विवेचन सारांश
భగవంతుని నిర్వికార స్వరూపము, సర్వవ్యాపకత్వము మరియు అనన్య భక్తి యొక్క వివరణ
హనుమాన్ చాలీసా, దైవ ప్రార్థనలతో దీపప్రజ్వలన జరిపి, ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురు ప్రార్థన, ఈ క్రింది శ్రీకృష్ణ, భూదేవి ప్రార్థన శ్లోకాలతో జాహ్నవి జీ దీదీ, ఈనాటి వివేచనను ప్రారంభించారు.
కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ।
ప్రణతః క్లేష నాశాయ గోవిందాయ నమో నమః ॥
రత్నాకర ధౌతపాదాం హిమాలయ కిరీటినీమ్ ।
బ్రహ్మరాజార్చితాంగాం వందే భారతమాతరమ్ ॥
9వ అధ్యాయంలో భగవాన్ ఈ విధముగా చెబుతున్నారు. ఇది రహస్య జ్ఞానము. అత్యంత రహస్యంగా ఉంచబడిన అత్యుత్తమ జ్ఞానము ఏమిటి? ఎటువంటి రహస్యాన్ని వివరించే జ్ఞానం గురించి మనం తెలుసుకున్న తరువాత, మనం తెలుసుకోవలసిన అటువంటి జ్ఞానము మరొకటి ఉండదు. మనం శ్వేతకేతు కథ విన్నాం కదా, అతనిని అతని తండ్రి ఈ విధముగా అడిగారు. ఏ జ్ఞానమును మనము తెలుసుకోవడం ద్వారా మనం అన్ని విషయాలను తెలుసుకుంటాము? అటువంటి విద్యనే భగవానుడు భగవద్గీత ద్వారా తొమ్మిదవ అధ్యాయంలో వివరించారు. మనం భగవంతున్ని ఈ విశ్వంలోని ప్రతి అణువులోనూ సందర్శించగలగాలి. ఈ ప్రపంచంలో ఏ కార్యము జరిగినా, అది మన లేదా వేరొకరి శ్రేయస్సు కోసం మాత్రమే. మనం దీనిని తప్పక తెలుసుకోవలెను. స్వయముగా మనం చేయగలిగినది ఏది లేదు. మనం విత్తనాలు నాటుతాము, అవి వృక్షాలుగా పెరుగుతాయి. ఈ విత్తనాలను ఎవరు తయారు చేశారు? భగవంతుడు సృష్టించారు. మనం మాతృగర్భం నుండి ఈ జన్మను పొందాము. ఇక్కడ కూడా బీజం ద్వారా మనల్ని భగవంతుడే సృష్టించారు. సైన్స్ ద్వారా శాస్త్రవేత్తలు ఎన్నో తయారు చేయగలుగుతున్నారు కానీ రక్తాన్ని మాత్రం తయారు చేయలేకపోయారు. అందువలనే మనం రక్తదానం చేస్తున్నాము. రక్తాన్ని జాగ్రత్తగా భద్రపరిచి దానిని అవసరం అయినవారికి ఉపయోగిస్తాం. ఎందుకంటే, దీనిని కేవలం భగవంతుడు మాత్రమే తయారు చేయగలరు. ఈ విధంగా సమస్త సృష్టిని సృష్టించిన భగవంతుని గురించిన జ్ఞానం మనం తప్పక తెలుసుకోవలెను.
9.12
మోఘాశా మోఘకర్మాణో, మోఘజ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం(ఞ్) చైవ, ప్రకృతిం(మ్) మోహినీం(మ్) శ్రితాః।।12।।
మోఘాశా మోఘకర్మాణో: భగవంతున్ని ఎరుగని అటువంటి వ్యక్తుల ఆశలు, వారు చేసే కర్మలన్నీ వ్యర్థమైనవే. మన అందరికీ భిన్నమైన లక్ష్యాలు ఉంటాయి. ఒకరికి పరీక్షలో ప్రథమ బహుమతి తెచ్చుకోవాలని ఉంటుంది. మరొకరికి ఏదైనా ఆట లేదా ఏదైనా పోటీ గెలవాలని ఉండొచ్చు. మరొకరు ఏదైనా పాట నేర్చుకోవాలి, పాడాలి అనుకోవచ్చు. మనం భగవద్గీత శుద్ధ ఉచ్చారణతో నేర్చుకోవాలి అనే లక్ష్యం కలిగి ఉన్నాం. వీటిని సాధించటం కోసం మనం ప్రయత్నం చేస్తాము. భగవంతుడు ఇలా చెబుతున్నారు, భగవంతుని యొక్క గొప్పతనం గుర్తించని వ్యక్తులు, వారే అంతా చేస్తున్నాం అనే భ్రమలో ఉంటారు. అటువంటి వ్యక్తులు చేసిన పనులు మంచివి అయినప్పటికీ, అవి వ్యర్థమే. ఎందుకంటే వారికి అంతా తామే చేస్తున్నాము అనే భావన నుండి అహంకారము కలుగుతుంది. ఇది నేను చేయలేదు, ఆ భగవంతుడే నా ద్వారా ఇలా చేయించారు అనే భావన ద్వారా మనకు ముక్తి కలుగుతుంది. కావున వారి ఆశలు, కర్మలు, సమస్త జ్ఞానము, వారు ఎంతటి జ్ఞానవంతులైనా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని డిగ్రీలను సంపాదించినప్పటికీ అది వృధా అవుతుంది. ఎందుకంటే వారిది రాక్షస స్వభావం. అంతా నేనే చేశాను, నేనే చేయగలను, అంతా నేనే చేస్తున్నాను అని భ్రమ పడుతూ ఉంటారు. ఏ విధముగానయితే హిరణ్యకశ్యపుడు, భగవంతుని నమ్మాల్సిన అవసరం ఏమిటి? నేనే దేవుడిని, అందరికీ నేనే ప్రభువును, అందరూ నన్నే కీర్తించాలి అని తన ప్రజలకు చెబుతూ ఉండేవాడో, అదే విధముగా నేనే చేస్తున్నాను అనే భావన ఆసురీ స్వభావం. ఎవరైనా ఒక వ్యక్తి తన జీవితంలో గొప్పవాడైతే అతను కొన్నిచోట్ల తగ్గటం కూడా అవసరమే. జీవితంలో ఎదుగుతున్న కొద్ది మనకు వినయం అలవాటు కావాలి. కేవలం భగవంతుని దయవలన మాత్రమే ఇది సాధ్యపడినది. నేను ఏమీ చేయలేదు, ఆ భగవంతుడే నా చేత ఇదంతా చేయిస్తున్నారు అనే భావనతో మెలగాలి.
