ్చినా పట్టించుకునే వాడు కాదు. ఎవరైనా తెలియని విషయాలు అడిగితే 'మై న జానే రఘునాథ్జీ జానే' అని జవాబు చెప్పేవాడు. అంటే నాకు తెలియదు... రామచంద్రుడికే తెలుసు అని అర్థం. అతడు తన కూతురి పెళ్లి కోసం ఒక షావుకారు వద్ద కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత ఆ అప్పు తీర్చేసాడు. కాని అప్పు తీర్చలేదని షావుకారు అతడి మీద వ్యాజ్యం వేశాడు. భోలాను న్యాయాధికారి 'ఈ షావుకారు వద్ద అప్పు తీసుకున్నావా' అని అడిగాడు. అతడు తీసుకున్నానని ఒప్పుకున్నాడు. అప్పుడు న్యాయాధికారి 'ఎందుకు తీర్చలేదు' అని అడిగాడు. అందుకు భోలా అప్పు తీర్చేశానని జవాబు చెప్పాడు. అప్పు తీర్చినందుకు ఋజువు ఏమిటని న్యాయాధికారి అడిగాడు. ఏమీ తెలియని భోలా అప్పు తీసుకున్నప్పుడు రాసుకున్న పత్రం చూపించాడు. దానికి న్యాయ అధికారి' ఈ పత్రం అప్పు తీసుకున్నట్టు ఉంది. అప్పు తీర్చిన పత్రం ఎక్కడ 'అని అడిగాడు. దానికి భోలా అలవాటు ప్రకారం 'నాకు తెలియదు. రఘునాథ్ జీకే తెలుసు' అని చెప్పాడు. అప్పుడు న్యాయాధికారి 'ఆ రఘునాథ్ జీ  ని కోర్టులో ప్రవేశపెట్టండి'. అన్నాడు. అప్పుడు మెడలో ఒక పూలమాల ధరించిన తేజస్వి అయిన ఒక వృద్ధుడు వచ్చి' భోలా అప్పు చెల్లించాడు' అని సాక్ష్యం ఇచ్చాడు. ఆయన న్యాయాధికారితో అన్నాడు ."భోలా అప్పు చెల్లించాక ఈ షావుకారు మనసులో పాపపు ఆలోచన ప్రవేశించింది .ఈ షావుకారు అప్పు తీర్చినట్టుగా ఉన్న పత్రాన్ని 12వ ఖాతా పుస్తకంలో పడేశాడు. కావాలంటే అతడి ఇంటికి వెళ్లి 12వ నెంబరు ఖాతా పుస్తకంలో చూడండి. ఋణం తీర్చిన పత్రం కనిపిస్తుంది."అలాగే షావుకారి ఇంటికి ఒక మనిషిని పంపించి చూశారు. 12వ నెంబర్ ఖాతా పుస్తకంలో భోలా వేలిముద్రతో కూడిన రసీదు కనిపించింది. దాంతో ఆ న్యాయమూర్తి షావుకారు చేసిన మోసం గ్రహించి, అతడిని శిక్షించాడు. షావుకారుకు కూడా ఆశ్చర్యమైంది నేను 12వ నెంబర్ ఖాతా పుస్తకంలో ఆ రసీదు దాచిన విషయం ఈ వ్యక్తికి ఎలా తెలిసింది అని. తర్వాత న్యాయాధీశుడు ఆ రఘునాథజీ ఎక్కడ ఉన్నాడో అన్ని వెతికించాడు. అతడు ఎవరికీ కనిపించలేదు. భోలా  యొక్క గ్రామానికి వెళ్లి అక్కడ ఆయన వాకబు చేశాడు. రఘునాథ్ జీ ఎవరని... అక్కడ గుడి పూజారి గుడిలోని రాముడి విగ్రహాన్ని చూపించి ఈయననే మేము రఘునాథ జీ అంటాము... అని జవాబు ఇచ్చాడు. అప్పుడు న్యాయాధీశుడికి రామచంద్రుడి మెడలో ఉన్న పూలమాలను చూసి సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వృద్ధుడి మెడలో కూడా ఇదే హారం ఉందని గుర్తొచ్చింది. అతడి హృదయం భక్తితో, ఉద్వేగంతో, అపరాధ భావంతో నిండిపోయింది.అతడు తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. "ప్రభూ! నిన్ను బోనులో  నిలబెట్టి నేను కుర్చీలో కూర్చున్నానా! నన్ను క్షమించు"... అని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పరమాత్ముడిని ప్రార్థిస్తూ వేడుకుంటూ అలాగే నిలబడి ఉండేవాడు. అతడు అదేవిధంగా భక్తిలో పరవశించిపోతూ, సిద్ధిని, పరమాత్మ ప్రాప్తిని పొందాడు. అందరూ అతడిని పిచ్చివాడని అనుకునేవారు. అందుకని ఆ గుడికి పాగల్ బాబా మందిర్ అన్న పేరు వచ్చింది. ఉత్తానపాదుని కుమారుడైన ధృవుడు, తన సవతి తల్లి సురుచి తండ్రి ఒడిలో కూర్చునీయకుండా చేసిన అవమానంతో, తల్లి సునీతి బోధతో ఐదేళ్ల చిరుతప్రాయంలో శ్రీమన్నారాయణుడికై తపస్సు చేయడానికి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. నారద మహర్షి అతడికి వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించాడు. తపస్సు ఎలా చేయాలో బోధించాడు. నిశ్చలమైన భక్తితో, శ్రద్ధతో ఏకాగ్రతతో  ఘోర తపస్సు చేసి ఆ చిన్నారి బాలుడు పరమాత్మని ప్రసన్నం చేసుకోగలిగాడు. నక్షత్ర మండలంలో అనన్య సాధ్యమైన స్థానాన్ని పొంది, దృఢభక్తికి చెరగని తార్కాణంగా నిలిచాడు.

