विवेचन सारांश
భక్తియోగం భగవత్ప్రాప్తికి అనుకూలం

ID: 3701
तेलुगू - తెలుగు
శనివారం, 23 సెప్టెంబర్ 2023
అధ్యాయము 12: భక్తి యోగము
1/2 (శ్లోకము 1-9)
వివేచకులు: గీతావిశారద డా. సంజయ్ మాల్పాణి గారు


ప్రారంభ ప్రార్థన, దీప ప్రజ్వలన తర్వాత 12వ అధ్యాయమగు భక్తియోగ పూర్వార్థ వివేచనను గీతా విశారద్ మరియు గీతా పరివార్ రాష్ట్రీయ కార్యాధ్యక్షులు, ఆదరణీయ డాక్టర్ సంజయ్ జీ మల్పాని గారు సద్గురు స్మరణతో ప్రారంభించారు. భక్తి యోగాధ్యాయ చింతన చేయడానికి ఉపస్థితులైనట్టి వివేచకులు, ప్రతి స్థాయిలో కొన్ని అధ్యాయాలను సాధకులు నిత్యం అభ్యాసం చేస్తారని, తాను కూడ సాధకుడనేనని, ప్రతి దినం భగవద్గీతను అధ్యయనం చేసి, అర్థం చేసుకొని, జీవితంలో అన్వయించుకునే ప్రయత్నం చేస్తానని తెలిపారు. వారు 48 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు, సద్గురువులు శ్రీ గోవింద్ దేవ్ గిరి మహారాజ్ గారు భగవద్గీతను కంఠస్థం చేయుటకు మార్గనిర్దేశం చేశారు. అప్పుడు వారికి ఎలాంటి శిక్షణా సౌలభ్యం లేదు. రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఇతర సంస్కృత అధ్యాపకులు మరియు ఆదరణీయ సువర్ణ కాకీజీ గారి ద్వారా ఉచ్ఛారణ నియమాలను నేర్చుకుని, భగవద్గీతను కంఠస్థీకరణ చేశారు. ప్రారంభంలోనే ఐదు మార్లు భగవద్గీతపై ప్రవచనాలు చేసే అవకాశం దక్కింది. 12 మరియు 15 అధ్యాయాలలో పేర్కొన్న జీవన మూల్యాలను అభ్యాసకుల వద్దకు తీసుకెళ్లడం ముఖ్యమని వారు తలచినారు. స్వయంగా వ్యవస్థాపన మరియు మార్కెటింగ్ విభాగాలలో చదివిన పుస్తకాలు మరియు శిక్షణా కార్యక్రమాలలోని సారమంతా భగవద్గీతలో కలదని వారు గ్రహించినారు. తమ విద్యాలయాల నిర్వహణ చేస్తూ, మేనేజ్మెంట్ విభాగంలో డాక్టరేట్ పట్టాను కూడ పొందినారు. జీవన మార్గదర్శక విషయాలలో భగవద్గీత అత్యుత్తమ మనోవైజ్ఞానిక గ్రంథంగా వారికి అర్థమైనది. పాశ్చాత్య మానసిక శాస్త్రగ్రంధాల పరిజ్ఞానం జీవితం విచ్ఛిన్నం అయ్యాక, విశ్లేషణకు మాత్రమే పనికొస్తుంది. కాని భగవద్గీత జీవిత పతనానికి పూర్వమే ఆలంబనగా నిలుస్తుంది. మనం వాహనాలను నిర్దిష్ట కాల పరిమితిలో, ఆగిపోకుండా ఉండడానికి మరమ్మత్తులు చేస్తాం. భగవద్గీత కూడ సాధకులు నిర్వీర్యులు కాకుండా సకాలంలో పునరుజ్జీవులను చేస్తుంది. అర్జునుడిలా మన మనస్సు విషాదానికి గురి కాకుండా, ముందస్తుగానే కాపాడుతుంది. స్వయం నియంత్రణ శాస్త్రానికి భగవద్గీత సుందర ఉదాహరణ. వివేచకులు ఇప్పటికీ ప్రతి వివేచనలో కొత్త కొత్త విషయాలను గ్రహిస్తారు, తమను తాము భాగ్యశీలిగా భావిస్తారు. గీతా ప్రయాణం ద్వారా తన జీవితంలో పరివర్తన కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు. బుద్ధిమంతులకు మరియు అల్పబుద్ధి గలవారికి కూడ భగవద్గీతలో పరిష్కారాలు లభిస్తాయి. భగవద్గీత జ్ఞానయోగాన్ని, కర్మయోగాన్ని, భక్తియోగాన్ని సాధకుల యోగ్యతను బట్టి ప్రసాదిస్తుంది. అన్ని మార్గాలు ఒకే గమ్యాన్ని చేర్చుతాయి. గంగాతీరంలో ఉన్న ఒక మిత్రుడు గంగానదిని ఎలా దాటాలో చెప్పవలసిందిగా కోరుతాడు. ఆ ప్రశ్న అసంపూర్ణంగా తోస్తుంది. సలహా ఇవ్వడానికి వారు గంగోత్రి, రిషికేష్, హరిద్వార్, త్రివేణి సంగమం, వారణాసి లోని ఏ గంగాతీరంలో ఉన్నారో తెలియదు. ప్రదేశం తెలిస్తే గాని ఎలా గంగానది ఆవలి ఒడ్డుకు పోవాలో సూచించవచ్చును. అదే విధంగా సాధకుడు ఏ స్థాయిలో ఉన్నారన్న విషయాన్ని బట్టి, భక్తియోగం, జ్ఞాన యోగం లేదా కర్మయోగాన్ని అనుసరించాలన్నది నిర్ధారించబడుతుంది. భక్తియోగ చింతన చేసినప్పుడు, అది సరళమైనదిగా, సర్వశ్రేష్టమైనదిగా అగుపడుతుంది. అర్జునుడి ప్రశ్న కూడ అలాగే ఉంది. సగుణ, సాకార ఉపాసన శ్రేష్టమా లేదా నిర్గుణ, నిరాకార మార్గము ఉన్నతమా అని భగవానులను ప్రశ్నించారు. భగవానులు కూడ అప్రయత్నంగా భక్తి యోగమే ఆచరణీయమని తెలియజేశారు. సాధకులందరూ అర్జునుడికి ధన్యవాదాలు తెలియజేయాలి. మన మదిలో జనించే ప్రశ్నలనే వారు భగవానుల ఎదుట ఉంచారు. అర్జునుడి కారణాన మనకు సమాధానాలు లభించాయి. వేదాలు, ఉపనిషత్తులనే గోవుల పాలను పితికిన గోపాలనందనుడి ద్వారా, అర్జునుడు దూడగా
గీతామృతమనే పాలను గ్రోలినాడు.

