विवेचन सारांश
భక్తితో భగవత్ ప్రాప్తి.

ID: 3382
तेलुगू - తెలుగు
శనివారం, 29 జూలై 2023
అధ్యాయము 12: భక్తి యోగము
1/2 (శ్లోకము 1-11)
వివేచకులు: గీతా విశారద డా. ఆశూ గోయెల్ గారు


సాంప్రదాయానుగుణంగా శ్రీకృష్ణ ప్రార్ధన, సరస్వతీ  ప్రార్థన మరియు దీప ప్రజ్వలనముతో కార్యక్రమము ప్రారంభమైనది. శ్రీ ఆశుజీ గోయల్ గారు  శ్రీకృష్ణ  ప్రార్థన మరియు గురు వందనముతో తమ వివేచనని మొదలుపెట్టారు. పరమాత్ముడి అనంతమైన కృపాకటాక్షం వల్ల మనం భగవద్గీత నేర్చుకోగలుగుతున్నాం. దీనిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం.ఏడు వందల శ్లోకాలు కలిగిన ఈ భగవద్గీత చాలా చిన్నది. కాని ఇది మహత్తరమైనది. దీనిని గీతా ప్రెస్ వారు  అగ్గిపెట్టె సైజులో కూడా ముద్రించారు. ఎందరో మహాత్ములు భగవద్గీతలో వారి సమస్యలకు సమాధానం దొరికిందని చెప్పారు. ఏ సంస్కృతి లేదా సాంప్రదాయానికి చెందిన వారైనా భగవద్గీతను ప్రామాణికమైన గ్రంథం గా అంగీకరిస్తారు. భారతదేశంలో విభిన్న సంస్కృతులు సంప్రదాయాలు ఉన్నాయి. కాని అందరూ అంగీకరించినది, ఎవ్వరూ ఖండించనిది, ఆదరంతో అవలంబింపజేసినది భగవద్గీతా. మహాత్మా గాంధీ , వినోబాభావే ,లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మొదలైన వారు దీనిని అపురూప గ్రంథంగా ప్రస్తుతించారు. అంత గొప్పగా ఏముంది దీనిలో ... అని మనం చింతన చేస్తూ ముందుకు వెళ్లేటప్పుడు మనకు అర్థం అవుతుంది. దీనిలో ఏ మతానికి లేదా  కులానికి సంబంధించిన విషయాలు లేవు. దీనిని ముస్లింలు, క్రైస్తవులు లేక ఏ అన్య సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు చదివినా వారికి మార్గ నిర్దేశం జరుగుతుంది. కొంతమందికి ముందుగా మనం 12వ అధ్యాయంతో ఎందుకు భగవద్గీతని ప్రారంభిస్తున్నామన్న సందేహం రావచ్చు. ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చినప్పుడు, 1913 లో ముంబయిలో 'గేట్ వే ఆఫ్ ఇండియా 'ని కట్టారు. దాన్ని భారత దేశంలోకి సముద్రం ద్వారా వాళ్ళు వచ్చినప్పుడు ప్రవేశ మార్గంగా భావించారు. కాని వాళ్లు ఇక్కడ స్థావరాలన్నీ ఏర్పరచుకున్న తర్వాత, విమానాలలో రాకపోకలు  సాగించేటప్పుడు  ఢిల్లీ  వాళ్లకి అనువుగా  అనిపించింది. అక్కడ 1921 లో 'ఇండియా గేట్' ని వాళ్ళు నిర్మించారు. ఢిల్లీ భారతదేశానికి హృదయం లాంటిది. ఢిల్లీని చూస్తే భారతదేశాన్ని చూసినట్టే. అదేవిధంగా గేట్ వే ఆఫ్ ఇండియా ఒకటవ అధ్యాయం అయితే, ఇండియా గేట్ 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయం అన్నిటికన్నా చిన్నది. సరళమైనది ; కాని చాలా ప్రభావవంతమైనది.  గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. జ్ఞాన యోగము ,కర్మయోగము, భక్తి యోగము..  ఈ విధంగా అనేక యోగాలు భగవద్గీతలో చెప్పబడ్డాయి. యోగము.. అంటే కలయిక. భగవద్గీత మనల్ని పరమాత్ముడితో కలుపుతుంది. ఈ భక్తి యోగము భగవద్గీతకు హృదయం లాంటిది. ఒక్కసారి హృదయాన్ని చూస్తే శరీరంలో మిగిలిన అవయవాలను  చూడకున్నా ఫరవాలేదు. ఈ భగవద్గీత అర్జునుడికి శ్రీకృష్ణుడికి జరిగిన 45 నిమిషాల సంభాషణ.  ఇది సరళమైన  ప్రశ్నలు, సమాధానాల రూపంలో సాగుతుంది. దీనిలో   ప్రస్తావించిన వివిధ విషయాలను ఆధారంగా చేసుకుని   మనం సులభంగా  అర్థం చేసుకునే విధంగా వ్యాస మహర్షి  18  అధ్యాయాలుగా విభజించి మనకి అందించారు.
 భగవద్గీత అర్జున విషాద యోగంతో ప్రారంభమవుతుంది. విషాదం అంటే దుఃఖం. విషాదంతో భగవంతుడిని ఎలా చేరగలం అన్న సందేహం వస్తుంది. నిజానికి జీవితంలో ఒక జరగకూడని సంఘటన జరిగినప్పుడు మనకు దైవం గుర్తుకొస్తుంది. అందుకే కుంతీదేవి శ్రీకృష్ణుడిని అడిగింది..
