विवेचन सारांश
అంతఃకరణ శుద్ధితో ఆత్మజ్ఞానం సాధ్యం !

ID: 6357
तेलुगू - తెలుగు
శనివారం, 01 ఫిబ్రవరి 2025
అధ్యాయము 15: పురుషోత్తమ యోగము
2/2 (శ్లోకము 7-20)
వివేచకులు: గీతా విశారద డా. ఆశూ గోయెల్ గారు


జై శ్రీ కృష్ణ ! సనాతన ధర్మ సంరక్షకులైన పరమ పూజ్య సంత్ స్వామి శ్రీ గోవింద్ దేవ్ గిరి మహారాజ్ లకు వందనాలు సమర్పిస్తూ, ఈనాటి 15వ అధ్యాయమగు, పురుషోత్తమ యోగ ఉత్తరార్థ సత్రాన్ని ఆరంభించారు. ప్రార్థన ద్వారా ప్రభునామ స్మరణ చేసిన తర్వాత, దీప ప్రజ్వలన గావించినారు. వివిధ రకాల గీతా సేవల ద్వారా గీతా ప్రచారంలో భాగస్వాములను కావలసిందిగా సాధకులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే గీతా పరివార్ వారి 38వ గీతా సంథా వర్గం, ఫిబ్రవరి 21వ తేదీ నుండి ప్రారంభం కానున్నదని, తమ బంధుమిత్ర సన్నిహిత వర్గాలకు తెలుపవలసిందిగా కోరనైనది. తర్వాత సత్రానికి గురువు మరియు గోవింద దేవ్ గిరి జీ మహరాజ్ గారి విశేష కృప కలిగినట్టి వివేచకులు, గీతా విశారద్, డాక్టర్ ఆశూజీ గోయల్ గారిని సత్రానికి ఆహ్వానించడమైనది. వారు దైవ ప్రార్థన అనంతరం గురు చరణాలకు వందనాలు సమర్పించి తమ వివేచనను ఆరంభించారు. భగవానుల అతిశయ మంగళ మయ కృప మనపై కురుస్తుందని, మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి భగవద్గీతా మనకు ప్రాప్తించినదని తెలిపారు. మన ఇహ జన్మ లేదా గత జన్మ సుకృతం కావచ్చును, మన పూర్వజుల పుణ్యఫలం కావచ్చును, సంత మహాపురుషుల కృపాదృష్టి కావచ్చును, మనం భగవద్గీతా చదవడానికి భగవానులచే ఎన్నుకోబడ్డాము.  భగవానులు 18వ అధ్యాయం 68వ శ్లోకంలో, భక్తులు ఎలాంటి సంశయం లేకుండా తనని పొందుతారని అభయమిచ్చారు. అనేకులు గీతా శాస్త్రం  తెలిసినప్పటికి, సాధకులు కాలేరు. వారు భగవానులచే ఎన్నుకోబడతారు. మనం గీతా ప్రచార బాధ్యతను మరువ రాదు. గీతా పఠనం చేయువారు ఇహ లోకంలో మరియు పరలోకంలో ఉత్తమ ఫలితాలను పొందుతారు. అర్జునుడు సాధారణ వ్యక్తి కాదు. అనేక యుద్ధాలు చేసి విజయం సాధించారు. ఎప్పుడు నియమాల ఉల్లంఘన చేయలేదు. అహంకార వర్తనుడు కాలేదు. అయినప్పటికి మోహవశుడయ్యాడు. తాను శిష్యుడనని, శరణాగతుడనని, తనను శాశింపుడని భగవానులను వేడుకున్నాక (భ.గీ. 2-7), భగవానులు ప్రసన్నులయ్యారు. అర్జునుడిని నిమిత్తుడిగా చేసి, సమస్త మానవజాతి కల్యాణానికి భగవద్గీతాను ప్రబోధించారు. గోపాలుడిగా సమస్త ఉపనిషత్తుల సారాన్ని పాలుగా పితికి, అర్జునుడికి లేగదూడగా చేసి, సంపూర్ణ మానవజాతికి గీతామృత క్షీరాన్ని ప్రసాదించారు. 12వ అధ్యాయంలో భక్తుల లక్షణాలను తెలియజేశారు. 15వ అధ్యాయ ప్రారంభంలో, జ్ఞానులకు మాత్రమే అర్థంమయ్యేలా తలక్రిందులుగా ఉన్న సంసార అశ్వత్థ వృక్షాన్ని వర్ణించారు.


15.7

మమైవాంశో జీవలోకే జీవభూతః(స్) సనాతనః| మనః(ష్) షష్ఠానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి৷ ।।15.7।।

ప్రాణి లోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతియందు స్థితములైన మనస్సు, ఇంద్రియములను, శబ్దాదివిషయములద్వారా తనవైపు ఆకర్షించును.

