विवेचन सारांश
రాజ విద్యా రాజ గుహ్య యోగము - ఉత్తరార్థం

ID: 2143
तेलुगू - తెలుగు
ఆదివారం, 18 డిసెంబర్ 2022
అధ్యాయము 9: రాజవిద్యా రాజగుహ్య యోగము
3/3 (శ్లోకము 22-34)
వివేచకులు: గీత విదూషి సౌ.వందనా వర్ణేకర్ గారు


సాంప్రదాయానుగుణంగా శ్రీకృష్ణ ప్రార్ధన, సరస్వతీ ప్రార్ధన మరియు దీపప్రజ్వలనముతో కార్యక్రమము ప్రారంభమైనది. శ్రీమతి వందనా వర్ణేకర్ గారు గురువందనం, సరస్వతి ప్రార్థన మరియు వేదవ్యాస ప్రార్థనతో తన వివేచనని మొదలుపెట్టారు. అద్భుతమైన, నిరుపమానమైన ఈ తొమ్మిదవ అధ్యాయం పరమగుహ్యమైనది. ఇందులో ప్రతిపాదింపబడిన సిద్ధాంతం వేరే ఏ అధ్యాయంలోనూ చెప్పబడలేదు. అందుకే ఇంతకుముందు చెప్పినట్టుగా జ్ఞానేశ్వర్ మహారాజ్ గారికి ఈ అధ్యాయం అత్యంత ప్రీతిపాత్రమైనది. సజీవ సమాధి పొందేటప్పుడు ఆయన ఈ అధ్యాయాన్ని తన వద్ద ఉంచుకున్నారు. మీ అందరి అంతరంగాలలో గీతా ప్రేమబీజం అంకురిస్తోంది. దానిని చింతన/వివేచన అనే నీరు పోసి పెంచే బాధ్యత నాకు ఇవ్వబడింది. ఈ అధ్యాయం యొక్క లోతులు కనుగొనడం అసాధ్యమని జ్ఞానేశ్వర్ మహారాజ్ గారు అన్నారు. మన ప్రతిభ అనగా ఎంత? కాని ఆయన పద్దెనిమిదో అధ్యాయం చివర ఒక అర్థవంతమైన వోలీ చెప్పారు.
राजहंसाचे चालणे I भूतली जालिया शहाणे II
आणिके काय कोणे I चालावेची ना ?
 
రాజహంస ఎంతో అందంగా, రాచ ఠీవితో నడుస్తుంది. ప్రపంచంలో ఎవ్వరూ అంత అందంగా నడవలేరు. కాని మిగిలిన వారు నడవనే కూడదని కాదు. స్వర్గీయ లతా మంగేష్కర్ తన అద్భుత గానలహరిలో ఇప్పటికీ మనల్ని ముంచెత్తుతున్నారు. ఆమెలా పాడలేకపోయినా మరి ఎవరూ పాడకూడదని మాత్రం కాదు కదా. సచిన్ టెండూల్కర్ గొప్ప క్రికెట్ ఆటగాడు. అతడిలా అందరూ ఆడ లేకపోయినా క్రికెట్ అందరూ ఆడొచ్చు. అలాగే ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు భగవద్గీతని అధ్యయనం చేయాలి. గీతని అర్థం చేసుకునేటంత శక్తి గాని, బుద్ధి కాని లేదని అనుకోకూడదు.అప్పుడు మనకు అందులోనే  రహస్యాలు అర్థమవుతాయి.
భారత సంగ్రామ భూమిలో నర నారాయణుల మధ్య జరిగిన సంవాదం ఈ భగవద్గీత. తన పితామహుడిని ,ఆచార్యుడిని బంధుజనులను చూసి హతోత్సాహుడై విషాదం కమ్మిన అర్జునుడు ధనుర్బాణాలు వదిలి యుద్ధం చేయనని చెప్పాడు. తరువాత సమర్పణ భావంతో శ్రీకృష్ణుని శరణాగతి చేసి తన శ్రేయస్సు కొరకు ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటో బోధించమని శిష్య భావంతో వేడుకున్నాడు. భగవద్గీతలో రెండవ అధ్యాయంలో ఏడవ శ్లోకం:

కార్పణ్యదోషోపహత స్స్వభావ
పృచ్ఛామి త్వాం ధర్మసంమూఢ చేతాః
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్య స్తే హం శాధిమాన్ త్వాం ప్రపన్నం 


అప్పుడు శ్రీకృష్ణుడి ముఖారవిందం నుండి గీతామృతం జాలువారింది.ఈ విధంగా శరణు కోరి తన శ్రేయస్సు కోసం ఏ శిష్యుడు అయినా అడిగితే గురువు అన్ని విషయాలను బోధిస్తాడు.ఇలా ప్రపన్నుడైన అర్జునుడికి శ్రీకృష్ణుడు సర్వ రహస్యాలను విప్పి చెప్పాడు.
'నచ మాన్ తాని కర్మాణి'..., 'మత్స్థాని సర్వ భూతాని'... ఇలా చెప్పిన భగవంతుడి తత్వజ్ఞానాన్ని మనం విశ్లేషించే ప్రయత్నం చేశాము. సర్వభూతములు నాయందు ఉన్నవి. కాని నేను వాటి యందు లేను. ఈ విధమైన పరస్పర విరుద్ధ భావాలని మనం విశ్లేషించాం. ఇప్పుడు శ్రీకృష్ణుని ముఖ కమలం నుంచి భక్తి ప్రధానమైన విషయాలు ప్రస్ఫుటమవుతున్నాయి. వాటిని గురించి తెలుసుకుందాం.

