विवेचन सारांश
ఇంద్రియములు మరియు విషయ బంధనము
భగవద్గీతలోని రెండవ అధ్యాయము సాంఖ్యయోగము యొక్క వివేచన చివరి భాగము యధావిధిగా ప్రార్థన మరియు దీప ప్రజ్వలనతో ప్రారంభము అయినది. వివేచనను చెప్పవలసినదిగా గీతా పరివార్ అంతర్జాతీయ అధ్యక్షులు, ఆదరణీయులు డా. ఆశూ జీ గోయల్ గారిని ఆహ్వానించారు. డా. గోయల్ గారు, కృష్ణ ప్రార్థన, గురు చరణములకు వందనములతో ఈనాటి వివేచనను ప్రారంభించారు.
భగవంతుని అతిశయ మంగళమయ కృప వలన మన అందరిలో ఎటువంటి సద్భాగ్యము జాగృతము అయినదంటే మనము మన ఈ మానవ జీవితాన్ని సఫలము చేసుకోవడానికి, సార్ధకము చేసుకోవడానికి, మన అలౌకిక మరియు పారాలౌకిక కళ్యాణము కొరకు, మన జీవితాల్లో అన్ని క్షేత్రాలలో విజయులుగా ఉండటానికి, మరియు ఈ మనుష్య జీవనము సర్వోచ్ఛ సార్థక సిద్ధి పొందటానికి భగవద్గీత యొక్క పఠనములో, దాని ఉచ్చారణ నేర్చుకోవడంలో, దాని స్వాధ్యాయములో, దాని వివేచనలను వినడంలో, దానిలోని సూత్రములను అర్థము చేసుకొని కొన్నింటిని జీవితంలోకి తీసుకురావడానికి ఇప్పుడు మనమందరము తత్పరము అయ్యాము. మనము ఈ జన్మలో చేసుకున్న పుణ్య కర్మల వల్లనో, మన ఏదైనా పూర్వజన్మలలో చేసుకున్న పుణ్య కర్మల వలనో, మన పూర్వజుల ఏదైనా కొంత సుకృతము వలనో, లేదా ఏదైనా జన్మలో ఎవరైనా సంత మహాపురుషుని కృపా దృష్టి మనపై ప్రసరించడం కారణముగానో ఎటువంటి భాగ్యోదయము కలిగినదంటే మనము భగవద్గీతను చదువుకోవడానికి ఎంచుకోబడ్డాము.
భగవద్గీతకు సమానమైన కల్యాణ కారకమైన గ్రంథము ఈ సంసారంలో వేరొకటి లేదు. ఏ మనుష్య మాతృలకైనా ఇది అంత సుగమము కాదు. ఐదువేల ఒక వంద సంవత్సరాలలో మళ్లీ మళ్లీ ఆచార్యులు, మహా పురుషులు, సంతులు వేరువేరు భావములతో ఎంతో గట్టిగా ఈ విషయాన్ని చెప్పారు. గీతా ప్రచార సంస్థాపకులైన పరమ శ్రద్ధేయ బ్రాహ్మలీన సేఠ్ జీ జయదయాల్ గోయందకా గారు భగవద్గీత యొక్క ప్రస్తావనలో ఈ విధముగా వ్రాశారు- సమస్త శాస్త్రములను అధ్యయనము చేసిన తరువాత మనుష్య మాత్రులకు కళ్యాణము చేసే భగవద్గీతకు సమానమైన వేరొక సుగమమైన గ్రంథము లేదని నిష్కర్షకు వచ్చానని అన్నారు. ఆదిశంకరాచార్య భగవానులు కూడా "గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః"- ఒక భగవద్గీతను చదివినట్లయితే వేరే ఏమి చదివినా, చదవకపోయినా సరిపోతుందని అన్నారు. ఎందుకంటే వేదముల సారము ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారము భగవద్గీత. అన్ని శాస్త్రముల సారము భగవద్గీత మరియు ఇది భగవంతుడు కృష్ణుని ముఖారవిందమునుంచి వెలువడినది.