అనాదియగు పరమాత్మయే జీవుడి లోని జీవాత్మ. ఈ శతాబ్దిలోని ఒక మహా పురుషుడు మనకు గుర్తుకు వస్తారు. గీతా భవన్ లో సత్సంగం చేయు పరమ శ్రద్ధేయ స్వామి రామ సుధాంశ్ జీ మహారాజ్, గోస్వామి తులసీదాస్ వారి రామచరిత్ మానస్ లోని చౌపాయి గురించి తెలుపుతూ, జీవుడిని ఈశ్వరుడి అంశగా, అవినాశిగా తెలిపారు. పూజ్య స్వామీజీ గోవింద్ దేవ్ గిరి మహారాజ్  భగవద్గీతాను సిద్ధాంత శాస్త్రంగా, రామాయణాన్ని అన్వయ శాస్త్రంగా తెలుపుతారు. శ్రీకృష్ణ భగవానులు తెలిపిన అంశాలనే శ్రీరామచంద్రుల వారు తమ జీవితంలో ఆచరించి చూపారు. పరమాత్మ యొక్క అంశయే జీవుడు. దేహంలోని సనాతనుడైన పరమాత్మ యొక్క అంశయే జీవుడు. జీవుడు వాస్తవంగా అల్పుడు కాదు. కాని జీవుడు ప్రకృతి యందు స్థితములైన మనస్సును, ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తనవైపు ఆకర్షిస్తాడు. జీవుడు సనాతనుడు. కాని తన సస్వరూపాన్ని మరిచిపోతున్నాడు. సనాతనుడైన పరమాత్మ అశ్వత్థ వృక్షం వలే, వివిధ శాఖలతో, చివుళ్ళతో వర్ధిల్లుచున్నాడు. శాస్త్రాకారులు పరమాత్మను మహాకాశంగా, బ్రహ్మాండాన్ని మటాకాశంగా, అందులోని జీవులను ఘటాకాశంగా వర్ణిస్తారు. ఆ ఘటాకాశంలో ఉన్నవాడు జీవాత్మ. జీవాత్మ లేని దేహమునకు అస్తిత్వంలేక విసర్జించబడుతుంది. జీవాత్మ మనస్సు మరియు పంచేంద్రియాలగు స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలచే బాహ్య ప్రపంచంతో అనుబంధం కలిగి ఉంటుంది. మనస్సు జన్మజన్మాంతర సంస్కారాలతో కూడి ఉంటుంది. మన సంస్కారాలు ఒక శరీరం నుండి మరో శరీరంలోకి ఏ విధంగా సంక్రమిస్తాయి ?

15.8

శరీరం(య్ఁ) యదవాప్నోతి, యచ్చాప్యుత్క్రామతీశ్వరః।
గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధానివాశయాత్॥15.8॥

వాయువు వాసనలను ఒకచోటినుండి మఱియొక చోటికి తీసికొని పోయినట్లుగా దేహాదులకు స్వామియైన జీవాత్మ ఒక శరీరమును త్యజించునపుడు, మనస్సు ఇంద్రియములను గ్రహించి, వాటితో గూడ మఱొక శరీరమును పొందును. అనగా దానిలో ప్రవేశించును.

వాయువు సుగంధమును గాని, దుర్గంధమును గాని ఒక చోటు నుండి మరొక చేటుకు తీసుకు వెళ్తుంది. వాయువునకు ఎలాంటి పక్షపాతం లేదు. ఇంద్రియ, మనస్సులకు అధిపతి అయిన జీవాత్మ శరీరాన్ని వీడినప్పుడు, కామనలు, వాసనలు, సంస్కారాలు, ఇష్టాయిష్టాలతో కూడి వెళ్లి నూతన శరీరాన్ని గ్రహిస్తుంది. వాయువుతో పాటు వాసన వెళ్లునట్లు, జీవాత్మతో కూడి ఇంద్రియ మనంబులు వెళ్తాయి. కాబట్టి సంస్కారములను బట్టి మరు జన్మ కలుగుతుంది. జన్మరాహిత్యానికి వాసనారాహిత్యం తప్పనిసరి.

15.9

శ్రోత్రం(ఞ్) చక్షుః(స్) స్పర్శనం(ఞ్) చ, రసనం( ఙ్) ఘ్రాణమేవ చ
అధిష్ఠాయ మనశ్చాయం(వ్ఁ) విషయానుపసేవతే॥15.9॥

ఈ జీవాత్మ త్వక్ఛక్షుశ్ర్శోత్రజిహ్వాఘ్రాణములు అనెడి పంచేంద్రియములను, మనస్సును ఆశ్రయించి, శబ్దాదివిషయములను అనుభవించును.