9.16

అహం(ఙ్) క్రతురహం(య్ఁ) యజ్ఞః(స్) , స్వధాహమహమౌషధమ్
మంత్రో౽హమహమేవాజ్యమ్, అహమగ్నిరహం(మ్) హుతమ్॥9.16॥

నేనే క్రతువును. నేనే యజ్ఞమును, స్వధయును నేనే, ఓషధులను నేనే, నేనే మంత్రమును, నేనే ఘృతమును, నేనే అగ్నిని, హోమరూపక్రియయును నేనే.

9.16 writeup

9.17

పితాహమస్య జగతో, మాతా ధాతా పితామహః
వేద్యం(మ్) పవిత్రమోంకార, ఋక్సామ యజురేవ చ।।17।।

ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను, అట్లే కర్మలఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును, తండ్రియును, తాతయును నేనే. తెలిసికొనదగిన వాడను నేనే. పవిత్రుడను, ఓంకారమును నేనే. ఋక్సామయజుర్వేదములను నేనే.

9.17 writeup

9.18

గతిర్భర్తా ప్రభుః(స్ ) సాక్షీ, నివాసః(శ్ ) శరణం(మ్ ) సుహృత్
ప్రభవః (ఫ్) ప్రలయః( స్) స్థానం(న్), నిధానం(మ్) బీజమవ్యయమ్।।18।।

పరమగతియైన పరమధామమును, జగత్తును భరించి, పోషించువాడను నేనే. అందరికిని స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే, అందఱికిని నివాసస్థానమును, శరణుపొందదగినవాడను నేనే, ప్రత్యుపకారమును ఆశింపక హితమొనర్చువాడను, అందఱి ఉత్పత్తిప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిధానమును, శాశ్వతకారణమును నేనే.