అర్జునుడు భగవంతునితో ఏ విధమైన గీతా జ్ఞానము వినిపించమని అడగలేదు మరి భగవంతుడు ఎందుకు చెప్పాడు అన్న ప్రశ్న మీ మనసులో కూడా చాలా సార్లు రావచ్చును. అర్జునుని మనసులో మోహము కలిగినది మరియు అతడు యుద్ధము చేయనని అంటున్నాడు. విషయము ఇంతవరకు మాత్రమే. ఇక్కడ భగవంతుడు తత్వయుక్తముగా సమాధానమిచ్చి, అర్జునుడికి విడమర్చి చెప్పి, ఇంకా బుజ్జగించి యుద్ధము చేయించాలి. కాని ఇక్కడ పారమార్థిక జ్ఞానము, ఉపనిషత్తుల జ్ఞానము, బ్రహ్మజ్ఞాననము (భగవంతుడు మళ్లీమళ్లీ చెప్పిన గుహ్యతమ జ్ఞానము అనగా గోప్యమైన జ్ఞానము) భగవంతుడు చెబుతున్నాడు.
యుద్ధ భూమిలో ఉండగా, ఇక యుద్ధము మొదలవుతుందనగా ఇటువంటి గుప్తమైన జ్ఞానమును చెప్పవలసిన అవసరమేమున్నది? అర్జునుడు బ్రహ్మజ్ఞానాన్ని అడగనప్పటికీ భగవంతుడికి ఇంతటి గొప్ప బ్రహ్మజ్ఞానమును చెప్పవలసిన సూచనాత్మకత ఎక్కడి నుంచి వచ్చింది? కాని ప్రారంభంలో భగవంతుడు అర్జునుని స్థితిని అర్థము చేసుకున్నాడు. అందుకే భగవంతుడు ఈ విధమైన విషయ వాతావరణం ప్రారంభించాడు. దీని ద్వారా అర్జునుడిని లేగ దూడగా చేసి, నిమిత్తునిగా చేసి ఈ సంసారమంతటి కళ్యాణము కొరకు గీతా రూపమైన అమృతోపదేశమును చేశాడు.
సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్
భగవంతుడు గోవు రూపములో ఉపనిషత్తులన్నింటి సారమును పాలగా పితికి, అర్జున రూపుడైన లేగ దూడను నిమిత్తముగా చేసుకొని, మన అందరి కోసము అమృత తుల్యమైన గీతా రూపంలో ఇచ్చాడు.
అర్జునుడు కూడా ఏమీ సాధారణమైన వ్యక్తి కాదు. 84 సంవత్సరాల వయసులో, అత్యంత గంభీర, ప్రౌఢ, అనుబవశాలి, శాస్త్రజ్ఞ్యాని మహాత్ముడు. అందుకే 54వ శ్లోకంలో అర్జునుడు భగవంతుడిని మీరు ఎటువంటి యోగి గురించి చెబుతున్నారంటే-
స్థితప్రజ్ఞస్య కా భాషా, సమాధిస్థస్య కేశవ
స్థితధీః కిం ప్రభాషేత, కిమాసీత వ్రజేత కిమ్
అతడు ఏ విధముగా మాట్లాడుతాడు, అతని ఆచరణ ఏ విధముగా ఉంటుంది అంటాడు. నేను యుద్ధము చేయను, దాని విషయము మాత్రమే చెప్పు, నన్ను పక్కదారి ఎందుకు పట్టిస్తున్నావని అర్జునుడు అడగలేదు. భగవంతుడు అర్జునునికి కొంచెం జ్ఞానము ఇస్తానన్న సంకేతము ఇవ్వగా అర్జునుడు ఆ దారిలోకి వచ్చి వెంటనే ప్రశ్నలు అడగటం ప్రారంభించాడు. అతడు ఎలా ఆచరణ చేస్తాడు, అని అడిగాడు. అర్జునుడికి ఇటువంటి ఆధ్యాత్మిక రుచి ఉన్నదని గ్రహించిన భగవంతుడు ప్రసన్నుడై జ్ఞానాన్నంతటిని ఉపదేశము చేసాడు. 59వ శ్లోకము వరకు మనము గత వారము చెప్పుకున్నాము. భగవంతుడు ఇలా చెబుతున్నాడు-
2.60
యతతో హ్యపి కౌన్తేయ,పురుషస్య విపశ్చితః৷
ఇన్ద్రియాణి ప్రమాథీని,హరన్తి ప్రసభం(మ్) మనః৷৷60॥
అర్జునా, ఆసక్తి నాశనము కావడము కారణంగా ఈ ఆదిమ స్వభావం గల ఇంద్రియములు బుద్ధిమంతుడైన పురుషుని యొక్క మనసును బలవంతముగా లాగడానికి ప్రయత్నం చేస్తాయి. గత వారం మనము చూసుకున్నాము, త్యాగం చేసిన తరువాత కూడా ఆ త్యాగం యొక్క ఆసక్తి ఉండిపోతుంది. టీ త్రాగడం ఆపినా, టీ తాగడం ఆపేయాలన్న తన ఇచ్ఛ అందరికీ తెలియాలన్న కోరిక వెంటనే జాగృతము అవుతుంది. నేను ఒక మంచి నియమాన్ని ఆచరిస్తున్నాను, ఆ నియమము అందరికీ తెలియాలి మరియు అందరూ నన్ను అధికముగా ఆదరించాలి అన్న భావన వెంటనే మనసులో వస్తుంది.