12.1

అర్జున ఉవాచ
ఏవం(మ్) సతతయుక్తా యే,భక్తాస్త్వాం(మ్) పర్యుపాసతే৷
యేచాప్యక్షరమవ్యక్తం(న్),తేషాం(ఙ్)కే యోగవిత్తమాః৷৷1॥

అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! అనన్యభక్తితో పూర్వోక్తరీతిగా నిరంతరము నిన్నే భజించుచు, ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సగుణరూపమును ఆరాధించువారును, కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘననిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించువారును కలరు. ఈ రెండువిధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విదులెవరు?

11వ అధ్యాయంలోని 55వ శ్లోకంలో తెలిపినట్లు, కొంతమంది భక్తులు ఈశ్వరార్పణ బుద్ధిచే, భగవానులనే పరమ ప్రాప్యముగా భావించి, దృశ్య పదార్ధములందు ఆసక్తి లేక, భగవంతుని యందే మనస్సును నిలిపి, సగుణ సాకార రూపాన్ని నిరంతరము ఆరాధన చేస్తారు. దైవ సంబంధ కర్మలను ఆచరిస్తారు. కొంతమంది జిజ్ఞాసువులు జ్ఞానమార్గంలో, ఇంద్రియగోచరం గాని, నిర్గుణ, నిరాకార, అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తారు. ఇద్దరిలో ఎవరు యోగమును బాగా ఎఱిగినవారని అర్జునుడు భగవానులను ప్రశ్నించినారు. ఒక తల్లిని మీకు జేష్ట పుత్రుడు ఇష్టమా, లేదా కనిష్ట పుత్రుడు ఇష్టమా అని అడిగితే ఏమని సమాధానం ఇస్తుంది ? ఇద్దరూ కన్నబిడ్డలే, ఇద్దరూ ప్రీతిపాత్రులే. కాని తప్పనిసరి అయినప్పుడు, చిన్నవాడికి ఏం తెలియదు, వాడు నాపై ఆధారపడ్డవాడు, వాడి అవసరాలు నాకు తెలుసును, కాబట్టి నా వద్దనే ఉంటాడు, పెద్దవాడిని మీరు బయటికి తీసుకెళ్లండి అని అంటుంది. పెద్దవాడికి అన్నింటిపై అవగాహన ఉంది, వాడిని కూడా వదిలి తాను ఉండలేనని, కాని తొందరగా తీసుకురండని మళ్లీ చెబుతుంది. ఆ విధంగా భక్తి మార్గాన్ని అనుసరించే సాధకుడు ఎల్లప్పుడు భగవానుని కనుసన్నలలో ఉంటాడు.భగవానులు వారి బాధ్యతలను స్వీకరిస్తాడు.

12.2

శ్రీ భగవానువాచ
మయ్యావేశ్య మనో యే మాం(న్), నిత్యయుక్తా ఉపాసతే꠰
శ్రద్ధయా పరయోపేతాః(స్), తే మే యుక్తతమా మతాః৷৷2॥

శ్రీ భగవానుడు ఇట్లనెను - పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై, నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై, అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణరూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు - అని నా అభిప్రాయము.