"శ్రీకృష్ణా!  మాకు ఎల్లప్పుడూ కష్టాలనే ప్రసాదించు. అందువల్ల నీ స్మరణ నిత్యము చేస్తూ ఉంటాము." అని. జీవితానికి ఆరంభం విషాదంతోనే అవుతుంది.  బిడ్డ  పుట్టిన వెంటనే ఏడ్చినప్పుడే చుట్టూ ఉన్నవాళ్లు ఆనందిస్తారు. తులసీదాసు తన రామాయణంలో  రామ లక్ష్మణ భరత  శత్రుఘ్నలు పుట్టినప్పుడు, ముగ్గురు  రాణులూ ఎంత ఆనందించారో, అంతః.పురం అంతా ఎంత ఆనంద సందోహంలో మునిగిందో వివరించాడు.
ఒక గజల్లో కవి అన్నాడు.
 "క్రందన్ సే కరుణా ఉపజీ... సంగీత్ బనా శిశురుదన్ సే"
దుఃఖము వలన కరుణ పుట్టింది. శిశురోదనం సంగీతమైంది. దుఃఖంలో ఉన్నప్పుడు మనకు ప్రపంచం మీద ఆసక్తి పోతుంది. ఆ వైరాగ్యం మనలను పరమాత్మునికి దగ్గర చేస్తుంది. అందుకే ఒక హిందీ కవి అన్నాడు ' ఏ దునియా ఏ మెహఫిల్ మేరే కామ్ కి నహి'. ఈ అర్జున విషాద యోగం గేట్ వే ఆఫ్ ఇండియా లాంటిది. భగవద్గీత హృదయం ఇది కాదు. ఈ 12వ అధ్యాయమైన భక్తి యోగం భక్తి గురించి మనకి తెలుపుతుంది. కబీర్ దాస్ ని భక్తి గురించి అడిగినప్పుడు ఆయన ఇలా అన్నారు,  " భక్తి   సుతంత్ర సకల సుఖ ఖానీ. బిను సతసంగ్ న పావహి ప్రానీ".. భక్తి అన్నది  స్వతంత్రమైనది. సకల సుఖాలకు గని వంటిది. కాని సత్సంగంలేక ప్రాణులు దానిని పొందలేరు. భక్తి మార్గం అన్నిటికంటే సులభతరం. ఒక ఐదేళ్ల పిల్లవాడు కూడా భక్తితో కీర్తన  చేయగలడు. చదువు, జ్ఞానము లేని  మానవుడు కూడా నిర్మల హృదయంతో , శ్రద్ధతో పరమాత్ముడిని భజించగలడు. కొంతమంది మాకు సమయం లేదంటారు. మీరు మీ మీ పనులు చేసుకుంటూనే నామస్మరణ చేయవచ్చును. వంట చేస్తూ, ఇంటి పనులు చేస్తూ, కారు నడుపుతూ, కంప్యూటర్ లో పని చేస్తూ కూడా మనసులో నామ జపం చేస్తూ ఉండవచ్చు. తులసీదాసు గారు అంటారు.
भायँ कुभायँ अनख आलस हूँ। नाम जपत मंगल दिसि दसहूँ॥
सुमिरि सो नाम राम गुन गाथा। करउँ नाइ रघुनाथहि माथा।।
మంచి భావంతో లేదా చెడు భావంతో, క్రోధంతో లేదా సోమరితనంతో...  ఏ విధంగా రామనామం జపించినా దశదిశలందు  మంగళం జరుగుతుంది. శ్రీరామచంద్రుని చరణకమలాల పైన శిరస్సు నుంచి ఆయన గుణగానాన్ని చేస్తాను.उल्टा नाम जपत जग जाना, बाल्मीकि भए ब्रह्म समाना  వాల్మీకి రామ నామాన్ని  తిరగేసి పలికినా  కూడా బ్రహ్మత్వాన్ని పొందిన విషయం మనకు తెలుసు. కనుక భక్తికి ఏదీ సాటి రాదు. అన్ని విధములైన యోగాలలో భక్తి మకుటాయమానమైనది. అంతేకాదు సులభతరమైనది కూడా.
నారాయణస్వామి అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. శ్రమణాచారి అని ఒక జ్ఞాని  అతడి మిత్రుడు. ఒకసారి శ్రమణాచారి , నారాయణ స్వామి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. " నేను ఎన్నో శాస్త్రాలు చదివాను ఎంతో జ్ఞానాన్ని  సముపార్జించాను. అయినా నీ లాగా   భక్తి నాకు పట్టు పడలేదు. నాకు భక్తిని ఉపదేశించు". దానికి నారాయణస్వామి "ముందు నీవు కాళ్లు చేతులు కడుక్కుని రా "అన్నాడు. శ్రమణాచారి కాళ్లు కడుక్కుని వచ్చాక అతడికి ఒక చెంబులో నీళ్లు తాగడానికి ఇచ్చాడు. ఆయనకి ఆ సమయంలో దాహం లేదు. కాని నారాయణస్వామి నీళ్లు ఇచ్చాడు కనుక , ఏమీ అనలేక  అందులో సగం తాగి మిగతాది అలాగే ఉంచాడు. తరువాత నారాయణస్వామి మరో చెంబుతో పానకం తీసుకుని వచ్చి, సగం నీళ్లున్న చెంబులో ఆ పానకం పోయసాగాడు. ఇక ఉండ బట్టలేక శ్రమణాచారి    "  అందులో నీళ్లు ఉన్నాయి పానకం  అందులో ఇమడదు.. పానకం రుచే పోతుంది కదా"  అన్నాడు. ఇప్పుడు నారాయణస్వామి నీకు భక్తిలో మొదటి పాఠం వంటబట్టింది. " మనసులో జ్ఞానము ఇంకా ఎన్నెన్నో శాస్త్రాలు ఇవన్నీ నింపుకొని ఉంటే.. భక్తికి చోటు ఉండదు. గుండె నిండా పరమాత్మ నే నింపుకోవాలంటే దాన్ని ముందు ఖాళీగా ఉంచుకోవాలి".  ఒక వనిత అందంగా అలంకరించుకోవాలంటే ముందు పాత అలంకారాలను తీసివేస్తేనే కదా వీలవుతుంది.మనం కూడా గీతని అభ్యసించి, ఆచరించాలంటే అదేవిధంగా మనసుని ఖాళీ చేసి నిర్మలంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మహాభారత యుద్ధం మొదలై 10 రోజులైనాక భీష్మ పితామహుడు ఆయుధాలను విసర్జించి,  బాణశయ్యపై పడుకున్నాడన్న  వార్త ధృతరాష్ట్రుడికి తెలిసింది. సంజయుడిని పిలిచి  మొదటి నుంచి యుద్ధం ఎలా జరిగిందో వివరించమని అడిగాడు. భగవత్ గీత లో మొదటి శ్లోకం ధృతరాష్ట్రుడి   నోటి నుండి వచ్చింది
" ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః।
 మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ।।
ఈ ఒక్క శ్లోకం ధృతరాష్ట్రుడు చెప్పాడు. సంజయుడు 41 శ్లోకాలని, అర్జునుడు 84 శ్లోకాలని, శ్రీకృష్ణ పరమాత్మ 574 శ్లోకాలని  చెప్పారు. వ్యాస విరచితమైన మహాభారత గ్రంథం  ప్రపంచంలోనే పెద్ద గ్రంథం.  ఇందులోని 18 పర్వాలలో లక్ష శ్లోకాలను కలిగి ఉంది. భీష్మ పర్వంలో  25 నుంచి 42 వ అధ్యాయం వరకు భగవద్గీత లో 700 శ్లోకాలు ఉన్నాయి. అర్జునుడిని  మాధ్యమంగా చేసుకుని పరమాత్ముడు మన  జీవితానికి ఒసగిన పాథేయమే భగవద్గీత. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడి వయసు 84  సంవత్సరాలు, శ్రీకృష్ణుడి వయసు 87  సంవత్సరాలని శాస్త్రాలలో చెప్పబడింది. అర్జునుడు మహాయోధుడు. విశ్వాన్ని తన పరాక్రమంతో జయించినటువంటి వీరుడు. యుధిష్ఠురుడు రాజసూయ యాగం చేసినప్పుడు, తన ముగ్గురు తమ్ముళ్లు తెచ్చిన ధనం కన్నా మూడు రెట్లు ఎక్కువ ధనాన్ని ఆయన సమకూర్చి తెచ్చాడు. అందుకే ఆయనకు  'ధనంజయుడు' అని  పేరు వచ్చింది. ఆయన తన  తపస్సు వల్ల  సశరీరంగా స్వర్గానికి వెళ్ళగలిగాడు. ఇంద్రుడు ఊర్వశిని అతడి సపర్యలకై వినియోగించాడు. ఊర్వశి తనకు మాతృ సమానురాలైనందున ఆమె పొందును అతడు నిరాకరించాడు. అందుకు ఆమె ఆగ్రహించి "ఒక సంవత్సరం నపుంసకుడవు కమ్మని" శపించింది.  అందుకే  అజ్ఞాతవాస సమయంలో విరాటనగరంలో అతడు   ఒక సంవత్సరం నపుంసకుడిగా ( నాట్యాచార్యుడు) గడిపాడు. విరాట  నగరం మీదకు  గోగ్రహణానికై వచ్చిన కౌరవుల  మొత్తం సైన్యాన్ని ఒక్కడే తన సమ్మోహనాస్త్రంతో  నిలువరించగలిగిన మహావీరుడతను. పరమశివుని కోసం తపస్సు చేసి మల్ల యుద్ధంలో ఆయనని  మల్లికార్జునుడిగా ప్రసన్నం చేసుకుని, దివ్యాస్త్రాలను పొందిన ఘనుడతడు. ఇంతటి వీరుడు, శీలవంతుడైన అర్జునుడు  మహాభారత యుద్ధంలో తన ప్రియతమ గురువైన ద్రోణాచార్యుడిని, ప్రేమతో తనని పాలించిన తాత అయిన భీష్మాచార్యుడిని  చూసి మోహితుడయ్యాడు. ఎందుకంటే మహాభారత యుద్ధంలో జయం పొందాలంటే వీరితో  పోరాడి, వధించాల్సిన అవసరం ఉంది. అది  అర్జునుడి విషాదానికి కారణమైంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి సఖుడు. ఒక రెండు మాటలు చెప్పి వెన్ను తట్టి ఉండినా అర్జునుడు యుద్ధం చేసేవాడే. కాని పరమాత్ముడికి అర్జునుడిని నిమిత్తం గా చేసుకుని మనందరికీ   గీతా జ్ఞానాన్ని  పంచాలన్న కరుణ! ఆయన అనుగ్రహం ఉంటే తప్ప మనకు భగవద్గీత చదవాలని,  అభ్యసించాలని, ఆచరించాలని బుద్ధి పుట్టదు. అందుకే మన పూర్వ పుణ్యం వలన లభించిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మహర్షి వేదవ్యాసుడు స్వయంగా గీతను గురించి ఇలా అన్నాడు. 
గీతా సుగీతా కర్తవ్యా కిమాన్యేః శాస్త్రవిస్తరైః।
 యస్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిః స్రుతా।।" 
స్వయంగా పద్మనాభుడైన శ్రీకృష్ణుడి ముఖపద్మం నుండి వెలువడిన ఈ గీత  సర్వశాస్త్రములలోను గొప్పది. దీనిని అంతఃకరణతో అర్థం చేసుకుని  ఆచరించడం మన కర్తవ్యం. గీతని అభ్యసించడానికి పరమాత్ముడు మనల్ని ఎంచుకున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భక్తి యోగంలో మొదటి శ్లోకాన్ని పరిశీలిస్తాం.