భగవంతుడు చెప్పేదేమిటంటే వదిలిపెట్టిన దానిపై ఆసక్తిని పట్టుకుని ఉంటే పని జరగదు. అందువలన భగవంతుడు ఏమన్నాడంటే అర్జునా ఆసక్తి నాశనము అవ్వకపోవడం కారణంగా ఈ ఆదిమ స్వభావములు కల ఇంద్రియములు తిరిగి మనసును అటువైపు తిప్పుతాయి. మనసులో పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. గొప్ప గొప్ప సాధకులకు కూడా ఇటువంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రయత్నం చేసి కూడా విఫలమవుతుంటారు. మనకు విశ్వామిత్రుడు-మేనకల వృత్తాంతము తెలుసును. ఈ విధముగా చరిత్రలో అనేకమైన ఘటనలు చూడవచ్చును. అంతటి ఉత్తమ ఋషి, ఉత్తమ సాధకుడు అయి ఉండి కూడా ఆయనలో సంయమనము కొట్టుకుపోయింది.
ఇంద్రియములకు అవకాశం దొరికితే అవి మనసును లాగివేస్తాయి మరియు మనసుకు అవకాశం దొరికితే అది ఇంద్రియములను లాగి వేస్తుంది. రెండింటి మధ్యన టగ్ ఆఫ్ వార్ కొనసాగుతుంది. ఆరవ అధ్యాయము 34వ శ్లోకంలో భగవంతుడు ప్రమాథి బలవద్ దృఢమ్- అంటూ మనసును గురించి అలా చెప్పాడు మరియు ఇక్కడ ఇంద్రియముల గురించి చెప్పాడు. మనసే ఆదిమ స్వభావము కలది మరియు ఇంద్రియములు జఢము.
మనసు యొక్క బలముతో ఇంద్రియములలో బలము వస్తుంది. మనసు పెట్టకపోతే కళ్ళు చూస్తున్నా అవి ఏమీ చూడవు, చెవులు వింటున్నా వినవు. ఈ విషయాన్ని మనము గతంలో చెప్పుకున్నాము. మన ఎదురుగా ఎవరైనా వెళ్ళినా, తరువాత అడిగితే ఏమో నాకు తెలియదు, నా ధ్యాసంతా వేరే ఎక్కడో ఉంది అంటారు. కళ్ళు చూస్తున్నాయి గాని నాకు తెలియదు. ఏమైనది?
నేను భోజనము చేస్తుండగా ఫోన్ వస్తే నేను దానిలో పూర్తిగా మునిగిపోయి మాట్లాడుతున్నాను. ఏమి తిన్నానో కూడా తెలియదు. భోజనం అంతా అయిపోయింది నాకు తెలియను కూడా లేదు. టీ తాగిన తర్వాత పూర్తిగా తాగామా లేదా అనుకుంటూ ఇంకోసారి గ్లాస్ వైపు చూస్తాము, ఎందుకంటే మన మనసు దానిపై లేదు.
ఇంద్రియములతో మనసు కలిసి ఉండకపోతే ఇంద్రియముల శక్తి సమాప్తం అయిపోతుంది. అందుకే శాస్త్రములలో ఇంద్రియములతో మనసును మరియు మనసుతో ఇంద్రియములను రెండింటినీ ఒకదానితో ఒకటి సంయమనము చేయాలన్న విషయము ఉంటుంది.
ఇంద్రియములను సంయమనము చేస్తే మనసు నియంత్రితమవుతుంది. కళ్ళు మూసుకుని, నిటారుగా కూర్చుని, అటూ ఇటూ వచ్చే శబ్దాలను వినకుండా, ఏమీ మాట్లాడకుండా ఉండగలిగితే అప్పుడు ఇంద్రియములను సంయమనము చేసినట్లు. ఇంద్రియములను నియంత్రిస్తే మనస్సు కూడా నియంత్రణలో ఉంటుంది.
