विवेचन सारांश
సమత్వమే యోగము మరియు స్థిత ప్రజ్ఞత
రెండవ అధ్యాయము సాంఖ్య యోగము వివేచన ఐదవ భాగము యదావిధిగా ఆరంభ ప్రార్థన మరియు దీప ప్రజ్వలనతో ప్రారంభమైనది. వివేచనను చెప్పవలసినదిగా గీతా పరివార్ అంతర్జాతీయ కార్యాధ్యక్షులు, లెర్న్ గీతా ప్రోగ్రాం యొక్క ప్రోగ్రాం డైరెక్టర్, ఆదరణీయులు డా. ఆశూ జీ గోయల్ గారిని సాదరంగా ఆహ్వానించారు.
డా. గోయల్ గారు కృష్ణ ప్రార్ధనలు, గురు చరణములకు వందనములతో వివేచనను ప్రారంభించారు. భగవంతుని అత్యంత మంగళమయ కృప వలన మనందరకి ఎటువంటి సద్భాగ్యము జాగృతము అయినదంటే మన జీవితాల్ని పరమ సఫలము చేసుకోవడానికి, సార్ధకము చేసుకోవడానికి, మన ఈ లోకము మరియు పరలోకములో మంచి జరగటానికి మనమందరము భగవద్గీతను అధ్యయనం చేయడంలో, పఠనములో, నేర్చుకోవడంలో, దానిని ప్రసారం చేయడంలో, దాని అర్థాలను తెలుసుకోవడంలో, వివేచనను విని కొన్ని సూత్రములను జీవితములోనికి తీసుకురావడానికి ముందుకు కదిలాము. మనము ఈ జన్మలో చేసుకున్న పుణ్య కర్మల వలనో, పూర్వజన్మలలో చేసుకున్న పుణ్య కర్మల వలనో, మన పూర్వజులు యొక్క కొంత సుకృతము వలనో, లేదా ఏదైనా జన్మలో ఎవరైనా సంత మహాపురుషుని యొక్క కృపాదృష్టి మనపై ప్రసరించడం వలనో ఆ కారణంగా ఇటువంటి భాగ్యోదయము కలిగినది మరియు భగవద్గీత కొరకు ఎంచుకోబడ్డాము. నేను మరలా మరలా చెప్పేది ఏమిటంటే మనము దీని కోసము ఎంచుకోబడ్డామన్న పరమ విశ్వాసము మన మనసులలో కలిగినట్లయితే, ఈ భావన ఉన్నంత వరకు జీవితంలో గీత ఎప్పటికీ మన నుంచి వేరు కాదు.
ద్వితీయ అధ్యాయము యొక్క వివేచనను మనము చెప్పుకుంటున్నాము. ఇది అత్యంత గూఢమైన సాంఖ్య యోగము. మొత్తం భగవద్గీతలోని 700 శ్లోకాలలో 574 శ్లోకాలు భగవంతుని శ్రీ ముఖము నుంచి వెలువడ్డాయి. ఎన్నో అద్భుతమైన విషయాలను, జ్ఞానబండారమును నింపి భగవంతుడు ఈ 574 శ్లోకాలలో చెప్పాడు. కాని భగవంతుడు ఏ మూల విషయాన్ని భగవద్గీతలో అర్జునుడికి చెప్పాలనుకున్నాడు? ఏదైనా ఒక సందేశాన్ని భగవంతుడు అర్జునుడికి ఇవ్వాలనుకున్నాడు అనుకుంటే మనకు చాలా సందేశములు దొరకవచ్చును. ఒకరు తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ అని చెప్పవచ్చును, వేరొకరు మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు అని, ఇంకొకరు సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ అని, వేరొకరు మా ఫలేషు కదాచన అని, ఇంకొకరు మామేకం శరణం వ్రజ అని భగవంతుడు చెప్పాలనుకుంటున్నాడని అంటే ఇవన్నీ కూడా వాటి స్థానంలో సరి అయినవే. ఇలాంటి విషయాలు ఇంకొన్ని ఇంకొంతమందికి అనిపించవచ్చును. కాని సంతులు దీనిపై ఆలోచనలు చేసి ఒక అభీష్టాన్ని భగవంతుడు అర్జునుడి ముందు పెట్టాడని చెబుతారు, అది ఆరవ అధ్యాయము లోని 46వ శ్లోకము యొక్క అంతిమ చరణం తస్మాద్యోగీ భవార్జున, అన్ని చేసి నువ్వు యోగివి కమ్మని.
యోగిలో అనేక శబ్దములు ఉండవచ్చును. ఉదాహరణకు ఒక వ్యాపారి తన కుమారుడిని వ్యాపారం చేయమంటే కుమారుడు ఏ వ్యాపారం చేయాలని అడగవచ్చును. అక్కడ అనేక వ్యాపారములు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వ్యాపారం అన్నది మౌలిక శబ్దం. దాని అంతర్గతముగా అనేక విషయములు వస్తాయి. ఇదే విధముగా యోగి కావడం ఒక మౌలిక విషయము. ఇప్పుడు ఇందులో ధ్యానయోగి కావాలా, కర్మయోగి కావాలా, జ్ఞాన యోగి కావాలా, భక్తి యోగి కావాలా లేదా ఇంకా అన్యమైన యోగి ఏదైనా కావాలా అన్నవి దానికి అంతర్గతముగా వచ్చే విషయములు. అందుకే భగవాన్ వేదవ్యాసుడు ప్రతి అధ్యాయమునకు చివర పుష్పికలో యోగ శాస్త్రము అని చెప్పాడు అంటే యోగి అవ్వడానికి శాస్త్రము. భగవద్గీతలోని అధ్యాయములన్నీ యోగశాస్త్రములని చెప్పబడ్డాయి మరియు భగవంతుడిని యోగేశ్వరుడు అని చెప్పారు. యత్ర యోగేశ్వరః కృష్ణో అని చివరి శ్లోకములో సంజయుడు అంటాడు. ఇక్కడ భగవంతుడిని సమస్త యోగములకు ఈశ్వరుడని, యోగేశ్వరుడని మరియు భగవద్గీత లోని అన్ని అధ్యాయములను యోగశాస్త్రములని చెప్పారు.
యోగ శబ్దమును గురించి కూడా కొంచెం ఆలోచన చేసుకుందాము. ఈ రోజులలో కొంచెం ఆసనాలు వేసి, కాస్త గాలిని పీల్చి విడిచిపెట్టినట్లయితే దానిని యోగముగా చెబుతున్నారు. ఇవి కేవలము యోగము యొక్క అంగములు మాత్రమే. పతంజలి మహర్షి యోగ సూత్రాలలో అష్టాంగ యోగం అనే విషయం గురించి చెప్పారు. యోగ సూత్రములలో అష్టాంగ యోగము ఒక చిన్న విషయము. ఆ అష్టాంగ యోగములో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము, సమాధి అనే ఎనిమిది స్థాయిలు ఉంటాయి. ఈ ఎనిమిదిలో ఆసనము మరియు ప్రాణాయామము మూడు మరియు నాలుగు స్థాయిలు, యమ, నియమముల తర్వాత వస్తాయి. వీటి అంతిమ స్థాయి సమాధి అని చెప్పారు. సమాధి అంటే బుద్ధి యొక్క సమత్వము. భగవంతుడు ఈ సూత్రమును యోగము అని చెప్పాడు.
ఈరోజు మనము 48వ శ్లోకము నుంచి ప్రారంభించి చెప్పుకోవడానికి దాని భూమికను ఇక్కడ చెప్పడానికి ప్రయాస చేస్తున్నాను. భగవంతుడు ఈ విధముగా అంటున్నాడు-
2.48
యోగస్థః(ఖ్) కురు కర్మాణి, సఙ్గ(న్) త్యక్త్వా ధనఞ్జయ৷
సిద్ధ్యసిద్ధ్యోః(స్) సమో భూత్వా , సమత్వం(య్ఁ) యోగ ఉచ్యతే॥2.48॥
హే ధనంజయ! నీవు ఆసక్తిని త్యాగము చేసి, సిద్ధి మరియు అసిద్ధిలో సమాన బుద్ధి కలిగియుండి, యోగములో స్థితుడవై కర్తవ్య కర్మలను చేసినట్లయితే అటువంటి సమత్వము యోగము అని చెప్పబడుతుంది.
కురు కర్మాణి సఙ్గం త్యక్త్వా - ఆసక్తికి పర్యాయపదాన్ని ఇక్కడ భగవంతుడు వాడాడు. సఙ్గం త్యక్త్వా- అనగా విషయముల యొక్క సంఙ్గత్యము చేయరాదు. విషయముల సాంగత్యం అనగా భోజనం చేయకూడదా? లేక మొబైల్ వాడకూడదా? లేక మంచి దుస్తులు వేసుకోకూడదా? ఇవన్నీ చేయవచ్చును. కాని మొబైల్ ఫోన్ వాడుతున్నప్పుడు ఎవరిదైనా మన మొబైల్ కన్నా ఇంకా బాగా కనిపిస్తే, బాగుంది నా దగ్గర ఎందుకు లేదు, దీని మోడల్ ఏమిటి? దీని ధర ఎంత? అని అనుకోకూడదు. ఎవరి ఇంటిలో అయినా మంచి పరదాలు చూస్తే ఎంతో బాగున్నాయి అని, ఎవరిదైనా డైనింగ్ టేబుల్ చూసి ముగ్దులవడము, అలా ప్రతి విషయానికి ఆసక్తులమవుతూ ఉంటాము. కొంతమంది మనసు కొన్నింటిలో చిక్కుకుంటుంది, ఇంకొంతమంది మనసు ఇంకొన్నింటిలో చిక్కుకుంటుంది. కొంతమందికి ఇల్లు, బట్టలు, మొబైల్ లో చిక్కుకుంటే, కొంతమందికి తిని తాగే వాటిపైన, కొంతమందికి పనిలేని కబుర్లు చెప్పుకోవడంలో మనసు ఇరుక్కుంటుంది. అందుకోసమే భగవంతుడు సఙ్గం త్యక్త్వా అని చెబుతున్నాడు.