12.1

అర్జున ఉవాచ
ఏవం(మ్) సతతయుక్తా యే,భక్తాస్త్వాం(మ్) పర్యుపాసతే৷
యేచాప్యక్షరమవ్యక్తం(న్),తేషాం(ఙ్)కే యోగవిత్తమాః৷৷1॥

అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! అనన్యభక్తితో పూర్వోక్తరీతిగా నిరంతరము నిన్నే భజించుచు, ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సగుణరూపమును ఆరాధించువారును, కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘననిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించువారును కలరు. ఈ రెండువిధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విదులెవరు?

12.1 
12వ అధ్యాయం అర్జునుడి ప్రశ్నతో ప్రారంభమైంది. అర్జునుడు పరమాత్ముడిని నిన్ను  సగుణ సాకార రూపంలో కొలిచే భక్తులు గొప్పవారా..  లేక.. నిర్గుణ నిరాకార రూపంలో కొలిచే భక్తులు గొప్పవారా.... అని అడిగాడు.  ఈ  ప్రశ్నని మరొక రకంగా విశ్లేషిస్తే  భక్తి మార్గం గొప్పదా జ్ఞానమార్గం గొప్పదా అని అడిగాడు. ఇదే ప్రశ్నని రామాయణంలో అరణ్యకాండలో లక్ష్మణుడు శ్రీరామచంద్రుడిని అడిగాడు. అప్పుడు లక్ష్మణుడికి రామచంద్రుడు ఏ జవాబు చెప్పాడో అదే జవాబుని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ప్రశ్న అదే.. జవాబు కూడా అదే. శ్రీకృష్ణ పరమాత్ముడు గొప్ప ఉపన్యాసకుడు. అందుకే రెండవ శ్లోకంలో అర్జునుడి ప్రశ్నకి సూటిగా క్లుప్తంగా జవాబు చెప్పాడు. తర్వాత మూడు నుంచి ఇరవయ్యవ శ్లోకం దాకా   విశదంగా వివరించి చెప్పాడు.

12.2

శ్రీ భగవానువాచ
మయ్యావేశ్య మనో యే మాం(న్), నిత్యయుక్తా ఉపాసతే꠰
శ్రద్ధయా పరయోపేతాః(స్), తే మే యుక్తతమా మతాః৷৷2॥

శ్రీ భగవానుడు ఇట్లనెను - పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై, నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై, అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణరూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు - అని నా అభిప్రాయము.

12.2 
శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు. నాలో మనసు నిలిపి నిత్య యుక్తులై పరమ శ్రద్ధతో కూడి ఎవరు నన్ను ఉపాసిస్తారో వాళ్ళు యోగులలో శ్రేష్టులని  నా అభిప్రాయం. భక్తి మార్గమే శ్రేష్టమైనదని పరమాత్ముడు ఈ విధంగా తెలిపాడు. మందులు  అమ్మే దుకాణం లోఎన్నో రకాల మందులు ఉంటాయి. వాటిలో మనకు ఏది  సరైనది అని తెలుసుకోవాలి. గీతలో అనేక యోగ మార్గాలని పరమాత్ముడు ఉపదేశించాడు. అర్జునుడిని మాధ్యమంగా చేసుకుని విశ్వకళ్యాణం కోసం తనను చేరే వివిధ మార్గాలని ఉపదేశించడమే పరమాత్ముడి లక్ష్యం.  అలాగని భగవంతుడు జ్ఞానమార్గాన్ని ఉపేక్షించాడని అనుకోవద్దు. తర్వాతి శ్లోకాలలో మనం ఈ జ్ఞానమార్గాన్ని గురించి తెలుసుకుంటాము. భక్తి ఎంత గొప్పదో ఇంతకుముందే భూమిక లో మనం చెప్పుకున్నాము. నవవిధ భక్తులు  శాస్త్రాలలో వివరించబడ్డాయి.  వాటిని గురించి వాటిని ఆచరించి తరించిన  భక్తులతో సహా తెలుసుకుందాం.  శ్రవణం.. పరీక్షిత్ మహారాజు, కీర్తనము..  శుక మహర్షి, స్మరణము..  ప్రహ్లాదుడు, పాద సేవనము... శ్రీలక్ష్మి, అర్చనము..పృథు చక్రవర్తి, వందనము.. అక్రూరుడు, దాస్యము... హనుమంతుడు, సఖ్యము.. అర్జునుడు, ఆత్మ నివేదన.. బలి చక్రవర్తి. భగవంతుడు ఇక్కడ శ్రద్ధతో తనని మనసులో నిలుపుకుని  ఉపాసించడం భక్తి అని చెప్పాడు. శిఖలు ధరించి, తిలకాలు ధరించి, ఆచారాలు పాటించడం మాత్రమే భక్తి కాదు.  ఈ నవ విధమైన భక్తి  మార్గాలలో  ఏది ఎంచుకున్నా అది మనల్ని పరమాత్మ  సాన్నిధ్యానికి తీసుకు వెళుతుంది

