विवेचन सारांश
స్థితప్రజ్ఞత లక్షణాలు
పరమ పూజ్య గోవింద్ దేవ్ గిరీజీ మహారాజ్ గారి చరణములకు వందనములతో, ప్రార్థన, దీప ప్రజ్వలనతో ఈనాటి వివేచన కార్యక్రమము మొదలు అయినది. ఈనాడు సాంఖ్యయోగము అనబడే రెండవ అధ్యాయము వివేచన మధ్యాంశము చెప్పబడుతుంది. దీనికి గీతా విశారద్ శ్రీ శ్రీనివాస్ జీ వార్నేకర్ గారిని వక్తగా ఆహ్వానించారు. గురు ప్రార్థన, కృష్ణ ప్రార్థన, గురు పరంపర, భారతమాతకు ప్రార్థన, గీతా మాహాత్మ్యము, సద్గురు శ్రీ గోవింద్ దేవ్ గిరీ జీ మహారాజ్ చరణములకు వందనములతో, గీతా సాధకులు అందరికీ అభివాదం చేస్తూ శ్రీవార్నేకర్ గారు ఈనాటి వివేచనను ప్రారంభించారు.
మొదటి అధ్యాయములో ఆనాటి పరిస్థితి, అర్జునుని మనోస్థితి గురించి తెలుసుకున్నాము. శ్రీమద్భగవద్గీతా యొక్క సందర్భము మొదటి అధ్యాయంలో వస్తుంది. రెండవ అధ్యాయములో మొత్తం భగవద్గీతా లో చెప్పే విషయాలన్నీ సంక్షిప్త రూపంలో చెప్పబడినవి. భగవంతుడు చెప్పదలచిన మూల, ముఖ్య తత్వములను రెండవ అధ్యాయంలో చెప్పాడు. భగవంతుని ఉపదేశము
మొదటి అధ్యాయములో ఆనాటి పరిస్థితి, అర్జునుని మనోస్థితి గురించి తెలుసుకున్నాము. శ్రీమద్భగవద్గీతా యొక్క సందర్భము మొదటి అధ్యాయంలో వస్తుంది. రెండవ అధ్యాయములో మొత్తం భగవద్గీతా లో చెప్పే విషయాలన్నీ సంక్షిప్త రూపంలో చెప్పబడినవి. భగవంతుడు చెప్పదలచిన మూల, ముఖ్య తత్వములను రెండవ అధ్యాయంలో చెప్పాడు. భగవంతుని ఉపదేశము
అశోచ్యానన్వశోచస్త్వం(మ్), ప్రజ్ఞావాదాంశ్చ భాషసే৷
గతాసూనగతాసూంశ్చ, నానుశోచన్తి పణ్డితాః (2.11)
గతాసూనగతాసూంశ్చ, నానుశోచన్తి పణ్డితాః (2.11)
శ్లోకముతో మొదలవుతుంది. ఇక్కడ భగవంతుడు అర్జునునితో నీకు దేని గురించి శోకించవలెనో, దేని గురించి శోకించరాదో తెలియదు, కాని పండితుడివలె మాట్లాడుతున్నావు అంటాడు. ఇక్కడ భగవంతుడు సౌమ్యమైన మాటలతో అర్జునుని మందలించడానికి ప్రయత్నించిన తరువాత భగవద్గీతా ముఖ్య అంశమైన జ్ఞానము గురించి చెప్పి, ఆత్మ తత్వము గురించి చెప్పి, అటువంటి ఆత్మ తత్వాన్ని ఎలా ప్రాప్తించుకోవాలో ముందు ముందు చెబుతాడు. ఇక్కడ-
ఏషా తే౽భిహితా సాఙ్ఖ్యే, బుద్ధిర్యోగే త్విమాం(మ్) శృణు৷
బుద్ధ్యాయుక్తో యయా పార్థ, కర్మబన్ధం(మ్) ప్రహాస్యసి (2.39)
బుద్ధ్యాయుక్తో యయా పార్థ, కర్మబన్ధం(మ్) ప్రహాస్యసి (2.39)
ఏ కర్మయోగ ఆచరణతో నీవు కర్మ బంధాలనుంచి ముక్తుడవు కాగలవో నేను నీకు చెబుతాను అంటూ భగవంతుడు ఒక మలుపు తీసుకుంటాడు. కర్మయోగమునకు సంబంధించిన కొన్ని శ్లోకములను ఇక్కడ భగవంతుడు చెప్పాడు-
కర్మణ్యేవాధికారస్తే, మా ఫలేషు కదాచన৷
మా కర్మఫలహేతుర్భూః(ర్), మాతే సఙ్గో౽స్త్వకర్మణి (2.47)
మా కర్మఫలహేతుర్భూః(ర్), మాతే సఙ్గో౽స్త్వకర్మణి (2.47)
భగవద్గీతా లో ఈ శ్లోకము ఎంతో గుర్తింపబడిన, ఎంతో ప్రసిద్ధి చెందినది. భగవద్గీతా గురించి తెలుసా అని అడిగితే కొంతమంది శ్రీకృష్ణార్జునులు రథముపై ఉన్న చిత్రములో ముద్రించబడిన ఈ శ్లోకాన్ని గురించి తెలుసు అని చెబుతారు. ఈ శ్లోకము భగవద్గీతా కు సారము అని చెబుతారు. ఈ శ్లోకము యొక్క నాలుగు చరణములలో భగవంతుడు నాలుగు ముఖ్యమైన విషయాలను చెబుతాడు. మొదటి చరణములో నీకు కర్మలను ఆచరించడం పైనే అధికారము ఉన్నది అని చెబుతాడు. సంస్కృతంలో అధికారము అంటే యోగ్యత అని అర్థము. కర్మలను ఆచరించే యోగ్యత మనకందరికీ ఇవ్వబడినది. కాళ్లు, చేతులు, ముక్కు, నాలిక లాంటి ఇంద్రియములతో మనము కర్మలను చేయగలము. వీటి ద్వారా కర్మలను ఆచరించడానికి మనకు యోగ్యత ఇవ్వబడినది. మా ఫలేషు కదాచన- కాని ఈ కర్మల ద్వారా మనకు ఏది లభిస్తుందన్న దానిపై మనకు యోగ్యత లేదు, మనం నిశ్చయంగా చెప్పలేం. ఎందుకంటే కర్మలనాచరించిన తరువాత దాని ఫలితము వేరే విషయములపై కూడా ఆధారపడి ఉంటుంది. బాగా చదివి పరీక్ష రాసిన తర్వాత, దానిని పరీక్షించే అధ్యాపకుడికి మనస్థితి బాగా లేక తక్కువ మార్కులు వేసినా అది మన చేతిలో లేదు. అలాగని కర్మ ఫలితము లభించలేదని కాదు. కర్మలను చేసిన వారికి దాని ఫలితము కచ్చితంగా లభిస్తుంది. మార్కులు ఎన్ని లభించినప్పటికీ చదువు ద్వారా లభించిన జ్ఞానము మన తోటే ఉంటుంది. మార్కులు మన చేతిలో లేకపోయినా, దాని ఫలితము జ్ఞాన రూపములో మనతో ఉంటుంది, అందుకే దాని గురించి చింతించరాదని భగవంతుడు చెబుతున్నాడు. మా కర్మఫలహేతుర్భూః(ర్)- కర్మ ఫలాన్ని మనసులో ఉంచుకోకుండా పని చెయ్యి. ఫలాలపై ఆపేక్ష లేకుండా కర్మలను ఆచరించడం సామాన్య జనులకు చాలా కష్టము. మనుషులు చాలావరకు ఏదో ఒక దానిని ఆశించి పనులు చేస్తారు. మనం రోజులో కనీసం ఒక్కటైనా కర్మను ఫలాపేక్ష లేకుండా చేయగలిగాలి. ఇది చేయదగినది, నాకు యోగ్యమైనది, నా కర్తవ్యం అన్న భావనతో చేయాలి. ఇలా మనం ప్రారంభించవచ్చును. మాతే సఙ్గః అస్తు అకర్మణి- ఫలాపేక్ష లేదని, ఎందుకు కర్మలను ఆచరించాలని అనుకోవద్దని అర్జునునికి చెబుతున్నాడు. ఎల్లప్పుడూ కర్మలను చేస్తూనే ఉండు. ఈ విషయము మూడవ అధ్యాయంలో తర్వాత వచ్చింది దాని గురించి మనం ముందే చెప్పుకున్నాం- "న హి కశ్చిత్క్షణమపి, జాతు తిష్ఠత్యకర్మకృత్" (3.5)- కర్మలను ఆచరించకుండా ఎవ్వరూ ఒక్క క్షణమైనా ఉండలేరు అని భగవంతుడు చెబుతున్నాడు. మనం కర్మలను చేయవలసినదే. మరి అలాంటప్పుడు మన కర్తవ్య కర్మలను ఎందుకు చేయకూడదు అని ఆలోచించాలి. ఫలితము ఎలాగూ లభిస్తుంది, దాని గురించి చింతింపనేల అని భగవంతుడు చెబుతున్నాడు. భగవద్గీతా ను ఆచరించడం ఈ శ్లోకముతో ప్రారంభమవుతుంది. భగవద్గీతా ను ఆచరణలోకి తీసుకురావడానికి రోజూ కనీసం ఒక కర్మనైనా ఆపేక్ష లేకుండా చేయాలి. ఎంత చిన్న కర్మైనా ఆపేక్ష లేకుండా చేసినప్పుడు అది కర్మయోగము అవుతుంది. భగవంతుడు ఇదే విషయాన్ని అర్జునునికి అలాంటి స్థితిలో ఉండి కర్మలను ఆచరించమని చెబుతాడు.