రాక్షసీమాసురీం చైవ, ప్రకృతిం మోహినీం శ్రితాః: ఇటువంటి వ్యక్తులు రాక్షస, అసుర మరియు మోహిని స్వభావాలను ఆశ్రయిస్తారు. భగవానుడు మనకు రెండు రకాల ప్రవృత్తిల గురించి వివరిస్తారు. ఒకటి దైవిక ప్రవృత్తి, రెండు ఆసురీ ప్రవృత్తి. ఆసురీ ప్రవృత్తిలో మూడు రకాలను మనకు ఈ శ్లోకంలో వివరించారు, అవి రాక్షస, అసుర మరియు మోహిని స్వభావాలు. రాక్షస స్వభావం గల వ్యక్తులు, ఏదైనా పని, అది వారికి చెడు చేసేది అయినప్పటికీ దానిని చేసే తీరుతారు. ఉదాహరణకు అతిగా నిద్రపోవటం. అతిగా నిద్రపోవటం వలన మనం ఎన్నో పనులను చేయలేము. దాని ద్వారా మనం చదువుకోలేము, ఆడుకోలేము, ఇలా ఎంతో సమయం వృధా అవుతుంది. అతిగా నిద్రపోతూ వారు మరింత దిగజారిపోతారు. అయినప్పటికీ, వారు దానిని చేస్తారు. రెండవది అసుర స్వభావం. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అది ఎవరికైనా కష్టం లేదా నష్టం కలిగిస్తుంది అని తెలిస్తే ఆ పనిని చేయటం ఆపివేస్తాము కానీ అసుర స్వభావము కలవారు అటువంటి పనులను, ఎటువంటి అభ్యంతరము లేకుండా, ఉద్దేశపూర్వకంగా చేస్తారు. మరియు దానిని ఆస్వాదిస్తారు. మూడవది మోహిని స్వభావము. ఈ స్వభావము కల వ్యక్తులు తనకి ఆనందము లభించినా లేదా లభించకపోయినా, ఇతరులకు చెడు చేయాలి అనే ఆలోచనతో ఉంటారు. ఉదాహరణకు తీవ్రవాదులు. వారికి దాని ద్వారా ఎటువంటి ఆనందము లభించకపోయినప్పటికీ, ఎదుటి వారి అరుపులు, ఏడుపులు విన్న తరువాత వారు ఆనందమును పొందుతున్నట్లు భావిస్తారు. ఇది సరైన స్వభావము కాదు. ఈ మూడు స్వభావాలు కలిగిన వ్యక్తులు భగవంతుని ఎప్పటికీ తెలుసుకోలేరు.
మహాత్మానస్తు మాం(మ్) పార్థ, దైవీం(మ్) ప్రకృతిమాశ్రితాః
భజన్త్యనన్యమనసో, జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్।।13।।
అదే సమయంలో కృష్ణుడు, సత్యభామతో కలిసి తన రాజభవనంలో ఉంటారు. కానీ కృష్ణ భగవానుడు కలవరపడుతూ, పరధ్యానంలో ఉంటారు. అది చూసిన సత్యభామ దేవి, ప్రభూ, ఎన్నో రోజుల తర్వాత నాకు, మీతో గడిపే సమయం వచ్చింది. కానీ, ఎందుకు మీరు అంత పరధ్యానంగా ఉన్నారు? ఏమి జరిగింది? అని ప్రశ్నిస్తారు. అప్పుడు భగవానుడు సత్యభామ దేవికి, నిండు సభలో ద్రౌపది దేవికి ఎదురైన పరిస్థితిని గురించి వివరించి, నేను తనకు సహాయం చేయటం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. అయినప్పటికీ, ద్రౌపది నన్ను తప్ప సభలో ఉన్న మిగతా అందరి వ్యక్తులను సహాయం కోరుతున్నది. వారినుండి సహాయాన్ని ఆశిస్తున్నది. కానీ, ఇక్కడ నేను తనకు సహాయం చేయాలని ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నాను అని చెప్పారు. తరువాత ద్రౌపది దేవి, ఈ సభలోని వారెవరు తనకు సహాయం చేయలేరు అని నిశ్చయించుకొని, అనన్యమనస్కురాలై, అనగా నిశ్చలమైన మనసుతో, తన చేతులతో పట్టుకున్న చీరను కూడా విడిచిపెట్టి, హే కృష్ణా, నీవు మాత్రమే నన్ను రక్షించగలవు. అని రెండు చేతులు జోడించి, సంపూర్ణ శరణాగతి చేసింది మరియు కృష్ణుని నామము జపించటము మొదలుపెట్టినది. ఆ క్షణంలోనే భగవంతుడు ప్రత్యక్షమై, ద్రౌపది మాతను రక్షించారు మరియు ఆ సభలో ఉన్న వారందరినీ ఆయన తన యోగశక్తితో, వివస్త్రులను చేశారు. ఎప్పటి వరకు అయితే ద్రౌపది మాతకు అనన్య భక్తి కలగలేదో, అప్పటివరకు కృష్ణ భగవానుడు ఆమెకు సహాయం చేయలేదు. ఎప్పుడైతే కృష్ణా, నీవు తప్ప నాకు మరొకరు లేరు, అని తాను నిశ్చల మనసుతో, సంపూర్ణ శరణాగతి చేశారో, భగవంతుడు క్షణమాత్రం ఆలస్యం చేయక, వెంటనే ప్రత్యక్షమై కాపాడారు. అనన్య భక్తి అనేది దైవిక స్వభావము. మహాత్ములైన వారు నన్ను తెలుసుకొని, నిశ్చలమైన భక్తితో నన్ను భజిస్తారు అని భగవాన్ వివరించారు.