9.22

అనన్యాశ్చిన్తయన్తో మాం(య్ఁ) , యే జనాః(ఫ్) పర్యుపాసతే
తేషాం(న్) నిత్యాభియుక్తానాం(య్ఁ) , యోగక్షేమం(వ్ఁ) వహామ్యహమ్॥9.22॥

పరమేశ్వరుడనైన నన్ను నిరంతరము అనన్య భక్తితో చింతనచేయుచు, నిష్కామ భావముతో సేవించువారి యోగక్షేమములను నేనే వహించుచుందును. (అప్రాప్త వస్తుప్రాప్తిని 'యోగము' అనియందురు. ప్రాప్తించిన వస్తురక్షణమును 'క్షేమము' అని యందురు.)

9.22 
ఇంతకుముందు రెండు శ్లోకాలలో ఏ విధంగా యజ్ఞ, దాన, తపఃక్రియల వల్ల పుణ్యం సముపార్జించి అమర లోకాలలో భోగభాగ్యాలు అనుభవించి ,ఆ పుణ్య సంపద  క్షీణించగానే తిరిగి భూలోకానికి మరలి వస్తారో తెలుసుకున్నాము. భోగ భాగ్యాలు ఆశించి పుణ్యం చేసేవారు ఈ జనన మరణ చక్రం నుండి  తప్పించుకోలేరు. సాధ్యము, సాధన...రెండు ఉంటాయి. మనం కష్టాల నుండి తప్పించుకోవడానికి లేదా భోగాలు అనుభవించడానికి భగవంతున్ని ప్రార్థిస్తే ఆ సాధ్యము మన కోరిక అవుతుంది. సాధన భగవంతుడు అవుతాడు. అలా కాక, కేవలం భగవత్ ప్రాప్తి కోసమే మనం ప్రార్థిస్తే అప్పుడు సాధ్యము, సాధన భగవంతుడే అవుతాడు. తీర్థయాత్ర చేస్తే పుణ్యం వస్తుంది. అదే  అంతర్యాత్ర చేస్తే పరమ శాంతి, పరమాత్మ సాన్నిహిత్యం లభిస్తాయి.
LIC ధ్యేయ వాక్యము 'యోగక్షేమం వహామ్యహం'. ఈ వాక్యంలో భగవంతుడు ఎవరైతే అనన్యభావంతో నిరంతరం నన్నే ఉపాసిస్తారో వారి యోగక్షేమములు నేనే వహిస్తాను అంటాడు. 'అప్రాప్యస్య ప్రాప్యం.. యోగం
ప్రాప్యస్య రక్షణం .. క్షేమం
మన దగ్గర లేనిది మనకి దొరకడం యోగం. మన దగ్గర ఉన్న దాన్ని రక్షించుకోవడం క్షేమం. జీవితమంతా ఈ రెండింటి కోసమే గడిచిపోతుంది. కాని ఈ రెండు తానే వహిస్తానంటున్నాడు పరమాత్ముడు. అనన్య అన్న పదానికి సరైన అర్థం తీసుకోవాలి. ఒక్క శ్రీకృష్ణుడే పరమాత్ముడు వేరెవ్వరూ కారు అన్న అర్థం సరైనది కాదు. ఒకే పరమాత్ముడు అనేక రూపాలలో ప్రకటమై ఉన్నాడని అర్థం చేసుకోవడం సరైనది. న అన్య... అంటే అన్ని రూపాలలో ఒక్కడే అయి ఉన్న పరమాత్మ తప్ప వేరేదీ  సత్యం కాదన్న సత్యం తెలుసుకోవడం. తెలుసుకున్న వాళ్ళ భ్రమలన్నీ తొలగిపోతాయి. ఒక ఉదాహరణ చెప్పారు. పండరీపురంలో నరహరి అన్న మహా శివ భక్తుడైన ఒక కంసాలి ఉండేవాడు. అతడు శివుడిని తప్ప వేరే ఎవరిని పూజించేవాడు కాదు. పండరీ  పురం లో ఉండి కూడా విఠలుడిని దర్శించలేదు. ఒక మహా ధనవంతుడు సంతానం కలిగితే పాండురంగనికి రత్న ఖచితమైన వడ్డాణం చేయిస్తానని మొక్కుకున్నాడు. మొక్కు తీర్చుకోవడానికి ఈ కంసాలిని వడ్డాణం చేయమని అడిగాడు. అప్పుడు ఈ కంసాలి తాను పాండురంగడిని చూడనని, నడుము కొలత ఆ ధనవంతుడినే తీసుకుని రమ్మన్నాడు. మొదట ఆ వడ్డాణం పాండురంగడికి వదులు అయింది. రెండవసారి బిగుతయింది. విసుగు చెందిన ఆ శ్రీమంతుడు ఆ కంసాలినే కొలతలు తీసుకోమన్నాడు. అప్పుడు ఆ కంసాలి కళ్ళకి గంతలు కట్టుకుని కొలతలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. విఠలుడి విగ్రహాన్ని తాకితే చేతికి శివలింగం తగిలింది. కళ్ల గంతలు విప్పి చూస్తే విఠలుడు! రెండుసార్లు అలాగే అయ్యాక, అతడికి అర్థమైంది. సంభ్రమాశ్చర్యాలతో శివుడూ, కృష్ణుడూ, రాముడు, పాండురంగడు అందరూ ఒకే పరమాత్మ స్వరూపమని అర్థమై రోమాంచితమైన శరీరంతో, కళ్ళల్లో నీరు  కారుస్తూ ఉండిపోయాడు.
కష్టాలు తీరడం కోసం, వివిధమైన కోరికల కోసం భగవంతుని ప్రార్థిస్తాము. భగవంతుడిలో మమేకమై అతడి కోసమే అతడిని ప్రార్థించడం.. సాధ్యము సాధన రెండు ఒకటేయైన భక్తి. అందులోనూ 'నిత్యాభి యుక్తానాం'.. అంటే నాలుగు వైపుల నుంచి భగవంతుడికి 
అనుసంధానమై ఉండడం.
कांदा मुळा भाजी, अवघी विठाई माझी।' అంటారు సంత్ సావతామాలి. దీని అర్థం ఏమిటంటే ప్రపంచంలో ప్రతి వస్తువులోను ఆయనకి పరమాత్మనే కనిపిస్తాడు. అనన్య భక్తి అంటే ఇది. చిన్న బాలుడు తన ఆకలిని, నిద్రని, అవసరాలని గుర్తించలేడు. అన్నిటి కోసం తన తల్లి మీదే ఆధారపడతాడు. అలా మనం కూడా మన జీవితము, ప్రాణము , సర్వస్వము  భగవంతుడికే అర్పించి భగవంతుడి మీదనే ఆధారపడితే మన యోగక్షేమములు అతడే వహిస్తాడు. ఒక తల్లి తన బిడ్డకు ఎన్నో బొమ్మలని ఇచ్చి కూర్చోబెడుతుంది. కొంచెం సేపు ఆడుకున్నాక ఆ పిల్లవాడు నాకు బొమ్మలు వద్దు అమ్మనే కావాలి అని ఏడుస్తాడు. అప్పుడు అమ్మ వాడిని ప్రేమతో దగ్గరికి తీసుకుంటుంది. మనం కూడా అలాగే నాకు ఈ భోగభాగ్యాలు ఏవీ వద్దు భగవంతుడే కావాలి , అని తపించి ప్రార్థిస్తే పరమాత్మ మనకి ప్రాప్తిస్తాడు.
రామకృష్ణ పరమహంస కాళికాదేవి పరమ భక్తుడు. ఆయనకు వేదాంతము ,తత్వము బోధించాలని తోతాపురి అన్న మహనీయుడు ఆయన వద్దకు వస్తాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస మీ వద్ద నేను వేదాంతం నేర్చుకోవాలో , వద్దో అమ్మను అడిగి వస్తాను అంటాడు. కాళికాదేవి అతడితో 'హిమాలయ గుహల నుండి నీకు వేదాంతం నేర్పించడానికి నేనే ఇతడిని పిలిపించాను. నీవు అతడి వద్ద నేర్చుకో' అని చెప్తుంది. నిర్గుణోపాసకుడైన తోతాపురి కాళికాదేవి రామకృష్ణ పరమహంసతో మాట్లాడుతుందని విని ఆశ్చర్యపోతాడు. కాళికాదేవి మీద రామకృష్ణ పరమహంస కి ఉన్న భక్తి అనన్య భక్తికి ఉదాహరణ.