2.48
యోగస్థః(ఖ్) కురు కర్మాణి, సఙ్గ(న్) త్యక్త్వా ధనఞ్జయ৷
సిద్ధ్యసిద్ధ్యోః(స్) సమో భూత్వా , సమత్వం(య్ఁ) యోగ ఉచ్యతే॥2.48॥
ఓ ధనంజయా! యోగస్థితుడవై ఆసక్తిని వీడి, సిద్ది-అసిద్దుల యెడ సమత్వ భావమును కలిగియుండి, కర్తవ్యకర్మలను ఆచరింపుము. ఈ సమత్వభావమునే యోగమందురు.
ఇక్కడ భగవంతుడు ఏమి చెబుతున్నాడు అంటే, యోగస్థః- యోగములో స్థితుడవై, ఈ కర్మ యోగాన్ని ఆచరణలో పెడుతూ, ఏదో ఒక కార్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేస్తూ ఉండాలి. మంచి కార్యములను చేసినట్లయితే జనుల ద్వారా పేరు ప్రతిష్టలు, సన్మానము లభిస్తుందన్న ఆలోచన ఉండకూడదు. ఇక్కడ గీతా ను ఆచరణలోకి తీసుకు వచ్చినప్పుడు కలిగే అనుభూతి లభిస్తుంది. భగవద్గీతా యోగ శాస్త్రము, శాస్త్రము అంటే విజ్ఞానము (science). దీనిని ఆచరణలో పెట్టనంతవరకు (practical) అర్థం చేసుకోలేము. అందుకే స్వామీజీ మహారాజ్ గీతా ను చదవండి, చదివించండి, ఆచరణలోకి తీసుకురండి అని ఎల్లప్పుడూ చెబుతుంటారు. గీతా ను ఆచరణలోకి తీసుకురావడానికి ఇలా ఏదో ఒక కర్తవ్య కర్మను చేయాలి. ఆపేక్ష లేకుండా ఏదో ఒక మంచి పని చేస్తూ ఉండాలి. యోగస్థః(ఖ్) కురు కర్మాణి- ఈ యోగములో స్థితుడవై కర్మలను ఆచరింపుము అని భగవంతుడు చెబుతున్నాడు. సఙ్గ(న్)- అంటే ఆసక్తి. ఆసక్తి అంటే అతుక్కోవడం. సక్త అంటే అతుక్కోవడము. ఆసక్త అంటే గట్టిగా అతుక్కోవడము. మనం మన మనసు ద్వారా అతుక్కుపోతాము. నేను ఎంతో మంచి పని చేశాను, ఇది అందరికీ తెలియాలి అన్నది ఆసక్తి. మనసులో ఇటువంటి ఆలోచనలు రావడం, అంటే ఆ కర్మఫలమును అంటి పెట్టుకోవడము, త్యక్త్వా- అంటే విడిచి పెట్టుము. ఆసక్తిని విడిచిపెట్టమని అర్థము. సిద్ధ్య అసిద్ధ్య - ఒక కార్యము పూర్తి అయినది, లేదా ఎంతో ప్రయాసపడినప్పటికీ అది పూర్తి కాలేదు, సమో భూత్వా- వీటిపై మనసులో సమత్వ భావన ఉన్నప్పుడు, ఆసక్తి లేనప్పుడు, మనసు దానంతటదే శాంతితో ఉంటుంది. అటువంటి మనిషి ఎప్పుడూ ఓడిపోడు. శాంతితో తన ధ్యేయాన్ని చేరుకోవడానికి విచలితుడై సాగిపోతూ ఉంటాడు. ఆపేక్ష ఉన్నట్లయితే కర్మఫలము సిద్ధించనప్పుడు విచారములో మునిగిపోతాడు. సిద్ధి-అసిద్ధిలో సమత్వ భావనతో ఉండటమే యోగము. యోగముపై మొదటి వ్యాఖ్యానము ఇక్కడ వచ్చినది. సమత్వం యోగ ఉచ్యతే- సమత్వాన్ని యోగము అని భగవంతుడు చెబుతున్నాడు. ఎటువంటి పరిస్థితులలోనైనా చిత్తమును సమస్థితిలో ఉంచుకోగలగటమే యోగము. ఎక్కడైతే మనసు, బుద్ధి రెండూ సమముగా ఉంటాయో, సిద్ధి- అసిద్ధిలో ఒకే రకంగా ఉంటారో వారు యోగ స్థితిని పొందినట్లు.
దూరేణ హ్యవరం(ఙ్) కర్మ, బుద్ధియోగాద్ధనఞ్జయ৷
బుద్ధౌ శరణమన్విచ్ఛ,కృపణాః(ఫ్)ఫలహేతవః৷৷49॥
ఈ సమత్వబుద్ధియోగముకంటెను సకామకర్మ మిక్కిలి నిమ్నశ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయా! నీవు సమత్వబుద్ధియోగమునే ఆశ్రయింపుము - ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంతదీనులు, కృపణులు.
