विवेचन सारांश
శాస్త్రమే ప్రమాణము

ID: 4257
तेलुगू - తెలుగు
శనివారం, 13 జనవరి 2024
అధ్యాయము 16: దైవాసుర సంపద్విభాగ యోగము
2/2 (శ్లోకము 8-24)
వివేచకులు: గీత విశారద శ్రీ శ్రీనివాస వర్ణేకర్ గారు/


సాంప్రదాయానుగుణంగా దీప ప్రజ్వలన ,శ్రీకృష్ణ ప్రార్ధన మరియు సరస్వతీ ప్రార్థనతో వివేచనా కార్యక్రమము ప్రారంభమైనది. శ్రీ శ్రీనివాస్ జీ  వర్ణేకర్ గారు  గురువందన, భగవద్గీతా ప్రార్థనా  శ్లోకములతో తమ వివేచనను మొదలుపెట్టారు. భగవంతుడు మన ద్వారం ముందు వచ్చి నిలిస్తే అది భక్తి. ఇప్పుడు భగవద్గీతాను మనము చేతిలో పట్టుకుని అభ్యాసం చేస్తున్నాము. భగవద్గీతా అంటే ఒక పుస్తకం కాదు, ఇది సాక్షాత్తు పరమాత్ముని వాంఙ్మయ రూపిణి.  భగవద్గీతా ని అభ్యసిస్తున్నప్పుడు పరమాత్ముడికి చాలా దగ్గరగా ఉంటాము. ఈ దైవాసుర సంపద్విభాగయోగంలో  మనం 26 దైవీ గుణాలను గురించి తెలుసుకున్నాము. ఇవి మనం చేసుకునే అలంకారాల వంటివి. అలంకారాలను ధరించే ముందు శరీరాన్ని శుభ్రపరచుకోవడం అవసరం. అదేవిధంగా మనం ఆసురీ గుణాలను విసర్జించి, మన శరీరాన్ని, మనసును, బుద్ధిని శుభ్రపరచుకోవాలి. ఈ అధ్యాయం మనకు ఒక దర్పణం లాంటిది. మనం అద్దంలో చూసి ఎలా మనల్ని తీర్చిదిద్దుకుంటామో, అదేవిధంగా ఈ అధ్యాయాన్ని అభ్యసించడం వల్ల మనలో ఏ విధమైన అసురీగుణాలు ఉన్నాయని విశ్లేషించుకోగలము. మనం ఈ అధ్యాయాన్ని అభ్యసించేటప్పుడు ఎదుటివారిలో ఈ విధమైన  అసురీ గుణాలు ఉన్నాయా అని పరిశీలించడం కాదు; మనలో ఉన్నాయా లేదా అని ఆత్మ విశ్లేషణ చేసుకోవడం ముఖ్యం. మనం చేయాల్సిన పనులలో మన ప్రవృత్తి ఉండాలి. శాస్త్రవిహితం కాని పనులు చేసేటప్పుడు నివృత్తి ఉండాలి. ఇది ఏమీ తెలియని వారు అసురీ ప్రవృత్తి కలిగిన వాళ్లు. వారికి సత్యము,  శౌచము, ఆచారము ఉండదు. ద్రోణాచార్యుడు కౌరవ, పాండవులకు గురువు. వారికి పాఠం చెబుతూ ఆయన
 'సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయాన్మా న  ప్రమద' ..      ఇటువంటి వాక్యాలని  చెప్తూ.. ఇవన్నీ రేపటిలోగా కంఠస్థం చేసి చెప్పాలని అన్నాడు. ధర్మరాజు తప్ప మిగిలిన అందరూ కంఠస్థం చేసి చెప్పారు. ఆయనని 'నీవెందుకు  కంఠస్థం చేయలేదు '..అని అడిగితే  'మొదటి వాక్యమే నాకు కంఠస్థం చేయడానికి వీలు కాలేదు. ఎప్పుడూ నిజమే చెబుతూ ఉండడం ఆచరణలో ఎంత కఠినమో నాకు అర్థం అవుతూ ఉంది. మరి ఆచరించకుండా కంఠస్థం చేయడం ఎలా?' అని అడిగాడు ఆయన.

16.8

అసత్యమప్రతిష్ఠం(న్) తే, జగదాహురనీశ్వరమ్ ৷
అపరస్పరసమ్భూతం(ఙ్), కిమన్యత్కామహైతుకమ్৷৷8৷৷

ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియును లేదనియు, ఇది అసత్యమనియు, భగవంతుడనెడివాడు లేనేలేడనియు, కామప్రేరితులైన స్త్రీపురుషులసంయోగ కారణముగ జీవులు సహజముగనే పుట్టుచున్నారనియు, కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు ఆసురలక్షణములు గలవారు భావింతురు.