మనము ధ్యానములో కూర్చున్నప్పుడు ఏమీ మాట్లాడకూడదు, ఏమీ చూడకూడదు, ఏమీ వినకూడదు, ఏమి స్పర్శించకూడదు అనుకుంటాము. ఇంద్రియములను నియంత్రిస్తే మనసు నియంత్రణలో ఉంటుందని భావిస్తారు. ఇదే విధముగా మనసును నియంత్రిస్తే ఇంద్రియములు కూడా నియంత్రణలో ఉంటాయి.
కళ్ళ ముందు వేడివేడి జిలేబి తయారవుతుంటే, కళ్ళు చూసినా మనసు అనుకుంటుంది వేడిగా ఎంత కరకరలాడుతోందో కదా అని. అప్పుడు బుద్ధి ఈరోజు ఉదయం 180 గా ఉన్న మీ షుగర్ ను గుర్తు చేసుకోమంటుంది. దానికి మనసు జిలేబి రోజు రోజు తినము కదా, ఒక రోజు తింటే మాత్రం ఏమైంది, ఇంకొక మాత్ర అధికముగా వేసుకుంటాను, కొంచెము ఎక్కువగా నడుస్తాను అంటుంది. ఇదివరకు కూడా ఇలాగే చేసి, తేడా చేయడం వల్ల ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చింది గుర్తుపెట్టుకో అంటుంది బుద్ధి. ఒక్కోసారి బుద్ధి గెలుస్తుంది, ఒక్కోసారి మనసు గెలుస్తుంది. ఇలా మనందరికీ జరుగుతుంటుంది. భగవంతుడు చెప్పేది ఏమిటంటే మనసు నుంచి ఆసక్తి త్యాగము కానంతవరకు, ఈ మనసు విషయములలో ఇరుక్కోవడానికి ఆత్రుతతో ఉంటుంది.
మనము వదిలిపెట్టినా మనసు నుంచి పోదు. మిఠాయిని తినడం వదిలిపెట్టినా అది మనసులోంచి పోదు. ఇక నేను ధనముపై ఆసక్తి పెట్టుకోను, ఎక్కువగా ధనమును స్పర్శించను అన్నా కూడా ధనము పై ఉన్న మోహము మనసులో నివసిస్తూ ఉంటుంది. ఈ విషయాలు బయట నుంచి ఎంత పెద్దగా కనిపిస్తాయో దానికన్నా వేలరెట్లు ఎక్కువగా మనసులో ఉంటాయి. అందుకే మనసును సంయమనములో పెట్టుకోవడం ఎక్కువ ఆవశ్యకమైన విషయము.
తాని సర్వాణి సంయమ్య,యుక్త ఆసీత మత్పరః৷
వశే హి యస్యేన్ద్రియాణి,తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా৷৷61॥
ఆ సంపూర్ణ ఇంద్రియములను వశపరచుకొని, సమతా చిత్తుడై, నా పరాయణుడై ధ్యానములో కూర్చున్న వ్యక్తి, ఆ పురుషుడు ఇంద్రియములు వశమైతే అతని బుద్ధి కూడా స్థిరమవుతుంది.
ముందుగా సిద్ధాసనములో కాని, పద్మాసనములో కాని, సుఖాసనంలో కాని కూర్చొని కాళ్ళను బంధిస్తే త్వరగా దేనికి లేవలేరు. ఏదైనా అవసరము వచ్చినా కాళ్లు విప్పుకొని కూర్చున్న వారు వెంటనే లేచి చూస్తారు. కాని కాళ్ళను బంధించి కూర్చుంటే లేవటానికి సమయం పడుతుంది, అందుకే ఆ వ్యక్తి త్వరగా లేవడు. అందుకే ఈ ఆసనాలలో కూర్చుని ఉండే పరంపర ఉన్నదని గుర్తుపెట్టుకోండి. కేవలము కాళ్ళను మాత్రమే బంధించకుండా చేతులను కూడా జ్ఞానముద్రలు వేయడం ద్వారా బంధించుకోవాలి. ఆ తరువాత కళ్ళను మూసుకుని, నోరు తెరవకుండా అన్ని విధాలుగా వీటిని నియంత్రిస్తే, భగవంతుడు చెబుతున్నాడు- ఇంద్రియములను నియంత్రిస్తే మనసు కూడా నియంత్రణలోకి వస్తుంది, ధ్యాన పూర్వకంగా మనసును అదుపులో పెట్టుకుంటే బుద్ధి స్థిరమవుతుంది. ఇది ఒక క్రమము.