సమత్వ బుద్ధితో కర్మలను ఆచరిస్తే ఏమి ప్రాప్తిస్తుందో మనకు అనుభవపూర్వకంగానే తెలుస్తుంది. చిత్తము స్థిరము అవుతుంది, మనసు, బుద్ధి శాంతితో ఉంటాయి. కాని మనం అన్ని పనులను అలా చేయలేము. దూరేణ హ్యవరం(ఙ్) కర్మ- ఈ సమత్వ బుద్ధిని విడిచి చేసే కర్మలు నీచ శ్రేణి లోకి వస్తాయి. సమత్వ భావనతో, నిష్కామ బుద్ధితో చేసే కర్మలు ఉచ్ఛ శ్రేణివిగా ఉంటాయి. ఏదైనా కర్మ ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తే ఉచ్ఛశ్రేణిది అవుతుంది, అదే కర్మను ఫలాపేక్షతో చేస్తే తక్కువ శ్రేణిది అవుతుంది. అపేక్షతో ఉన్నవారు దీనులు, వారు ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారు. రామాయణంలో కేవటుడి గురించి అందరికీ తెలుసు. అతడు తన నౌకలో రాముణ్ణి నది దాటించాడు. నది దాటిన తర్వాత శ్రీరాముడు తన స్వర్ణముద్రికను అతనికి ఇవ్వబోతే, అతడు నిరాకరించి మీ పాద స్పర్శ నా నౌకను పావనం చేసింది, ఇంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు. ప్రభువుకు సేవ చేసిన తరువాత అతడు మాట్లాడిన మాటలతో ఆతని కార్యము ఎంతో ఉచ్చ శ్రేణిదిగా పరిణతి చెందినది. బుద్ధియోగాద్ధనఞ్జయ- ఆపేక్షతో, కోరికలతో చేసే కర్మ కూడా మంచి కర్మయే. కేవటుడు నది దాటించిన తర్వాత రాముడి నుంచి స్వర్ణముద్రిక తీసుకున్నట్టయితే అది తప్పేమీ కాదు. అతడు చేసిన పనికి ప్రతిఫలాన్ని తీసుకుంటున్నాడు. కాని ప్రభు సేవాభావముతో చేసినప్పుడు అది ఉచ్ఛ శ్రేణిదిగా అవుతుంది. హ్యవర అంటే నీచ శ్రేనిదిగా అవుతుంది. ఎంతోమంది ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. అందర్నీ కర్మయోగులంటారా? కర్మ, కర్మయోగములో వ్యత్యాసము ఏమిటి? నిష్కామ కర్మలు కర్మయోగము అవుతాయి. లేకపోతే అది కర్మ మాత్రమే అవుతుంది. కనీసం ఏదో ఒక కర్మను నిష్కామ భావంతో ఆచరిస్తే మనం గీతా ను ఆచరణలోకి తీసుకురావడం ప్రారంభమవుతుంది. బుద్ధౌ శరణమన్విచ్ఛ- ఈ కర్మయోగ బుద్ధిని నీవు ఆచరణలో తీసుకురమ్మని భగవంతుడు చెబుతున్నాడు. దీన్ని ఆశ్రయముగా తీసుకొని నీవు కార్యములను నిర్వర్తించుము. కృపణాః(ఫ్)ఫలహేతవః- ప్రతిఫలాన్ని హేతువుగా భావించేవారు అత్యంత కృపణులు, ధీనులు, అర్థించేవారు. ఇది కర్మయోగి, కార్మికులలో అంతరము. అటువంటి బుద్ధియోగముతో కర్మలను చేయడం వల్ల ఏమి ప్రాప్తిస్తుంది? ఇటువంటి ఆలోచనలు మనకు వెంటనే కలుగుతాయి.
బుద్ధియుక్తో జహాతీహ, ఉభే సుకృతదుష్కృతే৷
తస్మాద్యోగాయ యుజ్యస్వ, యోగః(ఖ్) కర్మసు కౌశలమ్৷৷50॥
సమత్వ బుద్ధియుక్తుడైనవాడు పుణ్య పాపములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వబుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇదియే కర్మాచరణమునందు కౌశలము. అనగాకర్మబంధములనుండి ముక్తుడగుటకు ఇదియే మార్గము.
బుద్ధియుక్తః- ఈ కర్మయోగబుద్ధితో ఎవరైతే కర్మల నాచరిస్తారో, జహాతీహ ఉభే సుకృతదుష్కృతే- మనం మంచి పనులు చేసినప్పుడు కూడా ఒక్కోసారి తప్పులు జరుగుతూ ఉంటాయి. అది పాపముగా చెప్పబడుతుంది. మంచి జరిగితే అది పుణ్యం గా చెప్పబడుతుంది. పాప పుణ్య కార్యములు మన ద్వారా ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. మనం మంచి బుద్ధితో చేసినా కొన్ని తప్పులు దొర్ల వచ్చును. ఉదాహరణకి మనం దేవుని దర్శనానికై గుడికి వెళుతున్నప్పుడు పొరపాటున కాళ్ళ కింద పడి కొన్ని చీమలు చనిపోవచ్చును. ఇది మన వలన జరిగిన తప్పా కాదా? ఇది పాపమా కాదా? మనం ఏమీ ఆశించకుండా భగవంతుని దర్శనము కర్తవ్యంగా భావించి గుడికి వెళుతున్నట్లయితే ఈ పాప పుణ్యములన్నీ కూడా త్యాగము అయిపోతాయి, తొలగిపోతాయి. ఎందుకంటే ఇక్కడ మనకు ఆపేక్ష లేదు. భగవంతుని ముందు నిలబడి ప్రార్థన చేసినప్పుడు ప్రతిసారి మనకు కోరికలు ఉండవు కదా. తల్లిదండ్రులకు నమస్కరించినప్పుడు ప్రతిసారి అపేక్షతో చేయము. దీన్ని మనం కర్తవ్యభావంతో చేస్తాము. ఇటువంటి కర్మలను ఆచరించినప్పుడు తప్పులు దొర్లినా అవి నష్టమైపోతాయి. సుకృతి - పుణ్యము ప్రాప్తించదు, అలాగే దుష్కృతి- పాపములు తగలవు. పుణ్యము లభించకపోతే మనం దీన్ని ఎందుకు చేయాలన్న భావన మనలో రావచ్చును. ముక్తుడు అవ్వాలనుకున్నవారికి పుణ్యముపై ఆపేక్ష ఉన్నా కర్మలు వారికి అతుక్కుంటాయి. దీనిని ఎప్పుడో ఒకప్పుడు అనుభవించవలసినదే. కర్మ సిద్ధాంతము అను ఒక గుజరాతి పుస్తకము ఉన్నది. ఇందులో ఒక ఉదాహరణగా ఆదాయ వ్యయాల లెక్కింపు గురించి చెప్పారు. దీనిలాగే మన పాప పుణ్యాల చిట్టా కూడా ఉంటుంది. ఇది నేను చేశాను అన్న భావముతో చేస్తే దాని ప్రతిఫలము మనకు దక్కవలసినదే. మంచి చెడు కర్మలను అనుసరించి పాప పుణ్యముల జమ జరుగుతూ ఉంటుంది. జమ అయిన పాప పుణ్యములు కూడా మనతో వస్తాయి. మన ముందు జన్మలలో చేసిన పాపపుణ్యముల ఫలము అనుభవించవలసి ఉన్నది అందుకే ఈ జన్మ సంభవించినది. వీటి ప్రతిఫలము- సుఖదుఃఖాలు పాత జన్మల నుంచి వచ్చినవి, ఈ జన్మలో చేసుకున్నవి కూడా మనం అనుభవించవలసి ఉంటుంది. పాపములు పుణ్యముల నుంచి తీసివేయబడవు. పాపపుణ్యాలు రెండిటిని వేరువేరుగా సుఖదుఃఖాలుగా అనుభవించవలసి ఉంటుంది. ఈ పాప పుణ్యాలు సమాప్తం ఎలా అవుతాయి? పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యాల వల్ల ఈ జన్మము సంభవించినది. జన్మించిన తరువాత కర్మలను చేయక తప్పదు. న హి కశ్చిత్క్షణమపి, జాతు తిష్ఠత్యకర్మకృత్ (3.5) అని భగవంతుడే చెప్పాడు. ఈ జన్మలో చేసిన పాప పుణ్య కర్మలు ముందు జన్మల నుంచి వచ్చిన వాటితో కలిసి జమ అవుతూ ఉంటాయి. మనం కర్మలపై అపేక్ష వదలి, కర్తవ్య కర్మలను నిర్వహించినప్పుడు పాప పుణ్యాలు అన్నీ నశించిపోతాయి. ఈ లోకంలో బుద్ధియుక్తతతో కర్మలను ఆచరించిన వారికి పాపపుణ్యములన్ని సమాప్తం అయిపోతాయి. తస్మాద్యోగాయ యుజ్యస్వ- పాపపుణ్యాలన్నీ త్యాగం అయిపోయిన తర్వాత ఆ భావనలో ఉన్న వారికి ఇక జమ కావు. వారు ముక్తులు అయిపోతారు. బంధనాలనుంచి ముక్తులవుతారు. చిన్నప్పటినుంచి ముసలితనం వరకు మన శరీరము మార్పు చెందుతూ ఉంటుంది. కాని మనము మనము గానే ఉంటాము. ఈ శరీరంలో నేను ఉంటాను అంటే దాని అర్థం నాకు ఈ శరీరము ప్రాప్తించినది అందువల్లనే కర్మలు చేయవలసి వస్తోంది, నేను ఈ కర్మబంధనాలలో చిక్కుకున్నాను. ఈ కర్మబంధనముల నుంచి ముక్తి పొందాలి. ఫలాపేక్షపై ఆసక్తి లేకుండా కర్తవ్య కర్మలను ఆచరించినప్పుడు మనం ఈ కర్మబంధనాలనుంచి ముక్తులము కాగలుగుతాము. కర్మల ద్వారా మనకి ఏమి లభిస్తుందన్న దానిపై ఆలోచించకూడదు. ఇది కర్మయోగము అవుతుంది. అందుకే నీవు ఈ యోగాన్ని అనుసరించు అని భగవంతుడు చెబుతున్నాడు. యోగః(ఖ్) కర్మసు కౌశలమ్- ఇదే కర్మబంధనాలనుంచి తప్పించుకోవడానికి సులభమైన ఉపాయము. ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించిన రోజు మనసుకు శాంతి లభిస్తుంది. కర్తవ్యభావంతో కర్మలను ఆచరించిన మనుషులు యోగులు అయిపోతారు.