సతతం(ఙ్) కీర్తయన్తో మాం(య్ఁ) , యతన్తశ్చ దృఢవ్రతాః
నమస్యన్తశ్చ మాం(మ్) భక్త్యా , నిత్యయుక్తా ఉపాసతే॥9.14॥
ఒక తోటమాలి, మొక్కలకు నీళ్లు పోస్తూ, వాటిని కాపాడుతూ ఉంటాడు. అతను తన పనులను చేస్తూ కూడా, భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండవచ్చు. మనం చదువుకుంటున్నాము కదా మనం దీనిని పూర్తి ఏకాగ్రతతో, కనుక చేస్తుంటే అది కూడా మనం భగవంతునికి చేసే భక్తి వంటిదే. మనం ఏది చేస్తున్న అది భగవంతుని కీర్తన వలె చేయాలి. మనం మన పనులను చేస్తూనే ప్రతిరోజు భగవద్గీత అధ్యాయాలను తప్పక చదువుతూ ఉండాలి. కీర్తనలను చేస్తున్నా, శ్లోకాలను పాడుతున్నా, ఇదే విధముగా మనం ఎటువంటి పనులను చేస్తూ ఉన్నప్పటికీ, దాన్ని పూర్తి చేయగానే, దాని ఫలితములు కృష్ణునికి అర్పించాలి. ఏ విధంగా అయితే మనం భగవద్గీతలోని అధ్యాయం చదవటం పూర్తి కాగానే కృష్ణార్పణం అని అంటామో, అదే విధముగా మనం చేసే ప్రతి పనిని కూడా భగవంతునికి అర్పించాలి. మనం ఏదైనా నేర్చుకున్నా, ఏదైనా గ్రహించినా, భగవంతునికి అర్పణ చేసి, తరువాత స్వీకరించడం మంచి పని. సహజంగా మనం అన్నిటికంటే అత్యుత్తమమైనవి మాత్రమే భగవంతునికి అర్పిస్తాము. ఈ విధంగా మనం ప్రతిదీ భగవంతునికి అర్పించడం అలవాటు చేసుకుంటే, వాటిని భగవంతునికి అర్పిస్తాము అనే భావనతో మనం వాటిని అత్యుత్తమంగా చేయగలుగుతాము. ఇదే విధంగా మనం ఏ కార్యం చేసినప్పటికీ, దాని పైన పూర్తి ఏకాగ్రతతో మన మనసులను లగ్నం చేసినట్లయితే, అది నిరంతరం మనం భగవంతుని నామ జపం చేయటం వంటిది, నిరంతర భగవద్ కీర్తన వంటిదే.
నమస్యన్తశ్చ మాం(మ్) భక్త్యా, నిత్యయుక్తా ఉపాసతే: నా భక్తులైన వారు నాకు పూజలు చేస్తూ ఉంటారు, నన్ను నమస్కరిస్తూ, నిత్యం ఉపాసిస్తూ ఉంటారు అని అర్థం. మనం చేసే ప్రతి పని కూడా భగవంతునికి అర్పించడం కోసం మాత్రమే. మహారాష్ట్రలో సంత్ గోరా కుంభార్ ఉండేవారు. ఆయన గొప్ప సాధువు, విఠల భగవానుని పైన అపారమైన భక్తి కలిగి ఉండేవారు. ఆయన కుమ్మరి పని చేస్తూ ఉండేవారు. అనగా కుండలను తయారు చేయుట. అప్పుడు ఆయన కుండల కోసం మట్టిని తయారు చేస్తున్నా, లేదా కుండలను చేస్తున్నా, ప్రతి పనిని కూడా భగవంతుని నామస్మరణ లోనే చేసేవారు. అయినా భక్తిలో ఎంత లీనమైపోయేవారు అంటే, ఒకసారి ఆయన మట్టిని తన కాలితో తొక్కుతూ, మెత్తగా చేస్తూ ఉంటారు. అదే సమయంలో తన బిడ్డ, పసి పిల్లవాడు పాకుకుంటూ, ఆ బురదలో ఆడుకోవడం కోసం వస్తాడు. ఆయన భక్తితో, భగవంతుని నామస్మరణ లో మైమరిచిపోయి, తన బిడ్డ అక్కడకు వచ్చిన విషయాన్ని గ్రహించరు. అతని భార్య లోపలనుండి, ఏం చేస్తున్నారు మీరు? అక్కడ పసిబిడ్డ వచ్చి ఆడుకుంటున్నాడు, మీరు దానిని గ్రహించకుండా, మీరు మన బిడ్డని కాలితో తొక్కుతూ ఉన్నారు, అని అరిచారు. విఠల భగవానుని దయవలన ఆ బిడ్డకు ఏమీ కాదు. ఆయన తన పూర్తి శక్తిని పెట్టి నలిపివేసినప్పటికీ కూడా ఆ బిడ్డకు ఏమీ కాకుండా రక్షింపబడతాడు. తన తండ్రి, తనను నలిపి వేస్తున్నప్పటికీ ఆ బిడ్డ ఏడవలేదు ఎందుకంటే భగవానుడు అతనిని రక్షించారు. దీని ద్వారా మనం మన కార్యములను, అత్యంత శ్రద్ధ, భక్తితో కనుక నెరవేర్చినట్లయితే, మిగిలిన అన్ని విషయాలను, ఆ భగవంతుడే చూసుకుంటాడు అని అవగతం అవుతుంది.