ఎవరికైతే ఇంద్రియములు, మనసు, బుద్ధి ఈ మూడు స్థిరమవుతాయో వారే స్థితప్రజ్ఞులు అవుతారు. సమత్వం యోగ ఉచ్యతే. అర్జునుడికి భగవంతుడు కొంచెం క్లిష్టమైన విషయాలను చెబుతున్నాడని అనిపించింది. బహుశా మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉండవచ్చును. ఇది సాధ్యమా, చెప్పేది చెబుతారు విని ఊరుకుందాము అని చాలామంది మనసులో అనిపిస్తూ ఉంటుంది. మీరు అలా చేస్తే ఏమవుతుందో వినమని భగవంతుడు చెబుతున్నాడు-
ధ్యాయతో విషయాన్పుంసః(స్), సఙ్గస్తేషూపజాయతే৷
సఙ్గాత్సఞ్జాయతే కామః(ఖ్), కామాత్క్రోధో౽భిజాయతే৷৷62॥
ముందుగా నీకు ఈ విషయాలు అంతా సైద్ధాంతకంగా అనిపించి, ఆచరణాత్మకంగా అనిపించకపోతే, దీని వలన ఆచరణాత్మకమైన ప్రభావము ఎలా ఉంటుందో చెబుతాను. ధ్యాయతో విషయాన్పుంసః- విషయాల గురించి చింతను చేసే పురుషుడికి, సఙ్గస్తేషూపజాయతే- ఆ విషయములపై ఆసక్తి ఉత్పన్నం అవుతుంది. సఙ్గాత్సఞ్జాయతే కామః- ఆసక్తి వలన ఆ విషయములపై కోరికలు ఉత్పన్నము అవుతాయి. కామాత్క్రోధో౽భిజాయతే- ఈ కోరికలకు విఘ్నము కలిగితే క్రోధము వస్తుంది.
డాబాపై కూర్చుని ఉండగా మబ్బులు వచ్చాయి, చల్లటి గాలి వీస్తోంది, ఎంతో మధురమైన వాతావరణం నెలకొంది. వెంటనే అటువంటి వర్షపు రోజున ముందు సారి తన భార్య మంచి పకోడీలు వండిపెట్టిందన్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే ఇంటిలో ఉన్న భార్యకు ఫోను చేసి వింటున్నావా అని ఎంతో ప్రేమగా అడిగాడు. వెంటనే ఆమెకు ఏదో పని పడి మెత్తగా మాట్లాడుతున్నాడని అర్థమైంది. వింటున్నాను ఏమిటో చెప్పు అంది. దానికి అతడు వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది అన్నాడు. అయితే ఏమి చేయమంటావు అన్నది భార్య. ఇంతకుముందు వాతావరణం ఇలా ఉన్నప్పుడు నీవు పకోడీలు చేసి పెట్టావు అన్నాడు. దానికి భార్య నీవు పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్నావు, నేను ఇక్కడ పిల్లలకు చదువు చెబుతున్నాను, నువ్వు ఖాళీగా ఉండి ఇక్కడికి వచ్చి పిల్లలకు చదువు చెబితే నేను నీకు పకోడీలు చేసి పెడతాను అని ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు ఈ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి.
ధ్యాయతో విషయాన్పుంసః- విషయము గురించి ఆలోచన మనసులో వచ్చింది. ఆలోచన రావడంతో దానిపై కోరిక ఉత్పన్నం అయినది మరియు కోరికలలో విగ్రహం కలగడం వల్ల క్రోధము మనసులో వచ్చింది. ఇదేమైనా పద్ధతిగా ఉందా మాట్లాడటానికి, నేను కేవలం పకోడీ అడిగాను, ఏమన్నా ఖజానా అడిగానా, ఓ పావుగంట తర్వాత చేస్తానని చెప్పవచ్చు కదా, పిల్లలకు చదివిస్తున్నాను అంటే చూడండి ఆమె మాట్లాడే విధానము ఎలా ఉందో.
పకోడి గురించి ఆలోచన రావడంతో దానిపై కోరిక ఉత్పన్నము అవుతుంది మరియు కోరిక పూర్తి కాకపోతే, దానిలో విఘ్నము వస్తే మనకు క్రోధము వస్తుంది.
చాలామంది వివేచన తరువాత క్రోధము వస్తోంది ఏమి చేయమంటారని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కాని ఎవరూ కూడా కోరికలు వస్తున్నాయని, వాటి గురించి ఏమి చేయాలంటారని ఎప్పుడూ ప్రశ్నలు అడగరు. ఎవరు అడగరు ఎందుకంటే కోరికలు మనందరికీ బాగా అనిపిస్తాయి. కోరికలు రానివారు అంటూ ఎవరూ ఉండరు. వచ్చిన ఈ కోరికలు తీరకపోతే క్రోధము ఎలాగూ వస్తుంది.