కర్మజం(మ్) బుద్ధియుక్తా హి, ఫలం(న్) త్యక్త్వా మనీషిణః৷
జన్మబన్ధవినిర్ముక్తాః(ఫ్),పదం(ఙ్) గచ్ఛన్త్యనామయమ్৷৷51॥
ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి, జనన మరణబంధములనుండి ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమైన పరమ పదమును పొందుదురు.
బుద్ధియుక్తా - ఈ బుద్ధిని ఆచరించువారు, మనీషిణః- ఎవరు దీనిని ఆచరిస్తారు, జ్ఞానులు, అన్నీ తెలిసినవారు దీనిని ఆచరిస్తారు. కర్మజం(మ్) ఫలం(న్) త్యక్త్వా- కర్మలతో ఉత్పన్నమయ్యే ఫలాలను త్యజించు. దాని గురించిన ఆలోచనలను మనం రానీయకూడదు. జన్మబన్ధవినిర్ముక్తాః(ఫ్),పదం(ఙ్) గచ్ఛన్త్యనామయమ్- అలా చేసిన వారు ఎక్కడైతే శుద్ధ ఆత్మ తత్వము ఉంటుందో, వికారములు లేకుండా ఉంటుందో అక్కడికి చేరుకుంటారు. అనామయ అంటే వికార రహితమని అర్థం. మన ఈ శరీరము వికారయుక్తము అయినది. అంటే అటువంటివారు పరమాత్మ పథాన్ని చేరుకుంటారు. నరుడు నారాయణుడు కాగలడు. విషయం చిన్నదైనా దాని ద్వారా మనిషికి అన్నిటికన్నా పెద్ద ధ్యేయము పరమాత్మ పథము లభిస్తుంది. జన్మ మరణ బంధనాల నుంచి విముక్తులవుతారు.
యదా తే మోహకలిలం(మ్), బుద్ధిర్వ్యతితరిష్యతి৷
తదా గన్తాసి నిర్వేదం(మ్), శ్రోతవ్యస్య శ్రుతస్య చ৷৷52॥
మోహమనెడి ఊబినుండి పూర్తిగా బయటబడినప్పుడే నీవు వినిన, వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు.
నీ యొక్క ఈ బుద్ధి మోహమనే ఊబి నుంచి బయటపడాలి. ఈ జీవితంలో ఆకర్షణీయమైన అనేక విషయాలు ఉంటాయి, వాటిపై మనసు వెళుతూనే ఉంటుంది. మనం వాటిని వదిలిపెట్టలేము. ఉదాహరణకి ఒకసారి WhatsApp ఖాతా తెరిస్తే దాని మోహంలో పడి ఎంత సమయం వృధా అవుతుందో మనకు తెలియదు. అలాగే మోహానికి గురి చేసే అనేక విషయాలు మన చుట్టూ ఉంటాయి. బుద్ధిర్వ్యతితరిష్యతి- నీ బుద్ధి ఈ మోహభరితమైన ఊబిని దాటి ముందుకు వెళ్లాలి. మన బుద్ధి ఒక ధ్యేయముపై ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న మొహాలనుంచి తప్పించుకోగలుగుతుంది. ఈ అధ్యాయములో మనము
వ్యవసాయాత్మికా బుద్ధిః(ర్), ఏకేహ కురునన్దన ।
బహుశాఖా హ్యనన్తాశ్చ, బుద్ధయో౽వ్యవసాయినామ్ ॥2.41॥
బహుశాఖా హ్యనన్తాశ్చ, బుద్ధయో౽వ్యవసాయినామ్ ॥2.41॥
అని చెప్పుకున్నాము. ముందే భగవంతుడు వ్యవసాయాత్మక బుద్ధి, అంటే నిశ్చయాత్మక బుద్ధి ఉండాలి అని చెప్పాడు. ఇక్కడ నిశ్చయము మన ధ్యేయముపై ఉండాలి. స్వార్థపూరిత లౌకిక విషయాలపై ఆసక్తి కలిగి ఉండటాన్ని కోరికలు అంటారు. అదే కోరికలు విశాలమైనప్పుడు, అంటే తన స్వార్థానికి కాకుండా సమాజ శ్రేయస్సు కొరకు ఉన్నట్లయితే దానిని కోరిక అనకుండా ధ్యేయము అంటారు. మనిషి చిత్తము, మనసు, అటువంటి ధ్యేయముపై స్థిరముగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఆకర్షణలు, కోరికలు, మోహములు వారిని బంధించలేవు. ఉదాహరణకి ఒక విద్యార్థి తనకు మంచి మార్కులు రావాలని ధ్యేయంగా పెట్టుకుంటే అతడిని టీవీలో వచ్చే క్రికెట్, ఫుట్బాల్ లాంటి ఆకర్షణలు చదువు నుంచి బయటకు తీసుకురాలేవు. విద్యార్థికి చదువుకోవడం ధ్యేయమే అవుతుంది ఎందుకంటే అది అతని కర్తవ్య కర్మ. నిశ్చయాత్మక బుద్ధి ఉండటం వల్ల అతడు మోహపు ఊబిని దాటుకుని ముందుకు వెళ్లగలుగుతాడు. తదా గన్తాసి నిర్వేదం(మ్), శ్రోతవ్యస్య శ్రుతస్య చ- ఇప్పుడు మనకి ఏమి ప్రాప్తిస్తుంది. నీవు ఇప్పటి వరకు విన్న స్వర్గబోగాలు ఏవి కూడా నిన్ను ఆకర్షించలేవు. నిశ్చయాత్మక బుద్ధితో ఉన్నప్పుడు ఈ మొహాలన్నీ నిన్ను చలింప చేయలేవు. మీకు నిర్వేదం ప్రాప్తిస్తుంది. నిర్వేదము అంటే వైరాగ్యము అని అర్థము. వైరాగ్యం అంటే కుటుంబాన్ని వదిలిపెట్టి, కాషాయ వస్త్రాలను ధరించి ఇంటికి దూరంగా ఉండటం కాదని అర్థం చేసుకోవాలి. వైరాగ్యము అంటే వి రాగము అంటే రాగం నుంచి విముక్తుడైనట్లు, ఆసక్తి లేకుండా ఉన్నట్లు. ఆసక్తి నుంచి ముక్తి పొందితే మోహము నుంచి ముక్తి పొందినట్లు. మొహానికే కదా ఆసక్తి ఉండేది. మనిషి ధ్యేయాసక్తి తో ఉన్నప్పుడు మోహాసక్తి వదిలిపెడతాడు. వారు ఆసక్తి నుంచి ముక్తి పొంది వైరాగ్యాన్ని పొందుతారు.
శ్రుతివిప్రతిపన్నా తే, యదా స్థాస్యతి నిశ్చలా৷
సమాధావచలా బుద్ధిః(స్),తదా యోగమవాప్స్యసి৷৷53॥
నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన ( అయోమయమునకు గురియైన) నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మతో నిత్య ( శాశ్వత) సంయోగము ఏర్పడును.