16.8 
 సాధారణంగా మన లాంటి వాళ్ళం పరమాత్మయే ఈ మొత్తం ప్రపంచాన్ని సృష్టించాడని భావిస్తాము. సృష్టి స్థితి లయ కారకుడు భగవంతుడే నని విశ్వసిస్తాము. సమస్త విశ్వానికి ఆధారం భగవంతుడని నమ్ముతాము. కాని అసురీగుణం ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని నమ్మరు. భూమి  గోళాకారంగా ఉన్నా మనల్ని భరిస్తున్నది. భూమి మీద మనం నిలబడగలుగుతున్నాం; నడవగలుగుతున్నాం. దీనికి కారణం భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అనుకుంటే, సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకున్నా, ఈ విశాల విశ్వంలోని కోటానుకోట్ల  నక్షత్రాలని, గ్రహాలని, జీవరాశులని నియంత్రిస్తున్నది ఎవరు? మనం ఆ మహా శక్తి పరమాత్ముడు అని విశ్వసిస్తాం. కాని అసురీగుణం ఉన్నవాళ్లు, అసత్యమప్రతిష్టంతే.... ఈ విశ్వమంతా దానంతట అదే ఏర్పడిందని అనుకుంటారు. ఈశ్వరుడు ..అంటూ ఏది శక్తి లేదని అంటారు. కేవలం కామం వల్లనే ఈ ప్రపంచం నడుస్తుందని నమ్ముతారు. అందువల్లే ఇప్పుడు Live in relationship అన్న కొత్త  ఒరవడి మొదలైంది. అంటే వివాహం అనే   బంధం అవసరం లేకుండా ఇద్దరు స్త్రీ పురుషులు   కేవలం కామం కోసమే కలిసి జీవించడం. జీవితాన్ని అనుభవించడం మాత్రమే ధ్యేయంగా బతకడం.Double income no kids(DINK)    వంటి కొత్త  కొత్త   పోకడలు బయలుదేరాయి. కామం అన్నది  నాలుగు పురుషార్థాలలో ఒకటి. అది ధర్మంతో కూడినప్పుడు ఆచరణీయమై మనల్ని మోక్ష  మార్గంలో తీసుకు వెళుతుంది. అలా కాక కామము వెర్రి తలలు వేసినప్పుడు  మన పతనానికి దారితీస్తుంది. పశువులకి, మనిషికి ఆహార, నిద్రా ,మైథునాలలో భేదం లేదు. కేవలం ధర్మాచరణ మాత్రమే మనిషిని పశువుల కన్నా ఉన్నతంగా నిలబెడుతుంది. కేవలం విషయ భోగం మాత్రమే జీవన ధ్యేయమన్నది వారి దృష్టి కోణం.

16.9

ఏతాం(న్) దృష్టిమవష్టభ్య, నష్టాత్మానో౽ల్పబుద్ధయః ৷
ప్రభవన్త్యుగ్రకర్మాణః, క్షయాయ జగతో౽హితాః৷৷9৷৷

అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదముచేయుభౌతికవాదులు ఆత్మనుగూర్చి తలంపరు. (ఆత్మయొక్క అస్తిత్వమును విశ్వసింపరు) వారు మందబుద్ధులు. వారు అందఱికిని అపకారముచేయుక్రూరులు. వారి శక్తిసామర్థ్యములు ప్రపంచ వినాశమునకే వినియోగపడుచుండును.

16.9 
జీవితంలో భౌతిక వాంఛలను అనుభవించడమే ధ్యేయంగా ఇటువంటి వారు బతుకుతూ ఉంటారు." Eat, drink and be merry  " అన్నదే వీరి ఆదర్శంగా ఉంటుంది. ఈమధ్య ఎన్నో ఏళ్ల తర్వాత   సుమారు పాతిక, యాభై ఏళ్ల తర్వాత Re-  union  పేరుతో కలుసుకుంటారు. కలుసుకున్నాక వారు ఎంజాయ్ ఎలా చేయాలనే ఆలోచిస్తారు. జీవితంలోని నాలుగు ఆశ్రమాలలో ( బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య) దానికి తగిన  విధంగా ప్రవర్తించాలన్న మౌళిక జ్ఞానం కూడా వారికి ఉండదు. అసురీ ప్రవృత్తి, రాక్షసి ప్రవృత్తికి భేదం ఉంటుంది. అసురీ ప్రవృత్తి ఉన్న వాళ్ళు నాకు కావాల్సింది దొరికితే చాలు; ఎదుటివారు నాశనమైనా పరవాలేదు..అన్న అభిప్రాయంతో ఉంటారు. కాని రాక్షసి ప్రవృత్తి ఉన్నవాళ్లు  నాకు మేలు కలగకపోయినా పర్వాలేదు ఎదుటి వాళ్లు మాత్రం నాశనం కావాలి.. అనే బుద్ధితో ఉంటారు. ఈ విధమైన ఆసురి ప్రవృత్తి ఉన్న వారి వల్ల  ... క్షయాయ జగతో  హితాః.. ప్రపంచానికి నాశనమే కలుగుతుంది. తీవ్రవాదులు దీనికి సరైన ఉదాహరణ. అమాయకులను, నిరపరాధులను  చంపడం కోసం వారు ఆత్మ త్యాగానికి కూడా సిద్ధమవుతారు. వస్తు సంగ్రహము, కోరికలు తీర్చుకోవడం మాత్రమే వీరి జీవన ధ్యేయంగా ఉంటుంది.

16.10

కామమాశ్రిత్య దుష్పూరం(న్), దమ్భమానమదాన్వితాః ৷
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్, ప్రవర్తన్తే౽శుచివ్రతాః৷৷10৷৷

దంభము, దురభిమానము, మదములతోగూడిన ఈ ఆసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరచి, తమవాంఛలను ఏదో విధముగ తీర్చుకొనుటకు సిద్ధపడుదురు. అజ్ఞానకారణముగ మిథ్యాసిద్ధాంతములను ఆశ్రయింతురు. శాస్త్రవిరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు.