ఎవరైతే భగవానుల యందు మనస్సును నిలిపి, నిరంతరం తదేక నిష్ఠతో, పరమ శ్రద్ధతో ఉపాసన చేస్తారో, వారు ఉత్తమ యోగులని భగవానులు అర్జునుడికి తెలియజేశారు. “ఆసనం” అనగా కూర్చునుట. “ఉప” అనగా భగవానుల చెంత. మార్గముతో నిమిత్తం లేకుండా నిత్యం భగవానుల సాన్నిధ్యంలోనే, భక్తులు సతతం మననం చేస్తూ ఉంటారు. మాతంగ బుుషి ఆశ్రమానికి శబరి బాల్యంలోనే చేరుకుంది. అందుకు కారణం, వారి తండ్రి కొన్ని మేక పిల్లలను ఇంట్లో పెంచేవాడు. వాటితో బాల్యంలో శబరి ఆడుకునేది. వారి తండ్రి ఒక సందర్భంలో చక్కగా ఆడుకో, అవి నీ వివాహ సమయంలో విందు భోజనానికి పనికొస్తాయని అంటారు. తండ్రి మాటకి శబరికి రాత్రంతా నిద్రపట్టలేదు. అర్ధరాత్రి లేచి ఎవరికీ చెప్పకుండా బయటకు పరుగెత్తుకొని పోయింది. తెల్లవారి చూస్తే శబరి ఇంట్లో లేదు. శబరిని గూర్చి వారి తండ్రి వెదకసాగాడు. అలా దినమంతా పరిగెడుతూ, రాత్రంతా చెట్లపై గడిపింది. అలా ప్రయాణం చేసి చివరికి మాతంగ ముని ఆశ్రమానికి చేరుకుంది. ఆశ్రమ వాతావరణం ప్రశాంతంగా అగుపడింది. అచ్చటి వారు సాత్వికులుగా కనిపించారు. వారు ఆశ్రమ నిత్య విధులలో నిమగ్నమయ్యారు. అంతలో అచ్చట దయాపూర్ణమైన ఒక వృద్ధ ముని శబరికి కనిపించారు. శబరి అక్కడే ఉండాలని భావించి, మాతంగ మునిని శరణు కోరింది. వారు ప్రేమతో ఆశ్రయమిచ్చారు. ఆశ్రమంలో సేవలు చేయసాగింది. ఒకనాడు మాతంగ ముని, తన అంతిమ సమయం ఆసన్నమైనదని, అచ్చట చేరియున్న శిష్యులకు తెలియపరిచారు. శిష్యులందరూ తమ తమ ప్రశ్నలను వేయ సాగారు. బాల శబరి ఆలోచించ సాగింది. తనకేమి తెలియదని, తనకు భగవంతుడు ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తారని మహర్షిని ప్రశ్నించింది. భగవంతుడు తనకు ఆశ్రమంలోనే కలుస్తారని, నిరీక్షించమని తెలియజేశారు. కాలాంతరంలో మాతంగ ఋషి అంతర్ధానమయ్యాక, శిష్యగణమంతా ఆశ్రమం వదిలి వెళ్ళిపోయారు. కాని తానొక్కరే భగవానులకై నిరీక్షిస్తూ, ప్రతి నిత్యం ఏ దిక్కునుండి ప్రభువులు వస్తారో తెలియదు కాబట్టి ఆశ్రమ పరిసరాలను శుభ్రం చేస్తూ, నది నుండి జలాన్ని, నివేదనకై అడవి నుండి ఫలాలను సేకరించి ఎదురు చూసెడిది. తన అస్థిత్వాన్ని సంపూర్ణంగా మరిచిపోయింది. కాలక్రమంలో శబరి వృద్ధురాలు అయింది. కాని గురువుల మాట ప్రకారం, శ్రీరాములవారు వస్తారనే విశ్వాసం మాత్రం మనసులో మాసిపోలేదు. భక్తి, శ్రద్ధ, విశ్వాసం తన దినచర్యగా మారింది. ఆ విధంగా పగలు రాత్రి భగవానులకై ప్రతీక్షించసాగింది. శబరి భక్తి యోగం యొక్క అత్యున్నత శిఖరం. ఆ సమయం ఆసన్నమైనది. ఒకరోజు భగవాన్ శ్రీరాములు రాగానే వారి పాదాలపై వాలి పోయింది. తన కన్నీళ్ళతో పాదప్రక్షాళన చేసింది. మధురమైన ఎంగిలి పళ్ళను భక్తితో భగవానులకు సమర్పించింది. కృతార్థురాలైనది. అలాగే నావికుడు గుహుడు కూడా భగవానుల పాదధూళిచే అహల్య శాపవిమోచన జరిగిందని, తన నావకు ఆ దూళి సోకితే ఏమవుతుందోనని భావించి, భక్తిభావంతో భగవానుల పాదాలను శుభ్రంచేశారు. తమ పాదాలను జనక మహారాజుచే కూడ స్పృశింపనివ్వని శ్రీరాముల వారిని, గుహుడి చర్యపట్ల ఆసక్తితో సీతామాత, లక్ష్మణులు చూడసాగారు. అద్భుత భక్తి భావన అది. నదిని దాటిన తర్వాత సీతామాత ఉంగరాన్ని శ్రీరాములవారు గుహుడికి పారితోషికంగా ఇవ్వబోయారు. దానిని ఆశించి గంగానదిని తాను దాటించలేదని, అది తన జీవన సౌభాగ్యమని గుహుడు తెలియజేశారు. నావికుడుగా తాను తన ధర్మాన్ని నిర్వర్తించానని, తనను ఈ భవసాగరం నుండి దాటించమని వేడుకున్నారు. అట్టి గుహుడి భక్తి సుశోభితమైనది. ఈ విధమైన భక్తిభావంతో పయనించువారు యోగవేత్తలనబడుతారు.

12.3

యే త్వక్షరమనిర్దేశ్యమ్,అవ్యక్తం(మ్) పర్యుపాసతే꠰
సర్వత్రగమచిన్త్యం(ఞ్)చ, కూటస్థమచలం(న్) ధ్రువమ్꠱3॥

కాని ఏ పురుషులు అనిర్వచనీయమైన స్వరూపముగలవాడును, నిరాకారుడును , సర్వవ్యాపియైనవాడును, మనస్సుకు బుద్ధికి గోచరము గానివాడును, సర్వదా ఒకే స్థితిలో ఉండువాడును, నిశ్చలుడును, నిత్యుడును, శాశ్వతుడైన సచ్చిదానందఘనబ్రహ్మను ఏకీభావముతో ఉపాసింతురో…

12.3 writeup

12.4

సన్నియమ్యేన్ద్రియగ్రామం(మ్), సర్వత్ర సమబుద్ధయః꠰
తే ప్రాప్నువన్తి మామేవ, సర్వభూతహితే రతాః꠱4॥

(ఏ పురుషులు) ఇంద్రియ సముదాయమును పూర్తిగా వశపఱచుకొని, అన్నిటియందును సమభావముగలవారై, సకల ప్రాణులకును హితముచేయగోరువారుగా ఉంటారో, వారు (యోగులు) నన్నే పొందుదురు.