9.23

యే ౽ప్యన్యదేవతా భక్తా, యజన్తే శ్రద్ధయాన్వితాః
తే౽పి మామేవ కౌన్తేయ, యజన్త్యవిధిపూర్వకమ్।।23।।

ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతరదేవతలను పూజించినప్పటికిని వారు నన్ను పూజించినట్లే. కాని వారిపూజలు అవిధిపూర్వకములైనవి. అనగా అజ్ఞానముతో కూడినవి.

9.23 
కొందరు అనేక దేవతలని పూజిస్తూ ఉంటారు. అందరు దేవతలకి పరమాత్మ వల్లనే శక్తి ,తేజస్సు ప్రాప్తం అవుతాయి. గాలికి వాయుదేవుడు, వరుణదేవుడు జలానికి, సంపదలకు లక్ష్మీదేవి, కళలకు సరస్వతి, బుద్ధికి గణపతి, ఇలా మనకి ఎందరో దేవతలు ఉన్నారు. కోరికలు తీరడం కోసం లేదా కష్టాలు తొలగడం కోసం వారిని అజ్ఞానంతో, సరైన విధులను పాటించకుండా పూజిస్తారు. ఈ సృష్టిని సృజించిన పరమాత్మని తలుచుకోరు.. ఏ దేవతలను పూజించినా ఆ పూజలు పరమాత్ముడికే చెందుతాయి. దేశానికి ప్రధానమంత్రి ఒకరే ఉంటారు. అనేక విభాగాలను మిగిలిన మంత్రులు పాలిస్తూ ఉంటారు. వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, ఆర్థిక శాఖ ఇలా వివిధ శాఖలకు మంత్రులు ఉంటారు. అలాగే పరమాత్మ ఒక్కడే. అతడి ఆధ్వర్యంలో మిగిలిన దేవతలు వారి వారి శాఖలను నిర్వర్తిస్తూ ఉంటారు.

9.24

అహం(మ్) హి సర్వయజ్ఞానాం(మ్), భోక్తా చ ప్రభురేవ చ
న తు మామభిజానన్తి, తత్త్వేనాతశ్చ్యవన్తి తే।।24।।

ఏలనన సకల యజ్ఞములకును భోక్తను, స్వామిని గూడ నేనే. వారు నా పరమేశ్వర తత్త్వమును ఎఱుంగరు. కావున పతనమగుదురు. అనగా పునర్జన్మను పొందుదురు.

9.24
అన్ని యజ్ఞాలకు ప్రభువు, భోక్త కూడా పరమాత్ముడే. యజ్ఞం అంటే సమిష్టిగా అందరూ కలిసి చేసే కార్యం. ఈ భగవంతుడి తత్వం తెలియని వాళ్ళు అధోగతిని పొందుతారు. భగవద్గీత మన దృష్టి కోణాన్ని మార్చుకోమంటుంది. కోరికలు తీరడం కోసం లేదా కష్టాలు తొలగడం కోసం ఏ దేవతలను ప్రార్థించినా అది పరమాత్ముని  ద్వారానే సాధ్యమవుతుంది. విద్యుత్తు తీగెల నుండి వస్తుందని కొందరు అనుకుంటారు. లేదా ట్రాన్స్ఫార్మర్ నుండి వస్తుందని అనుకుంటారు. కాని అది పవర్  స్టేషన్/జనరేటర్ లో తయారవుతుందని తెలుసుకోలేరు. సర్వసృష్టికి నియామకుడైన పరమాత్మ ద్వారానే అన్నీ సాధ్యమవుతున్నాయి.