16.10 
వీరు కోరికలనే ఆశ్రయించి ఉంటారు. కోరిక.. అనేది ఎలాంటిదంటే అది ఎన్నటికీ తీరదు. Desire  is that state of mind which is empty. ఒక కోరిక తీరుతూనే మరొక కోరిక పుట్టుకొస్తూ ఉంటుంది. దీనికి అంతం అనేది ఉండదు.  అసురీ ప్రవృత్తి ఉన్నవాళ్లు కోరికలు తీర్చుకోవడమే జీవిత పరమావధిగా బతుకుతారు. షాపెన్ హెయిర్ అన్న ఒక పాశ్చాత్య శాస్త్రజ్ఞుడు  జీవితాన్ని అనుభవించడమే జీవితానికి ధ్యేయమన్న ఒక వాదాన్ని ప్రచారం చేశాడు."Eat, drink and be merry...  భోగాలను హాయిగా అనుభవించు. అలా అనుభవించి, అనుభవించి.. అనుభవించలేని స్థితి కలిగినప్పుడు ఆత్మహత్య చేసుకో!"  ఇదీ ఆయన  బోధించిన పద్ధతి. కాని భగవద్గీతా, ఉపనిషత్తులు చదివిన తర్వాత ఆయన ఆలోచనలో పూర్తి మార్పు కలిగింది. "నేను ఇంతకుముందు బోధించినవన్నీ   అసత్యాలు"  అని ఆయన ఒప్పుకున్నాడు. భగవద్గీతాలో బోధించిన విషయాలు ఆయనకు  చాలా ఆమోదయోగ్యమయ్యాయి. ఆయన మీద పరమాత్ముడి కృప ఉన్నందువలన ఆయనలో  మార్పు వచ్చింది. కాని ఎంత మందో భగవద్గీతా చదవని వాళ్ళు  మోహముతో, అజ్ఞానంతో ఇటువంటి శుష్క ,అసత్య వాదాలని సత్యమని నమ్ముతూ ఉంటారు. వారికి ఈశ్వరుని  అస్తిత్వం మీదనే నమ్మకం ఉండదు. చేసే ప్రతి పనీ  దంభాచారంతో ప్రదర్శన కోసం చేస్తారు. మనం ఇప్పుడు చూస్తున్నాం ... వివాహం  జరిగేటప్పుడు పురోహితుడు చెప్పే మంత్రాల మీద విధివిధానాల మీద ఎవరికీ  దృష్టి ఉండదు. ముహూర్తం తప్పిపోయినా పరవాలేదు, మేకప్ చక్కగా  చేసుకోవాలి. పురోహితుడేమో నాలుగు మంత్రాలు చెప్తాడు అందులో ఏముంది... ఎంతసేపు వీడియో ఎలా వస్తుంది.. మనం ఎలాంటి పోజు ఇవ్వాలి అన్నది మాత్రమే  వారి మనసులో ఉంటుంది. ఫోటోలు తీసి వాట్స్అప్ లో  ఫేస్ బుక్ లో పెట్టడం మాత్రమే ముఖ్యమని అనుకుంటారు. ఇటువంటి ప్రవృత్తిని మనం ఈ మధ్య గమనిస్తున్నాం.

16.11

చిన్తామపరిమేయాం(ఞ్) చ, ప్రలయాన్తాముపాశ్రితాః ৷
కామోపభోగపరమా, ఏతావదితి నిశ్చితాః৷৷11৷৷

మరణించువఱకును వారు అంతులేనిచింతలలోనే మునిగిపోవుచుందురు. విషయభోగానుభవముల యందే తత్పరులై అదియే నిజమైన సుఖమని భావింతురు.

16.11 
ఇటువంటి వారికి అపరిమితమైన చింతలు ఉంటాయి. వారు కేవలం చింతించడం తప్ప వేరే ఏ పని చేయరు. కిళ్ళీ కొట్టు వద్ద నిలబడి దేశంలో  ఉన్న సమస్యల గురించి పెద్దగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఏ ఉపయోగము ఉండదు. రోజూ ఏవో కొదవలు వారిని బాధిస్తూ ఉంటాయి. ఉత్తర భారతమంతా చూశాను ...దక్షిణభారతం ఎప్పుడు చూస్తానో... ఇంకా ఈ వస్తువు ...ఆ వస్తువు ఎప్పుడు కొంటానో ఈ విధంగా. ప్రళయాంతాముపాశ్వితాః.. అంటే చనిపోయే వరకు ఇదిలా కొనసాగుతూనే ఉంటుంది. కామోపభోగపరమా... కోరికలు తీర్చుకోవడమే పరమావధిగా వీరు భావిస్తారు. వీరికి వారి వద్ద ఉన్న వాటితో సంతృప్తి ఉండదు. ఇంకా ఏవేవో కావాలన్న ఆరాటం ఉంటుంది. అవి సంపాదించుకోవాలన్న తాపత్రయం ఉంటుంది. పాప పుణ్యాల చింత అసలు ఉండదు. ఇటువంటి వారిని గురించి చెబుతూ జ్ఞానేశ్వర్ మహారాజ్ అంటారు
 
అతా పురే హా కువిచార్ యాచా కరూ న యే విస్తార్ 
ఐసే బోలూ జాతా ఫార్ వాణీ యేతే తుచ్ఛతా
 
 ఇటువంటి వారిని గురించి ఎక్కువగా ఆలోచించడం కూడా మంచిది కాదు.  వీరిని గురించి   ఎక్కువగా మాట్లాడటం వల్ల మన పలుకు  తుచ్ఛమవుతుంది.

16.12

ఆశాపాశశతైర్బద్ధాః(ఖ్), కామక్రోధపరాయణాః৷
ఈహన్తే కామభోగార్థమ్, అన్యాయేనార్థసఞ్చయాన్৷৷12৷৷

వారు ఆశాపాశపరంపరలచే ఎల్లప్పుడును బంధింపబడుచుందురు. కామక్రోధపరాయణులై ప్రవర్తింతురు. విషయభోగముల నిమిత్తమై, అన్యాయ మార్గములద్వారా ధనార్జనకు పాల్పడుచుందురు.

16.12 
మీరు ఆశలు అనే తాళ్లతో కట్టబడి ఉంటారు. సంస్కృతంలో ఒక  సుభాషితం ఉంది.
आशा नाम मनुष्याणा काचीत आद्यशृंखला l
  बद्धा यया प्रधावन्ति मुक्ता तिष्ठंती मूर्खता ll
ఇది విపరీతమైన రజోగుణాన్ని సూచిస్తుంది. మనం 14వ అధ్యాయంలో  ఈ గుణాలను గురించి విస్తృతంగా నేర్చుకుంటాము. ఆశ అన బడే సంకెళ్లు ఎలాంటివంటే, మామూలుగా సంకెళ్లతో బంధించబడితే ఒక్కచోటే ఉంటాడు మనిషి. కాని ఆశ అన్న, గొలుసులతో కట్టబడినప్పుడు ముందుకు పరిగెడుతూనే ఉంటాడు ఇంకా కావాలన్న  కోరికతో!  మనం హరిభక్తి పరాయణులు, గీతాపరాయణులు  ఇలాంటి పదాలు వింటుంటాం. అంటే వారు నిత్యము హరి భక్తిలో నిమగ్నులై ఉన్నారని అర్థం. కాని వీరు ఎలాంటి వారంటే, కామ క్రోధ పరాయణులు. నిత్యమూ కామ క్రోధాలతో బతికే వాళ్ళు. కామానికి , ధ్యేయానికి భేదం ఉంది. పుట్టినప్పుడు పిల్లవాడు నా తల్లి, నా ఆకలి, నా వాళ్ళు అని మాత్రమే ఆలోచిస్తాడు. పెరుగుతూ ,పెరుగుతూ అతని దృక్పథం విశాలం కావాలి. స్వార్థం నుంచి పరమార్ధం వైపుకు నడవాలి. నా ఊరు, నా దేశం... ఈ విధంగా విశాలమౌతూ పోయినప్పుడు అది ధ్యేయమవుతుంది. అప్పుడు అందులో స్వార్థం ఉండదు. అలా కాకుండా కేవలం కోరికలు తీర్చుకోవడం కోసం అన్యాయంగా ధనాన్ని సంపాదించడం చాలా పెద్ద దోషం. దీనివల్ల భ్రష్టాచారం ప్రబలి,   పతనావస్థకు దారితీస్తుంది.