జీవాత్మకు ఎట్టి ఇంద్రియ వికారాలు లేవు. కాని జీవాత్మ మనస్సు మరియు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం మొదలగు ఇంద్రియాలను ఆశ్రయించి, శరీరాలను మారుస్తూ ఉంటుంది. కామనల వల్ల జన్మలు లభిస్తాయి. జింక చెవులకు శబ్ద గ్రాహ్యత ఎక్కువ. అతి వేగంగా పరిగెత్తే చిరుత 40 సార్లు ప్రయత్నిస్తే ఒకసారి జింకను పట్టుకోగలుగుతుంది. వేటగాళ్లు జింక దగ్గర ఉన్న కస్తూరిని పొందడానికి వేటాడుతారు. దానికి సంగీతం అంటే ఇష్టం. ఆ సంగీతం వినగానే జింక దాని పట్ల ఆసక్తిని చూపుతుంది, ఆస్వాదిస్తుంది. కస్తూరి స్థానం దాని అండ కోశం వద్ద ఉంటుంది. సంగీతంలో లీనమైన జింక అండ కోశాన్ని వేటగాళ్లు కోసేస్తారు. శబ్ద ఆకర్షణలో అతివేగంగా పరిగెత్తే జింక చలనం లేక బలైపోతుంది. అలాగే నేత్రాలు రూపాన్ని ఆస్వాదిస్తాయి. దీపకాంతి ప్రకాశానికి ఆకర్షితమై కీటకాలు అగ్నికి బలి అవుతాయి. చర్మానికి స్పర్శ గుణం ఉంటుంది. అడవిలో సర్వ శక్తిశాలి అయిన ఏనుగు మావటి వానికి లొంగుతుంది. అమావాస్య రాత్రి, 8 అడుగుల గోతిపై ఒక ఆడ ఏనుగు నిర్మాణాన్ని తయారుచేసి, దానికి ఏనుగు పేడను పూస్తారు. ఆడ ఏనుగు శబ్దాన్ని ఒక యంత్ర సహాయంతో వినిపిస్తారు. ఆ దిశగా మగ ఏనుగు పరిగెత్తుతూ వచ్చి, దాని వాసనను పసిగట్టి, ఆడ ఏనుగు రూపం పట్ల ఆకర్షింపబడి, గోతిలో పడుతుంది. మూడు రోజుల పాటు పెనుగులాడుతుంది. అలసిపోతుంది. ఆకలేస్తుంది. ఆ నిస్సహాయ స్థితిలో మావటి వాడు వచ్చి అరటిపళ్ళు, రొట్టెలు ఇస్తాడు. అలా ఆహారం ఆశ చూపి, ప్రతి రోజు తనకు అనుకూలంగా, ఏనుగుకు శిక్షణ ఇస్తూ లోబర్చుకుంటాడు. తన విశ్వాసంలోకి తీసుకొని, వారం తర్వాత గోతిలో నుండి ఏనుగును బయటకు తీస్తాడు. అప్పటికి ఏనుగు తన సహజ శౌర్యాన్ని కోల్పోతుంది, లొంగిపోతుంది. చేప రుచిని కోరి ఎరకు బలవుతుంది. బలమైన చెట్టును కూడా తొలిచే భ్రమరం తామర పుష్ప పరాగ రేణువుల మత్తుకు లోనై, సూర్యాస్తమయం తర్వాత సుకుమారమైన ఆకర్షణ పత్రాల మధ్య బంధించబడుతుంది. మనుష్యులు విపరీతంగా ఒక ఇంద్రియం మాత్రమే గాక, ఐదు ఇంద్రియాల ఆకర్షణలో ఉంటారు.

15.10

ఉత్క్రామన్తం(మ్) స్థితం(వ్ఁ) వాపి, భుఞ్జానం(వ్ఁ) వా గుణాన్వితమ్।
విమూఢా నానుపశ్యన్తి , పశ్యన్తి జ్ఞానచక్షుషః॥15.10॥

జీవాత్మ శరీరమును త్యజించునప్పుడును, శరీరమునందు స్థితుడై యున్నప్పుడును, విషయ భోగములను అనుభవించుచున్నప్పుడును, అటులే త్రిగుణములతో కూడియున్నప్పుడును అజ్ఞానులు తెలిసికొనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమజ్ఞాననేత్రములవలన స్వస్వరూపమును తెలిసికొన గల్గుదురు.