శ్రుతివిప్రతిపన్నా- అనేక రకమైన విషయాలు వేదములలో చెప్పబడినవి. వేదములు మనకు తల్లి లాంటివి. ప్రతీ తల్లి తన బిడ్డలు సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకే వేదములలో అనేక రకములైన ఉపాయములు చెప్పబడినవి. కాని ధ్యేయాసక్తుడైన మనిషి ఈ సుఖాలను కోరుకోడు, ఆసక్తి ఉండదు. వారు వేదాంతములను కోరుకుంటారు. వేదములను మించిన ఆత్మ తత్వాన్ని, ఆ పరమాత్మను సాధించాలనుకున్న వారు, ఈ మనుష్య జన్మ సద్వినియోగం చేసుకొని నరుడు నుంచి నారాయణుడిగా మారాలని కోరుకుంటారు. కర్మ ఫలాపేక్ష అతన్ని చలింప చేయలేదు. నీ బుద్ధి సమాధి. సమాధి అంటే పరమాత్మ. అష్టాంగ యోగము అంతిమ ధ్యేయము ఆ పరమాత్మతో ఏకరూపతను సాధించడము. అలా చేయడం వల్ల నీ బుద్ధి ధ్యేయముపై స్థిరత్వాన్ని సాధించి యోగము సమాధి స్థితిని పొందుతుంది. యోగము అంటే కలిసి ఏకత్వాన్ని సాధించడం. జీవాత్మ పరమాత్మతో ఏకరూపతను పొందుతుంది. ధ్యేయము తప్ప వేరే ఏది కనిపించనప్పుడు అతని ప్రజ్ఞ, బుద్ధి స్థిరమవుతుంది. అలా ప్రజ్ఞ, బుద్ధి స్థిరమైన వ్యక్తి అసలు ఏమైనా చేస్తాడా అని అర్జునుడు భగవంతుడిని అడుగుతాడు-
అర్జున ఉవాచ
స్థితప్రజ్ఞస్య కా భాషా, సమాధిస్థస్య కేశవ৷
స్థితధీః(ఖ్) కిం(మ్) ప్రభాషేత, కిమాసీత వ్రజేత కిమ్৷৷54॥
అర్జునుడు పలికెను - ఓ కేశవా! సమాధిస్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములెవ్వి? అతడు ఎట్లు భాషించును? ఎట్లు కూర్చొనును? ఎట్లు నడుచును?
స్థితప్రజ్ఞస్య కా భాషా- భాషా అంటే వ్యాఖ్యానము (definition). స్థితప్రజ్ఞులని ఎవరిని అంటారు, వారు ఎలా ఉంటారు? బుద్ధి అలా ధ్యేయముపై స్థిరము అయిన వారిని, సమాధిని అనగా పరమాత్మతో ఏకరూపులైనవారిని ఎలా గుర్తుపట్టగలము, వారి లక్షణాలు ఏమిటి? అని అర్జునుడు భగవంతుడిని అడుగుతున్నాడు. స్థితధీః(ఖ్) కిం(మ్) ప్రభాషేత- స్థిర బుద్ధి కలిగిన అటువంటివారు ఏమి మాట్లాడుతారు? ధ్యానంలో కూర్చుని ఉండిపోతారా లేకపోతే ఏమైనా మాట్లాడతారా? కిమాసీత- ఎలా కూర్చుంటారు? వ్రజేత కిమ్- ఎలా నడుస్తారు? మనం అటువంటి వ్యక్తిని ఎలా గుర్తుపట్టగలం. ఈ ప్రశ్న అడిగి అర్జునుడు మనకు ఎంతో ఉపకారం చేశాడు. ఎందుకంటే దీనికి సమాధానం ఇస్తూ భగవంతుడు సద్గుణాల గురించి ఎన్నో మాటలు చెప్పాడు. వీటిలో సద్గుణాల సూచిక ఉంటుంది, వీటిని ధారణ చేసిన వారు స్థితప్రజ్ఞులుగా చెప్పుకోవచ్చును. లేదా మనం స్థితప్రజ్ఞులు కావడానికి ఈ సద్గుణాలను ధారణ చేయడం నేర్చుకోవలెను. అటువంటి వ్యక్తిలా కావాలంటే ఏమి నేర్చుకోవాలి, ఆ వ్యక్తి గుణాలు ఏమిటో చూడాలి. మనకు, భగవద్గీతా కు, భగవంతుడికి ఆదర్శ వ్యక్తి ఎవరు అన్నది, అతడిని ఎలా గుర్తుపట్టాలి అని భగవంతుడు ఇక్కడ చెబుతాడు. 12వ అధ్యాయములో మనం భక్తుడి లక్షణాల గురించి తెలుసుకున్నాము. ఆ సద్గుణాలున్న వారు భగవంతుని భక్తులు అని తెలుసుకోవచ్చు. 13వ అధ్యాయములో జ్ఞాని లక్షణాలను చెప్పారు. 14వ అధ్యాయంలో భగవంతుడు గుణాతీతులను ఎలా గుర్తుపట్టాలో వారి లక్షణాలను చెప్పాడు. 16వ అధ్యాయంలో అన్ని సద్గుణాల సంపద దైవీ లక్షణాల గురించి చెప్పాడు. ఈ సద్గుణాలను అలవర్చుకోవడానికి, సాధన చేయడానికి జీవితం గడపాలి. మన మనసులో ధ్యేయజ్యోతి నిత్యము వెలుగుతూ, మన ధ్యేయము ఏమిటి, అంతిమ లక్ష్యము ఏమిటి, మనకు ఎందుకు ఈ మనుష్య జన్మ ప్రాప్తించినది, దీని ద్వారా భగవంతునికి నాపై ఏమి అపేక్ష ఉన్నది అని ఆసద్గుణాలకై సాధన చేయాలి. అప్పుడే మనం ఆ సద్గుణాలను పొందవచ్చును. ఈ జీవనము సంగ్రామమయమైనది. మనం నిత్యం బయట వేరే వారితో లోపల మనసుతో యుద్ధం చేస్తూనే ఉంటాము అని తుకారాం మహారాజ్ చెబుతారు. మనసులో ద్వంద్వము అంటే యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఏది మంచో ఏది చెడో అన్న మీమాంస ఎప్పుడూ ఉంటుంది. స్థితప్రజ్ఞ అంటే ప్రజ్ఞ స్థిరము అయినవారు. ప్రజ్ఞ అంటే శుద్ధ బుద్ధి. దోషము లేని, ధ్యేయముపై, పరమాత్మపై స్థిరమైన బుద్ధి. అటువంటి బుద్ధి కలిగిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. భగవంతుడు సుందరమైన సమాధానాన్ని ఇస్తున్నాడు-
శ్రీ భగవానువాచ
ప్రజహాతి యదా కామాన్, సర్వాన్పార్థ మనోగతాన్
ఆత్మన్యేవాత్మనా తుష్టః(స్), స్థితప్రజ్ఞస్తదోచ్యతే৷৷55॥
శ్రీ భగవానుడు పలికెను - ఓ అర్జునా! మనస్సునందలి కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి, ఆత్మద్వారా ఆత్మ యందు సంతుష్టుడైనవానిని, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందినవానిని స్థితప్రజ్ఞుడని యందురు.
స్థితప్రజ్ఞస్త తదా ఉచ్యతే- అప్పుడు అతడిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఎప్పుడు, తన కోరికలన్నిటిని త్యజించినప్పుడు. ధ్యేయముపై స్థిరమై ఉన్నప్పుడే కోరికలను వదిలిపెట్టగలుగుతారు. మనసులో నాకు ఏ కోరికలు లేవు, కేవలం ధ్యేయాన్ని మాత్రం చేరుకోవాలి అని ఉండాలి. అటువంటి చిత్తముతో ఉన్నవారికి మనసులో కోరికలన్నీ నశించిపోతాయి. నాకు ధ్యేయము తప్ప వేరే ఏదీ కనిపించదు. ధ్యేయము స్వార్థపూరితమైనది ఎప్పుడూ కాదు. ధ్యేయమునకు అర్థము విశాలమైనది. స్వార్థపూరితమైనది కోరిక అనబడుతుంది. వసుదైవ కుటుంబకం- ఈ విశ్వమంతా నా కుటుంబమే. ఇది విశాల దృష్టి కోణాన్ని సూచిస్తుంది. భగవంతుని ఆదర్శ వ్యక్తికి ఈ దృష్టి కోణం ఉంటుంది.