రాజస్థాన్ కు చెందిన ఒక స్త్రీ ఒక మహాత్ముని దగ్గరకు వస్తుంది. ఆ మహాత్ముడు ఎంతో గొప్పవాడు మరియు ఎంతో కాలంగా వారిద్దరూ పరిచయము గలవారు. మహాత్ముడు కథలు చెబుతుండేవారు మరియు ఆమె ఆయన పాత శిష్యురాలు. ఆమె ఒక రోజు ఆయన దగ్గరకు వచ్చి నాకు కోపం చాలా ఎక్కువగా వస్తుంది అని చెప్పింది. దానికి ఆయన నిన్నే కదా దాని గురించి కథ చెప్పాను అనగా అవన్నీ నేను వింటూ ఉంటాను అయినప్పటికీ నాకు కోపం వస్తోంది అనగా ఆయన ఆమెకు కొన్ని కొన్ని సత్సంగములు వినిపించడం ప్రారంభించారు. దానికి ఆమె ఇవన్నీ నాకు తెలుసు, మళ్లీ మళ్లీ వినాలని లేదు, మీరు చెబుతున్న విషయాలన్నీ తెలుసు కాని మళ్లీ మళ్లీ కోపం వస్తూ ఉంటుంది, ఏమి చేయమంటారు, ఏదో ఒక ఉపాయం చెప్పండి, ఏదైనా మూలికలు ఇవ్వండి అని అడుగుతుంది.
మహాత్ముడు కొంచెం నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడు కాని ఆమె పట్టు పట్టుకుని కూర్చుని ఏది వినడానికి తయారుగా లేదు. ఆ మహాత్ముని దగ్గరకు ఇటువంటి వారు వస్తూనే ఉంటారు. వీరి కోసం ఆయన దగ్గర ఒక ఉపాయము ఉండేది. తన శిష్యుడిని వెళ్లి ఆ కోపము కలిగిన మూలికల బిళ్ళలు తెమ్మని చెప్పారు. అది వింటూనే ఆ మహిళ ఇంత కాలం ఆయన సత్సంగాలు మాత్రమే చెప్పారు, ఇప్పుడు మూలికలు ఇవ్వబోతున్నారన్న భావనతో ఎంతో ప్రసన్నమైనది. వెంటనే ఆ శిష్యుడు హోమియోపతి లోని ఒక డమ్మీ మందును తీసుకువచ్చి ఇచ్చాడు. ఇలాంటి డమ్మీ మందు ఒకటి హోమియోపతిలో ఉంటుంది. మీకు తెలిసినా తెలియకపోయినా అది చాలాసార్లు మీరు డాక్టర్ దగ్గరకు వెళ్లి నాకు ఏదో ఉంది, మందు ఇవ్వవలసిందే అని పట్టు పట్టినప్పుడు ఇస్తారు. మీకు ఏ సమస్య లేదని తెలిసిన డాక్టర్ తీపి గుళ్ళు ఇస్తాడు. అవి తినడం వల్ల ఏమీ కాదు, వాటిలో కేవలం పంచదార మాత్రమే ఉంటుంది. ఆ మహాత్ముడు అటువంటి గోలీలను తెప్పించి ఉంచాడు.
మహాత్ముడు ఏడు రోజుల వరకు నేను ఈ గోలీలలో మంత్రములు యొక్క శక్తిని నింపుతాను, దీని కోసము ఎంతో పెద్ద పూజ చేయవలసి ఉంటుంది అన్నాడు. దానికి ఆ స్త్రీ మీరు దీని గురించి ఆలోచించవలసిన పనిలేదు, ఏమి చేయాలన్నా నేను చేస్తాను అన్నది. దానికి ఆయన రోజు కమల పుష్పములు తీసుకురావాలి అంటే, దానికి ఆ స్త్రీ నేను తీసుకు వస్తాను అన్నది. ఒక గంట వరకు నేను మంత్రమును జపిస్తాను, నీవు బయట కూర్చుని ఆ సమయములో ధ్యానము చేయవలసి ఉంటుంది అనగా ఆమె అలాగే చేస్తాను అన్నది. ఏడు రోజుల వరకు ఆ స్త్రీ కమల పుష్పములు తీసుకువస్తూ ఉంది, మరియు ఆ మహాత్ముడు భగవంతునికి వాటిని అర్పించి, ఏడు రోజుల తరువాత ఆమెతో గోలీలతో ఉన్న సీసా ఇప్పుడు తయారుగా ఉంది, ఒక విషయాన్ని గుర్తు పెట్టుకో, ఎప్పుడు కోపము వచ్చినా రెండు గుళ్ళు నోటిలో వేసుకో కాని ఈ మంత్రములతో అభిమంత్రితమైన ఈ మాత్రలు పళ్లకు తగలడానికి వీలులేదు అని చెప్పారు. ఆమె దానికి సరే అని ఇంతకీ ఏమి చేయాలని అడిగింది. దానికి ఆ మహాత్ముడు ఇక పని అంతా ఆ మాత్రలు చూసుకుంటాయి నీవు ఏమి చేయవలసిన అవసరం లేదని పంపించారు.
ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? కోపము రాగానే ఆమె రెండు మాత్రలు నోట్లో వేసుకుంది. ఇప్పుడు అది పళ్ళకు తగలకూడదు కాబట్టి ఆమె నోరు మూసుకుని కూర్చోవలసి వచ్చింది. అందువల్ల ఆమె మాట్లాడలేదు. కాసేపట్లో కోపము చల్లబడిపోతుంది.
ఆ మరునాడు మహాత్ముని దగ్గర మాకు కూడా ఈ మాత్రలు కావాలని ఎంతో మంది వచ్చి నిలబడ్డారు. వారములో 100 సీసాలు పంచి పెట్టవలసి వచ్చింది.
వాస్తవానికి క్రోధము సమస్యను ఉత్పన్నము చేయదు. క్రోధము యొక్క వేగము సమస్యను ఉత్పన్నము చేస్తుంది. మీరు గుర్తు చేసుకుంటే మీకు అప్పటికప్పుడు ఎంతో కోపము కలుగదు. కోపము కొంచముగా ప్రారంభం అవుతుంది, తరువాత కొంచెం వస్తుంది, ఇంకొంచెం పెరుగుతుంది, ఆ తరువాత మనం మాట్లాడటం మొదలు పెడతాము, అలా మాట్లాడుతూ గట్టిగా మాట్లాడటం మొదలు పెడతాము, ఆ తరువాత కోపము ఇంకా పెరిగినప్పుడు చేతిలో ఏదున్నా విసిరి కొడుతూ ఉంటాము. అలా ఆ వేగము పెరుగుతూ పెరుగుతూ ఎక్కడిదాకా వెళుతుందో దానికి ఏమి కొలమానము లేదు.
ఒక భార్యాభర్తలకు రోజూ తగువు పడే స్వభావము ఉన్నది. రోజు ఉదయాన్నే ఏడు గంటలకు కచ్చితంగా మొదలుపెట్టి తొమ్మిది గంటల వరకు ఇద్దరూ దెబ్బలాడుకునేవారు. 9 గంటలకు భర్త ఆఫీసుకు వెళ్లడంతో గొడవ ఆగిపోయేది. ఇదంతా చుట్టుపక్కల వారికి చిర పరిచితము కావడం వల్ల వారంతా గొడవ మొదలవ గానే చెవులకు ఏ ఇయర్ ఫోన్సో పెట్టేసుకునేవారు. కానీ ఈరోజు ఆదివారం.
సంయోగము వలన ఆదివారం రోజు దెబ్బలాట మొదలైంది. 9 గంటల వరకు అందరూ హెడ్ ఫోన్స్ పెట్టుకునే ఉన్నారు. కాని ఈరోజు తగువులాట ఆగలేదు. 10, 11, 12 గంటలవుతున్నా గొడవ పడుతూనే ఉన్నారు. ఇక భరించలేక పొరుగింటాయన అసలు ఎందుకు తగువు పెట్టుకున్నారో చూసి వద్దామని వెళ్లి తలుపు తట్టారు. వెంటనే గొడవ ఆగిపోయింది, భర్త వెళ్లి తలుపు తీసి వచ్చిన పొరుగింటాయని ఏమి కావాలని అడగగా, ఏమీ లేదు మీరు చాలాసేపటి నుంచి గొడవ పడుతున్నారు అసలు ఏమిటో విషయం చూసి వద్దామని వచ్చాను అంటారు. వెంటనే భర్త రండి అని ఆయనను లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడతాడు.