అజ్ఞానులు ప్రాపంచిక దృశ్య వాసనల ప్రభావం వలన, దేహ త్యాగం చేయు జీవాత్మను, విషయాలను భోగిస్తున్న జీవాత్మను, సత్వ స్వభావం కలిగిన జీవాత్మను తెలుసుకోలేరు. కేవలం వివేకం, జ్ఞానదృష్టి, విషయ విరక్తి కలిగిన జ్ఞాని మాత్రమే ఆత్మ విచారణ ద్వారా జీవాత్మను తెలుసుకొనగలడు. అనేక జన్మలుగా మనం ఈ చక్రభ్రమణం లోనే ఉన్నాము. ఈ జ్ఞానానికి వైరాగ్యం మరియు గురు సాన్నిధ్యం అవసరం. ఒక సత్య కథ కలదు. గత జన్మలో యోగినిగా ఉన్న ఒక స్త్రీ, తన బాల్యం నుండి భక్తి భావనతో, విషయాకర్షణ లేకుండా జీవితం గడుపేది. యుక్త వయస్సు వచ్చాక వివాహం చేశారు. తన సద్వవహారంతో తన భర్తను కూడ సత్సంగం పట్ల ఆకర్షితుడిని చేసింది. వారికి కాలాంతరంలో ఒక బాలుడు జన్మించాడు. అతడు ఎనిమిది సంవత్సరాల ప్రాయంలో, ఇంటి బయట ఆడుతూ పాము కాటుకు గురై మరణిస్తాడు. ధర్మాచరణ గల ఆ గృహిణి నిశ్చేష్టురాలై, ఆ బాలుడిని తమ గృహంలోని ఒక గదిలో ఉంచింది. తన భర్తను గూర్చి ఎదురు చూడ సాగింది. సాయంకాలం భర్త రాగానే అతనికి భోజనం వడ్డించింది. కాంతి విహీనమైన భార్య వదనాన్ని చూసి భర్త కారణమడిగారు. ముందు భోజనం కానివ్వండి, తర్వాత చెబుతానని భర్తకు తెలిపింది. కారణం తెలుపమని భర్త అడగగా, పక్కింటి గృహిణి చాలా సంవత్సరాల క్రితం ఒక వంటపాత్ర తన దగ్గర తీసుకుందని, ఇంత కాలం దాని అవసరం రాలేదని, ఇప్పుడు అవసరార్థం ఆ పాత్రను అడగడానికి వెళ్తే, తనతో ఆ స్త్రీ జగడానికి వచ్చి అరవ సాగిందని, ఏడవ సాగిందని, ఇతరుల సమక్షంలో గొడవ చేసిందని తెలిపింది. అప్పుడా భర్త అది చాలా పొరపాటని, ఎదుటివారి వస్తువును తిరిగి ఇవ్వడానికి ఏడువ వలసిన అవసరం ఏముందని అన్నాడు. ఇంతలో భర్త భోజనం చేయడం పూర్తయింది. భర్త తన చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత, అప్పుడా యువతి వారి చేయి పట్టుకుని వేరే గదిలోకి తీసుకెళ్లింది. అచ్చట పుత్రుడు అచేతనుడై పడి ఉన్నాడు. మెడలో తులసి మాల ఉంది. దీపం వెలుగుతుంది. భర్త నిర్ఘాంతపోయి, కుప్ప కూలిపోయాడు. అప్పుడా యువతి సంయమనంతో, ఎవరి వస్తువును వారికివ్వడంలో దుఃఖమేముందని ఇప్పుడే అన్నారు కదా ! అని ఊరడించింది. ఆ పుత్రుడిని భగవానులు కొంత సమయానికై మనకి ఇచ్చారని, తిరిగి తీసుకెళ్లారని, తాము దుఃఖించకూడదని ఓదార్చింది. తన పత్ని యొక్క విచార ధారకు అతడు ఆశ్చర్యపోయాడు. పిల్లవాడి అంత్యక్రియలు చేసి, తదనంతరం ఆ దంపతులు బృందావనం వెళ్లి, తమ శేష జీవితాన్ని గడిపారు. అందరికి మరణం తథ్యం. కాని జ్ఞాని మరియు అజ్ఞాని యొక్క దృష్టికోణం భిన్నంగా ఉంటుంది.

15.11

యతన్తో యోగినశ్చైనం(మ్),పశ్యన్త్యాత్మన్యవస్థితమ్ | యతన్తో౽ప్యకృతాత్మానో, నైనం(మ్) పశ్యన్త్యచేతసః ।।15.11।।

అంతఃకరణశుద్ధిగల యోగులు తమహృదయముల యందున్న ఈ ఆత్మతత్త్వమును ప్రయత్నశీలురై తెలిసికొనగలరు. కాని, అంతఃకరణశుద్ధిలేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించియు, ఈ ఆత్మను తెలిసికొన జాలరు.