ఓం సర్వే భవన్తు సుఖినః సర్వే సంతు నిరామయాః ।
సర్వే భద్రాణి పశ్యన్తు మా కశ్చిద్దుఃభాగ్భవేత్ ।
సర్వే భద్రాణి పశ్యన్తు మా కశ్చిద్దుఃభాగ్భవేత్ ।
అందరూ సుఖంగా ఉంటే నేను కూడా సుఖంగా ఉంటాను. నేను మాత్రం బాగుండాలన్న భావన స్వార్థాన్ని సూచిస్తుంది. నేను అన్నది సమాప్తము అయిన తరువాత మిగిలేది పరమాత్మ. నేను అన్నది సమాప్తం కానంతవరకు హరి దర్శనము దొరకదు. సంత్ కబీర్ దాస్ చెప్పినట్లుగా
జబ మైం థా తబ హరి నహీం, అబ హరి హైం మైం నాఁహిం।
సబ అఁధియారా మిటి గయా, జబ దీపక దేఖ్యా మాఁహి॥
సబ అఁధియారా మిటి గయా, జబ దీపక దేఖ్యా మాఁహి॥
నేను ఉన్నంతకాలం హరి లేడు. ఇప్పుడు హరి ఉన్నాడు కాని నేను లేను. నేను, హరిలో ఎవరో ఒక్కరమే ఉండగలము. ఒకసారి హరి దర్శనము అయిన తరువాత నేను అన్నది సమాప్తం అయిపోతుంది. విశాల హృదయులు అవుతారు, సొంత కోరికలన్నీ సమాప్తం అయిపోతాయి. ఠాకూర్ శ్రీ రామకృష్ణ దేవ్ సమాధికి ముందు, అంతిమ దినములలో ఆయనకు క్యాన్సర్ రోగము సంక్రమించినది. రోగము గొంతులో వచ్చిన కారణముగా తీపి పదార్థాలతో పాటు కొన్నిటిని తినకూడదు అని చెప్పారు. ఆయన మిత్రులు, భక్తులు ఆయనకు ఇష్టమైన తీపి పదార్థాలను తీసుకువచ్చేవారు. ఆయన తినలేక పోవడం వల్ల బాధపడేవారు. దానిని చూసిన రామకృష్ణ దేవ్ మీరందరి నోటిద్వారా తింటున్నది ఎవరు తింటున్నారు? నేనే తింటున్నాను. అంతటి విశాల హృదయము ఆయనది. మీరందరూ సుఖిస్తే నేను ఆనందపడతాను. స్వయం కొరకై జీవించని వారిది ఇటువంటి విశాల హృదయము అవుతుంది. ఆత్మన్యేవాత్మనా తుష్టః- స్వయంగా తమలో తామే సంతుష్టులై ఉంటారు. అందరిలోనూ తనని చూసుకుంటారు. అందరిలోనూ ఉన్న పరమాత్మ తనలోను ఉన్నాడని గ్రహించినప్పుడు వారు సంతుష్టులైపోతారు. ఇతరులు సుఖంగా ఉంటే వీరు కూడా సుఖంగా ఉంటాయి. ఇతరులు దుఃఖంతో ఉంటే ఆ దుఃఖాన్ని ఎలా దూరం చేయాలని ప్రయాస చేస్తుంటారు. స్వయం ఆత్మ తత్వము, ఆ పరమాత్మతో సంతుష్టులై ఉంటారు. స్థితప్రజ్ఞస్తదోచ్యతే- అటువంటి అవస్థలో ఉన్న వారిని స్థితప్రజ్ఞులు అంటారు.
దుఃఖేష్వనుద్విగ్నమనాః(స్), సుఖేషు విగతస్పృహః৷
వీతరాగభయక్రోధః(స్), స్థితధీర్మునిరుచ్యతే৷৷56॥
దుఃఖములకు క్రుంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని, భయక్రోధములను వీడినవాడును ఐనట్టి మనన శీలుడు(ముని) స్థితప్రజ్ఞుడన బడును.
దుఃఖేష్వనుద్విగ్నమనాః- ఈ సంసారంలో సుఖదుఃఖాలు రెండు వస్తూనే ఉంటాయి. దుఃఖేష్వ- అంటే దుఃఖంలో అటువంటి వ్యక్తి ఉద్విగ్నుడు కాడు. ఉద్విగ్నత అంటే కోపము, చిరాకు కలగటము. స్థితప్రజ్ఞులకు ఉద్విగ్నత కలుగదు అని భగవంతుడు చెబుతున్నాడు. సుఖేషు విగతస్పృహః- అతడికి సుఖములపై కూడా ఎటువంటి ఆపేక్ష లేదు. సుఖ దుఃఖాలు రెండూ వచ్చి వెళ్లేవని అతనికి తెలుసు. అందువలన అతడికి సుఖము వచ్చినా, వెళ్లినా, దుఃఖము వచ్చినా, వెళ్లినా ఏమీ అనిపించదు. ఇవేవీ కూడా ఎల్లకాలం ఉండిపోవు. ఎల్లప్పుడూ ఉండేది ఆ పరమాత్మ మాత్రమే. అవ్యయము, అవినాశి అయిన ఆ పరమాత్మ ప్రాప్తియే నా లక్ష్యం. పరమాత్మను చేరుకున్న తర్వాత సుఖము ఉండదు అలాగే దుఃఖము కూడా ఉండదు. స్వతంత్ర సేనాని లోకమాన్య తిలక్ ఒకరోజు పంత్ గారికి ఒక వ్యాఖ్యానము రాయడానికి చెబుతున్నారు. మధ్యలో ఎవరో వచ్చి ఆయన చెవిలో ఏదో చెప్పారు. ఆయన పంత్ గారిని ఆగమని చెప్పి లోనికి వెళ్లి కొద్ది నిమిషములలో బయటికి వచ్చి మరల రాయడం ప్రారంభించమని పంత్ గారితో అన్నారు. పంత్ గారికి ఏమి జరిగినదో అర్థం కాలేదు. విచారించగా తెలిసినది ఏమిటి అంటే తిలక్ గారి 20-22 సంవత్సరాల కుమారుడు ప్లేగు వ్యాధితో మరణించాడని లోనికి వెళ్లి అతనికి ప్రణామము చేసి బయటకు వచ్చి మరల రాయడం ప్రారంభించమని చెబుతున్నారు. చకితులైన పంత్ గారు కుమారునికి మరణము సంభవించినది, దీని తరువాత రాసుకోవచ్చును, కేసరి పత్రిక ఒకరోజు రాకపోయినా ఏమీ కాదు అంటారు. దానికి తిలక్ గారు పట్నం అంతా ప్లేగు వ్యాధితో మండిపోతోంది, ఇది మా ఇంటి నుంచి ఆహుతి, ఏది ఏమైనా రేపు కేసరి పత్రిక బయటకు రావలసినదే, ఇది మన ధ్యేయం అంటారు. ఎంత పెద్ద దుఃఖము వచ్చినా తన కర్తవ్యాన్ని వదిలిపెట్టని వారు స్థితప్రజ్ఞులు. వీతరాగభయక్రోధః- రాగము (అంటే ఆసక్తి), భయము, క్రోధము (కోరికలు తీరకపోవడం వల్ల క్రోధము వస్తుంది) ఎవరికైతే సమాప్తం అయిపోతాయో వారు స్థితధీర్మునిరుచ్యతే- స్థిరమైన బుద్ధికల మునులుగా చెప్పబడుతారు. ముని అంటే తన ధ్యేయాన్ని మననము చేసేవాడు. ధ్యేయం తప్ప మనసులో వేరే ఏ ఆలోచనలు లేనివారు మునులు. పరమాత్మ తప్ప వేరే ఆలోచన లేనివారు మునులు.
యః(స్) సర్వత్రానభిస్నేహః(స్),త త్తత్ప్రాప్య శుభాశుభమ్৷
నాభినన్దతి న ద్వేష్టి, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా৷৷57॥
దేనియందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితు లయందు హర్షము, ప్రతికూల పరిస్థితులయందు ద్వేషము మొదలగు వికారములకు లోను గాని వాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును.