12.3

యే త్వక్షరమనిర్దేశ్యమ్,అవ్యక్తం(మ్) పర్యుపాసతే꠰
సర్వత్రగమచిన్త్యం(ఞ్)చ, కూటస్థమచలం(న్) ధ్రువమ్꠱3॥

కాని ఏ పురుషులు అనిర్వచనీయమైన స్వరూపముగలవాడును, నిరాకారుడును , సర్వవ్యాపియైనవాడును, మనస్సుకు బుద్ధికి గోచరము గానివాడును, సర్వదా ఒకే స్థితిలో ఉండువాడును, నిశ్చలుడును, నిత్యుడును, శాశ్వతుడైన సచ్చిదానందఘనబ్రహ్మను ఏకీభావముతో ఉపాసింతురో…

12.3 
భక్తి మార్గమే గొప్పదని పరమాత్ముడు చెప్పడం వల్ల అర్జునుడికి భగవంతుడు జ్ఞానమార్గాన్ని ఉపేక్షిస్తున్నాడా అన్న సందేహం వచ్చింది. మీలో కూడా ఈ సందేహం వచ్చి ఉండవచ్చు. ఈ మూడు,నాలుగు శ్లోకాలలో జ్ఞాన మార్గం యొక్క విశిష్టతను గురించి పరమాత్ముడు క్లుప్తంగా వివరించాడు.

12.4

సన్నియమ్యేన్ద్రియగ్రామం(మ్), సర్వత్ర సమబుద్ధయః꠰
తే ప్రాప్నువన్తి మామేవ, సర్వభూతహితే రతాః꠱4॥

(ఏ పురుషులు) ఇంద్రియ సముదాయమును పూర్తిగా వశపఱచుకొని, అన్నిటియందును సమభావముగలవారై, సకల ప్రాణులకును హితముచేయగోరువారుగా ఉంటారో, వారు (యోగులు) నన్నే పొందుదురు.

12.4 
నిరాకార నిర్గుణ పరబ్రహ్మ యొక్క ఎనిమిది లక్షణాలని పరమాత్ముడు ఇలా వివరించాడు
అచింత్యం..అంటే చింతించడానికి వీలుకానిది.  దానిని గురించి మన  బుద్ధి ఊహించను కూడా ఊహించలేదు.
అక్షరం ...అంటే క్షరము కానిది. నాశనము లేనిది.
అనిర్దేశ్యం...  ఎదురుగా ఉన్న వస్తువుల లక్షణాలతో కూడిన దానిని నిర్దేశించి చూపవచ్చు. నిర్గుణ నిరాకార బ్రహ్మాన్ని అలా నిర్దేశించడానికి వీలు లేదు.
అవ్యక్తం.. వ్యక్తం కానిది.  ఇంద్రియాలకి గోచరం కానిది.
సర్వత్రగం.... అన్నిటా  వ్యాపించినది.
కూటస్థం... ఒకే చోట ఉండేది. పరిణామం  చెందనిది.
కంసాలి ఉపయోగించే కొలిమిని మనం చూసి ఉంటాము. దానిమీద ఇనుమును పెట్టి,  కొట్టడం వల్ల రకరకాల ఆకారాలను  కల్పిస్తారు. కాని  కొలిమి మాత్రం అలాగే ఉంటుంది.  పదిహేను నుంచి ఇరవై తరాల దాకా ఆ కొలిమినే వాళ్లు ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా పరమాత్మ కూడా ఏ రకమైన మార్పును చెందని వాడై ఉంటాడు.
అచలం... చలించనిది. సర్వత్రా వ్యాపించినప్పుడు, చలించడం ఎలాగ?
ధృవం... స్థిరమైనది. ఎల్లప్పుడూ ఉండేది.
ఇటువంటి గుణములు గల నిరాకార వరబ్రహ్మను  ఇంద్రియ సముదాయాన్ని నిగ్రహించి, అన్ని భూతముల పట్ల  సమ బుద్ధి కలిగిన వారై, అన్ని ప్రాణుల లోనూ పరమాత్ముడినే దర్శిస్తూ, విశ్వ కళ్యాణాన్ని కోరుకునే యోగులు తప్పక పరమాత్ముడినే చేరుతారు. ఇటువంటి మహత్తర జ్ఞానులు ' అహం బ్రహ్మోస్మి'.. 'తత్వ మసి'.. అన్న సిద్ధాంతాలను  నమ్మి ఆచరించే వారై ఉంటారు. కాని పరమాత్ముడు భక్తి మార్గాన్నే ఎందుకు  ముందుగా చెప్పాడు..  అన్న సందేహం వస్తుంది. దీనికి జవాబు ఐదవ శ్లోకంలో పరమాత్ముడు చెప్పాడు.