ప్రయత్న పూర్వకంగా, ఆత్మ సాక్షాత్కారానికి గీతా చదివినా, ధ్యానం చేసినా, జపం చేసినా, పూజలు చేసినా లాభమేమి కలుగదు. ప్రయత్నానికి తోడు చిత్తశుద్ధి కావాలి. అప్పుడే ప్రయత్నం సఫలీకృతమౌతుంది. సద్గ్రంథ పఠనం, సజ్జన సాంగత్యం చేయు చిత్తశుద్ధి గల యోగులు, తమ యందే ఆత్మను దర్శించగలుగుతారు. కేవలం భగవద్గీతా పఠనం మాత్రమే సరిపోదు. దాని వల్ల పుణ్యం లభిస్తుంది. అంతఃకరణ శుద్ధి అత్యావశ్యకం.  వాసనలను తొలగించుకోవాలి. యమ నియమాలను నిత్యజీవితంలో ఆచరణలోకి రావాలి. భక్తుడి లక్షణాలను, దైవీ గుణాలను సొంతం చేసుకోవాలి. జీవన వ్యవహారాలలో మార్పు రావాలి. మనుష్యులు అవసాన దశలో, ఏ ఏ భావాలను స్మరిస్తూ దేహ త్యాగం చేస్తారో, ఆయా స్వరూపాలనే పొందుతారని భగవానులు తెలిపారు(భ.గీ.8-6). జీవితమంతా రామనామ స్మరణ చేసినా, అంత్య కాలంలో ప్రాపంచిక వాసనలతో శరీరాన్ని త్యాగం చేస్తే ఫలితం శూన్యం.

15.12

యదాదిత్యగతం(న్) తేజో, జగద్భాసయతే౽ఖిలమ్| యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ, తత్తేజో విద్ధి మామకమ్ ।।15.12।।

సమస్తజగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్నితేజస్సును నాతేజస్సేయని యెఱుంగుము.

పరమాత్మ మహిమను అర్థం చేసుకోవాలి. జగత్తంతా వారి దివ్య విభూతులతో నిండి ఉంది. జగత్తంతటిని ప్రకాశింపజేయు సూర్యుడి యందు, చంద్రుడు యందు, అగ్ని యందు గల తేజస్సంతయు పరమాత్మకు చెందినది. అవి స్వయం ప్రకాశకములు కాదు.

15.13

గామావిశ్య చ భూతాని, ధారయామ్యహమోజసా| పుష్ణామి చౌషధీః(స్) సర్వాః(స్), సోమో భూత్వా రసాత్మకః ।।15.13।।

పృథ్వియందు ప్రవేశించి, నేను నా శక్తిద్వారా సకల భూతములను ధరించి, పోషించుచున్నాను. రసస్వరూపుడనై - అనగా అమృతమయముడైన చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులన్నింటికిని పుష్టిని చేకూర్చుచున్నాను.

సమస్త పదార్థములకు, ప్రాణులకు, శక్తి ప్రదాత పరమాత్మయే. పరమాత్మ భూమి యందు ప్రవేశించి సమస్త ప్రాణికోటిని తమ శక్తిచే ధరిస్తున్నారు. తాను రస స్వరూపుడైన చంద్రుడై సమస్త సస్యములను పోషిస్తున్నారు. మన ఉనికికి కారణమైన పరమాత్మ పట్ల సమర్పణ భావంతో వ్యవహరించాలి.

15.14

అహం(వ్ఁ) వైశ్వానరో భూత్వా, ప్రాణినాం(న్) దేహమాశ్రితః।
ప్రాణాపానసమాయుక్తః (ఫ్), పచామ్యన్నం(ఞ్) చతుర్విధమ్॥15.14॥

నేనే ప్రాణాపానసంయుక్తమైన వైశ్వానరాగ్ని రూపములో సర్వప్రాణుల శరీరముల యందుండి నాలుగువిధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును.

పరమాత్మ వైశ్వానరుడనే  జఠరాగ్ని రూపంలో ప్రాణుల శరీరాన్ని ఆశ్రయించి, ప్రాణాపాన వాయువులతో గూడి, వారు భుజించే నాలుగు విధములైన భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యములనబడే ఆహారాలను జీర్ణం చేస్తున్నారు. కావున దైవమునకు నివేదన చేయకుండా,  స్వీకరించు భోజనం అపవిత్రమౌతుంది. సముద్రంలో వచ్చు బడబాగ్ని, అరణ్యంలో వచ్చు దావాగ్ని, శరీరంలోఉన్న జఠరాగ్నిగా, అగ్ని మూడు విధాలుగా ఉంటుంది. జఠరాగ్ని సూర్యోదయంతో మొదలై, వృద్ధి చెంది సూర్యాస్తమయంతో తగ్గుముఖం పట్టుతుంది. అందువల్ల సూర్యాస్తమయం లోపు ఆహారాన్ని స్వీకరించాలి.

15.15

సర్వస్య చాహం(మ్) హృది సన్నివిష్టో, మత్తః (స్)స్మృతిర్జ్ఞానమపోహనం(ఞ్) చ |వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో, వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ ।।15.15।।

సమస్తప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్న వాడను నేనే. నానుండియే స్మృతి, జ్ఞానము, అపోహనము (సందేహమును తొలగించుట) కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలిసికొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడను గూడ నేనే.