9.25

యాన్తి దేవవ్రతా దేవాన్, పితౄన్యాన్తి పితృవ్రతాః
భూతాని యాన్తి భూతేజ్యా, యాన్తి మద్యాజినో౽పి మామ్।।25।।

దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు. పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు. భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు.

9.25 
ఇక్కడ భగవంతుడు ఒక సుందరమైన విషయాన్ని మనకి చెప్తున్నాడు. ఎవరు  దేవతలని పూజిస్తారో వారు ఆ దేవతలని పొందగలుగుతారు. ఎవరు పితృదేవతలని ఆరాధిస్తారో (శ్రాద్ధ కర్మలు మొదలైనవి సరిగ్గా ఆచరించడం ద్వారా) వారు పితృదేవతలని పొందగలుగుతారు. ఎవరు భూతప్రేత గణాలని ఆరాధిస్తారో వారు వాటినే పొందుతారు. ఇక్కడ భూతాలకి 'భవతి ఇతి భూతః'అన్న అర్థం చెప్పుకోవచ్చు. మన దేహం పంచభూతాలతో నిర్మించబడింది. ప్రకృతిని, పంచభూతాలని ఆరాధించే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే విశిష్టమైన వ్యక్తులని ఆరాధించే వాళ్ళూ ఉంటారు. దానిని బట్టి వారు వాటినే పొందుతారు. ఎవరైతే నిర్మలమైన అంతఃకరణతో పరమాత్ముని పూజిస్తారో వారు పరమాత్ముడినే పొందుతారు.

9.26

పత్రం(మ్) పుష్పం(మ్) ఫలం(న్) తోయం(య్ఁ) , యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం(మ్) భక్త్యుపహృతమ్, అశ్నామి ప్రయతాత్మనః॥9.26॥

నిర్మలబుద్ధితో, నిష్కామభావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రమునుగాని, పుష్పమునుగాని, ఫలమునుగాని, జలమునుగాని, నేను ప్రత్యక్షముగా (స్వయముగా) ప్రీతితో ఆరగింతును.

9.26
అర్జునుడి మనసులో ఒక శంక ఉత్పన్నమై ఉండవచ్చు. సృష్టి, స్థితి, లయ కారకుడై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్ముని పూజించే విధానం చాలా కఠినమైనది కాబోలునని. శ్రీకృష్ణుడు చెప్తాడు, భక్తితో, ప్రేమ భావంతో పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో అర్పిస్తే నేను దాన్ని స్వీకరిస్తాను.ప్రయతాత్మనః,  అంటే శుద్ధమైన అంతఃకరణతో. సృష్టిలోనివన్నీ పరమాత్మ సృజించినవే. అన్నీ భగవంతుడికి చెందినవే. ఆయనకి చెందినవే ఆయనకి అర్పిస్తున్నాం మనం. అర్పించడం కేవలం నిమిత్త మాత్రమే. కావలసినది భక్తితో నిండిన మనసు. తనకి సమర్పిస్తున్న వాళ్లు గొప్ప వాళ్ళా, చిన్న వాళ్ళా, పెద్ద వాళ్ళా, ధనికులా, పేదలా అని భగవంతుడు చూడడు. భక్తి భావంతో ఒక తులసిదళం లేదా ఒక బిల్వపత్రం అర్పించినా అది  ఎంతో విలువైనదిగా భావిస్తాడు.
మహాభారతంలో ఒక ఘట్టాన్ని ఉటంకించారు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భంపై ప్రయోగిస్తాడు. అప్పుడు ఉత్తర తల్లడిల్లిపోయి తన గర్భాన్ని నిలపమని శ్రీకృష్ణుడిని శరణు వేడుతుంది. అందుకు శ్రీకృష్ణుడు నీవు నాకేం ఇస్తావని అడుగుతాడు. రణరంగంలో భర్తను పోగొట్టుకున్న నేను మీకు ఏమి ఇవ్వగలనని , కన్నీళ్ళతో అడుగుతుంది. నీ మాతృత్వాన్ని నాకు ఇవ్వు , అని అడుగుతాడు కృష్ణుడు. ఆమె అలాగే ఇస్తుంది. శ్రీకృష్ణుడు ఆమె గర్భాన్ని అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం నుంచి రక్షిస్తాడు. ఉత్తర గర్భంలో పరీక్షిత్తు పుడతాడు.
ద్రౌపదికి నిండు సభలో కౌరవులు వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు, ముందుగా ఆమె భీష్ముడిని, ద్రోణుడిని శరణు వేడింది. వారెవ్వరూ రక్షించరని తెలిసాక, నిర్మలమైన 
 మనసుతో శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. పరమాత్ముడు ఆమెని రక్షించాడు. ఒకనాడు తన చీర చెంగు చించి శ్రీకృష్ణుడి వేలికి రక్తం కారుతుంటే ఆమె కట్టు కట్టింది. భక్తి భావంతో, ప్రేమతో ఏది సమర్పించినా పరమాత్ముడు స్వీకరిస్తాడు.

9.27

యత్కరోషి యదశ్నాసి, యజ్జుహోషి దదాసి యత్
యత్తపస్యసి కౌన్తేయ, తత్కురుష్వ మదర్పణమ్।।27।।

ఓ కౌంతేయా! నీవు ఆచరించు కర్మను, భుజించెడి ఆహారమును, హోమముచేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము.