భగవానుల వాణి మంత్రమయమై శుద్ధత్వాన్ని ప్రసాదిస్తుంది. మనం ప్రతినిత్యం గీతా శ్లోక పఠనం చేయాలి. అందరి జీవితాల్లో గీతాధ్యయనం వల్ల అద్భుత ఫలితాలు సంభవిస్తున్నాయి. నాశరహితమైన, నిర్దేశింపశక్యముగాని, ఇంద్రియగోచరం కాని, ఊహింపశక్యముగాని, నిర్వికారమైన, అచలమైన, నిత్యమైన పరమాత్మ సాకారుడు మరియు నిరాకారుడు. ఇంద్రియ సమూహం శరీరాన్ని ఆధీనంలో ఉంచుకుంటుంది. అష్టాంగ యోగ విధానంతో ఇంద్రియాల సంయమనాన్ని సాధించవచ్చును. అందుకు యమ,నియమాలు నిచ్చెన కర్రల్లాంటివి. ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులు మెట్ల లాంటివి. ఇంద్రియ నిగ్రహంతో, అందరి పట్ల సమభావము కలిగి, సర్వప్రాణుల హితం కోరుట వల్ల బ్రహ్మప్రాప్తికి కావలసిన శీలసంపత్తి పెరుగుతుంది. పై సుగుణములతో కూడి, అట్టి నిరాకార, నిర్గుణ, అక్షర పరబ్రహ్మను ధ్యానించువారు నిశ్చయపూర్వకంగా ఆ పరమాత్ముని చేరుతారని భగవానులు అభయపూర్వకంగా తెలుపుతున్నారు. మన సంస్కృతిలో భాగంగా నాగ పంచమి రోజున పాములను, అమావాస్య రోజున గోవులను, తులసీమాతను, రావిచెట్టును, ఉసిరి చెట్టును పూజిస్తాము. వట సావిత్రి పూజ, గోవర్ధన పూజ, నదీజలాల పూజ, పంచభూతముల పూజ, రథసప్తమి రోజున దినకరుని పూజ మన దైనందిన జీవితంలో భాగాలు. ఇలాంటి భావాలతో మన జీవితాన్ని పరిపుష్టి చేసుకున్నాము. సర్వత్రా సమబుద్ధిని పాటిస్తున్నాము. చీమలకు, ఏనుగులకు కూడా ఆహారం సమకూరుస్తాము. ఇంట్లో ఉండే శునకాలకు, ఇంటికప్పుపై వ్రాలే కాకుల పట్ల కూడా భూతదయను చూపుతాము.

12.5

క్లేశో౽ధికతరస్తేషామ్,అవ్యక్తాసక్తచేతసామ్꠰
అవ్యక్తా హి గతిర్దుఃఖం(న్), దేహవద్భిరవాప్యతే꠱5॥

కాని సచ్చిదానందఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్తచిత్తులైనవారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతోగూడినది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్తపరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే.

సర్వత్ర సమబుద్ధితో పరమాత్మను దర్శించే సగుణోపాసన కంటే నిర్గుణ, నిరాకారోపాసన చాలా ప్రయాసతో కూడినది. సాకార రూపాన్ని ఆరాధించే వారికి నిర్గుణోపాసన కఠినతరం. సర్వ సమర్పణా భావం గల భక్తులకు భవసాగరాన్ని దాటడం సులువు. భక్తులుగా భగవానుల శరణుగోరి, తగిన శ్రేయోదాయక మార్గాన్ని ప్రసాదించమనే సగుణోపాసన చాలా సులభమైనది. దేహభిమానం కలిగి, ఇంద్రియ నిగ్రహం మరియు చిత్తశుద్ధి లేనివారికి నిర్గుణోపాసన అధిక శ్రమతో కూడి ఉంటుంది. మహాభారత యుద్ధం ఆరంభం కావడానికి పూర్వం, ఉభయసేనలు ఎదురెదురుగా నిలిచి ఉన్నాయి. శంఖనాదాలను పూరించినారు. పాండవసేనలో ఉన్నట్టి యుధిష్టరుడు తన రథాన్ని దిగి, పాదరక్షలు విడిచి కౌరవసేన వైపు పోసాగాడు. అందరూ ఆశ్చర్యపోయారు. యుధిష్టరులు శరణాగతులౌతారని, యుద్ధం పరిసమాప్తమౌతుందని భావించసాగారు. కాని వారు నేరుగా కురువంశ వరిష్టులైన భీష్మపితామహుల వద్దకు వెళ్లి, నమస్కరించి, ఏ కార్యారంభానికైనా జ్యేష్ఠులకు ప్రణామం చేయడం కులధర్మమని, తమకు విజయాశీర్వాదములను కలగజేయుమని ప్రార్థించారు. శత్రుపక్షానికి ప్రధాన సేనాధిపతియై ఉండి కూడ, ఆశీర్వాదం ఇవ్వనట్లైతే కుల పరంపరకు విఘాతం కావున, యుధిష్టరుడిని విజయీభవయని ఆశీర్వదించవలసి వచ్చింది. ఆ క్షణంలోనే పాండవుల విజయం నిశ్చయమైపోయింది. వినమ్రభావంతో, శ్రద్ధా భావంతో తలవంచడంలో అంతటి ఉత్కృష్టమైన ఫలితాలు సమకూరుతాయి. ప్రతిరోజు ఇంటి నుండి బయటికి వెళ్లే ముందు పెద్దలకు నమస్కారం చేయడం శుభకరం. అత్తగారికి కోడలు ప్రణమిల్లినప్పుడు, గతంలో పొడచూపిన విభేదాలు తొలగిపోయి, ప్రేమానురాగాలు విలసిల్లుతాయి.