ఈ రోజుల్లో ఒక కొత్త సఙ్గం ఉత్పన్నమైనది, అది ఏమిటంటే ఆన్లైన్ షాపింగ్. చాలామందికి ఇంట్లో అవసరము ఉన్నా లేకపోయినా సేల్ వచ్చినప్పుడు గంటల తరబడి సామాన్లు వెతుకుతూనే ఉంటారు. దేనిపై మంచి ఆఫర్ వస్తుందో చూస్తుంటారు. ఈ ఆఫర్ చాలా బాగుందని కొంటూ ఇంటి నిండా చెత్తను నింపుతూ ఉంటారు. ఏమీ అవసరం లేని వస్తువులు కూడా మంచి ఆఫర్లో దొరుకుతున్నాయని, చవకలో దొరికింది ఏదో ఒక రోజు పనికి వస్తుంది అని కొని వాటి ప్యాకింగ్ కూడా విప్పకుండా అలాగే పెట్టుకుని ఉంటారు. ఇది ఎటువంటి పిచ్చి పని? అఫర్ వస్తోందని ఏ కారణం లేకుండానే సామాన్లు కొని ఇంటిలో నింపుకుంటాము. ఆవశ్యకత లేకుండానే పోగు పెడుతుంటాము. ఇది కొత్త కొత్త భోగములను వెతికే ప్రవృత్తి.
సఙ్గం త్యక్త్వా- ఇటువంటి సంగ్రహమును త్యాగము చేయమని భగవంతుడు చెబుతున్నాడు. పాత భోగములు వదిలిపెట్టవు ఇంకా కొత్త భోగములను వెతుకుతూ ఉంటాము. ఇది అలా ఉన్నది, అది ఇలా ఉన్నది, ఇది కొత్తది అనుకుంటూ ఉంటాము. వివేచనకు వచ్చి పూజపై మనసు నిలవడం లేదు, ధ్యానముపై మనసు నిలవడం లేదు అని ప్రశ్నలు అడుగుతుంటాము. రోజంతా షాపింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటే పూజకు కూర్చున్నప్పుడు భగవంతునిపై మనసు వస్తుందా లేక షాపింగ్ పై మనసు వస్తుందా? రోజంతా రీల్స్ చూస్తూ ధ్యానమునకు కూర్చుంటే రీల్సే మనసులోకి వస్తాయి. రోజంతా భోజనం గురించి ఆలోచించినట్లయితే ధ్యానములో కూర్చున్నప్పుడు భోజనమే మనసులో కదులుతూ ఉంటుంది. ఏ విషయానికయితే మనము ఎక్కువ సమయాన్ని కేటాయిస్తామో దానిపైనే మన మనసు ఉంటుందని గుర్తుపెట్టుకోండి.
మనం ఏ విషయముతో సంఙ్గము చేస్తామో దాని యొక్క ఆసక్తి నిర్మాణం అవుతుంది. ఆసక్తి నుంచి స్పృహ, స్పృహ నుంచి కోరికలు, కోరికల నుంచి వాసనలు మరియు వాసనల నుంచి తృష్ణ నిర్మాణం అవుతాయి. సంఙ్గము, ఆసక్తి, స్పృహ, కోరికలు, వాసనలు, తృష్ణ ఒక క్రమంలో వస్తాయి. మంచి లడ్డు తిన్నామనుకోండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందన్న ఆసక్తి వెంటనే కలుగుతుంది. తిన్న లడ్డు అరిగిపోయిన తరువాత కూడా, మూడు రోజుల తరువాత దాని రుచి గుర్తుకు వస్తుంది. నేను మొన్న తిన్న లడ్డు ఎంతో బాగుంది, ఇది స్పృహ. మళ్లీ లడ్డు ఎప్పుడు దొరుకుతుందో అనుకుంటే అది కోరిక. మళ్లీ దొరికిన తరువాత ఇలా రోజూ దొరుకుతూనే ఉండాలి అనుకుంటే అది వాసన. ఈ లడ్డు లేకుండా నేను ఉండలేను అంటే అప్పుడు అది తృష్ణ అవుతుంది. బహుశా వీటిలో తేడా మీకు అర్థమై ఉంటుంది. లడ్డు తినాలనుకోవడం సంఙ్గము. చాలా బాగుంది ఎక్కడిది అని ఆరా తీయడము ఆసక్తి. ఎంత రుచికరమైన లడ్డు తిన్నాను అని దానిని గుర్తు చేసుకోవడం స్పృహ. ఇంకొకసారి తినాలనిపిస్తే అది కోరిక. మళ్లీ మళ్లీ తినడానికి దొరికితే బాగుండును అనుకోవడం వాసన. ఇది లేకుండా నేను ఉండలేను అనుకోవడం తృష్ణ.
ఈ విధముగా మనము ఏదైనా వస్తువుతో సఙ్గము ఏర్పరచుకుంటాము, ఏదైనా వస్తువుపై ఆసక్తితో ఉంటాము, ఏదైనా వస్తువుపై స్పృహతో ఉంటాము, ఏదైనా వస్తువును కోరుకుంటాము, ఏదైనా వస్తువుపై వాసనలో ఇరుక్కుంటాము, మరియు ఏదైనా వస్తువు యొక్క తృష్ణలో ఇరుక్కుపోతాము. ఈ కారణంగానే పునర్జన్మ జరుగుతూ ఉంటుంది- పువరపి జననం పనరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. అందుకే కోట్ల కోట్ల జన్మల నుంచి ఇక్కడ ఇరుక్కుని ఉంటాము. అనేక వస్తువులు, వ్యక్తులు, పరిస్థితులపై కోరికలు, ఆసక్తి, వాసనలు, మరియు తృష్ణ పెంచుకోవడం కారణంగా మరలా మరలా భోగములలో ఇరుక్కుని తిరిగి తిరిగి జన్మిస్తాము. కురు కర్మాణి- పని మాత్రం చెయ్యి కాని, సఙ్గం త్యక్త్వా- సంఙ్గమును, ఆసక్తిని త్యాగము చేసి చెయ్యి అని భగవంతుడు చెప్పాడు.
భగవంతుడు చెప్పే రెండో విషయం- సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా. నేను కర్మలను ఆచరిస్తే సఫలత లభించలేదన్న భావన పెట్టుకోవద్దు. లభిస్తే మంచిది, లభించకపోయినా మంచిదే. రెండింటిలో తేడా ఉండకూడదు. లభించడంలో ఆసక్తి లేదంటే నాకు వద్దని కాదు. పంట రాదన్న భావనతో రైతు ఎప్పుడూ వ్యవసాయం చేయడు. తక్కువ పండినా సరే, ఎక్కువ పండినా సరే. సిద్ధి మరియు అసిద్ధిలో సమానంగా ఉండాలి. మనము అనుకున్న పని బాగా జరిగినా మంచిదే చెడు జరిగినా మంచిదే.
యోగస్థః- యోగ స్థితిలో ఉండు. 47వ శ్లోకంలో భగవంతుడు కర్మ చేయకపోవడంలో నీకు రుచి ఉండకూడదు అనగా కర్మను మాత్రము చేస్తూనే ఉండాలి కాని ఫలముపై ఆసక్తి ఉండకూడదు అని చెప్పాడు. అంటే ఆసక్తి ఉన్న కర్మలను చేయకూడదు. కాని కర్తవ్య కర్మలను చేయడంలో వెనక్కి తగ్గకూడదు మరియు నాకు ఏ విషయాలయితే ఆవశ్యకము కాదో ఆ కర్మలను చేయడంలో నేను ప్రవృత్తుడను కాను. ఈ రెండింటి మధ్య అంతరము చాలా సూక్ష్మమైనది అందువలన ఎంతో సూక్ష్మతతో అర్థము చేసుకోవాలి. వీటి సఫలత, అసఫలత రెండింటిలో సమాన బుద్ధితో ఉండాలి.
భగవంతుడు సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు. రెండో అధ్యాయము 38వ శ్లోకంలో సుఖదుఃఖే సమే కృత్వా, లాభాలాభౌ జయాజయౌ అన్నాడు భగవంతుడు. ఈ శ్లోకాన్ని మనము గత వారాలలో చెప్పుకున్నాము. ఇక్కడ సాధారణమైన విషయాలను భగవంతుడు చెప్పాడు. సుఖము మరియు దుఃఖము రెండింటిలో సమానంగా ఉండాలి. వాటిని అనుభవించవద్దని చెప్పలేదు. అలా ఎవరూ చేయలేరు కూడా. నాకు ఏదైనా మంచి జరిగితే నాకు బాగా అనిపించదు, చెడు జరిగితే చెడుగా అనిపించదు అని ఉండదు. వాటిలో సమముగా ఉండాలి. అర్థమైందా లేదా? సుఖము కలిగినప్పుడు ఎంతగా సంబరాలు చేసుకుంటామో దుఃఖము కలిగినప్పుడు అంతే ఏడవాల్సి ఉంటుంది. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. ఎవరైతే తక్కువ సంబర పడతారో వారు ఏడ్చేది కూడా తక్కువగానే ఉంటుంది. కొంచెం మనసుకు నచ్చినట్లుగా ఫలితము ఉంటే అందరికీ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు, అలాగే మనసుకు నచ్చినట్లుగా జరగకపోతే అంతేమంది ముందు ఏడుస్తూ తిరుగుతుంటారు.