12.5

క్లేశో౽ధికతరస్తేషామ్,అవ్యక్తాసక్తచేతసామ్꠰
అవ్యక్తా హి గతిర్దుఃఖం(న్), దేహవద్భిరవాప్యతే꠱5॥

కాని సచ్చిదానందఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్తచిత్తులైనవారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతోగూడినది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్తపరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే.

12.5 
నిరాకార నిర్గుణ సచ్చిదానంద పరబ్రహ్మని  ఉపాసించడం  క్లిష్టతరమైనది. సాధకులు అందరూ దేహం ఉన్నవాళ్లే. కాని దేహాన్ని, దేహం చూసే ప్రపంచాన్ని తిరస్కరించి నిరాకారాన్ని చేరడం చాలా కష్టం. మన ఉనికిని ఈ శరీరమే అనుకుంటాం మనం. పుట్టిన క్షణం నుంచి ఈ శరీరం రకరకాల పరిణామాలకు లోనవుతూ ఉంటుంది. మనకి ఐదేళ్లప్పుడు, పదేళ్లప్పుడు,ఇరవై ఏళ్లప్పుడు ,నలభై ఏళ్లప్పుడు  మన శరీరం  ఒకే  లాగా లేదు.కాని శరీరంలో ఉన్న 'నేను' మాత్రం అలాగే ఉంది! ముందు స్కూల్లో మనం గ్రూప్ ఫోటో తీసుకునేవాళ్ళం. నలభై  ఏళ్ల తర్వాత మన స్నేహితుడి దగ్గర మనం ఆ ఫోటో చూశామనుకోండి. అందులో మనల్ని గుర్తుపట్టడమే కొంచెం కష్టం అవుతుంది. మనం మన అస్తిత్వంగా భావించే ఈ శరీరం ఇంతగా పరిణామం చెందుతూ ఉంటుంది. ఈ విధమైన దేహాభిమానం కలిగిన మానవులు అచింత్యమూ, అవ్యక్తమూ అయిన నిరాకార పరబ్రహ్మని  ఉపాసించడం చాలా కష్టం.

12.6

యే తు సర్వాణి కర్మాణి, మయి సన్న్యస్య మత్పరాః꠰
అనన్యేనైవ యోగేన, మాం(న్) ధ్యాయన్త ఉపాసతే꠱6॥

కాని మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటిని నాయందే అర్పించి, సగుణపరమేశ్వరరూపమునే అనన్యభక్తియోగముతో సతతము చింతన చేయుచు భజించుచుందురో.........

12.6 
ఈ శ్లోకంలో పరమాత్ముడు ' మామ్  ధ్యాయంత ఉపాసతే' అంటున్నాడు. భగవద్గీతలో ఎక్కడ 'మామ్ 'అన్న శబ్దం వస్తుందో అది పరమాత్ముడు తననే ఉద్దేశిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. వేదవ్యాస మహర్షి మహాభారతంలో శ్రీకృష్ణుడితో ఇతరుల సంభాషణ జరిగేటప్పుడు  పలుచోట్ల ' కేశవ ఉవాచ',  'వాసుదేవ ఉవాచ'.. ఇలా చెప్పాడు. కాని ఈ భగవద్గీతలో మాత్రం..' శ్రీ భగవానువాచ 'అనే అన్నాడు. శ్రీకృష్ణుడంటే పరమాత్ముడే. కొంతమంది నేను శ్రీరాముడినే నమ్ముతాను మరి  భగవద్గీత శ్రీకృష్ణుడు  చెప్పినది కదా.. అనేవారు ఉన్నారు. శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని ,శివుడిని, దుర్గని, హనుమంతుడిని , వినాయకుడిని ఎవరిని పూజించినా అంతా ఒక పరమాత్మ రూపమే అని అర్థం చేసుకోవాలి. ఏ రకమైన పేరుతో పిలిచినా పరమాత్ముడు ఒక్కడే. మనకు ఒక వ్యక్తి పేరు తెలిస్తే ఆ పేరుతో పిలుస్తాము. పేరు తెలియకపోతే నీలి చొక్కా వ్యక్తి అనో, తిలకం ధరించిన వ్యక్తి అనో, కళ్పద్దాల మనిషి అనో పిలుస్తాము. కాని మనిషి మాత్రం ఒక్కడే కదా... అతను మారడు. సచ్చిదానంద పరమాత్మ ఏ పేరుతో పిలిచినా ఒక్కడే.  సమస్త విశ్వాన్ని తన క్రీడా మైదానంగా చేసుకుని,  అనేక దేశాలలో అనేక పేర్లతో పిలవబడే  సచ్చిదానంద పరబ్రహ్మ పరమాత్మ ఒక్కడే.

12.7

తేషామహం(మ్) సముద్ధర్తా, మృత్యుసంసారసాగరాత్꠰
భవామి నచిరాత్పార్థ, మయ్యావేశితచేతసామ్꠱7॥

ఓ అర్జునా నాయందే లగ్నమనస్కులైన అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగనే మృత్యురూపసంసారసాగరము నుండి ఉద్ధరించెదను.