జ్ఞానయజ్ఞేన చాప్యన్యే, యజన్తో మాముపాసతే
ఏకత్వేన పృథక్త్వేన, బహుధా విశ్వతోముఖమ్।।15।।
నేను ఎవరు? నేను ఈ సృష్టిలో ఏ విధముగా సృష్టించబడ్డాను? ఈ సృష్టిని సృష్టించినది ఎవరు? సర్వోన్నతమైన భగవంతుడు ఎవరు? ఇటువంటి విషయాలను తెలుసుకోవడానికి మనం తప్పక ప్రయత్నించవలెను. దీనిని ధ్యానం ద్వారా కూడా తెలుసుకొనవచ్చును, భగవంతుడు ఇలా చెబుతున్నారు, కొంతమంది భక్తులు ధ్యానం ద్వారా, మరికొందరు జ్ఞానము ద్వారా నన్ను చేరుకోవడానికి ప్రయత్నిస్తారు, కొంతమంది పూజిస్తారు, కొందరు అనేక యాగాలు నిర్వహిస్తారు. వారు యజ్ఞాల ద్వారా నన్ను చేరుకుంటారు.
ఏకత్వేన పృథక్త్వేన, బహుధా విశ్వతోముఖమ్: కొందరు భక్తులు, ఈ విశ్వంలో నేను మరియు ఈ విశ్వము రెండు వేరు కాదు రెండు ఒకటే అనే అద్వైత భావనతో, నన్ను పూజిస్తారు. మరి కొందరు వ్యక్తులు ద్వైత భావనతో అనగా సృష్టి మరియు సృష్టికర్త, భగవంతుడు మరియు భక్తుడు అనే భావనతో పూజిస్తారు. ఈ లోకంలో వివిధ రకాలైన భక్తులు ఉన్నారు. వాళ్లు నన్ను రకరకాలుగా పూజిస్తూ ఉంటారు. అయినప్పటికీ, వారి అందరి పూజలను నేను స్వీకరిస్తాను అని భగవంతుడు తెలిపారు. ఈరోజు మనం చూస్తున్నాము, ప్రపంచం మొత్తం, నీ దైవం వేరు నా దైవం వేరు అనే ఆలోచనలో మునిగి ఉన్నది. మీరు భగవంతుని పూజిస్తున్న పద్ధతి వేరు, అనే మాటలను వింటూ ఉంటాము. ఈ ఒక్క మాట మీదనే, ప్రపంచం మొత్తం వివిధ వర్గాలుగా విడిపోయినది. భగవంతుడు ఈ విధంగా చెప్పారు, మీరు ఏ రకంగా, ఏ రూపంలో నన్ను పూజించినప్పటికీ అది సరైనదే, నేను స్వీకరిస్తాను అని. కొందరు భగవంతుని నిర్గుణ స్వరూపముగా భావించి పూజ చేస్తారు, అది కూడా సరియైనదే, ఎందుకంటే భగవంతుని స్వరూపాలలో ఒకటి నిర్గుణ స్వరూపము.
కొందరు భగవంతుని గణేశుని రూపములో, కొందరు శివుని రూపములో, మరికొందరు శక్తి రూపంలో పూజిస్తారు. అది కూడా సరి అయినదే, ఎందుకంటే భగవంతుడు, అన్ని రూపాలలోను కొలువై ఉన్నారు. సర్వశక్తివంతుడైన భగవంతుడు అనేక రూపాలను తీసుకుంటారు. మనం భగవంతుని శేషసాయి రూపంలో ఆరాధిస్తాము. ఆయన శేషనాగంపై శయనిస్తూ ఉండగా, పక్కనే మహాలక్ష్మీదేవి ఆయన సేవలో ఉంటారు. నాభి నుండి ఉద్భవించిన కమలంపై బ్రహ్మదేవుడు కూర్చున్నట్లు కనిపిస్తారు. ఆ ప్రసన్నవదనంతో వెలుగొందుతున్న, గదా చక్రధారి అయిన భగవంతుని మనం దర్శిస్తాము. అదే విధముగా రాముని గురించి చిరునవ్వుతో, కమల నయనములు కలిగిన, ధర్మమూర్తిని ధనుర్ బాణాలతో ఊహించుకుంటాము. భక్త ప్రహ్లాదుని కోసం ఆయన నారసింహ రూపం దాల్చారు. అదే విధముగా, భూదేవిని రక్షించడం కోసం ఆయన వరాహ రూపం ఎత్తారు. కాబట్టి భగవంతుని రూపము పరిమితమైనది కాదు. అదేవిధంగా మనం ఆయన కేవలం పది స్వరూపాలలో మాత్రమే దర్శనం ఇస్తారు అని కూడా చెప్పలేము. ఆయన మనకు ఏ రూపంలో అయినా దర్శనం ఇవ్వవచ్చును. తన భక్తులకు దర్శనం ఇవ్వటం కోసం భగవంతుడు ఏ రూపంలో నైనా వస్తారు. కావున మనం భగవంతున్ని పరిమిత దృష్టితో చూడకూడదు ఆయన అపరిమితమైన శక్తి.
మనం భగవంతునికి ఏదైనా ఒకటే రూపము ఆపాదించకూడదు, కేవలం దీని కారణంగానే, ఈ ప్రపంచంలో అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. అది ఉగ్రవాదం అయినా, మరేదైనా కేవలం ఇటువంటి ఆలోచనల వలన మాత్రమే జరుగుతుంది. భగవద్గీత ద్వారా, భగవంతుడు మనకు, తనను ఏ రూపంలో లేదా ఏ పద్ధతిలో పూజించినా సరే, వారికి ముక్తిని ప్రసాదిస్తాను అని తెలియజేస్తున్నారు. మన జీవితంలో దైవిక గుణాలను పెంపొందించుకోవటం కోసం భగవద్గీత చాలా అవసరము. అందువలన భగవద్గీత ప్రపంచ ప్రసిద్ధిచెందింది. హర్ కర్ గీత, హర్ ఘర్ గీత అనగా ప్రతి ఒక్క ఇంటిలోనూ, అలానే ప్రతి ఒక్కరి చేతిలోనూ భగవద్గీత ఉండటము ఈరోజుల్లో అత్యవసరము. ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఒక్కరూ భగవద్గీత తప్పక నేర్చుకొనవలెను. అప్పుడు మాత్రమే ఈ గందరగోళం నుండి మనం బయటపడి ప్రశాంతమైన జీవనం గడపగలము. ఈ పూర్తి విశ్వం భగవంతునితో నిండి ఉన్నది అనగా గంగాజలంలోను, ప్రయాగ, ఋషికేశ్ వంటి తీర్థ స్థలాలలోనూ, ప్రకృతిలోనూ ఇదే విధముగా సమస్త లోకంలోనూ ఆయన నిండి ఉన్నారు.