సుఖము మరియు దుఃఖము అంటే ఏమిటో ముందుగా తెలుసుకోండి. ప్రియమైనవి పొందటము మరియు ఆ ప్రియమైనవి వియోగము కావడము మనము సుఖముగా భావిస్తాము. అవి వస్తువులు కావచ్చు లేదా వ్యక్తులు కావచ్చు లేదా పరిస్థితులు కావచ్చు. దుఃఖము అంటే అప్రియమైనవి పొందటము మరియు ప్రియమైన వాటి వియోగం అంటే వద్దనుకున్నవి వస్తాయి మరియు కావాలనుకున్నవి దొరకవు. ప్రియము, అప్రియములలో సమత వచ్చినట్లయితే సుఖదుఃఖములలో కూడా సమత వస్తుంది. ఎవరూ నాకు అధికముగా ప్రియులు కారు అలాగే ఎవరూ అప్రియులు కాదు. నిజానికి నాకు అప్రియులు అంటూ ఎవరూ లేరు. ప్రియులలో వీరు నాకు కొంచెం ఎక్కువ ప్రియులని చెప్పుకోవచ్చును.
కబీరా ఖఢా బాజార మేం సబకీ మాఁగే ఖైర।
న కాహూ సే దోస్తీ న కాహూ సే బైర।।
అతనికి దుఃఖము కలుగదు, ఎందుకంటే అతనికి ఎవరు ప్రియులు కారు, ఎవరూ అప్రియులు కారు. అందువలన అతనికి పొందటం వల్ల సుఖము రాదు అలాగే విడిపోవడం వల్ల వియోగము కలగదు.
అభిమన్యుని వధ తరువాత అర్జునుని మనసులో జయథ్రధుడుపై ద్వేషము పుట్టినది. రోజంతా ఎంతో ప్రయాసపడినా అర్జునుడు జయథ్రడుని ఓడించలేకపోయాడు. అప్పుడు భగవంతుడు అర్జునుడితో నీవు ఈరోజు నీ క్షత్రియత్వమునుంచి దూరమయ్యావు అని అన్నాడు. యుద్ధము చేయడానికి బదులుగా ద్వేష భావముతో జయద్రథుడుని వెతకడంలో పడ్డావు. కాసేపు జయద్రథుడుని వెతుకుతున్నావు, మధ్యమధ్యలో సూర్యుని వైపు చూస్తున్నావు అందుకే నీవు సఫలము కాలేకపోతున్నావు. సఫలము కావాలంటే ద్వేషమును త్యాగము చేయాలి అన్నాడు.
సమత్వము యొక్క ఫలశృతి జ్ఞానులకూ కావాలి, భక్తులకూ కావాలి, కర్మయోగులకూ కావాలి. ఇది అన్ని మార్గములకు ఆవశ్యకమైన అభీష్టము. మీ యోగము లావును తగ్గిస్తుందా? అని బాబా రాందేవ్ ను ఎవరో ప్రశ్నించారు. ఆయన లేదు, నా యోగము సమతను తీసుకువస్తుంది అన్నారు. సన్నగా ఉన్నవారు లావు అవుతారు మరియు బాగా లావుగా ఉన్నవారు సన్నబడతారు. యోగము ద్వారా లావు తగ్గరు. ఎవరి శరీరమైతే క్షీణించి ఉన్నదో వారి శరీరము నిండుతుంది మరియు ఎవరి శరీరమైతే అధికముగా కొవ్వును కలిగి ఉందో వారికి ఆ కొవ్వు తగ్గుతుంది. సమత్వము వస్తుంది. మీకు అర్థమైందనుకుంటాను. ఇది చాలా మంచి ఉదాహరణ.
ఏ ఫలమును ఆశించకుండా, సిద్ధి-అసిద్ధిలో సమముగా ఉంటే మరి పని చేయడంలో ఆనందము ఎలా వస్తుంది?, జీవితంలో రసమే ఉండదు కదా అన్న ఆలోచన అర్జునుని మనసులో వచ్చింది. లడ్డు తిన్న తరువాత కూడా ఆనందము రాకూడదు మరియు దాని గుర్తు కూడా ఉండకూడదు అంటే మరి ఆనందం ఎక్కడుంది?, ఇంకా ఈ జీవనము పూర్తిగా రసహీనమైపోతుంది కదా అనిపిస్తుంది. ఇలాంటి ప్రశ్న అర్జునుని మనసులో కూడా వచ్చింది మరియు భగవంతుడు ఈ విధముగా చెబుతున్నాడు-
దూరేణ హ్యవరం(ఙ్) కర్మ, బుద్ధియోగాద్ధనఞ్జయ৷
బుద్ధౌ శరణమన్విచ్ఛ,కృపణాః(ఫ్)ఫలహేతవః৷৷49॥
ఈ సమత్వరూప బుద్ధియోగములో సకామ కర్మలే అత్యంత నిమ్న శ్రేణికి చెందినవి. అందుకే సమబుద్ధితో ఉండి రక్షకు ఉపాయమును వెతుకుము, అనగా బుద్ధియోగమును ఆశ్రయించు. ఎందుకంటే ఫలమునకు హేతువు అయ్యేవారు అత్యంత ధీనులు.
సకామ కర్మలు చెడ్డవేమీ కాదని భగవంతుడు చెప్పాడు. నేను ఈ పని చేస్తే ప్రతిఫలముగా నాకు ఇది దొరకాలనుకోవడం తప్పేమీ కాదు. వేదములలో వీటి కొరకు ఎన్నో ఉపాయములు చెప్పబడ్డాయి, ఎన్నో మంత్రములు చెప్పబడ్డాయి. కాని ఇవి తేలికైన విషయములు, నిమ్న శ్రేణికి చెందినవి. నీవు ఫస్ట్ గ్రేడ్ కి వెళ్ళగలిగినప్పుడు సెకండ్ గ్రేడ్ గురించి ఎందుకు ఆలోచిస్తావు.
ఉదాహరణకు మీకు ఒక రోజులో పది పనులు అనుకూలముగా జరిగాయి మరియు ఇంకొక పది పనులు జరగలేదు. సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత మీ మనసు సమతగా ఉంటుందా, సుఖముగా ఉంటుందా లేక దుఃఖముగా ఉంటుందా? వాస్తవానికి అయిపోయిన పది పనులు మీకు గుర్తు ఉండవు. పది పనులు కాలేదే అన్న మాట మాత్రం మీ మనసును తొలుస్తుంది, మీరు దుఃఖముతో ఉంటారు. పది మాటలు విడిచి పెట్టండి. ఒక వ్యాపారి 24 వస్తువులను లాభానికి అమ్మాడు. 25వ వస్తువు మాత్రం పొరపాటున కొంచెం నష్టానికి వెళ్ళింది. 24 వస్తువులపై అతడు సంపాదించిన లాభము గుర్తు ఉండదు కాని ఒక వస్తువుపై వచ్చిన నష్టాన్ని తలుచుకొని ఎంతో బాధపడుతూ ఉంటాడు.
జీవితంలో ఎంత లాభం వచ్చినా గుర్తుండదు గాని చిన్న నష్టం వచ్చినా గుర్తుంటుంది. ఇది కేవలం ఒక వ్యాపారికి సంబంధించిన విషయం కాదు మన అందరిదీ. ఏసీ పెట్టించుకున్న తర్వాత మీకు చాలా బాగా అనిపించింది. కాని మీరు ఎప్పుడు బాగుందని ఎక్కడా చెప్పుకోరు. అదే ఒక గంట కరెంటు పోతే ఆ సమయంలో మీకు ఎవరైనా ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని అడిగితే కరెంటు లేక ఇంత వేడిలో చెమటలు కక్కుకుంటూ కూర్చున్నాను, అంటూ ప్రధానమంత్రి వరకు కూడా తిట్లు తిడతారు. రోజంతా ఏసీ యొక్క సుఖాన్ని అనుభవించినా అది మీకు గుర్తుండదు కాని ఒక గంట కరెంటు పోతే మీకు దుఃఖము కలుగుతుంది. మనము సుఖాల్ని గుర్తు పెట్టుకోము కాని దుఃఖాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటాం అన్న విషయం మీ ధ్యాసలో ఉండాలి.
సుఖముల అవధి తక్కువసేపు ఉంటుంది కాని దుఃఖముల అవధి చాలా కాలము ఉంటుంది. ఎవరికైనా సకామత యొక్క ఫలము లభిస్తే అది కాసేపు మాత్రమే గుర్తు ఉంటుంది కాని అది దూరమైనప్పుడు దాని గుర్తు చాలా కాలము ఉంటుంది. అందుకే భగవంతుడు సకామ స్వభావము మంచిది కాదని చెబుతున్నాడు. నేను ఒక రోజు సాయంకాలము భోజన సమయంలో వ్యాపారి అయిన నా మిత్రుడు ఇంటికి వెళ్లాను. అక్కడ అతడు ముభావముగా ముఖం ముడుచుకుని కూర్చుని ఉన్నాడు. ఏమైందని అతని భార్యను అడిగాను. దానికి సమాధానముగా ఆమె ఆయనకు ఈ సంవత్సరం 25 లక్షలు లాభం రావాలన్న ఆపేక్ష ఉన్నది కాని లెక్కలు చూసుకుంటే 20 లక్షలు మాత్రమే లాభం వచ్చింది, అందువలన ఆయన ఉదాసీనముగా ఉన్నాడు అని చెప్పింది. 20 లక్షల లాభము వచ్చినప్పటికీ ఆ వ్యక్తి దుఃఖముతో ఉన్నాడు. ఇది మన అందరి విషయము, అవునా కాదా చెప్పండి?