16.13

ఇదమద్య మయా లబ్ధమ్, ఇమం(మ్) ప్రాప్స్యే మనోరథమ్ ৷
ఇదమస్తీదమపి మే, భవిష్యతి పునర్ధనమ్৷৷13৷৷

“నేను మిక్కిలి పురుషార్థిని గనుక ఈ అభీష్టవస్తువును పొందితిని. ఇంకను నా మనోరథము లన్నింటిని సాధించుకొనగలను. ఇప్పటికే నాకడ ఎంతో ధనము ఉన్నది. మున్ముందు ఇంకను ఎంతోధనమును సంపాదింపగలను” అని వారు తలంచుచుందురు.

16.13 
వీరు ఇంతవరకు సంపాదించిన ధనాన్ని లెక్కపెట్టుకుంటూ ఉంటారు. ఇంకా ముందుకు ఎంత సంపాదించగలము ..ఆ సంపాదించిన ధనంతో ఏ విధంగా తమ మనోభీష్టాలని తీర్చుకోగలము.. అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ధనం సంపాదించడం తప్పు కాదు. భౌతికంగా ఉన్నతిని పొందడం తప్పని భగవద్గీతా ఎప్పుడు అనదు. కాని ఆ సంపాదించేది ధర్మబద్ధంగా సంపాదించినదై ఉండాలి. భార్యాబిడ్డల కోసం కష్టపడి సంపాదించి వాళ్ళ అవసరాలు తీర్చడం భగవంతుడు నిర్దేశించిన కర్తవ్యం గా భావించి ఆచరించాలి. అందుకోసం ఏ విధమైన వృత్తి చేస్తున్నాడో  దానిని పూర్తి  నిబద్ధతతో చేయాలి. ఆ వృత్తి ధర్మబద్ధమైనదై ఉండాలి. అలా కాక నాకు ఇది కావాలి ,అది కావాలి ..ఎదుటి వాడి దగ్గర ఉన్నది కూడా నాకే కావాలి అన్న  కోరికతో డబ్బుని   అక్రమ మార్గంలో సంపాదించడం  సరైనది కాదు. ఏ పని చేసినా అది పరమాత్ముడు తనకు నిర్దేశించిన కర్తవ్యం గా భావించి చేయాలి. శివాజీ మహారాజు స్వరాజ్యాన్ని స్థాపించినప్పుడు 'ఇది నేను స్థాపించాను' అని అనలేదు. ఇదంతా పరమాత్ముడి ఇచ్ఛ వల్ల జరిగింది అని అన్నాడు. అటువంటి సమర్పణా భావంతో కర్తవ్యాలను నిర్వర్తించాలి

16.14

అసౌ మయా హతః(శ్) శత్రుర్, హనిష్యే చాపరానపి ৷
ఈశ్వరో౽హమహం(మ్) భోగీ, సిద్ధో౽హం(మ్) బలవాన్సుఖీ৷৷14৷৷

నేను ఈ శత్రువును వధించితిని. ఇతర శత్రువులనుగూడ వధింపగలను. నేనే సర్వాధిపతిని. సమస్త సుఖ భోగములను అనుభవింపగలవాడను నేనే. సిద్ధులన్నియు నా గుప్పిటనే యున్నవి. నేనే గొప్ప బలవంతుడను, సుఖిని.

16.14
నేను నా శత్రువులను వధించ గలను. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారిని కూడా  చంపగలను.  నేనే ఈశ్వరుడిని. అన్ని భోగాలని అనుభవించగలిగే అధికారం నాదే! అన్ని సిద్ధులు నా చేతిలో ఉన్నాయి. అందరికంటే నేనే బలవంతుడిని. ప్రపంచంలో అందరికన్నా సుఖపడే వాడిని నేనే. ఇటువంటి ప్రవృత్తి మనకు రావణాసురుడిలో కనిపిస్తుంది. అందరికన్నా గొప్ప వాడిని  అనే అహంకారం, తాను అనుకున్నట్టే జరగాలన్న  అభిజాత్యం!

16.15

ఆఢ్యో౽భిజనవానస్మి, కో౽న్యో౽స్తి సదృశో మయా ৷
యక్ష్యే దాస్యామి మోదిష్య, ఇత్యజ్ఞానవిమోహితాః৷৷15৷৷

“నేనే గొప్ప ధనవంతుడను, మిక్కిలి పరివారము గలవాడను. నాతో సమానుడు మరియొకడులేడు. నేను యజ్ఞములను చేయగలను. దానములు ఇయ్యగలను. యథేచ్ఛముగా వినోదింపగలను.” - అనుచు అనేక విధములుగా అజ్ఞానమోహితులై...