12.6

యే తు సర్వాణి కర్మాణి, మయి సన్న్యస్య మత్పరాః꠰
అనన్యేనైవ యోగేన, మాం(న్) ధ్యాయన్త ఉపాసతే꠱6॥

కాని మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటిని నాయందే అర్పించి, సగుణపరమేశ్వరరూపమునే అనన్యభక్తియోగముతో సతతము చింతన చేయుచు భజించుచుందురో.........

భగవానులు సాధకుడు అనుసరించాల్సిన పద్ధతిని తెలియజేస్తున్నారు. భక్తులు సమస్త కర్మలను పరమాత్మను పరమగతిగా ఎంచి, ప్రాపంచిక చింతనలు లేక, అనన్య చిత్తముతో ఈశ్వరార్పణ బుద్ధితో కేవలం ఆ పరమాత్మనే ఉపాసించాలి. వంట చేసేటప్పుడు మన చిత్తం భగవంతునిపై ఉన్నట్లయితే అది ప్రసాదంగా మారుతుంది. చేసిన వంటను సర్వ భూతములకు చెందినదిగా భావించాలి. అప్పుడు ఆ పాకం అమృతమయమౌతుంది. స్వార్థభావనతో చేసిన వంట రసహీనమవుతుంది. గృహాన్ని శుభ్రం చేసేప్పుడు కూడా మందిరాన్ని శుభ్రం చేస్తున్నామనే భావన కలగాలి. దుకాణంలో ఉన్న వర్తకుడు కొనుగోలుదారులను భగవత్స్వరూపులుగా భావించాలి. భక్తికి భావనే ప్రధానం. భగవాన్ ఆది శంకరులు వారి సంచారమే భగవత్ ప్రదక్షిణగా భావించారు. నిద్రను సమాధిగా ఎంచారు. ప్రతి శబ్దాన్ని స్తోత్రముగా తలచారు. అలా చేసే ప్రతి కర్మను కూడా భగవత్ కర్మగా భావించాలి.

12.7

తేషామహం(మ్) సముద్ధర్తా, మృత్యుసంసారసాగరాత్꠰
భవామి నచిరాత్పార్థ, మయ్యావేశితచేతసామ్꠱7॥

ఓ అర్జునా నాయందే లగ్నమనస్కులైన అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగనే మృత్యురూపసంసారసాగరము నుండి ఉద్ధరించెదను.

భగవంతుని యందే చిత్తం కలిగి, తనను ఆశ్రయించే భగవదోపాసకులను మృత్యు రూప సంసార సాగరం నుండి శీఘ్రముగా సముద్ధరిస్తానని భగవానులు అనుగ్రహ భాషణం చేసినారు. భక్తుల యోగక్షేమాలను స్వయంగా వారే చూస్తారు. సంసార సాగరంలో సంభవించే తుఫానుల నుండి రక్షణ కలుగజేస్తారు.

12.8

మయ్యేవ మన ఆధత్స్వ, మయి బుద్ధిం(న్) నివేశయ꠰
నివసిష్యసి మయ్యేవ, అత ఊర్ధ్వం(న్) న సంశయః꠱8॥

నాయందే మనస్సు నిలుపుము. నాయందే బుద్ధిని లగ్నముచేయుము. పిమ్మట నాయందే స్థిరముగా నుందువు. ఇందు ఏ మాత్రమూ సందేహమునకు తావులేదు.

భగవానులు భక్తులను ఉద్ధరించడానికి కావలసిన కొన్ని నిర్ధిష్టమైన సాధనాక్రియలను బోధిస్తున్నారు. మనస్సును మరియు బుద్ధిని దృశ్య విషయములపై పోకుండా, భగవానుల యందే నిశ్చలంగా, స్థిరంగా నిలుపాలి. పోగా పోగా మనస్సు భగవంతుని యందు లయిస్తుంది. వారి రూపాన్నే పొందుతుంది. ఇది అంత సులభం కాదు. ప్రయత్నపూర్వకంగా భక్తులు చేసే సాధన వల్ల, భగవానులు వారి హృదయమునందే స్థిర నివాసముంటారని, అందులో సంశయం అక్కర్లేదని భగవానులు తెలియజేస్తున్నారు. భగవానులు భక్తుల మనోభావాలను స్వీకరించడానికి ఆకలితో సిద్ధంగా ఉంటారు. అందుకు మనస్సు మరియు బుద్ధి ప్రధానం.

12.9

అథ చిత్తం(మ్) సమాధాతుం(న్),న శక్నోషి మయి స్థిరమ్।
అభ్యాసయోగేన తతో, మామిచ్ఛాప్తుం(న్) ధనఞ్జయ॥9॥

మనస్సును సుస్థిరముగా నాయందే నిల్పుటకు సమర్థుడవు కానిచో అర్జునా! అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము.