మనము ఎంత రావాలని అనుకుంటామో దానికన్నా తక్కువ వస్తే, వచ్చిన తరువాత కూడా మనము దుఃఖముతో ఉంటాము. ఇది మన అందరి విషయంలోనూ జరుగుతూ ఉంటుంది. కోడలు తన పుట్టింటి నుంచి ఎక్కువగా ఏమీ తెచ్చుకోకపోయినా మనకు దుఃఖము కలుగుతుంది. వంద మార్కులు ఆశించిన బాలునికి 99 మార్కులు వస్తే అతడు దుఃఖములో ఉంటాడు. 96 వస్తే దూకి తనని తాను చంపుకోవడానికి చూస్తాడు. పాస్ అవ్వడమే కష్టం అనుకున్న కొంతమందికి 70 మార్కులు వస్తే వారు లడ్లు పంచుతారు. ఇక్కడ మార్కుల సంఖ్యతో సుఖదుఃఖములు ఉండవు, మన అపేక్ష పైన ఆధారపడి ఉంటాయి.
వీరు దీనులని, వీరిపై దయ వస్తుందని భగవంతుడు చెబుతున్నాడు. వీరు తమ సుఖదుఃఖములతో మెదడును పాడు చేసుకున్నారు, ప్రతి విషయాన్ని దక్కించుకోవడం స్వభావముగా చేసుకున్నారు. అందుకే అర్జునా నిన్ను సకామతా నుంచి బయటకు తీసుకురా.
కర్మ యొక్క సిద్ధి మరియు అసిద్ధిలో మనసును ఎక్కువ పెడితే సుఖము దొరికిన గుర్తు ఉండదు మరియు దుఃఖము మాత్రము కలుగుతూనే ఉంటుంది మరియు నీవు దుఃఖములో ఉంటూనే ఉంటావు. మనకు 10 సుఖములు మరియు రెండు దుఃఖములు కలిగితే, మనము ఆ రెండు దుఃఖముల వెనకే దుఃఖముతో జీవనాన్ని వెళ్ళబుచ్చుతాము. ఎవరైనా వస్తే ఆ ఒకటి రెండు దుఃఖముల గురించే చెప్పుకుంటాము. భగవంతుడా నేను నీకు ఏమి తక్కువ చేశాను అంటారు. భగవంతుడిచ్చిన పది సుఖముల గురించి ధన్యవాదములు చెప్పరు కాని ఏదైనా ఒక దుఃఖాన్ని ఇస్తే దాని గురించి ఫిర్యాదు చేస్తారు.
దీనుడవు కావొద్దు, దీనుడు కావడానికి నేను నిన్ను పుట్టించలేదు అని భగవంతుడు అర్జునుడితో చెబుతున్నాడు.
బుద్ధియుక్తో జహాతీహ, ఉభే సుకృతదుష్కృతే৷
తస్మాద్యోగాయ యుజ్యస్వ, యోగః(ఖ్) కర్మసు కౌశలమ్৷৷50॥
బుద్ధిమంతులైన పురుషులందరూ తమ పుణ్యములు మరియు పాపములు రెండింటినీ కూడా ఈ లోకములోనే త్యాగము చేస్తారు అనగా వాటి నుంచి ముక్తులైపోతారు. దీని ద్వారా మీరు సమత్వరూప యోగములో యుక్తులవుతారు. ఈ సమత్వరూపయోగమే కర్మలలోని కౌశలత అనగా కర్మల నుంచి తప్పించుకునే ఉపాయము. ఇది ఎంతో మహత్వపూర్ణమైన శ్లోకము. గీతలో అన్నింటికన్నా ప్రసిద్ధి చెందిన శ్లోకములలో ఇది ఒకటి.
యోగః కర్మసు కౌశలమ్- యోగా నేర్పించే ఇన్స్టిట్యూట్లు అన్నిటిలో ఈ శ్లోకము కనిపిస్తుంది. నేను కూడా యోగములో డాక్టరేట్ చేసినప్పుడు ఆ కాలేజీలో చెప్పేవారు. దీని అర్థాన్ని మాత్రం అన్నిచోట్ల వేరువేరుగా చెబుతుంటారు. నేను కూడా తరువాత గీతను ఏకాగ్రతతో అర్థము చేసుకున్నప్పుడు అవన్నీ తప్పు అని తెలిసింది. అన్ని యోగా ఇన్స్టిట్యూట్ల లోనూ కర్మలలో కుశలతే యోగము అని వివరిస్తారు. మీరు గూగుల్లో వెతికినా ఇదే పరిభాష దొరుకుతుంది. ఇది ఎంతో ప్రసిద్ధమైన పరిభాష, కాని సరాసరి తప్పు. ఎందుకంటే కర్మలలో కుశలత యోగము అని దీని అర్థం అయితే మరప్పుడు ఎవరైనా ఎంతో కుశలతతో దొంగతనం చేసినా, ఎవరినైనా మోసము చేసినా అది కూడా యోగమే అవ్వాలి. తప్పుడు పనులు చేసిన వారు కూడా యోగులు అయిపోతారు. అలా కాదు వారు యోగులు కారు. దీనికి అర్థం కర్మలలో కుశలత యోగము అన్నది కొంచము సరియైనది.
గురు సుఖదేవ్ బ్రహ్మలీన స్వామి రామసుఖ్ దాస్ జీ మహరాజ్ దీనికి అర్థం తమ సాధక సంజీవనిలో ఇచ్చారు మరియు మిగిలిన ఎంతో మంది సంతులు కూడా ఇచ్చిన వివరణ ఎక్కువ సరియైనది. ఆయన కర్మలలో యోగమే కుశలత అని అర్థము చెప్పారు. కర్మలలో కుశలతయే యోగము అని మిగిలిన వారు చెబితే స్వామీజీ మాత్రం కర్మలలో యోగమే కుశలత అని వ్రాశారు. అంటే ఎవరైతే కర్మలలో భగవంతునితో అనుసంధానమవ్వడము నేర్చుకుంటారో వారి కర్మలన్నీ కుశలత్వమయిపోతాయి.
అందుకే స్వామీజీ వంటి యోగుల యొక్క కర్మలను మనము చూస్తాము. వారి కర్మలన్నీ, సమాధానాలన్నీ, ఆచరణాలన్నీ, ప్రతిస్పందనలన్నీ, ప్రతి చర్యలన్నీ ఖచ్చితముగా, లోపాలు లేకుండా ఉంటాయి.
ఎవరైతే కర్మలలో యోగమును చేయడము నేర్చుకున్నారో వారు కుశలత కలవారు. భగవంతుడు 18వ అధ్యాయములో న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే అని చెప్పాడు. కుశలతలో ఆసక్తి పెట్టుకోవద్దు అలాగే అకుశలతలో ద్వేషము పెంచుకోవద్దు.
ఠాకూర్ రామకృష్ణ పరమహంస గురించి ఒక ప్రసంగము వస్తుంది. ఒకరోజు ఠాకూర్ కూర్చుని ఉండగా ఆయనకు ఎంతో పెద్ద భక్తుడైన ఒక సేఠ్ వచ్చారు. ఆయన ఎంతో ధనవంతుడు. ఆయన రామకృష్ణ పరమహంస కోసము ఒక అసలైన కాశ్మీరీ పశ్మినీ శాలువాను తెచ్చారు. ఆ రోజులలోనే దాని ఖరీదు 200 రూపాయలు. ఇప్పుడైతే బహుశా ఏ రెండు లక్షలు పైనే ఉంటుంది. ఇంత ఖరీదైన శాలువాను తెచ్చిన ఆయన దాని గురించి ఠాకూర్ కు చెప్పడం ప్రారంభించారు. గురువుగారు నేను మీకోసం ఎటువంటి శాలువా తెచ్చానంటే దీనిని పశ్మీనా అంటారు, ఒక్క వేలు రంధ్రము నుంచి ఇది వెళ్లిపోతుంది, ఇది ఎంతో ఖరీదైనది అంటూ చెప్పసాగాడు. అటువంటి శాలువాతో ఠాకూర్ కు ఏ విధమైన ఆకర్షణ లేదు. ఆయన ఎంతో పెద్ద యోగి. ఆయనకు ఇటువంటి సంసారిక పదార్థములు ఎటువంటి ఆకర్షణను కలుగజేస్తాయి? సేఠ్ గారు ఇంతలా చెప్పిన తర్వాత ఆయన దానిని తీసుకొని తన దగ్గర పెట్టుకున్నారు. సేఠ్ గారికి తన సంపదను చూసుకొని ఎంతో అహంకారము ఉన్నది.