12.7 
కర్మలన్నింటినీ పరమాత్ముడికి అర్పించి, ఆయనే లక్ష్యంగా పెట్టుకుని, అనన్య భక్తితో ఎవరైతే ఉపాసిస్తారో  వారిని నేను మృత్యుస్వరూపమైన సంసార సాగరం నుంచి రక్షిస్తాను... అని పరమాత్ముడు అభయమిస్తున్నాడు.
" పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం"... అనే ఈ విషమ చక్రం నుంచి  ఇటువంటి భక్తులని కాపాడుతాడు.

12.8

మయ్యేవ మన ఆధత్స్వ, మయి బుద్ధిం(న్) నివేశయ꠰
నివసిష్యసి మయ్యేవ, అత ఊర్ధ్వం(న్) న సంశయః꠱8॥

నాయందే మనస్సు నిలుపుము. నాయందే బుద్ధిని లగ్నముచేయుము. పిమ్మట నాయందే స్థిరముగా నుందువు. ఇందు ఏ మాత్రమూ సందేహమునకు తావులేదు.

12.8
పరమాత్ముడు అంటున్నాడు... మనసుని నాలోనే నిలుపు. బుద్ధిని నాలోనే ఉంచు. ఆ తరువాత ( శరీరాన్ని త్యజించిన తర్వాత)  నిస్సంశయంగా నువ్వు నాలోనే నివసిస్తావు.

12.9

అథ చిత్తం(మ్) సమాధాతుం(న్),న శక్నోషి మయి స్థిరమ్।
అభ్యాసయోగేన తతో, మామిచ్ఛాప్తుం(న్) ధనఞ్జయ॥9॥

మనస్సును సుస్థిరముగా నాయందే నిల్పుటకు సమర్థుడవు కానిచో అర్జునా! అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము.

12.9 
మనసును ,బుద్ధిని భగవంతునికి ఎలా అర్పించాలి... అది ఎలా సాధ్యమవుతుంది.. అన్న సందేహం అర్జునుడికి కలుగుతుందని తెలిసి పరమాత్ముడు అంటున్నాడు
"ధనంజయా! ఇక స్థిరంగా నాలో చిత్తాన్ని నిలప లేకపోయినట్లయితే అప్పుడు అభ్యాస యోగం చేత నన్ను పొందడానికి ప్రయత్నించు".  పరమ భాగవతులైన రామ  సుఖ లాల్ జి అంటారు." హే ప్ర్రభూ! నిన్ను ఎప్పుడూ మరిచిపోని వరం ఇవ్వు!  సదా నా హృదయంలో నీ  స్మరణ ఉండే విధంగా అనుగ్రహించు".  కబీర్ దాస్ గారు అంటారు..
राम नाम रटते रहो, जब तक घट में प्राण,
कभी तो दीनदयाल के भनक पड़ेगी कान।

ప్రాణం ఉండేదాకా రామ నామాన్ని జపిస్తూ ఉండు. ఎప్పుడో ఒకప్పుడు ఆ దీన జన బాంధవుడికి నీ జపం చెవిన పడుతుంది. తులసీ దాస్ గారు అంటారు.
तुलसी मेरे राम को, रीझ भजो या खीज। 
भौम पड़ा जामे सभी, उल्टा सीधा बीज॥
ఏదో విధంగా రామనామ జపం చెయ్యి. ఫలితం దానంతట అదే వస్తుంది. విత్తనాలను నేరుగా నాటినా,  తలక్రిందులుగా నాటినా మొలకలు రానే వస్తాయి.
 స్తోత్ర పఠనం ,పారాయణం , జపం, మానసిక పూజ, ధ్యానం ఇలా ఏదో ఒక అభ్యాసం ద్వారా  భగవంతుడి మీద ఏకాగ్రత సంపాదించుకోగలగాలి. శ్రీకృష్ణుడు అర్జునుడి  సఖుడు కనుక  ఒకవేళ  అభ్యాసం కుదరకపోతే .. అతడికి ఇంకా కొన్ని మార్గాలని ఉపదేశిస్తున్నాడు.

12.10

అభ్యాసే౽ప్యసమర్థో౽సి, మత్కర్మపరమో భవ꠰
మదర్థమపి కర్మాణి,కుర్వన్సిద్ధిమవాప్స్యసి৷৷10॥

అభ్యాసముచేయుటకును అశక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించుటద్వారాకూడ నన్నే పొందెదవు.

12.10 
అభ్యాసం కూడా నీవు చేయలేకపోతే నా పరమైన కర్మలలో నిమగ్నమవు. నా కోసమే కర్మలను చేసినప్పుడు నువ్వు సిద్ధిని పొందుతావు. మనకు నిర్దేశింపబడిన కర్మలన్నిటినీ, భగవంతుడు మనకు అనుగ్రహించిన కర్తవ్యాలుగా భావించి, పరమాత్ముడి కోసమే చేస్తున్నామన్న పవిత్ర భావంతో  నిర్వర్తించడం కూడా పరమాత్ముని పూజగా భావించబడుతుంది.