భగవానులు బహిరంగ యోగం నుండి అంతరంగ యోగం వైపు వెళ్తున్నారు. ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు బహిరంగ యోగానికి సంబంధించినవి. ధారణ, ధ్యాన, సమాధి స్థితులు అంతరంగ యోగానికి చెందినవి. ఒకవేళ మనస్సు దైవమునందు స్థిరముగా నిలవక, అన్య విషయములపై పోతున్నట్లైతే, ఏమి చేయాలో భగవానులు చెప్తున్నారు. మనస్సుయే బంధకారకము లేదా మోక్షదాయకము కూడా. అందుకు కొంత ప్రయత్నం అవసరం. గీతను చదవాలి, చదివించాలి మరియు జీవితములో అన్వయించాలని గురుదేవులు చెబుతారు. కేవలం కంఠస్థీకరణ వల్ల ప్రయోజనం ఉండదు. మనస్సును భగవానుల యందు నిలుపుట సాధ్యం కానట్లైతే, అభ్యాసమనే ప్రయాస అవసరం. మనస్సును మెల్లమెల్లగా ఆత్మయందు స్థిరంగా నిలపడానికి ధ్యాన ప్రక్రియ అవసరం. ముందుగా భగవానులను పొందడానికి ప్రయత్నశీలురు కావాలి. విశ్వాసమే దానికి నాంది. తొలుత భక్తుడు వేరు, భగవానులు వేరు. తర్వాత ఇరువురు ఒక్కటౌతారు. ప్రస్తుతం భక్తుడు లేడు, హృదయంలో భగవానులు మాత్రమే ఉన్నారు. అందుకు శ్రద్ధ అవసరం. మోక్షం సులభం కదా ! అందరికీ ఎందుకు లభ్యం కాదని బుద్ధ భగవానులను శిష్యులు అడిగారు. అప్పుడు భగవానులు 10 గృహాలకు భిక్షకు వెళ్ళి, వారి కోరికలేమిటో తెలుసుకుని రమ్మన్నారు. శిష్యులు బయలుదేరి భిక్షాటనకు వెళ్లారు. ఒక ఇంట్లో నాకు పుత్రుడు కావాలన్నారు, ఒకరు వివాహం కావాలన్నారు, ఒకరు వ్యాపారం సవ్యంగా లేదన్నారు, ఒకరు ఉద్యోగం కావాలన్నారు, మరొకరు ధనమడిగినారు, ఇంకొకరు ఆరోగ్యం కావాలన్నారు. శిష్యులు తర్వాత భగవానుల వద్దకు చేరుకున్నారు. ఎంతమంది మోక్షప్రాప్తిని కోరినారని భగవానులు ప్రశ్నించారు. ఒక్కరికి కూడా ఆ ఇచ్ఛ లేదని శిష్యులు తెలిపారు. అందుకే సాధకులకు ముందుగా ధృడమైన సంకల్పం కావాలి. సంకల్పం లేకుండా ఏది ప్రాప్తించదు. భగవానులు ప్రత్యామ్నాయ మార్గాలతో భక్తులను ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నారంటూ, వాటిని తదుపరి సత్రంలో పరిశీలించుదామని తెలియజేస్తూ, అంతటితో వివేచనను ముగించి ప్రశ్నోత్తరాలను చేపట్టడం జరిగింది.
ప్రశ్న: ధనంజయ మరియు ‘ తత్ ‘ శబ్దాలకు అర్థాలు తెలియజేయండి ?
జవాబు: పాండవులు హస్తినాపురం నుండి వచ్చిన తర్వాత ఇంద్రప్రస్థ నగర నిర్మాణానికి సంకల్పించారు. ఆ సందర్భంగా అర్జునుడు అనేక రాజులతో యుద్ధం చేసి, చాలా ధనాన్ని ప్రోగు చేశారు. అమిత ధనాన్ని జయించిన వాడుగా ధనంజయుడని సార్థక నామధేయుడయ్యాడు. తతో- ‘తతః’ అనగా అటు పిమ్మట అని అర్థము.
ప్రశ్న: గీతా పరివార్ సంస్థ విషయంలో ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు అవరోధాలు ప్రాప్తిస్తే, ఎలా అధిగమించాలి ?
జవాబు: ముందుగా మన కర్తవ్యాలను, నిజ ధర్మాలను స్వీకరించాలి. తదుపరి ఇతర కార్యాలపై దృష్టి పెట్టాలి. తన స్వధర్మాన్ని మరిచి యుద్ధం నుండి అర్జునుడు పారిపోవాలనుకున్నాడు. కాని భగవానులు ముందుగా తన క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించమన్నారు. మన ధర్మాలను నిర్వర్తిస్తూ, మిగిలిన సమయాన్ని గీత మరియు అన్యకార్యాలలో వినియోగించాలి. ఇతరుల విమర్శల పట్ల దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. “ఉద్ధరేదాత్మనాత్మనం(న్), నాత్మానమవసాదయేత్…రిపురాత్మనః “(6-5)- తమను తామే ఉద్ధరించుకోవాలని మరియు తమను తాము అధోగతి పాలు చేసుకోకూడదని, తమకు తామే బంధువులని, శత్రువులు కూడా తామేనని భగవానులు తెలియజేశారు. మన మార్గంలోని కంటకాలను మనమే దూరం చేసుకోవాలి.