ఇచ్చట పరమాత్మ స్వరూపమును తెలియజేయుచున్నారు. ఆ పరమాత్మ సర్వ ప్రాణుల హృదయం నందు అంతర్యామిగా ఉన్నారు . వారి వల్లనే జ్ఞాపకశక్తి, జ్ఞానము, మఱపు కలుగుచున్నది. వారు మనస్సుకు అధిష్టానంగా ఉన్నారు. కావున విషయ వాసనలకు దూరంగా ఉండాలి. వేదములచే తెలుసుకోదగినవారు, వేదములను సృజించినవారు,  వేదములను ఎఱిగిన వారు కూడ పరమాత్మయే. కావున వేదముల పట్ల అచంచల విశ్వాసం అవసరం. ఈ సృష్టికి ఆధారంగా ఉన్న వారి అఖండ చైతన్యాన్ని, సదా స్మృతి యందు ఉంచుకోవాలి.

15.16

ద్వావిమౌ పురుషౌ లోకే, క్షరశ్చాక్షర ఏవ చ| క్షరః(స్) సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ।।15.16।।

ఈ జగత్తునందు క్షరుడు (నశ్వరుడు), అక్షరుడు (వినాశరహితుడు) అని పురుషులు రెండు విధములుగా గలరు. సకలప్రాణులశరీరములు నశ్వరములు. జీవాత్మ నాశరహితుడు.

ఈ ప్రపంచము నందు దేహాభిమానం గల, నాశనం కలిగిన  పురుషుడు మరియు ఆత్మ చైతన్యం గల, నాశనము లేని పురుషుడు కలరు. మోక్షం సిద్ధించు వరకు నశింపకుండా, కూటస్థ రూపంలో జీవుడు ఉంటాడు. పుట్టుక నుండి జీవుడి శరీరం మార్పులకు గురవుతూనే ఉంటుంది. నేను అనే చైతన్యం మాత్రం అక్షరంగా ఉంటుంది. ప్రకృతి-పురుషుడు, దేహం-దేహి, జడము-చైతన్యము, నాశి-అవినాశి అను పేర్లతో ఒప్పుచున్న పురుషులు ఇరువురు కలరు.

15.17

ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః ।
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః ।। 15.17 ।।

పై ఇద్దరికంటెను ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. అతడు ముల్లోకములయందును ప్రవేశించి అందఱిని భరించి పోషించుచున్నాడు.

పైన తెలిపిన క్షర, అక్షర పురుషుల కంటెను భిన్నంగా ఉండి, మూడు లోకము లందు ప్రవేశించి, వాటిని నిర్వహించు సర్వలోకధారి, నాశరహితుడు, జగన్నియామకుడైన ఉత్తమ పురుషుడే పరమాత్మ మరియు ఈశ్వరుడు. దేహము, కూటస్థ జీవుడు అంతరించినా పరమాత్మ మాత్రం శాశ్వతుడు. అట్టి పరమపదమును గూర్చి జీవుడు అన్వేషించాలి.

15.18

యస్మాత్క్షరమతీతో౽హమ్,అక్షరాదపి చోత్తమః |
అతో౽స్మి లోకే వేదే చ,ప్రథితః(ఫ్) పురుషోత్తమః ।।15.18।।

ఏలనన, నశ్వరమగు జడవర్గము (క్షేత్రము) కంటెను నేను సర్వథా అతీతుడను. నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను. కనుక ఈజగత్తునందును, వేదముల యందును పురుషోత్తముడనని ప్రసిద్ధి కెక్కితిని.

క్షర, అక్షర పురుషులకంటే అతీతుడైనట్టి, శ్రేష్టుడైనట్టి అక్షరుడైన పరమాత్మ, ఈ లోకమున మరియు వేదములందు పురుషోత్తముడుగా ప్రసిద్ధి చెందినాడు. కాబట్టి ఈ అధ్యాయం పురుషోత్తమ యోగమైనది.

15.19

యో మామేవమసమ్మూఢో, జానాతి పురుషోత్తమమ్| స సర్వవిద్భజతి మాం(మ్) సర్వభావేన భారత ।।15.19।।

ఓ అర్జునా! జ్ఞానియైనవాడు ఈ విధముగా నన్ను తత్త్వతః పురుషోత్తమునిగా ఎఱుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును.

ఎవరైతే అజ్ఞానరహితుడై,  ఈ ప్రకారముగా ఆ పరమాత్మను పురుషోత్తముడిగా ఎఱుగుచున్నారో,  వారు సర్వజ్ఞులై, భక్తి భావంతో, పరిపూర్ణ మనస్సుతో ఆ పరమాత్మను భజిస్తూ ఉంటారు. కావున పరమాత్మను పొందవలెనన్న పరిపూర్ణ భక్తి మరియు అచంచల విశ్వాసం అవసరం.

15.20

ఇతి గుహ్యతమం(మ్) శాస్త్రమ్, ఇదముక్తం(మ్) మయా౽నఘ| ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్,కృతకృత్యశ్చ భారత ।।15.20।।

ఓ పుణ్యపురుషా! ఓ అర్జునా! అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్త్వమును తెలిసికొనిన మనుష్యుడు జ్ఞానియై కృతార్థుడు కాగలడు.