ఠాకూర్ తన ప్రియ శిష్యుడు రఖాల్ ను పిలిచి ఈరోజు బజారు జరుగుతుంది, మన దగ్గర ఉన్న చెంబు పగిలిపోయింది అందుకే ఇంకొకటి కొనుక్కొని రా అన్నారు. రఖాల్ రెండు అణాలు తీసుకుని చెంబు కొనడానికి వెళ్ళిపోయాడు. ఇంతలో రామకృష్ణ పరమహంస సత్సంగమును మొదలుపెట్టారు. కాసేపటిలో రఖాల్ చెంబు తీసుకొని తిరిగి వచ్చాడు. పది పదిహేను నిమిషాల తరువాత ఠాకూర్ చెంబు తీసుకువచ్చావా అని అడగగా శిష్యుడు అవును గురువుగారు అన్నాడు. సరే అయితే ఎటువంటి చెంబు తీసుకువచ్చావో చూపించు అన్నారు ఠాకూర్. ఠాకూర్ ఆ కొత్త చెంబును తీసుకుని తన పక్కనే ఉన్న పాత చెంబులోని నీటిని కొత్త దానిలో పోయగా వెంటనే నీరంతా బయటకు వచ్చేసింది. ఠాకూర్ కు ఎంతో కోపం వచ్చి రఖాల్ ను అందరి ముందు గట్టిగా మందలించారు. దీనితో ఎంతో బాధపడ్డ రఖాల్ తన గురువు చెప్పినట్లు ఆ చెంబును తీసుకొని మార్చి తేవడానికి మరలా బజారుకు వెళ్లాడు. కింద ఒలికిన నీటిని ఠాకూర్ తన పక్కనే ఉన్న కాశ్మీరీ పశ్మినీ శాలువాతో కాలుతో తుడిచారు. అది చూసిన సేఠ్ కు నోటి వెంట మాట రాలేదు. ఇంత ఖరీదైన శాలువాను నేలను శుభ్రపరిచే తడిగుడ్డగా వాడారు. అడుగుదామంటే ఠాకూర్ ఎంతో కోపంగా ఉన్నారు అందువలన ధైర్యము చాలలేదు. ఇదంతా చూస్తున్న నరేంద్ర (స్వామి వివేకానంద) కు విషయము రుచించలేదు. ఆయన లేచి తన గురువుగారిని మీరు రెండు అణాల చెంబు సరిగా లేదని ఎంతో కోపముగా తిట్టారు మరియు 200 రూపాయల శాలువాను నేలను తుడవడానికి వాడారు నాకు విషయము ఏమీ అర్థం కాలేదు అన్నారు. నేను మీకు అందరికీ శిక్షణ ఇచ్చాను దానితో మీరు గాడిదల లాగా ఉంటారని కాదు. మీరు చేసే పనులన్నింటిలో కుశలత ఉండాలి. అప్పుడే మీరు యోగులు కాగలరు. రెండు అణాల చెంబును కూడా కొనడాన్ని మీరు ఎంత ధ్యానముతో చేస్తారో దానివల్ల మీరు యోగసిద్ధిని పొందగలుగుతారు. అప్పుడు నరేంద్ర ఇది సరే అర్థమైంది కానీ 200 రూపాయల శాలువాను మీరు నేలపై వేసి ఎందుకు తుడిచారు అని అడిగాడు. దానికి ఠాకూర్ దీనిని తెచ్చిన సేఠ్ మనసులో ఎంతో అహంకారము ఉన్నది. నాకు శాలువా వంద రూపాయలదా లేక రెండు రూపాయలదా అన్న తేడా లేదు. దాని ఉపయోగము నాకు కేవలం చలి నుంచి రక్షించుకోవడానికి మాత్రమే. నాకు రెండింటి విలువ ఒక్కటే. నాకు ధనము పై ఏ ఆసక్తి లేదు. కాని ఈ సేఠ్ గారికి మనసులో ధనముపై ఎంతో ఆసక్తి ఉన్నది. ఆ ఆసక్తిని సమాప్తం చేయడానికి, ఆయనలో ఉన్న అహంకారంను తొలగించడానికి నేను శాలువాను నేలను తుడవడానికి వాడాను. సంతుల లీలలు వేరే విధముగా నే ఉంటాయి. సామాన్య రూపంలో అర్థం కావు కాని, యోగః కర్మసు కౌశలమ్- యోగి కుశలుడు అయి ఉండాలి. ఎవరైతే కుశలత కలిగి ఉంటారో వారు యోగులు కాదు, దీనికి విపరీతంగా ఎవరైతే యోగులు అవుతారో వారిలో కుశలత ఉండాలి. దీని పరిణామము ఏమిటంటే ఠాకూర్ రామకృష్ణ పరమహంస అందరి శిష్యులు అత్యంత కుశలత ఉన్నవారు. ఎందుకంటే ఠాకూర్ వారందరికీ శిక్షణ అలా ఇచ్చారు. స్వామి వివేకానంద వంటి కుశలత ఎవరిలో ఉంటుంది? ప్రపంచమంతా ఆయన ముందు తలవంచింది. ఈ కుశలత అంతా ఠాకూర్ వారిలో పెంచారు.
కర్మజం(మ్) బుద్ధియుక్తా హి, ఫలం(న్) త్యక్త్వా మనీషిణః৷
జన్మబన్ధవినిర్ముక్తాః(ఫ్),పదం(ఙ్) గచ్ఛన్త్యనామయమ్৷৷51॥
ఎందుకంటే సమ బుద్ధితో యుక్తమైన జ్ఞానులు ఆ కర్మలతో ఉత్పన్నమయ్యే ఫలమును త్యాగము చేసి జన్మ రూప బంధనముల నుంచి ముక్తులవుతారు మరియు నిర్వికార పరమపద ప్రాప్తి పొందుతారు. ఇది కేవలం పాపపుణ్యముల విషయము కాదని భగవంతుడు అన్నాడు. పాపపుణ్యములు ఎంతో చిన్న విషయం, సాధారణ విషయము, తేలికైన విషయం. సమ బుద్ధితో జన్మ మరణ చక్రము నుంచి విముక్తులము కావాలి.
పునరపి జననం పునరపి మరణం,
పునరపి జననీ జఠరే శయనమ్।
ఈ చక్రం నుంచి విముక్తులము కావాలి. అనామయం పదం గచ్ఛతి- పరమపద ప్రాప్తి పొందాలి.
యదా తే మోహకలిలం(మ్), బుద్ధిర్వ్యతితరిష్యతి৷
తదా గన్తాసి నిర్వేదం(మ్), శ్రోతవ్యస్య శ్రుతస్య చ৷৷52॥
శ్రుతివిప్రతిపన్నా తే, యదా స్థాస్యతి నిశ్చలా৷
సమాధావచలా బుద్ధిః(స్),తదా యోగమవాప్స్యసి৷৷53॥
కిళ్ళి
ని వదిలిపెట్టి పాన్ మసాలా మొదలు పెడతారు. ఒక అలవాటుని మాని ఇంకొక అలవాటు చేసుకుంటున్నారు. ఒక రాగమును వదిలిపెట్టి ఇంకొక రాగాన్ని పట్టుకుంటున్నారు. అలా చేయకూడదు. దీనివల్ల రాగముల నుంచి బయటపడలేరు. ఎన్నో విషయాలను విన్నవారి బుద్ధి భ్రమితము అవుతూ ఉంటుంది. భగవంతుడు అర్జునుడితో వాటిని దాటి రాగద్వేషములను వదిలిపెట్టమంటున్నాడు. అర్జునుడు కొద్దిగా కంగారుపడ్డాడు, కొద్దిగా విస్మితమయ్యాడు. భగవంతుడు ఆచరించగలిగే విషయాలు చెబుతున్నాడా? ఆచరించలేని విషయాలు చెబుతున్నాడా? అలా రాగద్వేషాలను విడిచిపెట్టి ఆ విధముగా యోగ యుక్తులు కావడం సాధ్యమేనా? యోగస్తః కురు కర్మాణి- అలా చేసే వారెవరైనా ఉంటారా. మీరు చెబుతున్న విధముగా స్థిర బుద్ధి, చలించని బుద్ధి ఎలా ఉంటుందో కొంచెం వివరించి చెప్పమని ఇక్కడ అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు.
అర్జున ఉవాచ
స్థితప్రజ్ఞస్య కా భాషా, సమాధిస్థస్య కేశవ৷
స్థితధీః(ఖ్) కిం(మ్) ప్రభాషేత, కిమాసీత వ్రజేత కిమ్৷৷54॥
శ్రీ భగవానువాచ
ప్రజహాతి యదా కామాన్, సర్వాన్పార్థ మనోగతాన్
ఆత్మన్యేవాత్మనా తుష్టః(స్), స్థితప్రజ్ఞస్తదోచ్యతే৷৷55॥
అర్జునా, ఎప్పుడైతే ఆ పురుషుడు మనసులో స్థితమైన సంపూర్ణ కోరికలను పూర్తిగా త్యాగం చేస్తాడో మరియు ఆత్మన్యేవాత్మనా తుష్టః- ఆత్మతో ఆత్మలోనే సంతుష్టముగా ఉంటాడో ఆ సమయంలో స్థితప్రజ్ఞుడైపోతాడు. నీవు చూడలేదు కాని నేను ఎంతోమందిని చూశాను అని భగవంతుడు చెబుతున్నాడు. ఎంతో అందమైన చిన్న భజనను ఇక్కడ చెప్పుకుందాము-
మనసులో రాగద్వేషములు లేని ఒక మునివర్యుడ్ని వనములో చూశాను. అతడు గ్రీష్మ రుతువులో శిఖరముపై నుంచుని తపస్సు చేస్తున్నారు, వర్షాకాలంలో చెట్టు కింద నీళ్లలో తడుస్తూ ధ్యానము చేస్తున్నారు, శీతాకాలంలో నది పక్కన శీతలమైన గాలులు వీస్తున్న చోట కూర్చుని ధ్యానము చేసుకొంటున్న మునివర్యున్ని చూసాను. అటువంటి గురువు యొక్క చరణములపై నిత్యము నివాళులు అర్పించాలని ఉంది. వేసవిలో వేడి, వర్షాకాలంలో వర్షము, శీతాకాలంలో చలి సుఖదుఃఖములకు ప్రతీక.