ప్రశ్న: సగుణ , నిర్గుణ తత్వాల గూర్చి చెప్పారు. మరి ముస్లింల ప్రార్థన విధానమేమిటి ?
జవాబు: వారు నిరాకారాన్ని ఉపాసన చేస్తారు. అందులో కూడా శ్రద్ధ అవసరం. శ్రద్ధ లేకుండా ఉపాసన సాధ్యం కాదు. ఆ శక్తిని శ్రీకృష్ణుడు, మహావీర్, బుద్ధ, అల్లా అని ఏ పేరుతో అయినా పిలువ వచ్చును. మనం సగుణోపాసన చేస్తాం. మెల్లమెల్లగా నిర్గుణోపాసన వైపు వెళ్తాం. నిర్గుణోపాసకులు సగుణోపాసన కూడా చేస్తారు. రెండు ఒకదానిలో ఒకటి ఇముడుతాయి. మనం గణపతి మూర్తిని తెచ్చి ఇంట్లో, వీధుల్లో ప్రతిష్టాపన చేస్తాం. పదిరోజుల పాటు మూర్తి రూపానికి నిత్య పూజలను, నైవేద్యాలను సమర్పిస్తాము. తరువాత నదిలో విసర్జన చేస్తాం. విసర్జన అనగా విస్తారంగా సృజించడం. అప్పుడు గణపతి మూర్తి జలతత్త్వంగా మారుతారు. ఆ జలాలతో పంటలు సాగై, గణేశమయం అవుతాయి. పంటల నుండి వచ్చు ధాన్యము కూడా గణేశమయం అవుతుంది. పిదప ఆ ధాన్యం ఆహారంగా స్వీకరించిన వారందరూ గణేశమయం అవుతారు. ఎంతో విస్తారంగా మన మనోభావాలుంటాయి. భగవానులు విసర్జితం కారు, మన మనస్సులో విస్తారమవుతారు. ఉపాసనా పద్ధతుల గూర్చి భగవద్గీతలో విస్తారంగా వర్ణించబడ్డాయి. భగవానులు “ సర్వధర్మాన్పరిత్యజ్య, మామేకం(మ్) శరణం(వ్ఁ) వ్రజ।అహం(న్) త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥(18-66), అని ఉపదేశించారు. ఇది భగవద్గీత చరమ శ్లోకము. మొదటి పాదాన్ని శక్తియని, రెండవ పాదాన్ని కీలకమని అంటారు. సమస్త ధర్మాల కంటే భగవచ్ఛరణాగతి అతి ముఖ్యము. అప్పుడు సర్వ పాపముల నుండి విముక్తులను చేస్తానని భగవానులు అభయమొసంగారు. ఇది భగవద్గీత యొక్క అంతిమ సత్యం. సర్వదేవుళ్ళకు చేసే నమస్కారం కేశవుడికి ప్రాప్తిస్తుంది.
ప్రశ్: మనం శాస్త్రీయ విద్యావిధానంపై ఆధారపడ్డాం. అన్నింటికీ ఆధారాలు కావాలి. అలాంటప్పుడు మనస్సుకు భక్తి, సమర్పణ భావాలు ఎలా కలుగుతాయి ?
జవాబు: మనస్సును స్థిరముగా నిల్పుటకు అభ్యాసం చేయాలి. అందుకు అసమర్థులైతే భగవత్ప్రీత్యర్థము కర్మలను ఆచరించాలి. కారణాలు ఏవైనా కావచ్చును, మనపై మనకు నమ్మకముండదు. అందుకు మనస్సు కారణము. మనస్సు మరియు బుద్ధి ఏకమైతే చిత్తము శుద్ధమై శ్రద్ధ కలుగుతుంది. భగవానులు మన వద్దకు రావాలనుకుంటారు కాని, మన హృదయ గవాక్షాలు మూసివేశాక ఎలా వస్తారు ? “ శ్రద్ధయా పరయోపేతాః(స్), తే మే యుక్తతమా మతాః “(12-2)- మిక్కిలి శ్రద్ధతో కూడి భగవానులను ఉపాసన చేసినప్పుడే ఉత్తమ యోగులనబడుతారు, ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. గీతా తరగతులయ్యేంతవరకు కొంతకాలము ప్రయోగాత్మకంగా భగవానులను విశ్వసించండి. శాస్త్రపరంగా దీనిని ముందస్తు షరతుగా (ప్రీ కండిషన్ గా) భావించండి. అద్భుత ఫలితాలు వస్తాయి. శ్రద్ధ, విశ్వాసం లేకుండా ఇది సాధ్యం కాదు. మనం తల్లి మాటలపై విశ్వాసంతో ఫలానా వారిని తండ్రిగా విశ్వసిస్తాము. అంతేగాని తల్లి మాటలను నమ్మకుండా జన్యు పరీక్షలను జరిపించము కదా ! అదేవిధంగా సర్వోపరియైన భగవానుల మాటలను విశ్వసించి, ఏం జరుగుతుందో చూడాలి. అద్భుత ఆవిష్కరణలు జరుగుతాయి. “మూకం(జ్) కరోతి వాచాలం(మ్), పజ్ఘుం(మ్) లజ్ఘయతే గిరిమ్।యత్కృపా తమహం(వ్ఁ) వన్దే పరమాన్దమాధవమ్ ॥” భగవద్కృపచే మూగవాడు వాచాలుడు కాగలడు, కుంటివాడు పర్వతములు దాటగలడు. శుభం భూయాత్ !
ప్రశ్న: యమ,నియమాలనగా నేమి ?