ఇట్టి పరమరహస్యమైన శాస్త్రమును భగవానులు పాపరహితుడైన అర్జునుడికి తెలియజేశారు. కావున జ్ఞానప్రాప్తికి నిర్మలత్వం అవసరం. గీతా శాస్త్రము ప్రమాణపూర్వకమైనదిగా భగవానులు ఈ అధ్యాయము ద్వారా తెలిపారు. ఈ శాస్త్రాన్ని తెలుసుకున్నవాడు స్వస్వరూపానుభవం పొందే జ్ఞానవంతుడు, జన్మ సార్ధకతను పొంది కృతకృత్యుడు కాగలడు.


జీవితాన్ని గీతామయం చేసుకోవాలని, మిగతా అధ్యాయాలను కూడ నేర్చుకోవాలని మొదటి స్థాయి సాధకులను కోరుతూ, వారి నిష్కామ సేవను ఆశిస్తూ, వివేచకులు తమ వివేచనను ముగించి, హరి నామ సంకీర్తన గావించి, ప్రశ్నోత్తరములను చేపట్టినారు.


ప్రశ్న : గీతా ను  చదివినప్పటికి, అంతఃకరణ శుద్ధి లేకుండా ఏదీ సాధ్యం కాదన్నారు. అదెలా ?

జవాబు : మనం మహాకుంభమేళాకు వెళ్లి గంగా స్నానం చేస్తాం, జప ధ్యానాదులు చేస్తాం, పూజలు, ఉపవాసాలు చేస్తాం. కాని అది సరి పోదు. మన భావనలో, వ్యవహారంలో మార్పు రావాలి. ఆ మార్పు లేకుండా భగవానులు ఏమి చేయ లేరు. కామనలు, వాసనలు, అసత్యం, కపటత్వం, కుతంత్రం అంతఃకరణంలో ఉండగా, భగవానులు లభ్యం కారు. ముందుగా మీ సన్నిహితులు, ఆశ్రితులు, సేవకులు, పరివారములోని వారిని ఇష్టపడాలి. అందరిని స్వీకరించ గలగాలి. ఒకరోజు సంత్ ఏకనాథ్ మహారాజ్ నడుస్తూ వెళ్తున్నారు. వారు యథాలాపంగా చేయి విదిలించే సరికి, చెట్టు పైనున్న ఒక పక్షి ఎగిరిపోయింది. తన వల్ల ఆ పక్షికి భయం కలిగిందని, కాబట్టి తన అంతఃకరణ శుద్ధి సంపూర్ణం కాలేదని వారు భావించారు. మనుష్యులే కాదు, ప్రకృతి, పక్షులు కూడ మన వల్ల భయపడకూడదు. మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రేమమయం కావాలి.


ప్రశ్న : నాకు రామాయణం చదివే అలవాటుంది. భగవద్గీతా వల్ల అది వెనుక బడిపోయింది. ఎలా ?

జవాబు : రెండు వేరువేరు కాదు. రామాయణం భగవానుల జీవనం. భగవద్గీతా భగవానుల వాణి, మన నిత్య జీవితంలో భగవానులు నిండిపోవాలి.


ప్రశ్న : మహాకాశం, మటాకాశం, ఘటాకాశంపై వివరణ ఇవ్వగలరు.

జవాబు: మహాకాశమనగా పరమాత్మ, మటాకాశమనగా బ్రహ్మాండం, ఘటాకాశమనగా శరీరం.


ప్రశ్న : శ్లోకం పాడలేకపోయినా, అర్థం తెలుసుకోవడం మంచిదా ?

జవాబు: శ్లోకం వల్ల రెండు లాభాలు కలుగుతాయి. ఒకటి మంత్ర లాభం, రెండవది అర్థ లాభం. వైఫై టెక్నాలజీ తెలియకపోయినా, పాస్ వర్డ్ తో ఇంటర్నెట్ ప్రయోజనం పొందవచ్చును.  అర్థం తెలియకపోయినా, శుద్ధ ఉచ్చారణ వల్ల మంత్ర లాభం చేకూరుతుంది. అర్థం తెలుసుకోవడం వల్ల, జీవితంలో అన్వయించడం జరుగుతుంది . వివేచనల వల్ల అర్థం తెలుసుకుని, అన్వయించుకోవచ్చును


ప్రశ్న : జీవితంలో గురువు అవసరమా ?