9.18 writeup

9.19

తపామ్యహమహం(వ్ఁ) వర్షం(న్) , నిగృహ్ణామ్యుత్సృజామి చ
అమృతం(ఞ్) చైవ మృత్యుశ్చ , సదసచ్చాహమర్జున॥9.19॥

ఓ అర్జునా! సూర్యరూపమున నేనే తపించుచున్నాను. సముద్రములనుండి నీటిని గ్రహించి, వర్షరూపమున మఱల వదలెదను. అమృతమును, మృత్యువును గూడ నేనే. సత్తును (శాశ్వతమైన ఆత్మను) అసత్తును (నశ్వరమైన సమస్త వస్తుజాలమును) గూడ నేనే.

ఈ నాలుగు శ్లోకాలలో పరమాత్ముడు తన స్వరూపాన్ని మెల్లమెల్లగా పరిచయం చేస్తున్నాడు. లోకాలన్నింటా వ్యాపించి, సృష్టి, స్థితి లయ కారణమై వెలిగే తన పరంజ్యోతి రూపాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాడు. నేనే క్రతువుని ,యజ్ఞాన్ని , పితరులకు అర్పించబడే ఆహుతిని కూడా నేనే. హోమం చేసే మూలికలు నేను. మంత్రాన్ని ఆజ్యాన్ని, అగ్నిని ,హుతాన్ని కూడా నేనే. ఈ జగత్తుకి తల్లి నీ, తండ్రిని, ధాతను, పితామహుడిని కూడా నేనే. తెలుసుకోవలసినదీ, పవిత్రమైనది అయిన ఓంకారము నేనే. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము కూడా నేనే. జీవితానికి గతినీ ,భరించే వాడిని ,పాలించే వాడిని, సమస్తాన్ని పరిరక్షించే వాడిని, అన్నిటికీ ఆధారము, నిలయము, శరణము, స్నేహితుడు, అవ్యయమైన మూల కారణము కూడా నేనే. భూమిని తపింప చేసి, వర్షాన్ని కురిపిస్తాను. అమృతము, మృత్యువు, సత్యము, అసత్యము కూడా నేనే. ఈ విధంగా తన దివ్యమైన విభూతులను ఈ అధ్యాయంలోనే ఉపోద్ఘాతంగా పరమాత్ముడు చెప్పడం మొదలుపెట్టాడు.

9.20

త్రైవిద్యా మాం(మ్) సోమపాః(ఫ్) పూతపాపా,
యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం(మ్) ప్రార్థయన్తే
తే పుణ్యమాసాద్య సురేన్ద్రలోకమ్,
అశ్నన్తి దివ్యాన్దివి దేవభోగాన్।।20।।

ఋగ్యజుస్సామవెవేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారును, సోమరసపానము చేయువారును, పాప రహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి, స్వర్గ ప్రాప్తిని కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుదురు. అచ్చట దేవతల దివ్యభోగములను అనుభవింతురు.

9.20 writeup

9.21

తే తం(మ్) భుక్త్వా స్వర్గలోకం(వ్ఁ) విశాలం(ఙ్),
క్షీణే పుణ్యే మర్త్యలోకం(వ్ఁ) విశన్తి
ఏవ(న్) త్రయీధర్మమనుప్రపన్నా,
గతాగతం(ఙ్) కామకామా లభన్తే॥9.21॥

ఆ విశాలస్వర్గమునందు భోగములను అనుభవించి, పుణ్యములు అయిపోగానే (క్షీణింపగానే) మఱల మర్త్యలోకమున ప్రవేశింతురు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయవిహిత సకామకర్మలను ఆశ్రయించువారు, భోగములను ఆసించుచూ స్వర్గమర్త్యలోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్యప్రభావముచే స్వర్గమునకు పోవుదురు. పుణ్యము క్షీణింపగనే మర్త్యలోకమునకు వచ్చెదరు.