9.27 
ఇప్పుడు అర్జునుడు నేను ఉన్నది రణరంగంలో. ఇవన్నీ నీకెలా అర్పించగలను కృష్ణా అనుకుని ఉంటాడు. అందుకు శ్రీకృష్ణుడు నీవు ఏది చేసినా పరమాత్ముడి కోసమే చేస్తున్నాను, అన్న సమర్పణా భావంతో చెయ్యమని అంటాడు. ఈ శ్లోకంలో కర్మయోగం మరియు భక్తి యోగం యొక్క ఉత్తమమైన కలయికను చూస్తాం. నీవు ఏది భుజిస్తావో,ఏ యజ్ఞం చేస్తావో, దానం చేస్తావో, ఏ తపస్సు చేస్తావో దాన్ని నాకు అర్పించు , అంటాడు కృష్ణుడు.  యుధిష్ఠురుడు యక్ష ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు  తపస్సు అంటే కర్తవ్యాన్ని నిర్వహించడంలో కలిగే కష్టం అని చెప్పాడు. నేను ఏమీ చేయలేదు,  భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు. నేను ఏమి చేసినా అది భగవంతుడి కోసమే అన్న కృతజ్ఞతా భావంతో ఉండాలి. జ్ఞానేశ్వర్ మహారాజ్ గారు ఆయన రాసిన రెండు వేల వోలీల జ్ఞానేశ్వరి గ్రంథాన్ని ఆయన గురువుకి సమర్పించారు. ఇదంతా గురువు అనుగ్రహంతోనే తాను రాయగలిగానని, లేకపోతే ఇది రాసే శక్తి తనకు లేనేలేదని,  వినమ్రంగా వచించారు. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయాలి. భగవంతుడు ఏ విధమైన ఫలాన్ని ఇచ్చినా ప్రసాదంగా స్వీకరించాలి.
జ్ఞానేశ్వర్ మహారాజ్ గారు ప్రకృతి నుంచి ఈ విషయాన్ని నేర్చుకోమంటున్నారు. పుష్పాలనీ, ఫలాలనీ ఇచ్చే చెట్లు వాటిని ఎవరు తీసుకుంటున్నారో కూడా గమనించవు. ఇవన్నీ నేను  ఇస్తున్నానన్న కర్తృత్వ భావనతో ఉండవు. అందువల్ల కొత్త సృష్టి జరుగుతుంది. నేను చేశానన్న అహంకారపు పూతని కడిగేసి సమర్పణా భావంతో కర్మ చేయాలి. తేజోమయ్ ఆనంద్ జీ అంటారు..
మన వేలికి  వజ్రపు టుంగరం  ఇచ్చిన వాళ్లకు , కృతజ్ఞతలు చెప్తాము. కానీ మనకు వేలిచ్చిన  దయామయునికి కృతజ్ఞతలు చెప్పడం మరిచిపోతాము.

क्रियाजात आघवें । जें जैसें निपजेल स्वभावें ।
तें भावना करोनि करावें । माझिया मोहरा ॥ ४०० ॥
परि सर्वथा आपुलां जीवीं । केलियाची शंका कांहींचि नुरवीं ।
ऐसीं धुवोनि कर्मे द्यावीं । माझियां हातीं ॥ ४०१ ॥

మన స్వభావాన్ని, శక్తిని అనుసరించి కర్మలు కర్తృత్వ భావం లేకుండా, భక్తి పూర్వకంగా, నిష్కామ బుద్ధితో చేయాలి.

9.28

శుభాశుభఫలైరేవం(మ్), మోక్ష్యసే కర్మబన్ధనైః
సన్న్యాసయోగయుక్తాత్మా, విముక్తో మాముపైష్యసి।।28।।

ఈ విధముగా సన్న్యాసయోగమునందు స్థిరచిత్తుడవై. అనగా సమస్తకర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి, శుభాశుభఫలరూపకర్మబంధములనుండి ముక్తుడవయ్యెదవు. పిదప నన్నే చేరగలవు.

9.28 
అర్జునా! నీవు ఈ యుద్ధం యొక్క శుభాశుభ ఫలాలను గురించి చింతిస్తున్నావు. కాని నీవు ఎప్పుడు సన్యాసయోగ యుక్తాత్ముడివి అవుతావో అప్పుడు నన్ను చేరుకోగలవు. సన్యాస యోగం అంటే.. సన్యాసం అంటే వదలడం. యోగం మంటే కలవడం. ఇవి రెండూ పరస్పరం విరుద్ధ పదాలు. ప్రపంచం నుంచి నిస్సంగత్వం. కాని మనసు సంగం లేకుండా ఉండలేదు. దానిని అందుకే పరమాత్ముడితో ముడి పెట్టాలి. శుభాశుభ ఫలితాలను వదిలి పెట్టాలి. కర్మబంధనానికి మూడు విషయములు కారణమవుతాయి. కర్తృత్వం, భోక్తృత్వం, కర్మాసక్తి. వీటిని మూడింటిని వదిలి నప్పుడు పరమాత్ముని ప్రాప్తి కలుగుతుంది.

9.29

సమో౽హం(మ్) సర్వభూతేషు, న మే ద్వేష్యో౽స్తి న ప్రియః
యే భజన్తి తు మాం(మ్) భక్త్యా, మయి తే తేషు చాప్యహమ్।।29।।

నేను సకలభూతముల (ప్రాణుల) యందును సమభావముతో వ్యాపించియుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడును లేడు. కాని నన్ను భక్తితో భజించువారు నాయందేయుందురు. నేనును వారియందు ప్రత్యక్షముగా ఉందును.