యః సర్వత్ర అనభి స్నేహః- అనభి స్నేహః అంటే అందరిపై సమదృష్టి అని అర్థం చేసుకోవాలి. నా వారు, పరాయివారు అన్న దృష్టి కాదు. సూర్యచంద్రులు తమ ప్రకాశాన్ని అందరికీ సమంగా ఇస్తారు. అలాగే వీరి దృష్టి ఉంటుంది. సర్వత్ర సమదృష్టి. తత్తత్ప్రాప్య శుభాశుభమ్- శుభము ప్రాప్తించినా, అశుభము ప్రాప్తించినా వీరు చలించరు. చంద్రబింబము తన ప్రకాశాన్ని సమంగా ఎలా ఇస్తుందో, అలాగే వీరి దృష్టి అందరిపై సమంగా ఉంటుందని జ్ఞానేశ్వర్ మహారాజ్ చెబుతారు. న అభినన్దతి న ద్వేష్టి- శుభ ప్రాప్తి కలిగినప్పుడు సుఖమువల్ల అత్యంత ఉత్తేజితులు కారు. అలాగే దుఃఖము ప్రాప్తించినప్పుడు దానిని ద్వేషించరు. వారు వర్తమానములో జీవిస్తారు. ఏమి వచ్చినా దాన్ని స్వీకరిస్తారు, ముందుకు సాగిపోతారు. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా- అటువంటి వారి శుద్ధ బుద్ధి ధ్యేయముపై ప్రతిష్ఠితము అయిపోయినది, అంటే స్థిరము అయినది అని తెలుసుకోవాలి.
యదా సంహరతే చాయం(ఙ్), కూర్మో౽ఙ్గానీవ సర్వశః৷
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యః(స్),తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా৷৷58॥
తాబేలు తనఅంగములను అన్నివైపులనుండి లోనికి ముడుచుకొనునట్లుగా, ఇంద్రియములను ఇంద్రియార్థముల (విషయాదుల) నుండి అన్నివిధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను.
భగవంతుడు తాబేలు ఉదాహరణ ఇస్తున్నాడు. తాబేలుకి ప్రమాదము ఎదురైనప్పుడు తన ఇంద్రియాలు అన్నింటిని లోపలకి తీసుకుంటుంది. అలాగే ఇంద్రియ విషయములు- కంటి విషయము దృశ్యము, ముక్కు విషయము వాసన, నాలుక విషయము రుచి, చర్మ విషయము స్పర్శ, చెవుల విషయము శబ్దము- ఇంద్రియములను ఆకర్షిస్తూ ఉంటాయి. మనిషి చిత్తము ధ్యేయముపై స్థిరముగా ఉన్నప్పుడు ఈ ఆకర్షణలన్నీ తనకు సంకటముతో సమానమని అతనికి తెలుస్తుంది. తాబేలు తన ఇంద్రియాలను లోపలికి తీసుకున్నట్లు ఇటువంటి వారు ఈ ఆకర్షణల నుంచి దూరంగా ఉండటానికి అంతర్ముఖులైపోతారు. దీనికి యోగములో ఉన్న సాధనాలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామము, ప్రత్యాహారము. ఇవి ఇంద్రియాలకు ఆహారముగా పనిచేస్తాయి. ఇంద్రియాలకు లోలోపలే ఆహారము ఉండటం వల్ల వాటికి బయట ఆకర్షణలతో పనిలేదు. అంతర్ముఖులై ధ్యేయముపై స్థిరులై వున్నప్పుడు వారు బయటి వైపుకు చెదిరిపోకుండా ఉంటారు. ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యః- ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుంచి ఈ విధముగా రక్షించుకున్న వారు, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా- అటువంటి వారి బుద్ధి ప్రతిష్ఠితమైనదని తెలుసుకోవాలి. కాని సామాన్య జనులకు ఇది సాధ్యమేనా. మనము ఒకసారి సంయమనము పాటించడానికి ప్రయత్నము చేస్తాము. ఏకాదశి రోజు ఉపవాసము ఉంటాము. ఫలాహారాన్ని మించి వేరే ఏ విధమైన పదార్థము భుజించకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాము. మనం ఇంద్రియాలు దూరం ఉంచగలిగినప్పటికీ మనసులో మాత్రం ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి.
విషయా వినివర్తన్తే,నిరాహారస్య దేహినః৷
రసవర్జం(మ్) రసో౽ప్యస్య,పరం(న్) దృష్ట్వా నివర్తతే৷৷59॥
ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహంపనివానినుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును. కాని వాటి పై ఆసక్తి మిగిలిముండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందు వలన వానినుండి ఆ ఆసక్తిగూడ తొలగిపోవును.
ఇంద్రియములను ఆహారం నుంచి దూరము పెట్టగలిగాము. కాని విషయాల గురించి మనసులో చింతన చేస్తున్నాము. ధ్యేయముతో పరమాత్మ తప్ప వేరొకటి మనసులో లేనివారికి, రసవర్జం రసో౽ప్యస్య- రసాన్ని, రసాసక్తిని వదిలిపెట్టిన వారు, విషయాన్ని దూరం పెట్టాలి, అలాగే దానిపై ఆసక్తి కూడా ఉండకూడదు. వారికి ప్రజ్ఞ స్థిరమైనదిగా చెబుతారు. ఒక గ్రామంలో కీర్తనలు పాడటానికి ఒక భజన బృందాన్ని పిలిచారు. ఎంతో చక్కగా కార్యక్రమం జరిగింది. బృందాన్ని చాలా చక్కగా అభినందించారు గ్రామస్తులు. తర్వాతి సంవత్సరం కూడా అదే భజన బృందాన్ని కీర్తనలు పాడటానికి ఆహ్వానించారు. ఒకరు ముందు సంవత్సరం ఎంతో బాగా అయింది అంటారు. అందుకు బృందంలో ఒకరు అవును ముందు సంవత్సరం పాలకోవా చాలా బాగా చేశారు అంటారు. దానికి మొదటి వ్యక్తి నేను పాలకోవ గురించి మాట్లాడటం లేదు, ఆరోజు నువ్వు తిన్న పాలకోవను పొట్టలో నిప్పుకున్నావా, లేక మెదడులో నింపుకున్నావా అంటాడు. రసవర్జం(మ్) రసో౽ప్యస్య- విషయాన్ని మెదడులో నుంచి కూడా తీసేయాలి. ఇది మహాత్వపూర్ణమైనది. మనందరికీ మూడు కోతుల కథ గురించి తెలుసు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని చెబుతారు. ఈ మూడు ఉంటే మాత్రం సరిపోదు ఎందుకంటే ఇంద్రియములన్నింటినీ నియంత్రించి ఉంచినా మనసు విషయములపై ఆలోచిస్తూ ఉంటుంది. మనసును ఎలా నియంత్రించాలి, దానిపై ఎలా విజయం సాధించాలి అన్నది ఇక్కడ తెలుస్తుంది. విషయముల నుంచే కాకుండా, విషయములపై ఉన్న ఆసక్తి నుంచి కూడా నివృత్తి కావాలి.
యతతో హ్యపి కౌన్తేయ,పురుషస్య విపశ్చితః৷
ఇన్ద్రియాణి ప్రమాథీని,హరన్తి ప్రసభం(మ్) మనః৷৷60॥
ఓ అర్జునా! ఇంద్రియములు ప్రమథనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను, ఆసక్తి తొలగి పోనంతవఱకును అవి అతని మనస్సును ఇంద్రియార్థములవైపు బలవంతముగా లాగికొనిపోవుచునే యుండును.