ఒకసారి నా  స్నేహితుడు ఒకతను, ఫోన్ చేసి చెప్పాడు. "నాకు ఒక మంచి విషయం తెలిసిపోయిందోయ్. నీవు చదివే భగవద్గీతా లోనే ఉంది ఆ విషయం. యజ్ఞం చేసి సోమపానం చేసిన వాళ్లు స్వర్గానికి వెళ్తారట. కాబట్టి నేను అప్పుడప్పుడు తాగినా దానిలో ఏమి తప్పులేదు. స్వర్గానికి వెళ్తాను". నేను అతడితో అన్నాను నీవు తర్వాతి శ్లోకం కూడా చదువు. ఈ రెండు శ్లోకాలలో ఈ విధంగా వివరించబడింది. మూడు వేదాలను అధ్యయనం చేసిన వారు, సోమరసం తాగిన వారు, పుణ్యాత్ములైన వారు పరమాత్ముడిని యజ్ఞాల ద్వారా పూజించి ,స్వర్గవాసాన్ని కోరుకుంటారు ఆ విధంగా వారు వారి పుణ్యఫలమైన అమరలోకాన్ని పొంది, ఆ దివ్య భూమిలో దివ్యమైన భోగాలను అనుభవిస్తారు. ఆ తర్వాత వారు విశాలమైన స్వర్గలోకంలో సుఖాలను అన్నింటినీ అనుభవించి వారి పుణ్య ఫలం ఖర్చు అయిపోగానే భూలోకంలోకి తిరిగి వస్తారు. ఫైవ్ స్టార్ హోటల్లో మీ కార్డులో ఉన్న జమ ఖర్చయిపోగానే తిరిగి పంపించేస్తారు. ఉందామన్నా ఉంచుకోరు. స్వర్గ లోకంలో కూడా పుణ్యం ఖర్చు అయిపోగానే తిరిగి పంపించేస్తారు. ఈ విధంగా వారి జనన మరణ చక్రం తిరుగుతూనే ఉంటుంది. 
పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం...
ఈ విధంగా పుడుతూ చస్తూ ఉండడం ఎంతో దుఃఖ భాజనమైనది. గర్భ వాస దుఃఖాన్ని పొందిన శిశువు పుడుతూనే వైద్యుడు తలక్రిందులుగా చేసి వీపు మీద కొడితే మొదటి శ్వాస వస్తుంది. ఈ రకమైన దుఃఖాలనుంచి తప్పించుకొని శాశ్వతమైన పరమపదాన్ని పొందడం ఎలాగో పరమాత్ముడు తర్వాతి శ్లోకంలో చెప్తున్నాడు. మనం వచ్చేవారం దానిని వివేచన చేసుకుందాము. ఇంతటితో వివేచన ముగిసింది. ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రశ్న: మన హిందూ మతంలో ఎవరైనా ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఎన్నో శాస్త్ర విధులతో కర్మలు చేస్తారు. 12వ రోజు, 13వ రోజు ఈ విధంగా ఆచరిస్తారు. మిగతా మతాలలో ఇటువంటి పద్ధతి ఉండదు. మరి ఏదైనా ఆత్మ నే కదా. ఈ విధంగా ఆచరించాల్సిన అవసరం ఉందా? 
జవాబు: మన సనాతన ధర్మంలో శాస్త్ర విధులను ఋషులు ,మునులు ఎంతో అధ్యయనము ,అన్వేషణ చేసి తయారు చేశారు. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో విజ్ఞానం పూర్తిగా వికసించింది. 5000 సంవత్సరాల క్రితం చెప్పబడిన ఈ భగవద్గీతాలోనే జ్ఞానం విజ్ఞాన సహితంగా చెప్తున్నాను అని పరమాత్ముడు చెప్పాడు. ఉదాహరణకి ఈ గురుగ్రహం సౌరమండలంలో అన్నిటికన్నా పెద్దది. దీనికి ఒక ప్రదక్షిణకి 12 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు కుంభమేళా జరుగుతుంది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం మొదలైన వాటి గురించి, ఖగోళ శాస్త్రం గురించి చక్కటి అవగాహన మనవాళ్ళకి ఉంది. కాబట్టి ఈ రకమైన శాస్త్ర విధులను మరణం తర్వాత తప్పనిసరిగా ఆచరించాలి. నాకు ఈ శాస్త్రంలో పూర్తి శ్రద్ధ ఉంది. మిగతా మతాలను గురించి నేను ఏమీ చెప్పదలుచుకోలేదు."శ్రద్ధావాల్లభతే జ్ఞానం" అన్నాడు పరమాత్ముడు. 