అహం(ఙ్) క్రతురహం(య్ఁ) యజ్ఞః(స్) , స్వధాహమహమౌషధమ్
మంత్రో౽హమహమేవాజ్యమ్, అహమగ్నిరహం(మ్) హుతమ్॥9.16॥
మంత్రో౽హమహమేవాజ్యమ్, అహమగ్నిరహం(మ్) హుతమ్: భగవద్గీత కూడా ఒక మంత్రమే. భగవద్గీతలోని ప్రతి శ్లోకము కూడా భగవంతుని యొక్క విభూతియే. భగవద్గీతలోని ప్రతి శ్లోకం లోను, ప్రతి అక్షరంలోను తానే ఉన్నారు. నేనే అగ్నిని, నేనే యజ్ఞాన్ని మరియు నేనే యజ్ఞంలోని ఆహుతిని. ఒక కార్యము జరుగుతున్నప్పుడు, నేనే కర్తను, నేనే ఆ కార్యాన్ని, మరియు కార్యమునకు సంబంధించిన కర్మలను కూడా నేనే అని భగవంతుడు వివరించారు.
పితాహమస్య జగతో, మాతా ధాతా పితామహః
వేద్యం(మ్) పవిత్రమోంకార, ఋక్సామ యజురేవ చ।।17।।
వేద్యం(మ్) పవిత్రమోంకార, ఋక్సామ యజురేవ చ: పవిత్రమైన ఓంకార స్వరూపమును నేనే అని భగవంతుడు వివరిస్తున్నారు. మనం శ్వేతకేతుని కథ విన్నాము. అందులో శ్వేతకేతునిని, తన తండ్రి మనం తప్పక తెలుసుకోవలసినది ఏమిటి అని ప్రశ్నిస్తారు. దానికి సమాధానం ఓంకారం. ఉపనిషత్తులలో భగవంతున్ని ఓంకారస్వరూపముతో వర్ణిస్తారు. భగవంతుని యొక్క ప్రథమ ప్రకటిత స్వరూపము ఓంకార శబ్దము, ఈ శబ్దము నేటికీ, అంతరిక్షములో మన శాస్త్రవేత్తలు వినగలుగుతున్నారు. అంతరిక్ష శబ్దం ఏమిటి? ఈ ప్రపంచంలో మొత్తాన్ని ఒక యంత్రం గా పరిగణిస్తే, అది ఓంకార శబ్దముతో కదులుతుంది. అటువంటి ఓంకారాన్ని నేనే అని భగవంతుడు తెలిపారు. అదేవిధంగా ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదములను తానే అని భగవంతుడు వివరించారు. మన శాస్త్రాలు వేదాలను నాలుగు విధాలుగా ప్రస్తావించాయి. సమస్త శాస్త్రాలు, పురాణాలు, భగవద్గీత అన్నీ కూడా వేదాలపై ఆధారపడి ఉంటాయి. వ్యాసభగవానుడు వేదాలను విభజించినప్పుడు, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదాల నుండి కొంత భాగాన్ని తీసుకొని దానిని అథర్వణ వేదముగా విభజించారు. కావున మనకు వేదాలు నాలుగు ఉన్నాయి, కానీ పూర్వకాలంలో అది మూడు వేదాలుగా మాత్రమే ఉండేది, వర్గీకరణ ద్వారా మాత్రమే మనం నాలుగవ వేదమును పొందాము.
మనం ఇప్పుడిప్పుడే మన వేదాల యొక్క ప్రాముఖ్యతను గ్రహిస్తున్నాము. సైన్స్ అభివృద్ధి చెందుతున్న ప్రతిసారి, అది మన వేదాల యొక్క గొప్పతనమును తెలియజేస్తుంది. శాస్త్రవేత్తల లైబ్రరీలో కూడా లభించని శాస్త్రజ్ఞానం మనం వేదాలలో చూడవచ్చు. అంతరిక్షం గురించిన జ్ఞానము, సమయమును లెక్కించే విధానము వంటి అనేక విషయాలను మనం వేదములలో చూడవచ్చును. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి అనేక గొప్ప శాస్త్రవేత్తలు భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ఒప్పుకున్నారు. వారు ఇలా అన్నారు, ఎప్పటి వరకు అయితే మేము వేదాంత, ఉపనిషత్తులను చదవలేదో, అప్పటివరకు మేము సైన్స్ గురించి సరిగా అర్థం చేసుకోలేకపోయాము. ఈ సమస్త గ్రంథములను చదివిన తరువాత మేము సృష్టి మరియు దాని తత్వాన్ని అర్థం చేసుకున్నాము అని చెప్పారు. ఇటువంటి సమస్త జ్ఞానము భగవంతుడు మనకు వేదాల ద్వారా అందించారు. అటువంటి పవిత్రమైన వేదాలు తన స్వరూపమే అని భగవంతుడు వివరించారు.
గతిర్భర్తా ప్రభుః(స్ ) సాక్షీ, నివాసః(శ్ ) శరణం(మ్ ) సుహృత్
ప్రభవః (ఫ్) ప్రలయః( స్) స్థానం(న్), నిధానం(మ్) బీజమవ్యయమ్।।18।।
ప్రభవః ప్రలయః స్థానం, నిధానం బీజమవ్యయమ్: అన్నిటినీ సృష్టించేది నేనే, లయం చేసేది నేనే. సృష్టికర్తను నేనే, లయకారుడిని నేనే. ఈ సమస్త సృష్టికి ఆధారం నేనే, మొత్తం విశ్వం యొక్క చిట్టచివరి నివాసము నేనే. ప్రతి ఒక్కరూ చిట్టచివరికి చేరుకోవలసినది నన్నే అని వివరించారు.