16.15 
ఆఢ్య..అన్న పదానికి అర్థం  ధనవంతుడు అని. నేను అందరికన్నా శ్రీమంతుడిని; పెద్ద పరివారం కలవాడిని. నాతో సమానమైన వారు వేరే ఎవరూ లేరు.  నేను గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తాను; దానాలు చేస్తాను. దానం ఎలా చేయాలంటే కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు. అంతా పరమాత్ముడిదే అయినప్పుడు ఇచ్చే వాళ్ళం మనం  ఎవరము! అజ్ఞానులైన వీళ్ళకి ఈ విషయం బోధపడదు. అంతా చేస్తున్నది వాళ్లే అనుకుంటారు.  అహంకారం ఎంత  సూక్ష్మమైనదంటే... నాకు అహంకారం లేదనుకోవడం కూడా ఒక విధమైన అహంకారమే.  ఈ విషయంగా  మన ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ గారు ఒక చక్కటి ఉదాహరణను ఇచ్చారు. మనం   ఒక చొక్కా ని   డబ్బిచ్చి  కొంటాం. నా కష్టంతో ఈ చొక్కా  కొన్నామని చెప్పుకుంటాం. కాని దాని వెనక ఎంత మంది శ్రమ ఉందో ఆలోచించామా? ఎంతో శ్రమకు ఓర్చి రైతు పత్తిని పండిస్తాడు. ఆ పత్తిని  వడికి చేనేత కార్మికుడు బట్టను తయారు చేస్తాడు.  కలంకారి వాళ్లు దానికి రంగులద్దుతారు. ఎంతో శ్రమతో, నైపుణ్యంతో దర్జీ దానిని చొక్కాగా తయారు చేస్తాడు. ఎవరో ఒక తల్లి దానికి బొత్తాములు కుడుతుంది. ప్రకృతిలో ప్రతి కార్యం కోసం ఒక యజ్ఞం జరుగుతోంది. ఆ యజ్ఞ ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. అంతే తప్ప.. ఏదీ మనది కాదు.

16.16

అనేకచిత్తవిభ్రాన్తా, మోహజాలసమావృతాః৷
ప్రసక్తాః(ఖ్) కామభోగేషు, పతన్తి నరకే౽శుచౌ৷৷16৷৷

చిత్తభ్రమణమునకు లోనై మోహజాలమునందు చిక్కుకొని, ఆసురలక్షణములు గలవారు విషయభోగములయందే మిక్కిలి ఆసక్తులై ఘోరనరకముల యందు పడిపోవుచుందురు.

16.16 
ఇటువంటి అసురీ ప్రవృత్తి గలవారు మోహము అనే వలలో చిక్కుకొని ఉంటారు. తమ అజ్ఞానం వలన చిత్తభ్రాంతికి లోనవుతూ ఉంటారు. కామ భోగాలలో ఆసక్తులై ఉంటారు. ప్రసక్త అంటే... ప్రకర్షతో కూడిన ఆసక్తి. అంటే  విషయ భోగాలలో విపరీతమైన ఆసక్తి  కలిగి ఉండడం. ఇటువంటి వారు పతనాన్ని పొంది నరకానికి పోతారు. గొప్ప వాళ్ళు కావాలి. కాని మంచి వాళ్ళు కావాలి. గొప్ప వాళ్ళమని అహంకరించకూడదు. జ్ఞానేశ్వర్ మహారాజ్ అంటారు
 
వ్యుత్పత్తి అవధీ విసరిజే.  థోరపణ్  పర్దా సాండిజే
 జో జగా  ధాకుటే హోయీ జే  తై జవలీఫ్ మాఝే 

గొప్ప వాళ్ళు కావాలి. కాని మేము గొప్పవాళ్ళము అన్న విషయం మర్చిపోవాలి. వినమ్రతతో  మెలగాలి. అటువంటి వారే పరమాత్ముడికి ప్రియులవుతారు. ఎంత చదువుకున్నా వినయం లేనిది విద్య శోభించదు. 'విద్యా వినయేన శోభతే' అన్నారు

16.17

ఆత్మసమ్భావితాః(స్) స్తబ్ధా, ధనమానమదాన్వితాః৷
యజన్తే నామయజ్ఞైస్తే, దమ్భేనావిధిపూర్వకమ్৷৷17৷৷

వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు, గర్వోన్మత్తులై, ధనదురహంకారములతో కన్నుమిన్నుగానక ప్రమత్తులై, శాస్త్రవిరుద్ధముగా ఆడంబరప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞముల నాచరించుదురు.

16.17 
వారు తమను తామే గొప్పగా భావించుకుంటారు. వారికున్న పేరు ప్రతిష్టలు, ధనము  మూసుకొని గర్వంతో విర్రవీగుతూ ఉంటారు. ఆత్మ స్తుతి అన్నది  మహా పాపం. ఈ శ్లోకం మనకి అద్దంలా పనిచేస్తుంది. మనం ప్రతి నిమిషం జాగరూకతతో  జ్ఞానం వల్ల కాని, ధనం వల్ల కాని, పదవి వల్ల కాని మనలో అహంకారం పేరుకుంటుందా అని గమనించుకుంటూ ఉండాలి. అలా ఉందనుకున్నప్పుడు వెంటనే దాన్ని విసర్జించాలి. ఇటువంటి వారు వారిలో ఉన్న గొప్పతనం  వేలెడంతైనా దాన్ని కొండంతలుగా అందరికీ చూపించుకుంటూ ఉంటారు. అహంకారంతో విర్రవీగుతూ పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడే వాళ్ళు యజ్ఞాలు చేసినా  అవి శాస్త్రవిహితంగా ఉండవు. అందులో భక్తి ఉండదు. కేవలం ఆడంబరం మాత్రమే ఉంటుంది.  న్యాయస్థానంలో న్యాయాధీశుడు  ఇరుపక్షాల వాదనలని విన్నట్టుగా పరమాత్ముడు  దైవ ,అసుర రెండు గుణాలను గురించి తెలుసుకోమని అర్జునుడిని కోరుతున్నాడు. సమర్థ రామదాసు గారు తమ దాస బోధలో మూర్ఖుని లక్షణాలను గురించి ప్రస్తావించారు. అటువంటి  లక్షణాలు మనలో ఉండకుండా చూసుకోవడానికి వాటిని తెలుసుకోవడం అవసరం. యుధిష్టరుడు ఒకసారి తన ప్రతిజ్ఞ నిలుపుకోలేకపోయానని ఆత్మ హత్య చేసుకుంటానని శ్రీకృష్ణుడితో అంటాడు.  అందుకు శ్రీకృష్ణుడు "నిన్ను నీవే స్తుతించుకో. అది ఆత్మహత్యతో సమానం అవుతుంది" అని చెప్తాడు.  అసురీగుణం ఉన్నవాళ్లు  తాము చేసిన చిన్న పని నైనా గొప్పగా ప్రదర్శించాలని కోరుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో  తమ పనులన్నీ  అప్డేట్ చేసేవారు దీనికి నిదర్శనం.