జవాబు: యమ, నియమాలు ఐదు చొప్పున ఉంటాయి. యమ , నియమాలు మనో సంయమనానికి సంబంధించినవి. యమం అనగా సత్యము, అహింస, బ్రహ్మచర్యము, అస్తేయం(దొంగిలించకుండా ఉండడం) మరియు అపరిగ్రహం(ఇతరుల వస్తువులు ఆశించకపోవడం). అదేవిధంగా అనుసరించ వలసిన ధర్మాలైన శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము మరియు ఈశ్వరప్రణిదానము ( ఈశ్వరుడి పట్ల సంపూర్ణ సమర్పణ భావం కలిగి ఉండడం) నియమాలనబడుతాయి. పతంజలి మహర్షి యొక్క అష్టాంగ యోగ విధానంలో ఇవి మూలమైనవి. కాని భగవద్గీతలోని ఆత్మసంయమ యోగంలో చాలా సులభతరంగా ఈ అంశాలు తెలుపబడ్డాయి.
ప్రశ్న: మనస్సు మరియు బుద్ధిని భగవంతుని యందు ఉంచడానికి సులభమైన ఉపాయం ఏమిటి ?
జవాబు: ఏ పనినైనా నిర్విఘ్నంగా చేయాలంటే మనస్సును మరియు బుద్ధిని సమన్వయం చేయాలి. పరీక్షలో మంచి మార్కులు రావాలంటే, తరగతిగదిలో మనసు మరియు బుద్ధి ఏకీకృతం కావాలి. కళ్ళు ఉపాధ్యాయునిపై, మనస్సు ఇంట్లో ఉండకూడదు. భగవద్గీతలోని ఆరవ అధ్యాయంలో ఉపాసన విధానాల గూర్చి భగవానులు తెలియజేశారు. “ సమం(జ్)కాయశిరోగ్రీవం(న్)…దిశశ్చానవలోకయన్॥”(6-13)- శరీరము, శిరస్సు, మెడ తిన్నగా నిలిపి, కదలకుండా, స్థిరంగా ఉంచాలి. దిక్కులు చూడకుండా, దృష్టిని నాసికాగ్రంపై నిలపాలి. ప్రాణాపాన వాయువులను సమస్థితిలో ఉంచాలి. మనోబుద్ధులను శ్వాసక్రియ అనుసంధానం చేస్తుంది. పరీక్షలకు హాజరయ్యే ముందు మరియు ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనే ముందు, ఈ ప్రక్రియ ద్వారా విశేష లాభాన్ని పొందవచ్చును. మనసు, బుద్ధి ఒక్కటి కావాలి. మనస్సు సమత్వం పొందాలంటే శ్వాసక్రియ సమంగా ఉండాలి. శ్వాసక్రియ సమంగా ఉండాలంటే శరీరం సమస్థితిలో ఉండాలి. అప్పుడు ఛాతి విచ్చుకుంటుంది. దీర్ఘశ్వాసతో ప్రాణవాయువు యొక్క సరఫరా పెరుగుతుంది. ప్రాణవాయువు యొక్క సరఫరా మెదడుకు పెరిగినప్పుడు బుద్ధి స్థిరమౌతుంది. ఇది సులభమైన, శాస్త్రీయమైన సాంకేతిక విధానం. యోగశాస్త్రం ద్వారా మనస్సు మరియు బుద్ధుల మధ్య సమన్వయం సిద్ధిస్తుంది.
ప్రశ్న: గీతను ఎన్ని మార్లు చదివినా కొత్త విషయాలు గ్రాహ్యమవుతూనే ఉంటాయి. దానికి కారణమేమిటి ?
జవాబు: భగవద్గీత ఒక మనోవైజ్ఞానిక విశ్లేషణ గ్రంథం. అర్జునుడు యుద్ధరంగంలో తీవ్ర విచారగ్రస్థుడై కుప్పకూలిపోయాడు. “ గాణ్డీవం(మ్) స్రంసతే హస్తాత్…భ్రమతీవ చ మే మనః “(1-30)- శారీరిక, మానసిక వికారాలు కలిగినాయి. మతిభ్రమించినది. నిలిచే క్షమత నశించింది. ఈ పరిస్థితుల్లో, అర్జునుడు తిరిగి లేచి నిలబడి, యుద్ధానికి స్వయంగా సంసిద్ధుడయ్యేలా భగవానులు వారికి గీతోపదేశం చేశారు. చివరికి విజయం వరించింది. మనం కూడా అర్జునుడిలా, ఎన్నో కారణాల వల్ల విపరీతంగా ప్రవర్తిస్తాము. కారణాలు ఏవైనా మనఃస్థితి ఒక్కటే. గీత ఆత్మస్థితిని ఉత్తేజితం చేస్తుంది. దానివల్ల మనోస్థితి మెరుగవుతుంది. తద్వారా పరిస్థితులు అనుకూలిస్తాయి. మన ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. భగవద్గీత అద్భుత శాస్త్రం. అందుకే గీతా పరివార్ రికార్డ్ చేసిన ప్రవచనాలను ప్రోత్సాహించదు. ప్రతి వారాంతంలో ప్రత్యక్ష ప్రవచనాలను అన్ని స్థాయిల్లో ప్రసారం చేస్తుంది. వివేచన సమయంలో నూతన ఆలోచన విధానాలు స్ఫురణలోకి వస్తాయి. హరి అనంతం, హరికథ అనంతం, ఈ అనంతుడైన పరమాత్మకు అంతిమ స్వరూపం పరమానందమే. ప్రతి సుఖానికి ఆవల దుఃఖముంటుంది. కాని గీత మాత్రం ఆనంద ప్రాప్తిని మాత్రమే ప్రసాదిస్తుంది. ఆనందానికి వ్యతిరేక శబ్దం లేదు. సమర్పణా ప్రార్ధన తర్వాత, సామూహిక హనుమాన్ చాలీసాపఠనానంతరం సత్రం ముగిసింది.