తపామ్యహమహం(వ్ఁ) వర్షం(న్) , నిగృహ్ణామ్యుత్సృజామి చ
అమృతం(ఞ్) చైవ మృత్యుశ్చ , సదసచ్చాహమర్జున॥9.19॥
సూర్యకాంతి ద్వారా మనకు ఏమి జరుగుతుంది? సూర్యకాంతి ద్వారా మొక్కలు పుష్పించటము, పెరుగటము జరుగుతుంది. అదేవిధంగా మనకు ఆహారం, ధాన్యాలు లభిస్తాయి. సూర్య భగవానుడు సముద్రపు ఉప్పు నీటిని ఆవిరి రూపంలో గ్రహించి, మేఘాల ద్వారా మనకు వర్షం రూపములో అందిస్తారు. వర్షాల ద్వారా మనకు పంటలు పండి, ఆహారం లభిస్తుంది. వర్షము కూడా ఆ భగవంతుని స్వరూపమే. ఇక్కడ భగవానుడు ఒక్కొక్క మూలకం గురించి చెప్పటం ద్వారా, సమస్త సృష్టి ఆయన స్వరూపమే అని వివరిస్తున్నారు. భగవంతుడు కేవలం ఒక విగ్రహంలో మాత్రమే కాదు. సమస్త సృష్టి లోను ఆవహించి ఉన్నారు. మనకు కనిపించే సూర్యుడు, చంద్రుడు, మొక్కలు, పక్షులు, వృక్షాలు, నదులు, కొండలు, మన చుట్టూ ఉండే మన స్నేహితులు, సమస్తము ఆ భగవంతుని స్వరూపాలే. వర్షంలోనూ, ఎండలోను తానే ఉన్నారు. చీకటి, వెలుతురులోనూ తానే ఉన్నారు. కాబట్టి, మనం ఎప్పుడూ ఒంటరిగా ఉన్నామని భావించకూడదు. మనం చూసే ప్రతి వస్తువులోనూ తానే ఉన్నారు. భక్త ప్రహ్లాదుని కోసం స్తంభము నుండి ప్రత్యక్షమైనారు. మన భక్తి యొక్క స్వచ్ఛతను బట్టి, మన శ్రద్ధను బట్టి భగవంతుడు, మనకు అన్ని వస్తువుల యందు, సమస్త జీవుల యందు దర్శనం ఇస్తారు.
మనము ప్రతి వస్తువులోను భగవంతుడిని చూడటం, మన సాంప్రదాయ జీవన విధానం ద్వారా అలవాటు చేసుకున్నాం. ఉదాహరణకు మనం ఒక రైలులో ప్రయాణిస్తూ ఉన్నాము అనుకుందాము. ఆ రైలు నదుల పైన నిర్మించిన బ్రిడ్జిల మీద నుండి వెళుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము. అది ఏ నది అయినా సరే, మనం ఆ నదిని దేవతలా భావించి నమస్కరిస్తాము. అదే విధముగా మనం ఒక పుస్తకం కింద పడిపోతే, ఆ పుస్తకానికి వందనం చేసి పైకి తీసుకుంటాము. ఒకవేళ మన పాదము ఎవరికి అయినా తగిలినట్లయితే మనం వెంటనే వారికి నమస్కరిస్తాము. ఎందుకంటే మనం అన్నిటిలోనూ, అందరిలోనూ భగవంతుని యొక్క అస్థిత్వాన్ని చూడగలుగుతున్నాము. భగవానుడు మనకు ఇక్కడ అదే చెబుతున్నారు, మనం మన భావోద్వేగాలను స్వచ్ఛముగా ఉంచుకుంటూ ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువులోనూ, ప్రతి జీవిలోనూ ఆ భగవంతుని చూడగలగాలి.
మనం ఈ సృష్టిలోని అణువులను చూడలేము ఎందుకంటే అణువులు ఈ సృష్టిలోని అన్నిటికంటే చిన్న మూలకము. వస్తువులన్నిటికీ మూలమైన, విభజించలేని సూక్ష్మమైన భాగాన్ని అణువు అంటారు. ప్రపంచంలోని ప్రతి వస్తువు అణువుల సముదాయంతో ఏర్పడింది. ఉదాహరణకు మనం ఇనుముని తీసుకుందాము. అందులో విభజించడానికి వీలు కానీ అనేక ఇనుప అణువుల సముదాయం ఉంటుంది. దానిని మనం చూడలేము. అది ఏ లోహమైన అల్యూమినియం కానీ, బంగారం, వెండి కానీ దానిలో మనం విభజించడానికి వీలవని, దానికి సంబంధించిన అతి చిన్న లోహపు అణువులు సమూహంగా ఉంటాయి. కాంతి యొక్క అతి చిన్న కణం ఫోటాన్. మనం దానిని చూడలేము. కావున అది అక్కడ లేదు అని మనం అనుకోము. ఎందుకంటే దాని నుండే పూర్తి కాంతి వస్తుంది. దానిని మనం మన జీవితకాలంలో ఎప్పటికీ చూడలేము. శాస్త్రవేత్తలు సైతం దానిని చూడగలగడానికి సూక్ష్మ దర్శిని వంటి ఉపకరణాల సహాయం తీసుకుంటారు. వారు చూసి చెప్పిన దానినే మనం నమ్ముతున్నాము, ఈ నమ్మకాన్ని మనం విశ్వాసము అంటాము. ఈ విశ్వాసాన్నే శ్రద్ధ అంటారు. ఈ శ్రద్ధ ద్వారానే మనం ఈ సృష్టిలో ప్రతి కణం లోను ఉన్న భగవంతుడిని అనుభూతి చెందగలుగుతున్నాము. కేవలం విశ్వాసంతో కూడిన భక్తి ద్వారా మాత్రమే, భక్త ప్రహ్లాదుడు భగవంతుని సాక్షాత్కారము పొందగలిగారు. అటువంటి శ్రద్ధ, విశ్వాసాలు మనకు కూడా భగవంతుని పట్ల ఉంటే మనం కూడా అటువంటి భక్తుల వల్లే భగవంతుని సాక్షాత్కారము పొందగలుగుతాము.