16.18

అహఙ్కారం(మ్) బలం(న్) దర్పం(ఙ్), కామం(ఙ్) క్రోధం(ఞ్) చ సంశ్రితాః ৷
మామాత్మపరదేహేషు, ప్రద్విషన్తో౽భ్యసూయకాః৷৷18৷৷

అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వశులై, ఇతరులను నిందించుచు తమ శరీరములయందును, ఇతరుల శరీరముల యందును, అంతర్యామిగానున్న నన్ను ద్వేషించుచుందురు.

16.18 
అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము.... ఇటువంటి గుణాలను ఆశ్రయించుకుని  వారిలోనూ, ఇతరుల లోను  విరాజితుడై ఉన్న పరమాత్ముడిని ద్వేషిస్తారు.  అహంకారం వల్ల ఎదుటివారిని తమ కన్నా చాలా తక్కువగా భావిస్తారు. బాహ్యాడంబరాలకు పోయే వాళ్ళ దుర్గుణాలు క్రమంగా బలపడతాయి. తమలోను ఇతరుల లోనూ  ఉన్న  భగవంతుని అంశని   గుర్తించరు. భగవద్గీతా లోనే  కఠినమైన శబ్దాలతో ఉన్న తర్వాతి శ్లోకాన్ని పరమాత్ముడు చెప్తున్నాడు.

16.19

తానహం(న్) ద్విషతః(ఖ్) క్రూరాన్, సంసారేషు నరాధమాన్৷
క్షిపామ్యజస్రమశుభాన్, ఆసురీష్వేవ యోనిషు৷৷19৷৷

అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను, క్రూరులైన నరాధములను మాటిమాటికిని ఈ సంసారమునందు ఆసురీయోనులలోనే నేను పడవేయుచుందును.

16.19 
ఈ విధంగా నన్ను ద్వేషించే పాపాత్ములని, క్రూరులని, అశుభులైన నరాధములని  నేను తిరిగి తిరిగి అసురియోనులలోకి  విసిరి వేస్తాను. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఒకటి ఉంది. వారు తిరిగి తిరిగి ఆ విధంగా  పతనావస్థకు పోవడానికి కారణం ఎవరు? ఉదాహరణకి ఒక  న్యాయాధీశుడు  ఒక ముద్దాయికి ఉరిశిక్ష విధించాడు. తలారి దానిని అమలుపరిచాడు. ఆ వ్యక్తి ఉరి తీయబడడానికి కారణం ఎవరు?  అతడు చేసిన తప్పే అతడి శిక్షకి కారణం. పరమాత్ముడు ఎవరినైనా ఉద్ధరించాలంటే, వారు పరమాత్ముడికి కనీసం దగ్గరగా రావాలి. ఇటువంటి అవస్థకు వారు చేరుకున్నారంటే వారి కర్మలే దానికి కారణం. వేప చెట్టు నాటి మామిడి పండ్లు కావాలంటే వీలవుతుందా? అందుకే ఆరవ అధ్యాయంలో పరమాత్ముడు చెప్పాడు.  "ఉద్ధరేనాత్మనాత్మనం". మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఆ ప్రయత్నం చేస్తూ పరమాత్ముడికి దగ్గరగా వెళితే ఆయనే మనకి సరైన  మార్గ నిర్దేశం చేస్తాడు. భగవద్గీతా పరమాత్ముడు మనకు చేసిన మార్గనిర్దేశమే!

16.20

ఆసురీం(య్ఁ) యోనిమాపన్నా, మూఢా జన్మని జన్మని ৷
మామప్రాప్యైవ కౌన్తేయ, తతో యాన్త్యధమాం(ఙ్) గతిమ్৷৷16.20৷৷

ఓ అర్జునా! ఈ ఆసురీప్రకృతిగల మూఢులు, నన్ను పొందకయే, ప్రతిజన్మయందును ఆసురీయోనులనే పొందుచు చివరకు అంతకంటెను హీనమైనగతిని పొందుదురు. అనగా ఘోరమైన నరకములయందు పడెదరు.

16.20
ఇటువంటి అసుర ప్రవృత్తి గల మూర్ఖులు అనేక జన్మలలో మూఢయోనులలో జన్మిస్తారు. అనగా కీటకములు పశుపక్షాదులలో జన్మిస్తారు. అనేక జన్మల పిదప లభించేది ఈ మానవ జన్మ. సన్మార్గంలో నడిచి పరమాత్మ ప్రాప్తి పొందగలిగేది ఈ నరజన్మలోనే. ఆ విధంగా కాక తప్పుడు త్రోవలో వెళ్లి  పతనానికి చేరుకోవాలన్నా ఈ జన్మలోనే జరుగుతుంది. మనం పరమాత్ముని పొందాలన్న  కోరికతో ప్రయత్నం చేస్తే మన ఆత్మయే మనకు మిత్రుడు అవుతుంది. అలా లేని పక్షంలో మన ఆత్మయే మనకు శత్రువు. మనల్ని  మనం అలా ఉద్ధరించుకోలేని పక్షంలో  మరింత దిగజారి పోతాం. పరమాత్మ ని పొందాలన్న తపన ఉంటే ఎలాగైనా ఆయన  తన చెంతకు చేర్చుకుంటాడు. అది లేనప్పుడు పతనం తప్పదు.