భగవంతుడు అంటున్నాడు- వస్తువులు, వ్యక్తులు, పరిస్థితులు నుంచి వచ్చే సుఖదుఃఖములకు అతీతమైన వారు, ఆత్మన్యేవాత్మనా తుష్టః- ఎవరికైతే బయట వస్తువులు, వ్యక్తులు, పరిస్థితుల నుంచి సుఖము లభించదో అంటే తనలో ఉన్న సంతుష్టిని తెలుసుకున్నవారు బయటి వాటిపై సుఖాన్ని వెతుక్కోరు. తమలో తామే సంతుష్టముగా ఉంటారు. వీరి మనసుపై సుఖము మరియు దుఃఖము యొక్క ఆశ్రయము ఉన్నది. వారికి సుఖదుఃఖములు ఎందుకు పట్టవు?
ఆత్మన్యేవాత్మనా తుష్టః- చాలామంది వస్తువులతో సుఖము కలుగుతుందని భావిస్తారు. మనకు ఐఫోన్ పై కోరిక ఉండి దానిని ఎవరైనా ఇస్తే బాగా అనిపిస్తుంది. అదే పల్లెటూరులో ఏమీ తెలియని వారికి ఇస్తే వారికి దానివల్ల ఏ ప్రత్యేకమైన భావము కలుగదు మరియు వారు దానిని తీసుకోవడానికి నిరాకరించవచ్చును. అంటే ఇక్కడ సుఖము వస్తువులో లేదు. నాకు ఐ ఫోన్ ఇష్టం ఉంటే అది లభించినప్పుడు సుఖము కలుగుతుంది. వేరొకరికి దానిపై ఎటువంటి ఇష్టం లేకపోతే అది ఎటువంటి సుఖాన్ని ఇవ్వదు. మన ఇష్టములు సుఖానికి ప్రతీతముగా ఉంటాయి. సుఖములు ఏ వస్తువులోను, ఏ వ్యక్తిలోనూ లేదా ఏ పరిస్థితులలోనూ ఉండవు.
మీకు మనసు బాగోలేనప్పుడు మీకు ఇష్టమైన వంటకాన్ని తీసుకువచ్చి తినమన్నా మీరు దానిని తిరస్కరిస్తారు. అంటే ఆ వంటకములో సుఖము లేదు. సుఖము వేరే ఎక్కడో ఉన్నది. మనలో మనసు బాగోలేనప్పుడు వస్తువు సుఖాన్ని ఇవ్వలేదు. ఏ వస్తువులోనూ, వ్యక్తిలోనూ లేదా పరిస్థితులలోనూ సుఖము లేదన్నది గుర్తుపెట్టుకోండి. సుఖము మరియు దుఃఖము మన మనసులో ఉంటాయి. దీనిని తెలుసుకున్నవారు ప్రజ్ఞులు.
ఆత్మన్యేవాత్మనా తుష్టః- ఇది ఎంతో పెద్ద సూత్రము. నేను లోపలి నుంచి సంతుష్టుడుగా ఉండటం నేర్చుకోవాలి. నాకు సుఖములన్నీ లోపలి నుంచి తీసుకోవాలి కానీ బయట నుంచి కాదు.
అర్జునుడిని వినమని భగవంతుడు ఇంకా ఇలా చెబుతున్నాడు.
దుఃఖేష్వనుద్విగ్నమనాః(స్), సుఖేషు విగతస్పృహః৷
వీతరాగభయక్రోధః(స్), స్థితధీర్మునిరుచ్యతే৷৷56॥
దుఃఖములు ప్రాప్తించినప్పుడు ఎవరి మనసులో అయితే ఉద్వేగము కలుగదో మరియు సుఖములు ప్రాప్తించినప్పుడు అంతటా నిష్ప్రేయము (క్రియారహితము) గా ఉంటారో మరియు ఎవరికైతే రాగము, భయము మరియు క్రోధము నష్టమైపోయాయో అటువంటి ముని స్థిర బుద్ధి కలవాడని చెబుతారు. ఎవరైతే తపస్సులు చేసి ఉన్నారో వారికి దుఃఖములు ప్రాప్తించినప్పుడు ఉద్వేగము కలుగదు. మనకు కర్మలు సిద్ధించగానే స్పృహ, కోరికలు, వాసనలు, తృష్ణ నిర్మాణమవుతాయి. ఇవి మనము ముందే చెప్పుకున్నాము. మరి కర్మలు ఆసిద్ధి అంటే సిద్ధించనప్పుడు ఉద్వేగము యొక్క నిర్మాణము అవుతుంది. భగవంతుడు ఈ విధముగా చెబుతున్నాడు- స్పృహ నుంచి రాగము, రాగము నుంచి భయము, భయము నుంచి క్రోధము వస్తాయి. ఏ వస్తువు గురించి అయితే స్పృహ మనసులో ఉంటుందో ఆ వస్తువుతో రాగము ఏర్పడుతుంది. ఏ వస్తువుపై రాగము ఉంటుందో అది పోగొట్టుకుంటామేమో నన్న భయము కలుగుతుంది. అది నిజముగా పోగొట్టుకున్నప్పుడు భయము నుంచి క్రోధము వస్తుంది.
గోస్వామి గారు అయోధ్య కాండలో భగవంతుడు రామునికి మంగళాచరణములో స్తుతించారు. నాకు ఏ రాముడు ప్రియమైన వాడు, ఏ రాముడిని నేను స్తుతిస్తాను అంటూ ఎంతో అందమైన శ్లోకము ఉంది.
ప్రసన్నతాం యా న గతాభిషేకతస్తథా న మమ్లే వనవాసదుఃఖతః।
ముఖామ్బుజశ్రీ రఘునన్దనస్య మే సదాస్తు సా మంజులమంగలప్రదా॥
ఏ రాముడి ముఖములో అయితే రాజ్యాభిషేకము సమాచారము విన్న తరువాత ప్రసన్నత పెరగలేదో మరియు ఏ రాముడి ముఖములో అయితే వనవాసానికి వెళ్లాలన్న దుఃఖకరమైన సమాచారము విన్న తరువాత ప్రసన్నత తగ్గలేదో అటువంటి భగవంతుడు రాముడికి నేను నమస్కరిస్తున్నాను అని గోస్వామి గారు చెప్పారు. అంటే రేపు ఉదయము నీకు రాజ్యాభిషేకము జరుగుతుందని చెప్పినా లేదా నీవు రాజువు కాకుండా వనవాసానికి 14 సంవత్సరాల పాటు వెళ్లి రావాలని చెప్పినా భగవంతుడు రాముని ముఖములో ప్రసన్నత ఒకే రకముగా ఉన్నది. మంచి వార్త విని ముఖంలో దాచుకోలేని నవ్వు, అలాగే దుఃఖకరమైన వార్త విని ముఖం ముడుచుకుపోవడం వంటివి ఉండవు.
సర్దార్ పటేల్ యొక్క ఒక ప్రసంగము వస్తుంది. సర్దార్ పటేల్ రాజకీయ నాయకుడే కాకుండా ఒక పెద్ద వకీలు. ఒకరోజు ఆయన తన క్లైంట్ తరఫున కేసు వాదిస్తున్నారు. ఇంతలో ఆయన సహాయకుడు వచ్చి ఒక చిన్న కాగితాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాడు, ఆయన కొంచెం కోపగించడంతో, రెండవసారి వచ్చి ఆ కాగితాన్ని ఇచ్చాడు. జడ్జికి ఆ కాగితములో ఈ కేసుకు సంబంధించిన కొత్త విషయము ఏదో వచ్చి ఉంటుంది అనిపించింది. సర్దార్ పటేల్ ఆ కాగితాన్ని చదివి మడిచి తన జేబులో పెట్టుకున్నారు. ఎవరితోటి ఏమీ అనలేదు. కేసులో వాదనలు కొనసాగించాడు. ఆ రోజే ఆ కేసు పై నిర్ణయం జరగవలసి ఉన్నది. నిర్ణయం వచ్చిన తర్వాత అది ఆయన క్లైంట్ పక్షంలో ఉన్నది. అది కొంచెం క్లిష్టమైన కేసు కావడం వల్ల నిర్ణయము ఎటైనా వెళ్ళవచ్చును. కాని ఆయన క్లైంట్ వైపు సత్యము ఉన్నది. ఈ విశ్వాసముతోటే పటేల్ కేసును వాదించారు. కేసు నిర్ణయము వచ్చిన తరువాత జడ్జికి బాగా పరిచయము ఉన్న వ్యక్తి మరియు ఆదరణీయుడు కావడం వల్ల ఆయన పటేల్ ను ఆ కాగితం లో ఏముంది, కేసు గురించి ఏదైనా కొత్త విషయం వచ్చిందా అని అడిగారు. దానికి సమాధానముగా పటేల్ లేదు అని గంభీరముగా నా భార్య స్వర్గవాసురాలైనది అని చెప్పారు. దానికి జడ్జ్ ఎంతో కంగారు పడి అలాంటి విషయం వచ్చినప్పుడు మీరు వెంటనే వెళ్ళవచ్చును కదా, కాని మీరు కేసును వాదిస్తూనే ఉన్నారు, ఇంత పెద్ద ఘటన జరిగిందన్న విషయము మాకెవరికి తెలియను కూడా లేదు అని అన్నారు. దానికి పటేల్ ఆమె జబ్బు పడిందని తెలిస్తే నేను కేసును వదిలిపెట్టి వెళ్లేవాడిని. కాని ఆమె చనిపోయింది అందువలన నేను వెంటనే వెళ్లినా ఆమె తిరిగి రాదు. కాని ఈ కేసు ఈరోజు ఎంతో క్రిటికల్ స్టేజ్ లో ఉంది. నా క్లైంట్ నాపై నమ్మకంతో ఉన్నాడు. అందుకే కర్తవ్య పాలన కోసము నాకు ఇది సరైనది అనిపించింది, అందుకే నేను వెంటనే వెళ్ళలేదు అన్నారు. దుఃఖేష్వనుద్విగ్నమనాః- అంతటి దుఃఖములో కూడా ఆయన విచళితుడు కాలేదు. అందుకే ఆయన లోహపురుషుడు అయ్యాడు. దుఃఖముతో ఉద్విగ్నులు కారు.