త్రైవిద్యా మాం(మ్) సోమపాః(ఫ్) పూతపాపా,
యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం(మ్) ప్రార్థయన్తే
తే పుణ్యమాసాద్య సురేన్ద్రలోకమ్,
అశ్నన్తి దివ్యాన్దివి దేవభోగాన్।।20।।
తే తం(మ్) భుక్త్వా స్వర్గలోకం(వ్ఁ) విశాలం(ఙ్),
క్షీణే పుణ్యే మర్త్యలోకం(వ్ఁ) విశన్తి
ఏవ(న్) త్రయీధర్మమనుప్రపన్నా,
గతాగతం(ఙ్) కామకామా లభన్తే॥9.21॥
విష్ణుపురాణంలో ఈ విధముగా ఉన్నది. స్వర్గంలోని దేవతలు సైతం భారతదేశంలో జన్మను తీసుకోవాలని కోరికతో ఉంటారు. ఒకసారి భగవాన్ విష్ణువుకు దేవతలకు ఈ విధమైన సంభాషణ జరిగింది. భారతదేశము ఎంతో గొప్పది అని వారు అన్నారు. భారతదేశంలో పుట్టినందుకు, భగవద్గీతను నేర్చుకుంటున్నందుకు, అలానే ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుంటున్నందుకు మనం ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే పుణ్యఫలం ఉన్న వ్యక్తులకు మాత్రమే భారతావనిలో జన్మ లభిస్తుంది. స్వర్గంలోని దేవతలు సైతం ఈ విధముగా పాటలు పాడుతారు.
తే పుణ్యలాభాః కృతపుణ్యపుంజాః భూయః భవంతి భవభారభూతాః॥
అనన్యాశ్చిన్తయన్తో మాం(య్ఁ) , యే జనాః(ఫ్) పర్యుపాసతే
తేషాం(న్) నిత్యాభియుక్తానాం(య్ఁ) , యోగక్షేమం(వ్ఁ) వహామ్యహమ్॥9.22॥
క్షేమము అనగా మనకు ఏది మంచిదో, ఏది శ్రేయస్సును కలిగిస్తుందో, అది మన జీవితంలో తప్పక ఉండాలి. భగవద్గీత చదవటం, మన జీవితంలో అత్యంత ప్రయోజనకరమైనది. కావున, భగవద్గీతను మన జీవితంలోనికి తీసుకురావలెను. అదే విధంగా భగవంతుడు మనకి శ్రేయస్సును కలిగించని, మనకి క్షేమకరం కానీ విషయాలను మన జీవితం నుండి తీసివేస్తారు. మీ జీవితంలో ఏది జరిగినా అది కేవలం నేను మీ మంచి కోసం మాత్రమే చేస్తున్నాను. మీ జీవితపు పడవని నేను సురక్షితంగా దాటిస్తాను. మీ సమస్త యోగ క్షేమములను నేను చూసుకుంటాను అని భగవానుడు మనకు వాగ్దానం చేస్తున్నారు. కావున, అర్జునుని వలె మనం కూడా మన జీవిత రథం యొక్క సారధ్య బాధ్యతను భగవంతునికి ఇస్తే, మన యోగక్షేమముల బాధ్యతను ఆయనే చూసుకుంటారు.
ప్రశ్న: మనం అందరిలో భగవంతుడునే చూస్తాం కనుక, ఎవరికైనా మన కాలు తగిలితే మనం వారికి నమస్కారం పెడతాము అని చెప్పారు. మరి మనం కాళ్లతో, ఈ భూమి పైనే నడుస్తున్నాము కదా, దానికి ఏ విధమైన పరిహారము చేసుకోవలెను?
సమాధానం: మన శాస్త్రంలో దీని గురించి ఈ విధంగా తెలిపారు. మనం ప్రతి రోజు ఉదయం లేవగానే, మన కాలు భూమి మీద పెట్టడానికి మునుపే, మనం ధరణి మాతకు ప్రణామము చేయవలెను. మరియు ఈ శ్లోకమును చదువుకోవలెను.
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే ॥
ప్రశ్న: మనం చదువుతూ ఉన్నప్పుడు, చదువు పైన పూర్తి శ్రద్ధ మరియు ఏకాగ్రత పెట్టినచో, భగవానుడు సంతోషించి ప్రసన్నులు అవుతారు అని మీరు చెప్పారు, కానీ భగవద్గీత 12వ అధ్యాయం రెండవ శ్లోకంలో ఇలా ఉంది, "ఎవరైతే తమ మనస్సును నాపై నిలిపి, ఎల్లప్పుడూ నన్ను ఆరాధిస్తూ, పరమ శ్రద్ధతో ఉంటారో, వారే అత్యుత్తమ యోగులు అని నేను భావిస్తాను." కావున, ఏ విధంగా మనం చదువు పైన పూర్తి శ్రద్ధ పెడితే భగవానులు ప్రసన్నులు అవుతారు?