9.29 
 భగవంతుడికి అన్ని ప్రాణులు సమానులే. ఎవరినీ అతడు ద్వేషించడు. ఎవరినీ విపరీతంగా ప్రేమించడు. సూర్యకాంతి, వెన్నెల, చల్లగాలి, వానజల్లు అందరికీ సమానమే. కాని ఎవరైతే భగవంతుడిని ప్రేమతో ,భక్తితో ఉపాసిస్తూ ఉంటారో వారు భగవంతుడిలో ఉంటారు. భగవంతుడు వారిలో ఉంటాడు. మామూలుగా భగవంతుడి మీద రెండు ఆరోపణలు వినవస్తూ ఉంటాయి. భగవంతుడు కఠినాత్ముడని, పక్షపాతి అని. కాని అతడికి అందరూ సమానమే. బీజాన్ని బట్టి ఫలం ఉంటుంది. కర్మలను బట్టి మన అనుభవాలు ఉంటాయి.   జ్ఞానేశ్వర్ మహారాజ్ గారు అంటారు 
तो मी पुससी कैसा । तरि जो सर्वभूतीं सदा सरिसा ।
जेथ आपपरु ऐसा । भागु नाहीं ॥ ४०७ ॥
భగవంతుడిని నీవు ఎలాంటి వాడివి అని అడిగితే నేను అన్ని భూతాల పట్ల సమానమైన వాడిని. నాకు నీవు, నేను అన్న భేదం లేదు అంటాడు.
ఆదిశంకరాచార్యులు ఒక దృష్ట్యాంతాన్ని ఉదాహరిస్తారు. విపరీతమైన చలివేస్తున్నప్పుడు కొంతమంది చలిమంట దగ్గర కూర్చుని చలికాచుకుంటున్నారు. ఒక వ్యక్తి దూరంగా నుంచుని నాకు వేడి తగలడం లేదు , అగ్ని చాలా పక్షపాతి అంటాడు. వేడిమి కావాలంటే మంటకు దగ్గరగా కూర్చోవాలి. అలాగే పరమాత్ముడి సాన్నిహిత్యం కావాలంటే,  మనం అతడితో అలాంటి భక్తిని, ప్రేమని పెంపొందించుకోవాలి.
భగవంతుడు తనని నమ్మే వారిని ,నమ్మని వారిని కూడా సమానంగానే చూస్తాడు. ఒక వ్యక్తి అందరికీ రోజూ భోజనాలు పెట్టేవాడు. కాని ఒక నిబంధన మాత్రం ఉండేది. వారు భగవత్ భక్తులై ఉండాలి. ఒకరోజు ఒక నాస్తికుడైన వ్యక్తి అతడి దగ్గరికి భోజనానికి వచ్చి పంక్తిలో కూర్చుంటాడు. అతడు నాస్తికుడని తెలిసి పంక్తిలో నుంచి లేపేస్తారు. అప్పుడు ఆకాశవాణి ఇలా వినిపిస్తుంది. 'ఇతడు నన్ను నమ్మకపోయినా రోజూ ఇతడికి భోజనం సమకూరుస్తున్నాను. ఒక్కరోజు ఇతడికి నువ్వు అన్నం పెట్టలేవా?'. అందరూ సమానులే భగవంతుడికి!

9.30

అపి చేత్సుదురాచారో, భజతే మామనన్యభాక్
సాధురేవ స మన్తవ్యః (స్), సమ్యగ్వ్యవసితో హి సః।।30।।

మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో ఆతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు. అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మఱియొకటి ఏదియును లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు.

9.30 
దురాచారుడైన ఒక వ్యక్తి నన్ను నమ్మి పూజించిన వాడైతే అతడు సాధువు గానే పరిగణింపబడతాడు. అతడు నిశ్చయబుద్ధితో నన్ను నమ్మి పూజిస్తాడు. ఎంత దుష్కృత్యములు చేసినా పశ్చాత్తాపముతో ఇంతటి పాపములు చేసి భగవంతుడికి నా ముఖం ఎలా చూపించను , అన్న భావన కలిగినప్పుడు , అతడు సత్పురుషుడిగా పరిణతి చెందుతాడు.

9.31

క్షిప్రం(మ్) భవతి ధర్మాత్మా, శశ్వచ్ఛాన్తిం(న్) నిగచ్ఛతి
కౌన్తేయ ప్రతిజానీహి, న మే భక్తః(ఫ్) ప్రణశ్యతి।।31।।

కౌంతేయా! అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును. శాశ్వతమైన పరమశాంతిని పొందును. 'నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు' అను విషయమును నిశ్చయముగా ఎఱుంగుము.

9.31 
దుష్కర్మలు చేసిన వారు అయినా సరే ఎప్పుడైతే పశ్చాత్తాప బుద్ధితో పరమాత్ముని శరణు వేడుతారో వారిని భగవంతుడు తప్పక ఉద్ధరిస్తాడు. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ పూర్వకంగా చెప్తున్నాడు. ఇలా భగవంతుని శరణాగతి పొందడం వల్ల వాళ్లు శాశ్వతమైన శాంతిని పొందగలుగుతారు. వాల్మీకి మహర్షి ముందు రత్నాకరుడనే బోయవాడు. అనేక పాపకృత్యాలు చేశాడు. తను చేసినవి దుష్కర్మలని తెలుసుకున్నాక,  నారద మహర్షి వల్ల తారకమైన రామ నామ ఉపదేశం దొరుకుతుంది. రామనామ జపంతో, తపస్సుతో పవిత్రమైన రామాయణ గ్రంథాన్ని వ్రాశాడు. ఏ విధంగా ఒక వైద్యుడు ప్రమాదం వల్ల దెబ్బతిన్న రోగుల్ని ముందుగా ఐసీయూలో నుంచి సత్వరంగా కోరుకునేలా చేస్తాడో, ఆ విధంగానే పరమాత్ముడు దురాత్ములైనా,  క్షమను యాచించి శరణు కోరిన వారిని అత్యంత దయాగుణంతో ఉద్ధరిస్తాడు. జ్ఞానేశ్వర్ మహారాజ్ అంటారు:

यालागीं दुष्कृती जऱ्ही जाहला । तरि अनुतापतीर्थीं न्हाला ।

न्हाऊनि मजआंतु आला । सर्वभावें ॥ ४२०

పాపకృత్యములు చేసిన వారైనా అనుతాపమనే తీర్థంలో స్నానం చేసి, ప్రపత్తి భావంతో పరమాత్ముని చేరిన వారిని ఆయన అక్కున చేర్చుకుంటాడు.