ప్రశ్న: ఈ మధ్యకాలంలో ఆధునీకరణ వలన 12 రోజులు ఈ విధంగా విధులను నిర్వహించ లేక పోతున్నారు. కొంతమంది పెద్దవాళ్లే మాకు ఈ విధులన్నీ చేయవద్దండి అని అంటున్నారు.
జవాబు: కాలానుగుణంగా మార్పులు చేసుకోవడం మన సనాతన ధర్మంలో ఎప్పటినుంచో ఉంది. 12 రోజులు సమయం కేటాయించడం అన్నది ఈ ఆధునిక యుగంలో వీలు కాకపోయినా, సంక్షిప్తంగా నైనా శాస్త్రంలో చెప్పిన విధులను ఆచరించి తీరాలి.
ప్రశ్న: ఈ అధ్యాయంలోని నాలుగవ శ్లోకంలోనూ, ఐదవ శ్లోకంలోనూ చెప్పిన విషయాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయని నాకనిపిస్తుంది. 15వ అధ్యాయంలో "మమైవాంశో జీవలోకే "అన్న శ్లోకంలో పరమాత్ముడు జీవులన్నింటిలో తను ఉన్నాడని చెప్పాడు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలో వివరించగలరు. 
జవాబు: పరమాత్ముడి యొక్క సంకల్ప శక్తి వలన ఈ మొత్తం సృష్టి జరిగింది. ఆయన చైతన్యమనేక రకాలుగా ప్రసరించడం వలన ఇన్ని రకాల భూత రాశులు కనిపిస్తాయి. టాటా ఉప్పును రతన్ టాటా గారు తయారు చేయలేదు. ఆయన సంకల్పం వలన అది తయారయింది. మనకు మనసు, బుద్ధి ప్రకృతి వల్ల వచ్చాయి. పరమాత్ముడు అధ్యక్షుడై మొత్తం జీవకోటిని నడిపిస్తున్నాడు. భగవంతుడు ఈ చరాచర సృష్టిలో అన్నింటిలో ఉంటూ కూడా వాటి వలన ఏమాత్రం పరివర్తన చెందకుండా అవ్యయుడై ,శాశ్వతుడై ఉన్నాడు.
ప్రశ్న: మామూలుగా మనకు 'నేను' అన్నది అహంకారం అని నేను విసర్జించాలని చెప్తారు. కాని ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు యజ్ఞాన్ని, మంత్రాన్ని ,క్రతువును అంతా నేనే అని చెప్తున్నాడు.
జవాబు: ఒక విషయం మనం చక్కగా గుర్తుంచుకోవాలి. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పే విషయాలని చెప్పేటప్పుడు వ్యాసుడు వాసుదేవ ఉవాచ... అని చెప్పాడు. కాని భగవద్గీతాలో మాత్రం' శ్రీ భగవాన్ ఉవాచ' అనే చెప్పాడు. కాబట్టి అంతా నేనే అని చెప్తున్నది స్వయంగా భగవంతుడు. సర్వము ఆయనే కాబట్టి ఆయన అలా చెప్పడం పూర్తి సత్యం. అందులో అహంకారం లేదు. 
ప్రశ్న: గణపతికి తల్లి పార్వతి, తండ్రి పరమశివుడు. మరి శివుడికి తల్లిదండ్రులు ఎవరు?
జవాబు: శివుడికి తల్లిదండ్రులు లేరు. ఎందుకంటే ఆయన అనాది. అంటే పుట్టుక ,మరణము లేనివాడు. అనంతమైన చైతన్య శక్తి అయిన పరమాత్ముడు. 
ప్రార్థనతో వివేచనా సత్రము ముగిసింది.