12.11

అథైతదప్యశక్తో౽సి, కర్తుం(మ్) మద్యోగమాశ్రితః।
సర్వకర్మఫలత్యాగం(న్), తతః(ఖ్)కురు యతాత్మవాన్॥11॥

మత్ప్రాప్తికై వలయు యోగమునాశ్రయించి సాధన చేయుటకును నీవు అశక్తుడవైనచో మనోబుద్ధీంద్రియాదులను వశమునందు ఉంచుకొని, సకల కర్మఫలములను త్యజింపుము.

12.11 
నాకోసం కర్మలు ఆచరించడానికి కూడా నువ్వు అసమర్థుడివైతే, నీకోసం చేసుకున్న కర్మలన్నీ, మనస్సును, బుద్ధిని నిగ్రహించి వివేకంతో నాకు సమర్పించి, ఆ కర్మల ఫలాన్ని త్యజించు.
करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है
मेरा आपकी कृपा से मेरा काम हो रहा है।
చేస్తున్నది నేనే  అయినా.. చేయించేవాడు పరమాత్ముడే అన్న దృఢభావంతో కర్మలని చేయాలి. 'భగవంతుడి చేతిలో నేను ఒక పనిముట్టును 'అని భావించాలి. కర్మ ఫలాలను  త్యజించడం అంటే అవి భగవంతుడికి అర్పించడం.
తర్వాత శ్లోకాలలో పరమాత్ముడు భక్తుడికి   ఉండవలసిన 39 లక్షణాలని చెప్పాడు.  వాటిని తరువాతి  వారంలో తెలుసుకుందాం. హరినామ సంకీర్తనముతో సత్రం ముగిసింది. ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలయ్యింది.
 ప్రశ్న: పుష్పికలో బ్రహ్మవిద్య.. అని వస్తుంది కదా! బ్రహ్మవిద్య అంటే ఏమిటి?
జవాబు:  బ్రహ్మ విద్య అంటే విద్యలన్నిటిలోకి శ్రేష్టమైనది.  బ్రహ్మ తత్వాన్ని గురించి తెలిపే విద్య బ్రహ్మ విద్య. భగవద్గీతలో ఈ బ్రహ్మ తత్వాన్ని చేరడానికి ఎన్నో మార్గాలు చెప్పబడ్డాయి. మనం ఏ మార్గంలో వెళ్తామన్న దానికి పరమాత్ముడు ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఢిల్లీకి వెళ్లాలంటే బస్సులో  అయినా వెళ్లొచ్చు , రైల్లో  అయినా వెళ్లొచ్చు, విమానంలోనైనా వెళ్లొచ్చు. ఢిల్లీ చేరడం ముఖ్యం. అదేవిధంగా పరమాత్ముడి ప్రాప్తి ముఖ్యం. జ్ఞానయోగం కావచ్చు, కర్మయోగం కావచ్చు లేదా భక్తి యోగం కావచ్చు.
ప్రశ్న:  విగ్రహారాధన ఎందుకు; ఎంతవరకు చేయాలి?
జవాబు:  దేహభావం  ఉన్నంతవరకు, సాకార రూపంలో పరమాత్ముని ధ్యేయంగా ఉంచుకొని ఆరాధించడం మంచిది.
ప్రశ్న:  భగవంతుడిని కోరికలు కోరవచ్చా?  ఆ విధంగా కోరడం మంచిదా కాదా?
జవాబు:  తల్లిదండ్రులని పిల్లలు ఏమైనా అడుగుతారు. వారు వారి పిల్లలకి ఇస్తారు.  భగవంతుడిని కోరికలు కోరడం తప్పు కాదు. సకామ భక్తులను కూడా భగవంతుడు ఆదరిస్తాడు. మొదట్లో భగవంతుడితో సంబంధం పెట్టుకోవడానికి అవి ఉపకరిస్తాయి. ఏడవ అధ్యాయంలో భగవంతుడు నాలుగు విధములైన భక్తులను గురించి చెప్తాడు
చతుర్విధ భజన్తే మాం జనా స్సుకృతి నోర్జున।
ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ !।।
ఇందులో  అర్థార్థులైన భక్తులు.. కోరికలు కోరే వారై ఉంటారు. కాని ఈ కోరికల నుంచి,  కేవలం భగవంతుడినే.. కోరే స్థాయికి మనం ఎదగాలి.
ప్రశ్న:  చెడ్డ పనులు చేసే వాళ్ళు...  ఆ పనులు చేసే బుద్ధి దేవుడే వాళ్ళకు ఇచ్చాడని అంటారు. ఇది ఎంత వరకు సమంజసం?
జవాబు:  విద్యుచ్ఛక్తిని మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. మంచికైనా చెడుకైనా. అన్నీ పరమాత్మ శక్తి వల్లే జరుగుతాయి. కాని ఆ శక్తిని సరిగ్గా ఉపయోగించుకునే బుద్ధి మనుషులకి దేవుడు ఇచ్చాడు. మంచి ఏదో, చెడేదో తెలుసుకునే విచక్షణా శక్తిని మనం ఉపయోగించకుండా దేవుడి  మీద నెపం వేయడం తప్పు.
ప్రశ్న:  మనసుతో ,బుద్ధితో దేవుడిని ఎలా  స్మరించాలి?
జవాబు:  నవవిధభక్తి మార్గాలలో ఏదైనా ఎంచుకోవచ్చు.  శ్రద్ధా భక్తులతో  ఏ మార్గాన్ని అనుసరించినా  పరమాత్ముడిని చేరుకోవచ్చు.
ప్రార్థన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణంతో సత్రం ముగిసింది