జవాబు: తప్పకుండా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజి, జియాలజీ, ఆర్ట్స్, ఇంజనీరింగ్, మెడిసిన్, అకౌంటెన్సీ మొ॥న ఏ శాస్త్రమైనా గురువు ద్వారానే నేర్చుకుంటాం. యూట్యూబ్ ద్వారా నేర్చుకోము కదా ! చిన్న చిన్న అంశాలైన డ్రైవింగ్ నేర్చుకోవడానికి కూడ గురువు కావాలి. బ్రహ్మ విద్య గురువు లేకుండా ఎలా సాధ్యం ? నాలుగు పద్ధతుల ద్వారా గురువుని ఎంపిక చేసుకోవాలి. ఒకటి, తమను స్వయంభుగా ప్రకటించుకునే గురువులకు దూరంగా ఉండాలి. రెండు, వారు గురు పరంపర నుండి వచ్చిన వారై ఉండాలి. మూడు, వారు శాస్త్రాలను అనుసరించే వారై ఉండాలి. నాలుగు, స్వీయ పూజ కాకుండా, భగవానుల సేవను ప్రోత్సహించాలి..గురువులు ఈ దేశంలో కోకొల్లలు. కాని సద్గుగురులు కొంతమందే. 


ప్రశ్న : ధ్యానం ఎలా చేయాలి ?

జవాబు:  భగవానుల స్వరూప ధ్యానం, నామ ధ్యానం, గుణముల యొక్క ధ్యానం, ధామం యొక్క ధ్యానం చేయవచ్చును. ఇవి పూర్ణత్వాన్ని కలుగజేస్తాయి.


ప్రశ్న: నా మనస్సు సందేహంలో పడింది. నేను భయభీతులతో గడుపుతున్నాను. తెలిసీతెలియక నేను ఒక చెడు కర్మను చేశాను. నేను ఇంటర్వ్యూ బోర్డులో సభ్యులుగా ఉండి, బుద్ధి వక్రీకరించి ఒకరి నుండి డబ్బులు తీసుకున్నాను. తిరిగి ధార్మిక కార్యాలలో ఎంత వెచ్చించినా మనస్సు నుండి అపరాధ భావన తొలగడం లేదు. దీనికి పరిష్కారం ఉందా? దండన లభిస్తుందా ? ప్రాయశ్చిత్తం ఏమిటి ? ఇది సంతానానికి శాపం అవుతుందా ?

జవాబు: పాపం జరిగింది. దానిని మరిచిపోవాలి.  చింతించడం వల్ల మనస్సుకు దుఃఖం కలుగుతుంది. మీ మనస్సులో పశ్చాత్తాప భావన కలగడం, మీ సత్కర్మల ఫలం లేదా మీ పూర్వజుల పుణ్య కర్మల ఫలం కావచ్చును. మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో తనను ఆరాధిస్తే, అతడు సత్పురుషుడు గానే భావించ బడుతాడని, అతడిని నిశ్చయ బుద్ధితో, పరమాత్మ సేవకై అంకితమైన వాడిగా భావించవచ్చునని భగవానులు దయతో తెలిపారు (భ.గీ.9-30). తప్పు చేయడం తప్పు కాదు, ఆ తప్పును సరిదిద్దుకోకపోవడం తప్పు. పొందిన ధనాన్ని దానం చేయడం మంచిది. భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలి. భగవద్గీతాను త్రికరణ శుద్ధితో చదివే వారిని భగవానులు ఉద్ధరిస్తారు.


ప్రశ్న :  పూజల ద్వారా చాలా అనుభవాలు పొందాను. ప్రస్తుతం గీతా పఠనం చేస్తున్నాను. తిరిగి అలాంటి దర్శనాలు కలుగుతాయా ?

జవాబు : అనుభూతులు రెండు రకాలు. ఒకటి పుస్తకాల్లో చదివి, వినడం వల్ల మనస్సు కల్పన చేస్తుంది. రెండవది నిష్కామ భావనతో, నిష్టతో చేసిన ధ్యానం వల్ల, ఇలాంటి భావనలు కలగవచ్చును. ఈ అనుభూతులలో చిక్కకుండా ఉండడం ఉత్తమ స్థితి. అనుభవాల కోసం ఆరాటపడడం నిమ్న స్థితిని సూచిస్తుంది. అనుభూతులు రజోగుణ ప్రవృత్తికి మూలమౌతాయి, మాయతో మనల్ని బంధిస్తాయి. సిద్ధులకు దూరంగా ఉండాలి.

సమస్త సందేహాలను నివృత్తి చేసిన వివేచకులకు మరియు గీతా పరివార్ సాంకేతిక బృందానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత, హనుమాన్ చాలీసా పఠనానంతరం సత్రం ముగిసింది.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం(య్ఁ)
యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే పురుషోత్తమయోగో నామ పఞ్చదశో౽ధ్యాయః॥॥

ఈ విధముగా ఓం తత్ సత్ అను భగవన్నామ ఉచ్చారణ పూర్వకమైన బ్రహ్మ విద్య మరియు యోగ శాస్త్ర మయమైన, శ్రీకృష్ణార్జునుల సంభాషణ లేక సంవాద రూపములో ఉన్న శ్రీమద్భగవద్గీతలోని పదిహేనవఅధ్యాయమైన పురుషోత్తమయోగము సమాప్తమైనది