యః(స్) సర్వత్రానభిస్నేహః(స్),త త్తత్ప్రాప్య శుభాశుభమ్৷
నాభినన్దతి న ద్వేష్టి, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా৷৷57॥
యదా సంహరతే చాయం(ఙ్), కూర్మో౽ఙ్గానీవ సర్వశః৷
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యః(స్),తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా৷৷58॥
ఆహ్వానించను కూడదు అలాగని ద్వేషించను కూడదు అని భగవంతుడు చెప్పాడు- నాభినన్దతి న ద్వేష్టి. అలాగైతే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలన్న ఆలోచన అర్జునుడి మనసులో వచ్చింది.
దీనికి భగవంతుడు ఒక ఉదాహరణని ఇచ్చాడు- ఎలాగైతే తాబేలు తన అంగములన్నింటినీ లోపలికి లాక్కుని దాచుకోగలుగుతుందో అలాగే పురుషుడు ఇంద్రియ వస్తు విషయములనుంచి ఇంద్రియములను అన్ని విధాల తొలగించుకోవాలి.
తాబేలు ఒక అద్భుతమైన ప్రాణి. అది ఎంత కోమలమైనదంటే చిన్న దెబ్బ తగిలినా చనిపోవచ్చును. కాని భగవంతుడు దానికి ఇచ్చిన కవచము ఎంత కఠోరమైనదంటే పులి, ఏనుగు కూడా దానిని బద్దలు కొట్టలేవు. అందుకే తాబేలు ఏ చిన్న ప్రమాదాన్ని పసిగట్టినా వెంటనే తన కాళ్లు, చేతులు, ముఖము తన కవచం లోనికి లాగేసుకుంటుంది. ఇక ఇప్పుడు దాన్ని ఎవరూ ఏమీ చేయలేరు.
భగవంతుడు అంటున్నాడు- నీకు ఎప్పుడు ఏ సంకటము వచ్చినా దాన్ని లోపల దాచుకోవద్దు. అవి సుఖ సంకటములు కావచ్చు లేదా దుఃఖ సంకటములు కావచ్చు లేదా ఆకర్షణ కావచ్చు.
పరమ శ్రద్ధాలు, గీతా ప్రెస్ యొక్క సంస్థాపకుడు, పరమ శ్రేష్ఠుడు జయదయాల్ జీ గోయందకా గారు తన కాళ్ళ గోళ్ళను చూసుకుంటూ నడిచే అలవాటు ఉండేది. అటు ఇటు ఏమాత్రం చూసేవారు కాదు. మనసు ఇరుక్కోవడానికి స్థానమే ఉండేది కాదు. ఆయన అంతిమ సమయంలో ఆయనతోపాటుగా ఇద్దరు ముగ్గురు కూడా వెళ్తూ ఉండేవారు, ఎందుకంటే వయసు పెరిగిపోవడం వల్ల ఎక్కడైనా పడిపోతారేమో అన్న ఆందోళన ఉండేది. ఆయనను పట్టుకొని నడిపించ వలసి వచ్చేది.
గాంధీ గారు అస్వాద వ్రతమును తీసుకున్నారు. అంటే ఏ వస్తువైనా తినడానికి బాగా అనిపిస్తే దానిని రెండవసారి తినేవారు కాదు. ఇది ఎంత కఠినమో అర్థం చేసుకోండి. గాంధీ గారికి ముందు ఇటువంటి వ్రతము చేసిన వారు ఎవరూ కనిపించరు.
మీ అంగాలని రక్షించుకోండి. మీ మనసు ఎక్కడెక్కడ ఇరుక్కుంటుందో వాటిని వెతకండి.
అయోధ్యాకాండలో ఒక వర్ణన వస్తుంది. భరతుడు రాముని కలవడానికి చిత్రకూటమునకు వెళ్ళినప్పుడు భరద్వాజ ముని భరతునితో పాటు వచ్చిన రాణులందరిని, చతురఙ్గినీ సైన్యమును ఆశ్రమములో రాత్రికి విశ్రాంతి తీసుకోమని స్వాగతించారు. నావారందరినీ స్వాగతిస్తున్నారు, ఈయన కేవలం ఒక ముని మాత్రమే అని భరతుడికి అనిపించింది. భరద్వాజముని నీవు దీని గురించి చింతించవలసిన అవసరం లేదని, మాకు ఏమీ అవసరం లేనప్పటికీ వేదముల బలముతో మా వద్ద ఎంత సామర్థ్యం ఉన్నదంటే నీ చతురఙ్గినీ సైన్యము అంతటికీ ఏమి కావాలన్నా ఆ భోగముల వ్యవస్థను చేయగలను అని చెప్పారు. వెంటనే రిద్ధి, సిద్ధిలను ఆహ్వానించి భరద్వాజముని వారికి ఉండటానికి మరియు తినడానికి కావలసిన అన్ని సదుపాయములను ఏర్పరిచారు. దీని గురించిన వర్ణన రామ చరిత మానస్ లో నాలుగైదు పేజీలు ఉంటుంది. అక్కడ పండ్ల రసాల నదులు ప్రవహించాయని, ఎవరికి ఏ వంటకం కావాలో ఆ విధముగా అక్కడ వేల మంది సైన్యానికి ఉన్నాయని, కావలసిన గుడారాలు వెలశాయని ఉంటుంది. యోగ్యతను అనుసరించి వారికి కావలసినవన్నీ రిద్ధి, సిద్ధిలు ఏర్పాటు చేశారు. సామాన్య మానవులు ఎవరూ చూడనటువంటి భోగములు అక్కడ వెలిశాయి. ఆ అడవిలో దేవలోకములో ఉన్నటువంటి పదార్థములు, శయన కక్షలు వెలిశాయి. భరతునికి కూడా ఒక గుడారము ఇచ్చారు. రాత్రంతా అందులోనే గడిపిన భరతుడు మనసుతో కాని, అది లేకుండా కాని ఒక్క భోగమును కూడా అనుభవించలేదు. ఆయన మనసంతా రాముని చరణములపై, ఆయన్ని కలవాలన్న కోరికపై ఉండటం వల్ల ఈ భోగములన్నీ భరతునికి కనిపించలేదు.
జీవితంలో భోగముల వైపు మనసు పరిగెడుతూ ఉంటుంది మరియు దానిని మనము ఆపాలి. ఇది కేవలం ఆరంభిక స్థితి మాత్రమే. సాధన చేసేవారు టీ వదిలిపెట్టడం, మిఠాయిలు వదిలిపెట్టడం, ఒక పూట భోజనం మానేయడం వంటివి చేస్తూ ఉంటారు. అటువంటివి చేయాలి కూడా. వీటిని వదిలిపెట్టిన తరువాత నేను టీ ని వదిలి పెట్టాను అన్న విషయము అన్నిచోట్ల చెబుతుంటారు. నేను టీ తాగను అన్న విషయము అందరికీ తెలియాలన్న రసమును తీసుకుంటూ ఉంటారు.
ఒకసారి ఒక గురువుగారు ఉండేవారు. ఎంతో మంచివాడు. ఎవరి నుంచి ప్రణామములు స్వీకరించేవాడు కాదు. నెమ్మది నెమ్మదిగా ఆయన ఖ్యాతి ఎంతో విస్తరించింది. ఆయనతో ఎంతోమంది శిష్యులు చేరారు. ఎవరు తన పాదాలను తాకటం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. శిష్యులతో అందరికీ కాళ్ళపై పడవద్దు అని ముందే చెప్పమని అనేవారు. శిష్యులు కూడా వచ్చిన వారందరికీ గురువు గారికి ఇష్టం ఉండదు అందువల్ల మీరు ఎవరూ ఆయన కాళ్లకు మొక్క వద్దు అని చెప్పేవారు. ఒక రోజు ఒక వ్యక్తి వచ్చి గురువుగారితో కాసేపు మాట్లాడి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిన తర్వాత గురువుగారు శిష్యులతో మీరు అతడికి కాళ్లకు మొక్క వద్దని ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు. దానికి శిష్యులు ఇతడు పాత వాడే, ఇతనికి తెలుసు, అందువల్లే అతడు మీ కాళ్లకు మొక్క లేదు అని సమాధానం ఇస్తారు. దానికి గురువుగారు అయినా కానీ మీరు ముందు చెప్పవలసింది అని అన్నారు.