9.32

మాం(మ్) హి పార్థ వ్యపాశ్రిత్య, యే౽పి స్యుః(ఫ్) పాపయోనయః
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః(స్), తే౽పి యాన్తి పరాం(ఙ్) గతిమ్।।32।।

ఓ అర్జునా! స్త్రీ, వైశ్య, శూద్రులును, అట్లే చండాలాదిపాపయోనిజులును నన్ను శరణుపొంది పరమగతినే పొందుదురు

9.32
ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు  పాప యోనులలో జన్మించిన వారైనా, స్త్రీలైనా,  వైశ్యులైన, శూద్రులైన వారు కూడా పరమాత్మ ప్రాప్తికి పాత్రులే అని చెప్పాడు. ఇందులో కొందరు ఒక ప్రశ్నని అడుగుతారు. స్త్రీలు ,వైశ్యులు, శూద్రులు వీరిని తక్కువగా ఎందుకు భగవంతుడు చూపించాడని. ఈ శ్లోకంలో భగవంతుడి భావం ఏమిటంటే, స్త్రీలు గృహ కృత్యాలలో, పిల్లల లాలన పాలనలో భగవంతుడి స్మరణకి, పూజకి సమయం కేటాయించలేరు. అలాగే వైశ్యులు, శూద్రులు వ్యాపార వ్యవసాయాది కష్టతరమైన కృత్యాలలో నిమగ్నమై ఉంటారు. వీరి సేవల వల్లనే ప్రపంచంలో అన్ని కార్యాలు నడుస్తున్నాయి. భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. ఇలాంటి వారు కూడా పరమాత్ముడిని శరణాగతి చేసి, పరమ గతిని పొందడానికి అర్హులని శ్రీకృష్ణుడు చెప్పాడు

9.33

కిం(మ్) పునర్బ్రాహ్మణాః(ఫ్) పుణ్యా, భక్తా రాజర్షయస్తథా
అనిత్యమసుఖం(ల్ఁ) లోకమ్, ఇమ(మ్) ప్రాప్య భజస్వ మామ్।।33।।

ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులును, రాజర్షులును, భక్తులును నన్ను శరణుపొందినచో వారు పరమపదమునుచేరుదురని చెప్పవలసిన పనియేలేదు. ఈ మానవశరీరము క్షణభంగురము. సుఖరహితము. ఐనను దుర్లభము. కనుక దీనిని పొంది - నిరంతరము నన్నే భజింపుము.

9.33
ఇక ఎవరైతే బ్రాహ్మణులై, పుణ్యాత్ములై, భక్తులై, రాజర్షులై ఉన్నారో వారికి పరమాత్మ  ప్రాప్తించడంలో సందేహమే లేదు. క్షణభంగురమై, అశాశ్వతమై, దుఃఖ భూయిష్టమైన ఈ లోకంలో ఉన్న నీవు నిరంతరం నన్నే భజించడం వల్ల నన్ను చేరుకుంటావు. మామూలుగా టాప్ ర్యాంకర్స్ కి అవకాశం దొరుకుతుంది. కాని భగవంతుడు డ్రాప్ అవుట్స్ కి కూడా ఎంతో దయతో, ప్రేమతో అవకాశం ఇస్తున్నాడు. భగవంతుడి మందిర ద్వారాలు అందరికోసం తెరిచే ఉంటాయి. భగవత్ ప్రాప్తికి ఉన్నత కులంలో జన్మించడం, విద్వాంసులై ఉండడం, దానాలు,  యజ్ఞాలు, తపస్సు చేయాల్సిన అవసరం లేదు. శుద్ధమైన అంతఃకరణతో పరమాత్ముని శరణాగతి చేస్తే చాలు.

9.34

మన్మనా భవ మద్భక్తో, మద్యాజీ మాం(న్) నమస్కురు
మామేవైష్యసి యుక్త్వైవమ్, ఆత్మానం(మ్) మత్పరాయణః।।34।।

నా యందే నీ మనస్సును లగ్నము చేయుము. నా భక్తుడవు కమ్ము. నన్నే పూజింపుము. నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి, మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు.

9.34 
ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు భగవంతుని భజించడం అంటే ఏమిటో మరోసారి స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకాన్ని తిరిగి 18 వ అధ్యాయంలో మనం చూస్తాం. నిజానికి ఇందులో పేర్కొన్న ఐదు లక్షణాలు మనం లౌకిక జీవితంలో కూడా ఏ పనైనా చేయాలంటే అవసరం.
నీ మనసును నాయందే సమర్పించు
నాకు భక్తుడివి కమ్ము
నన్ను ఆరాధించే వాడివి కమ్ము
నాకు నమస్కరించు
నన్నే గమ్యంగా ఎంచుకో
ఈ ఐదు తుచ తప్పకుండా చేస్తే నిశ్చయంగా పరమాత్మ ప్రాప్తి జరుగుతుంది.
ఈ వివేచన జ్ఞానేశ్వర మహారాజ్ మరియు గురు ప్రార్ధనతో ముగిసింది. ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభమైంది.