16.21

త్రివిధం(న్) నరకస్యేదం(న్), ద్వారం(న్) నాశనమాత్మనః ৷
కామః(ఖ్) క్రోధస్తథా లోభః(స్), తస్మాదేతత్త్రయం(న్) త్యజేత్৷৷21৷৷

కామక్రోధలోభములు అను ఈ మూడును నరకద్వారములు. అవి ఆత్మ నాశమునకు కారణములు అనగా మనుజుని అధోగతిపాలుచేయునవి. కనుక ఈ మూడింటిని త్యజింపవలెను.

16.21 
ఆత్మ యొక్క వినాశనానికి దారి తీసే నరక ద్వారాలు మూడు. కామము ,క్రోధము ,లోభము. మానవుడు ఆత్మోన్నతిని పొందాలంటే ఈ మూడింటిని  విసర్జించాలి. కామం అన్నది పొందకూడని వస్తువుని పొందాలన్న కోరిక. ఆ కోరిక తీరనప్పుడు కలిగేదే క్రోధం. చిత్తము యొక్క ఉగ్రత. ఇవి రెండూ శరీరానికి సంబంధించినవి. వీటిని వెన్నంటే వచ్చే  లోభం మానసికమైనది. ఈ గుణాల వల్ల నాకు ఇది కావాలి ,అది కావాలి అన్న కోరికలు విపరీతంగా పెరిగిపోతూ, అవి తీరనప్పుడు క్రోధానికి లోనవుతూ, వస్తు సంచయం పట్ల లోభంతో  దిగజారుతూ నరకము  వంటి స్థితిని పొందుతాడు. తనను తాను ఉద్ధరించుకోవాలంటే ఈ మూడిటిని త్యజించాలి.

16.22

ఏతైర్విముక్తః(ఖ్) కౌన్తేయ, తమోద్వారైస్త్రిభిర్నరః ৷
ఆచరత్యాత్మనః(శ్) శ్రేయః(స్), తతో యాతి పరాం(ఙ్) గతిమ్৷৷22৷৷

ఓ అర్జునా! ఈ మూడునరకద్వారములనుండి బయటపడినవాడు శుభకర్మలనే ఆచరించును. అందువలన పరమగతిని పొందును. అనగా నన్నే పొందును.

16.22 
నరక ద్వారాలైన ఈ కామ క్రోధ   లోభములు మూడింటి నుంచి విముక్తి పొందిన నరుడు  కళ్యాణకరములైన కర్మలను చేస్తాడు. అందువల్ల అతడికి సచ్చిదానంద పరబ్రహ్మ యొక్క ప్రాప్తి కలుగుతుంది.' తమసోమా జ్యోతిర్గమయ'.. అంటే అంధకారం నుండి వెలుతురు వైపుకి వెళ్లాలని. ఈ మూడు వదిలించుకున్న  మానవుడు మోక్షపథం వైపుకి సాగిపోతాడు.

16.23

యః(శ్) శాస్త్రవిధిముత్సృజ్య, వర్తతే కామకారతః ৷
న స సిద్ధిమవాప్నోతి, న సుఖం(న్) న పరాం(ఙ్) గతిమ్৷৷23৷৷

శాస్త్రవిధిని త్యజించి, యథేచ్ఛగా (విశృంఖలముగా) ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు. వానికి ఇహపరలోకసుఖములు లభింపవు. పరమగతియు ప్రాప్తింపదు.

16.23 
మానవుడు ఎలా నడుచుకుంటే తనలోని దైవత్వాన్ని అందుకుంటాడో శాస్త్రాలు చెబుతాయి. శాస్త్రాన్ని ఉల్లంఘించడానికి కామం తప్ప మరో కారణం లేదు. కామం కోసం శాస్త్రాన్ని వదిలితే సిద్ధి, సుఖం, మోక్షం ఏదీ దొరకదు. మనకి భౌతిక జ్ఞానం  కోసం కూడా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. జీవశాస్త్రం, రసాయన శాస్త్రం ఈ విధంగా. భగవద్గీతా పరమాత్ముడితో ఏ విధంగా మనం  సంబంధం ఏర్పరచుకోవచ్చో, అలా ఏర్పరచుకోవడానికి ఏ విధంగా జీవించాలో  చెప్పే శాస్త్రం. దానిని అనుసరించడమే యోగ్యమైనది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు. ధూమపానం వల్ల అతడి ఆరోగ్యం చెడిపోతుందని, పర్యావరణానికి కూడా చాలా నష్టం కలుగుతుందని అతడికి తెలుసు. అయినా  అతడు సిగరెట్టు కాలుస్తూ ఉంటాడు. అతడికి క్షణికమైన ఆనందం కలగవచ్చు. అని అతడు భౌతికంగానూ, ఆధ్యాత్మపరంగాను దిగజారి పోతాడు

16.24

తస్మాచ్ఛాస్త్రం(మ్) ప్రమాణం(న్) తే, కార్యాకార్యవ్యవస్థితౌ ৷
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం(ఙ్), కర్మ కర్తుమిహార్హసి ৷৷24৷৷

కావున కర్తవ్యాకర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. కనుక శాస్త్రోక్తకర్మలను గూర్చి బాగుగా తెలిసికొని, అట్టి కర్మలను ఆచరింపుము.