ఇంద్రియములు, మనసు చంచలమైనవి దేని మాటా వినవు. యతతా హ్యపి- ప్రయత్నం చేసేవారు, విపశ్చితః- జ్ఞాని, బుద్ధిమంతుడు, అన్నీ తెలిసిన వాడు, ఇది నేను చేయకూడనిది అని అర్థం చేసుకున్న వాడిని కూడా ఈ ఇంద్రియములు మరలా మరలా ఇంద్రియ వస్తు విషయముల వైపు తీసుకు వెళుతూ ఉంటాయి. మనసు ఇంద్రియములకు మాటిమాటికి విషయములను గుర్తు చేస్తూ ఉంటుంది. చక్కెర వ్యాధి ఉన్నవారికి తీపి తినకూడదని తెలుసు అయినా ఇంద్రియములు, మనసు తీపి వైపు లాగుతూనే ఉంటాయి. ఇన్ద్రియాణి ప్రమాథీని- ఇంద్రియముల స్వభావమే అటువంటిది. విషయములు మనసును బలవంతముగా హరిస్తాయి. వీటిపై విజయం సాధించటం చాలా కష్టం. అందుకే అర్జునుడు ఆరవ అధ్యాయంలో ఈ విధంగా ప్రశ్నిస్తాడు-
చఞ్చలం(మ్) హి మనః(ఖ్) కృష్ణ, ప్రమాథి బలవద్దృఢమ్ ।
తస్యాహం(న్) నిగ్రహం(మ్) మన్యే, వాయోరివ సుదుష్కరమ్ (6.34)
తస్యాహం(న్) నిగ్రహం(మ్) మన్యే, వాయోరివ సుదుష్కరమ్ (6.34)
మనిషి ఏమి చేయకూడదో తెలిసి కూడా అదే పని చేస్తాడు. అర్థమవుతుంది గాని అలా జరగదు అని మరాఠీలో ఒక సూక్తి ఉన్నది. నిజంగా అర్థం అయి ఉంటే మనం అలా చేయకూడదు. చేస్తున్నామంటే మనకు అది నిజంగా అర్థమైనట్టు కాదు. ఆపుకోలేము అంటే అర్థం చేసుకోలేదు అని అర్థం. ఈ ఆత్మను ఎలా సంయమనము చేయాలో ఆరవ అధ్యాయంలో భగవంతుడు సుందర రూపంలో వర్ణించాడు. జ్ఞానులకు కూడా దీనిని నియంత్రించడం కఠినము. విశ్వామిత్రుడు లాంటి ఋషికి కూడా 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత మేనకలాంటి అప్సరస కనపడగానే ఇంద్రియములు అదుపుతప్పి చేసిన తపస్సంతా వ్యర్థము అయినది. తరువాత అతనికి జాగృతము అయినది, మరలా ప్రయాస మొదలుపెట్టాడు. ఆయనకు బ్రహ్మర్షి కావాలన్న ధ్యేయము గట్టిగా ఉన్నది. మరలా 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఇంద్రుడు రంభను పంపిస్తాడు. రూపముతో విచలితుడను చేయలేనని గ్రహించిన రంభ అతనికి సేవ చేయడం ప్రారంభిస్తుంది. ఒకరోజు కావాలనే ఆమె సేవ చేయడం మానేస్తుంది. దానితో విశ్వామిత్రునికి క్రోధము వస్తుంది. క్రోధము రావడం వల్ల అప్పటివరకు చేసిన 12 సంవత్సరాల తపస్సు మరల వ్యర్థము అవుతుంది. విశ్వామిత్రుడు మరలా తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. ఇది చాలా కష్టము. విశ్వామిత్రుడు లాంటి ఋషికి కూడా ఇంద్రియములు, మనస్సు బలవంతముగా నిగ్రహము కోల్పోయేలా చేశాయి. కాని ఏ మనిషి అయితే వీటిని నిగ్రహించుకోగలడో అతడిని స్థితప్రజ్ఞుడు అంటారు. మన ఆదర్శము ఎంతో ఎత్తైనది, ఎత్తులోనే ఉండాలి. Not failure but low aim is crime. ఓటమి కాదు చిన్న ధ్యేయము నేరము అని దీని అర్థం. పరమాత్మ ప్రాప్తి పొందాలన్న మన ధ్యేయము ఎప్పుడు తక్కువ చేయరాదు. ఇక్కడ చెప్పిన వాటిని ప్రయాసతో సాధించి ఉత్తమ గతులను చేరుకోవాలి అంటూ వివేచనకు విరామము ప్రకటించారు.
ప్రశ్నోత్తరాలు
ప్రశ్న- "యోగసు కర్మసు కౌశలం" గురించి ఇంకొంచెం వివరంగా చెప్పండి.
సమాధానము- కర్మలు ఆచరించడంలో కుశలత యోగము ఇది ఒక అర్థం కావచ్చును. ఇంకొకటి యోగముతో చేసే కర్మలు కౌశలం, ఇవి కర్మబంధనలనుంచి ముక్తులను చేస్తాయి. ఇది కర్మబంధనముల నుంచి విముక్తి చేసే ఉపాయము. అనపేక్ష భావనతో, ధ్యేయము కొరకు, కోరికలు లేకుండా కర్మలను చేయడము యోగముగా చెప్పబడినది.
ప్రశ్న- అనాసక్త కర్మలాగే అనాసక్త భక్తి కూడా ఉంటుందా?
సమాధానము- ఉండదు. భక్తికి అర్థము ఆసక్తి. భక్తికి అర్థము అతుక్కోవడము, ఒకటి కావడం. ఆత్మ రూపానికి ఆసక్తులు కావడమే భక్తి. భగవంతుడు నుంచి వేరు కాని వారు భక్తులు. అనాసక్త కర్మయోగము కన్నా, ధ్యేయముపై ఆసక్తితో ఉన్న కర్మయోగము తేలిక. ఆసక్తి లేకుండా కర్మలను ఆచరించడం కఠినము, అర్థం చేసుకోవడం కూడా కఠినము. ధ్యేయముపై ఆసక్తితో కర్మలను చేయమని చెప్పడం సరళము. ఇక్కడ ధ్యేయము మరియు కోరికల మధ్య ఉన్న తేడాను తెలుసుకోవాలి.
ప్రశ్న- భగవంతుడు బుద్ధియోగము గురించి చెప్పాడు. బుద్ధి సమత్వ భావముతో సంతులలో లీనమైపోయినది. ఇక్కడ దానిని కర్మయోగము దృష్టితో చూపించారు. జ్ఞాన యోగము, భక్తి యోగములో కూడా ఈ బుద్ధి యోగాన్ని చెప్పుకోవచ్చునా?
సమాధానము- ఇక్కడ దీని అర్థము యోగబుద్ధి అని. కర్మయోగము యొక్క బుద్ధి. ఏదైనా పదానికి అర్థం చెప్పుకున్నప్పుడు దాన్ని సందర్భాన్ని బట్టి చెప్పుకోవాల్సి ఉంటుంది. మన బుద్ధి విశ్లేషణ చేస్తుంది. మనసులో భావన ఉంటుంది. భక్తి భావానికి సంబంధించిన విషయం. మనసుకు సంబంధించిన విషయము. ఏదైనా తెలుసుకోవాలంటే అది బుద్ధి ద్వారా అవుతుంది. బుద్ధితో ఆ పరమాత్మ గురించి తెలుసుకుంటూ, మనసుతో ఆ పరమాత్మను ప్రేమిస్తూ ముందుకు వెళ్లాలి. ఇక్కడ బుద్ధియుక్త అని చెప్పారు. దాని అర్థము బుద్ధితో పరిపూర్ణము. కర్మయోగ బుద్ధితో పరిపూర్ణము అని అర్థం.
ప్రశ్న- లక్ష్యము లేకుండా కర్మలను ఆచరించడం ఎలా? కర్మకు లక్ష్యము ఉండాలి కదా.
సమాధానము- ధ్యేయము లేని జీవితము చుక్కాని లేని నావ లాంటిది. చాలామందికి ఏ ధ్యేయము లేకుండానే జీవితం నడుస్తూ ఉంటుంది. ముందుగా నిశ్చయము అవ్వాలి. భగవద్గీతా మనకు ధ్యేయాన్ని నేర్పిస్తుంది. ధ్యేయము ఎప్పుడు విశాలమైనదై ఉండాలి. స్వార్ధప్రేరితమై ఉండకూడదు. జీవితానికి దిశను చూపిస్తుంది భగవద్గీత.
అంతిమ ప్రార్ధన, హనుమాన్ చాలీసా సామూహిక పఠణముతో ఈనాటి వివేచన కార్యక్రమము ముగిసినది.
శ్రీ కృష్ణార్పణమస్తు.