గురువుగారి మనసు కాళ్లకు నమస్కారాలను వదిలించుకున్నా ముందు అందరికీ చెప్పాలన్న విషయంలో ఇరుక్కుపోయింది. ఇక్కడ వాసన ఎంత సూక్ష్మమైనదో అర్థం చేసుకోండి. ఉత్తమమైన సాధు బుద్ధి కాళ్లకు ఎవరూ నమస్కరించకూడదని చెప్పాలన్న తాపత్రయంలో చిక్కుకుపోయింది. గురువుగారి కాళ్లకు నమస్కరించవద్దని అందరికీ తెలియాలన్న ఆసక్తి నిర్మాణము అయిపోయింది. టీ తాగను అన్న విషయము అందరికీ తెలియాలి అనుకున్నప్పుడు టీ మీద ఆసక్తి వదిలిపెడతారు కానీ టీ తాగనని అందరికీ తెలియాలి, అందరికీ నేను శ్రేష్టుడనన్న ఆసక్తి నిర్మాణమైనది. ఇది ఎంతో మహత్వపూర్ణమైన విషయము అన్న దానిని ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. త్యాగమును కూడా త్యాగము చేయవలసి వస్తుంది. నేను త్యాగము చేసానన్న సూచన కూడా ఇతరులకు తెలియకూడదు.
కూర్మో౽ఙ్గానీవ సర్వశః- తాబేలు వలె అన్నింటినీ లోపలికి లాక్కోవాలి. ఒక రాగం రెండవ రాగములో ఇరుక్కుపోతుంది. కావాలని వదిలిపెట్టినా దానిని అందరికీ తెలియజేయడంలో ఇరుక్కుపోతుంది. సాధనలో ఇటువంటి ఆసక్తులను కట్టడి చేయవలసి ఉంటుంది.
విషయా వినివర్తన్తే,నిరాహారస్య దేహినః৷
రసవర్జం(మ్) రసో౽ప్యస్య,పరం(న్) దృష్ట్వా నివర్తతే৷৷59॥
అర్జునా! ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహణం చేయని పురుషుడు కేవలము విషయముల నుంచి నివృత్తము అవుతాడు. కాని దానిలో ఉండే ఆసక్తి నివృత్తము కాదు. ఈ స్థితిలో జ్ఞాన పురుషుడు ఆసక్తిని కూడా పరమాత్మ యొక్క సాక్షాత్కారముతో కేవలము నివృత్త విషయముల నుంచి నివృత్తం కాకుండా, వాటిపై ఆసక్తి నుండి కూడా నివృత్తులు కావాలి. కేవలము టీ ని వదిలి పెట్టడమే కాకుండా, దానిని వదిలి పెట్టానన్న ఆసక్తిని కూడా వదిలిపెట్టాలి. మిఠాయి తినడం లేదు కాని మిఠాయిలపై మనసు వెళుతూ ఉంటుంది. అవి గుర్తుకు వస్తూ ఉంటాయి. ఈ ఆసక్తి మీలో అలాగే ఉంటుంది. భగవంతుడు ఏమి చెబుతున్నాడు అంటే దానిపై ఉన్న ఆసక్తి నుంచి నివృత్తులు కావాలి.
మిగిలిన 13 శ్లోకాలను మళ్లీ వారము చెప్పుకుందామంటూ, హరినామ సంకీర్తనతో వివేచనను ముగించారు.
ప్రశ్నోత్తరములు
ప్రశ్న- నేను టీ వదిలి పెట్టాలని అనుకున్నాను. కాని ఎప్పుడో ఒకసారి నేను వదిలి పెట్టాను అన్న విషయము గుర్తుకు వస్తే అది ఆసక్తి అవుతుందా?
సమాధానము- టీ తాగాలని అనిపిస్తే అది ఆసక్తి అవుతుంది. పదార్థములను విడిచిపెట్టడముతో ప్రారంభించాలి. కాని ఎప్పుడైతే దానిపై కోరిక అనేది ఉండదో, టీ ముందు పెట్టినా తాగాలని అనిపించదో, అప్పుడు అది పూర్ణతను సాధిస్తుంది. ఆసక్తి పూర్తిగా తొలగిపోతుంది.
ప్రశ్న- నా ఇష్టం లేకుండా నేను ఏదో ఒక పని చేస్తున్నాను. నా ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరో బలవంతంగా నా నుంచి పనిని తీసుకుంటున్నారు. నా ఇష్టం లేకున్నా ఆ కర్మ ఆసక్తి అవుతుందా?
సమాధానము- మీరు కర్తవ్యం గా భావించి చేస్తే అది ఆసక్తి రహితమైనది అవుతుంది. కర్తగా భావించి చేస్తే అది ఆసక్తి సహితము అవుతుంది. నేను కర్తవ్యముగా భావించి చేసినప్పుడు మరియు అందులో నాకు ఏ అపేక్షా లేకపోతే అందులో ఆసక్తి లేనట్లు.
ప్రశ్న- మీరు ఇప్పుడు చెప్పిన స్థితప్రజ్ఞ యొక్క విషయము గురించి. కర్త యొక్క భావన మన మనసులో లేకుండా కర్మలను చేసినప్పుడు మరియు మనము పూర్ణ రూపంలో భక్తిలో ఉన్నప్పుడు, అలా మనకు చాలా ఆనందం కలిగినప్పుడు, ఏ పని జరిగినా ఆ పరమాత్మ యొక్క ఇచ్ఛ ప్రకారమే జరుగుతుందన్న భావన వచ్చినప్పుడు, ఈ విధముగా భక్తి ఎంతో లోతుల నుంచి ప్రకటితమైనప్పుడు పరమాత్మ గుర్తుకువస్తుంటాడు మరియు పరమాత్మ గుర్తుకు వచ్చినప్పుడు మన లోపల జ్ఞానము మరియు వైరాగ్యము వంటివి ఉత్పన్నము అవుతాయి. భగవంతుడు ఎంతగా గుర్తుకు వస్తాడు అంటే అన్నింటి పైన కోరిక పోతూ ఉంటుంది. స్వతహాగా ఏ కర్మ చేయాలన్న కోరిక ఉండదు. అటువంటి సమయములో మనము భక్తిలో ఎలా ప్రవృత్తుల మై ఉండాలి?
సమాధానము- మీరు చెప్పేదంతా సరిగ్గా ఉంది. ఒక సూఫీ ఇంకొక సూఫీని మనలో ఆధ్యాత్మిత పెరుగుతోందని ఎలా తెలుస్తుంది అని అడగగా, దానికి రెండవ సూఫీ ఇలా అన్నాడు- మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకుండా ఉంటే బాగా ఉంటుంది అనిపించినప్పుడు, తినేటప్పుడు తినకుండా ఉంటే బాగా ఉంటుంది అని అనిపించినప్పుడు, నడుస్తున్నప్పుడు నడవకుండా ఉంటే బాగుంటుంది అని అనిపించినప్పుడు. ఎప్పుడైతే ఎటువంటి స్థితి మన మనసులో నిర్మాణము అవుతుందో మనకు భోగములపై అరుచి రావటం మొదలవుతుంది. ఇది ఆధ్యాత్మిక స్థితి కలగడానికి ప్రమాణము. కాని ఎన్నోసార్లు మనసులో అకర్మణ్యత వస్తూ ఉంటుంది. అప్పుడు దానికి ఆశ్రయము ఇవ్వకూడదు. మీలో కర్మ చేయకూడదు అన్న రుచి ఉండకూడదు. ఇప్పుడు నేను ఏమి చేయవలసిన అవసరం లేదు, కేవలము భజన మాత్రమే చేస్తాను వంటి భావనలు కలుగకూడదు. ఎంతో గొప్ప గొప్ప సాధువులు మరియు ఋషులు ఉంటారు, వారు కూడా కర్మలను చేయవలసి ఉంటుంది. పరమ శ్రద్ధేయ మహారాజ్ వారిని నేను అంతిమ సమయము వరకు మాలాజపము చేస్తూ ఉండగా చూశాను. మన కర్తవ్య కర్మలను ఎప్పుడు వదిలి పెట్టకూడదు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవడం ఎంతో మహత్వపూర్ణమైనది.
ప్రశ్న- మహాభారతంలో ఉన్న రెండు పాత్రలు ద్రౌపది మరియు విదురుడు ద్వారా ఎప్పుడు ఏ తప్పులు జరగలేదని అంటుంటారు. ఇది నిజమేనా?
సమాధానము- అవును, వారిద్దరి ద్వారా ఎప్పుడు ఏ అపరాధములు జరగలేదు.
ప్రశ్న- సమయము, ధర్మము మరియు దేశము యొక్క ఆలోచన దయ చూపించినప్పుడు చేయవచ్చునా లేక కేవలము దానము చేసే సమయంలోనే చేయాలా? ఎవరైనా ఒక సైనికుడు తుపాకీతో కాల్చినప్పుడు దెబ్బతిన్న ఆతంకవాది ఎక్కడైనా దాక్కుంటే అతడిని రక్షించాలా?
సమాధానము- మన దగ్గర ఇటువంటి నియమము లేదు. గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చడం చేయవలసినదే. కసబ్ ను ఉరి తీయటానికి ముందు రోజు జ్వరం వస్తే అతన్ని డాక్టర్కు చూపించారు, ఎందుకంటే అందరూ కూడా దయకు అధికారులే అవుతారు.
అంతిమ ప్రార్ధన మరియు హనుమాన్ చాలీసా పఠనముతో ఈ వివేచన కార్యక్రమము సమాప్తము అయినది.