1) చి.అథర్వ
భగవద్గీతలో కొన్ని శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సు లో మరికొన్ని శ్లోకాలు  త్రిష్టుప్ ఛందస్సు లో ఎందుకు ఉన్నాయి?
జవాబు: మనకు వేదవ్యాసుడు చెపుతుండగా గణేశుడు ఈ మహాభారతం రాసాడని తెలుసు. ఏ కవితలోనైనా కవి సందర్భాన్ని అనుసరించి ఛందస్సుని వాడుతాడు. అధ్యాయాల పేర్లు కూడా వాటిలోని విషయాన్ని అనుసరించి ఉన్నాయి. రహస్యమైన విషయాలన్నీ ఉద్భోధించి జీవితాలని ప్రకాశింప చేస్తుంది , కనుక ఈ యోగం పేరు రాజవిద్యా రాజ గుహ్య యోగము. అలాగే అర్జునుడికి కలిగిన విషాదాన్ని గురించి తెలిపే యోగం అర్జున విషాద యోగం.
2) శ్రీమతి మీరా గారు 
ఈ అధ్యాయంలోని 25వ శ్లోకంలో శ్రాద్ధ కర్మల వల్ల పితృదేవతలు తృప్తి చెంది ఆశీర్వదిస్తారని చెప్పారు. కాని వారు తిరిగి జన్మ పొంది వేరే దేహంలో ఉంటే శ్రాద్ధ కర్మలు చేయాల్సిన అవసరం ఉందా?
జవాబు: శ్రద్ధతో చేసేది కనుక దానిని శ్రాద్ధ కర్మ అంటారు. మన జీవిత సోపానంలో ఈ స్థితికి రావడానికి కారణం మన పెద్దలు చేసిన కష్టం. వారు మనకు చేసిన ఉపకారానికి మనం పూర్తిగా వాళ్లకి ఏమీ చేయలేము. శ్రాద్ధ కర్మల ద్వారా ఒక కృతజ్ఞతా భావంతో వారిని తలుచుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల మనం కొంతవరకు పితృ ఋణం తీర్చుకోగలుగుతాం. వారు ఎక్కడ ఉన్నా వారికి మనం చేసే శ్రాద్ధ కర్మలు చెందుతాయి.
3) శ్రీమతి కాంచన గారు 
భగవద్గీత యొక్క వివేచన వినేటప్పుడు ఒక్కొక్కసారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మనసు ఆర్ద్రమైపోతుంది. నా సోదరుడు కొన్ని సంవత్సరాల క్రితం పరమపదించాడు. అతడి వస్తువులన్నీ జ్ఞాపకార్థం భద్రంగా ఉంచాను. భగవద్గీత అభ్యసిస్తున్నపుడు అవన్నీ అవసరమైన వాళ్ళకి ఇచ్చేయాలని అనిపించింది.ఎందుకలా?
జవాబు: . ఇంతకుముందు చెప్పినట్టుగా శ్రాద్ధ కర్మలు చేయడం వల్ల ఆత్మ శాంతి కలుగుతుంది. కాని వారిని తలుచుకుని దుఃఖించడం వల్ల వారికి కూడా చాలా క్షోభ కలుగుతుంది. మన దృష్టి కోణాన్ని మార్చుకోమని భగవద్గీత చెప్తుంది. మీరు ఆ వస్తువులు ఇచ్చేయడం ద్వారా ఆ బంధం నుంచి బయటపడతారు. ఆ ఆత్మకి కూడా కర్మ బంధం నుంచి ముక్తి దొరుకుతుంది. కన్నీరు మన హృదయాన్ని ప్రక్షాళన చేస్తాయి. అర్జునుడు కూడా ఇలాగే విషాదాన్ని అనుభవించాడు. అందులో నుంచి బయటపడడమే భగవద్గీత సారం.
4) శ్రీమతి ఉషా గారు
భగవద్గీతలో భగవంతుని ప్రాప్తి గురించి విన్నప్పుడు భగవంతుని స్మరణ చేయాలని ఉంటుంది. కాని ప్రపంచంలో మన వాళ్ళ గురించి,  వాళ్ల కోసం ఏదైనా చేయడంలో ఉత్సాహం భగవత్సేవలో ఉండదు ఎందుకని?
జవాబు: ఈ దేహం అంటే మనమేనని అనుకుంటాం. ఈ శరీరంలో చేతస్ రూపంలో పరమాత్ముడు ఉన్నంతవరకు మనము ఉంటాం. ఒకసారి ఆ చేతస్సు వెళ్ళిపోతే ఈ దేహానికి అర్థమే ఉండదు. దేహభావన వల్ల మనము మన వాళ్ళుఅన్న భ్రాంతి ఉంటుంది. ఇదే భ్రాంతి యుద్ధం ప్రారంభించేటప్పుడు అర్జునుడికి కలిగింది. అందులో నుంచి అతడిని బయటకు తేవడానికి భగవద్గీత చెప్పాల్సి వచ్చింది. సాధనతో మన బంధువుల మీద ఉన్న ప్రీతిని భగవంతుని వేపుకు మళ్ళించుకోగలగాలి.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం(య్ఁ) యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే రాజవిద్యారాజగుహ్యయోగో నామ నవమో౽ధ్యాయః

ఈ విధముగా ఓం తత్ సత్ అను భగవన్నామ ఉచ్చారణ పూర్వకమైన బ్రహ్మ విద్య మరియు యోగ శాస్త్ర మయమైన, శ్రీకృష్ణార్జునుల సంభాషణ లేక సంవాద రూపములో ఉన్న శ్రీమద్భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయమైన రాజవిద్యారాజగుహ్యయోగము సమాప్తమైనది