సమాధానం: ఇక్కడ భగవానులు శ్రద్ధగా ఉపాసన చేయటం గురించి ప్రస్తావించారు మనకు ఉపాసనలో అనేక రకాలు కలవు. మనం చేసే నిత్య పూజ కూడా భగవంతుని ఉపాసనయే. అంతేకాక, భగవానులు మూడవ అధ్యాయములో ఈ విధముగా వివరించారు. మనం ఏ కర్మను చేస్తున్నప్పటికీనూ దానిని, పూర్తి ఏకాగ్రతతో, మన మనసును లగ్నం చేసి, చేసినచో అది భగవంతునికి చేసే ఉపాసనయే అవుతుంది. మనం మన కర్మలను విస్మరించి, పూర్తిగా భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండటాన్ని భగవంతుడు హర్షించరు. మనం ఏ కార్యము చేస్తున్నప్పటికీ భగవంతునికి అర్పించి, ఆయనకు సమర్పించి చేసినచో, అది భగవత్ కార్యమే అవుతుంది. ఆయన ఉపాసనయే అవుతుంది. తద్వారా భగవంతుడు ప్రసన్నలవుతారు. మనం ఎంతో మంది భక్తులను చూసాము. వారు తమ సంసారాలను విడిచిపెట్టి, భగవంతుని నామస్మరణ చేయలేదు. వారందరూ గృహస్తులుగా ఉంటూనే భగవంతుని నామస్మరణ చేశారు. వారు కేవలం వారి భక్తిలో పరాకాష్టకు చెందినప్పుడు మాత్రమే ఈ సంసారాన్ని విడిచిపెట్టారు.
ఉదాహరణకు, జానాబాయి. ఆమె మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో పుట్టారు. ఆమెకు చిన్నప్పటి నుంచే విఠోబా మీద అపారమైన భక్తి కలిగినది. ఆమె చిన్న వయసులోనే సంత్ నామదేవ్ ఇంట పనిమనిషిగా పనిచేసేవారు. ఇంటి పనులు చేస్తూనే, "విఠల! విఠల!" అని ఎప్పుడూ జపించేవారు. జానాబాయి తన హృదయంలో విఠోబాను ఊహిస్తూ ఉండేవారు. కడగడం, వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, ఏ పనినైనా చేసేటప్పుడు “ఇది నా విఠోబాకే చేస్తున్నాను” అనే భావంతో చేసేవారు. "ఏ పనైనా మనసారా భగవంతునికి అర్పిస్తే అదే నిజమైన భక్తి" అని జానాబాయి నిరూపించారు.
మనం ప్రతిరోజు భగవంతుని ఉపాసన చేయటం అలవాటు చేసుకోవలెను. ప్రతి రోజు భగవద్గీత అధ్యాయాలను పారాయణ చేయవలెను. ఈ విధముగా చేయటం ద్వారా మనం కూడా కర్మయోగులుగా మారగలము.
ప్రశ్న: ఆసురి, రాక్షస ప్రవృత్తి కల వ్యక్తులను మనం ఏ విధముగా ఎదుర్కొనవలెను?
సమాధానం: మనం భగవద్గీతను మన కోసం నేర్చుకుంటున్నాము. నీవు ఇది తప్పు చేస్తున్నావు అని మరొకరికి ఉపదేశం చేయుట కోసం కాదు. మనం భగవద్గీతను నేర్చుకోవడం ద్వారా, ఆసురీ ప్రవృత్తి మనకు లేకుండా చూసుకోవలెను. ఈ పూర్తి భగవద్గీత సారం, కేవలం మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మాత్రమే. ఒకవేళ మరొకరికి చెప్పవలసి వస్తే, భగవద్గీత నేర్చుకోమని చెప్పాలి.
ప్రశ్న: మనం స్వర్గానికి వెళ్ళిన తరువాత కొంతకాలానికి మన పుణ్యం క్షీణిస్తుంది. అప్పుడు తిరిగి మనం ఈ భూమిపైన జన్మించవలసి వస్తుంది. అదే విధముగా నరకము తర్వాత కూడా తిరిగి జన్మిస్తారా?
సమాధానం: మనము స్వర్గానికి ఎందుకు వెళ్తున్నాము? మన పుణ్యఫలము వలన వెళ్తున్నాము. స్వర్గంలో కొంతకాలం ఆనందించిన తరువాత, ఆ పుణ్యఫలము క్షీణిస్తుంది. అప్పుడు, తిరిగి భూమి పైన జన్మిస్తాము. అదే విధముగా, నరకములో కష్టాలు, బాధలు పడిన తర్వాత, పాపఫలము కూడా క్షీణించి, మనము తిరిగి భూమి పైన జన్మను తీసుకుంటాము. మనం కేవలం ఈ భూమిపైన కర్మలను చేసి, వాటి ఫలితాలను అనుభవించడానికి మాత్రమే జన్మను తీసుకుంటాము. మనం పుణ్య కార్యాలు చేయుట ద్వారా స్వర్గం, పాప కార్యాలను చేయడం ద్వారా నరకం ప్రాప్తిస్తుంది.
ప్రశ్న: మనకు పునర్జన్మ ఉన్నట్లుగానే పూర్వజన్మ కూడా ఉంటుందా?
సమాధానం: భగవద్గీత ద్వారా భగవంతుడు దీనినే మనకు చెబుతున్నారు. మనం పూర్వజన్మలో చేసిన పాప పుణ్యాల ఫలితాలను ఈ జన్మలో అనుభవిస్తాము. కొందరు వ్యక్తులు 80 లేదా 90 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ, వారు భగవద్గీతను చదవలేరు. మరికొందరు నాలుగు లేదా ఐదు సంవత్సరముల వయసులోనే భగవద్గీతను కంఠస్థం చేయగలుగుతున్నారు. ఆ శ్లోకాల అర్థమును తెలుసుకొని ఆచరించగలుగుతున్నారు. వీరు తమ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యఫలం వలన అతి చిన్న వయసులోనే భగవద్గీతను నేర్చుకునే అవకాశం కలిగినది. మనం ఈ జన్మలో సాధ్యమైనంతగా, భగవద్గీతను పారాయణ చేసి, ఆచరించటం ద్వారా మనకు మరింత ఉత్తమమైన జన్మ లభిస్తుంది. మనం మరణం తర్వాత సంపదనంతా ఇక్కడే విడిచిపెట్టి వెళ్తాము, కానీ మన గుణములను మాత్రం, ప్రతి జన్మకు మన వెంట తీసుకొని వెళ్తాము.
ప్రార్థన మరియు హనుమాన్ చాలీసా పఠనముతో ఈ నాటి వివేచన కార్యక్రమము ముగిసినది.