16.24 
పరమాత్ముడు తస్మాత్ అన్నప్పుడు  మనం వెంటనే   అప్రమత్తులై జాగరూకతతో వినాలి. పరమాత్ముడు "శాస్త్రం ప్రమాణం" అంటున్నాడు. ఈ శ్లోకం ఈ మొత్తం అధ్యాయం లోని విషయాలను  సంగ్రహంగా తెలుపుతుంది. మనకు వేదాలు, ఉపనిషత్తులు  జీవన  విధానాన్ని నిర్దేశించాయి. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము... ఈ విధంగా  ఒక్కో సమయంలో ఏ విధంగా  నడుచుకోవాలి ,ఏ విధమైన విధులని నిర్వర్తించాలి .. ఇవన్నీ చక్కగా బోధించాయి. కార్యా కార్యాలని నిర్ణయించడానికి ప్రమాణం శాస్త్రమే. ఉదాహరణకి రసాయన శాస్త్రంలో ప్రయోగంలో "  గంధకికామ్లాన్ని  పలుచగా చేయాలంటే, అందులోకి నీళ్లు పోయకూడదు. నీళ్లలోకి నెమ్మదిగా ఆమ్లాన్ని పోయాలి. లేకపోతే  విస్పోటం సంభవిస్తుంది." అన్నారు. నమ్మి ఆ విధంగా ప్రయోగం చేస్తే సమస్య లేదు. "నేను ఆ విధంగా చేయను నాకెలా కావాల్సి ఉంటే అలా చేస్తాను "అంటే, తరువాత వచ్చే పరిణామాలను అనుభవించాల్సి వస్తుంది.  ఒక కార్యాలయములో  చేయాల్సిన  విధులను వివరించే మ్యానువల్ ఉంటుంది. అదేవిధంగా దేశాన్ని  నడిపించే నియమావళిగా   రాజ్యాంగం ఉంటుంది.  అలాగే ఈ విశ్వాన్ని నడిపించే శాస్త్రాలే వేదాలు ఉపనిషత్తులు.
 ఈ అధ్యాయంలో పరమాత్ముడు అర్జునుడిని మాధ్యమంగా చేసి దైవీ గుణాలను, అసురీ గుణాలను మనకు బోధించాడు. ఆత్మోన్నతిని పొందడానికి  అసురీ గుణాలను విసర్జించి దైవీ గుణాలను పెంపొందించుకోవాలి. సద్గుణముల సాధనతో మనం  మోక్ష ప్రాప్తికై అడుగులు వేస్తాం.
ఇవన్నీ విన్న తర్వాత అర్జునుడికి ఒక సందేహం వచ్చింది." శ్రద్ధ ఉండి శాస్త్ర విధానం తెలియకుండా ఆరాధిస్తే వారి నిష్ట ఎటువంటిది". దీనిని 17వ అధ్యాయంలో మనం తెలుసుకుందాం.
వివేచనా కార్యక్రమం ముగిసింది. ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభమైనది.
ప్రశ్న:  ఓం తత్ సత్ వీటి అర్థం ఏమిటి?
జవాబు:  మనం పరమాత్ముడిని ఓం తత్ సత్ అనే శబ్దాలతో పిలుస్తాము." ఓం శ్రీ పరమాత్మనే నమః"  ఈ విధంగా. ఏ మంత్రమైనా ఓమ్  అనే అక్షరం తోనే  ప్రారంభమవుతుంది. తత్ సత్ అనే శబ్దంతో మనం పరమాత్మునికి సమర్పించుకుంటాం. మన పూజలో ఏదైనా  చిన్న తప్పులు ఉన్నా పరమాత్ముడు ఈ పదాలతో దానిని స్వీకరిస్తాడు.
ప్రశ్న: " మాకు మోక్షం అక్కర్లేదు. మేము భగవద్గీత చదవము" అంటారు. భగవద్గీతా ప్రవృత్తి మార్గాన్ని బోధిస్తుందా   లేక నివృత్తి మార్గాన్ని బోధిస్తుందా?
జవాబు:  మోక్షం అంటే ముక్తి. దుఃఖం నుంచి విముక్తి. అందరూ దుఃఖం నుంచి తప్పించుకోవాలనే కోరుకుంటారు. మోక్షం అంటే చనిపోయాక లభించేది కాదు. శరీరంలో ఉన్నప్పుడే మోక్షం పొందడం ... నేను ఎవరిని అని తెలుసుకోవడం. నేను అనబడే నేను ఎవరిని.. కాలు నా... చేయి నా.. శరీరాన్నా .. ఆత్మనా... వీటన్నిటికీ జవాబు మనకు భగవద్గీతాలో దొరుకుతుంది. ఇలా తెలుసుకోవడం, నేను శరీరాన్ని కాదు ఆత్మని, చైతన్య స్వరూపాన్ని   అనే ఎరుకతో  శాస్త్రవిహితమైన కర్మలని చేస్తూ జీవించడమే మోక్షం. కొంతమంది చిన్న పిల్లలకి భగవద్గీతా బోధించవద్దండి ..వారు సన్యాసులుగా తయారవుతారు అంటారు. కాని భగవద్గీతా లో పరమాత్ముడు అర్జునుడికి కర్తవ్యమార్గాన్ని ఉపదేశించాడు. యుద్ధం చేయమన్నాడు. భౌతిక ఉన్నతిని పొందవద్దని భగవద్గీతా ఎన్నడు అనదు. భగవద్గీతా ప్రవృత్తి మార్గాన్ని, నివృత్తి మార్గాన్ని రెండింటిని బోధిస్తుంది.
ప్రశ్న:  కామ క్రోధ లోభాలతో నిండిన ఈ ప్రపంచంలో ప్రవృత్తి ఎలాగ వీలవుతుంది. నివృత్తి కోసం ప్రయత్నించడం ఎలాగా?
జవాబు:  అన్నింటి నుండి నివృత్తి పొందాల్సిన అవసరం లేదు. భౌతిక ఉన్నతిని కూడా పొందాల్సిందే. ధర్మబద్ధంగా కర్మలని ఆచరిస్తూ, వాటిని పరమాత్మ నిర్దేశించిన కర్తవ్యాలుగా భావిస్తూ  మోక్షమార్గం వైపుకు పయనించడమే భగవద్గీతా యొక్క మూల సూత్రం.
ప్రార్థన   మరియు హనుమాన్ చాలీసా పారాయణతో   వివేచన సత్రం ముగిసింది

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం(య్ఁ)
యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే దైవాసురసమ్పద్విభాగయోగో నామ షోడశో౽ధ్యాయః৷৷16৷৷

ఈ విధముగా ఓం తత్ సత్ అను భగవన్నామ ఉచ్చారణ పూర్వకమైన బ్రహ్మ విద్య మరియు యోగ శాస్త్ర మయమైన, శ్రీకృష్ణార్జునుల సంభాషణ లేక సంవాద రూపములో ఉన్న శ్రీమద్భగవద్గీతలోని పదహారవ అధ్యాయమైన దైవాసురసంపద్విభాగయోగము సమాప్తమైనది