అప్పుడు పొరుగింటాయన విషయం ఏమిటో చెప్పమనగా ఈసారి భార్య వైపు నుంచి సమాధానం వస్తుంది. వెంటనే భార్యాభర్తలిద్దరూ పోట్లాడుకోవడం మళ్ళీ మొదలుపెడతారు. పొరుగింటాయన, మీ ఇద్దరూ అసలు ఎక్కడ మొదలుపెట్టారు, తగువు ఎందుకు మొదలైందో చెప్పమని అడుగుతాడు. దానికి దంపతులిద్దరూ అసలు తగువు ఎందుకు మొదలైంది, ఎక్కడ మొదలైంది అన్న విషయం వెతుకుతూ ఆలోచనలో పడిపోతారు. గుర్తుకు రాకపోవడంతో మళ్లీ ఒకళ్ళు ఒక మాట అన్నారు, ఇంకొకళ్ళు దానికి వ్యతిరేకంగా ఇంకొక మాట అన్నారు, మళ్ళీ గొడవ మొదలైపోయింది.
పొరిగింటాయన మీరిద్దరూ ఆగండని, నాకు కేవలం అసలు గొడవ ఎక్కడ మొదలైందో చెప్పండి అన్నాడు. ఆ మనిషి కోపంగా మీరు తొమ్మిది గంటలనుంచి కొట్టుకుంటున్నారు, కనీసం ఎక్కడి నుంచి మొదలు పెట్టారో కూడా గుర్తులేదు అన్నాడు. ఎన్నో విషయాలపై తిట్టుకున్నారు, ఇప్పుడు ఏ విషయంపై మొదలైందో ఏ మాత్రం గుర్తులేదు.
మన అందరికి అలాగే జరుగుతుంది. చాలాసార్లు ఇంత చిన్న విషయానికి దెబ్బలాడుకున్నామా అని సిగ్గుతో చితికి పోతారు. చాలావరకు తగువులు ఏదో ఒక విషయంపై మొదలవుతాయి, అక్కడ నుంచి పాత విషయాలు తవ్వుకుంటూ ఎక్కడెక్కడికో వెళ్లిపోతాయి. ఇది ఆగదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ విషయం అంతా వేగానికి సంబంధించినది. మహాత్ముడు ఇచ్చిన మాత్రలు కోపానికి సంబంధించినవి ఏమాత్రం కాదు. వీటిని వేసుకొని నోరు మూసుకుంటే వేగము ఆగిపోతుంది. ఆ సమయంలో మాట్లాడకపోతే తరువాత ఆ వ్యక్తి ఎక్కువ కోపం తెచ్చుకోడు. చాలావరకు కోపాలు వెంటనే వ్యక్తపరచకపోతే అవి క్షరమవుతాయి. చాలా తక్కువ విషయాలు మాత్రమే మనలను ముందుకు తీసుకువెళతాము. మొన్న వచ్చిన కోపము ఈరోజు చూపించడం చాలా అరుదుగా జరుగుతుంది. చాలాసార్లు మనము ఆ కోపము ప్రదర్శించకపోతే తిరిగి మళ్లీ రాదు, అంటే ఆ సమయంలో క్రోధం యొక్క వేగమును ఆపగలిగితే క్రోధము ఆగిపోతుంది. అందుకే వెంటనే వచ్చే ప్రతి చర్యల నుంచి కాపాడుకోండి.
కోరికలు మరియు క్రోధం యొక్క వేగము ప్రమాదకరమైనది. కోరికలపై కాని, క్రోధముపై కాని అభ్యంతరము లేదు. కాని కోరికలు మరియు క్రోధం యొక్క వేగము మనుషులను నాశనము చేస్తుంది. చాలా సార్లు ఆ వేగమే మనుషులను త్యాగమైపోయేలా కూడా చేస్తుంది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, కొంతమంది ఇంకేదేదో చేసుకుంటారు. వేగము ప్రమాదకరమైనది. అందుకే వేగమును ఆపగలిగే వ్యక్తి బుద్ధిమంతుడు.
గొడవలకు పెద్ద కారణాలేమీ ఉండవు. ఆ క్రోధానికి కొంచెం గాలి కొట్టి, ఉబ్బేలా చేస్తే అది పెరుగుతూ పెరుగుతూ ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. నేను ఈ మాట ఎందుకు అన్నాను అని తర్వాత చాలామంది తల కొట్టుకుంటూ ఉంటారు. నిజానికి అది వారి ఉద్దేశ్యం కూడా కాదు. చాలాసార్లు తన మాటను సమర్ధించుకోవడానికి మనము వాస్తవానికి మన మనసులో లేని మాటలను, మనము ఎప్పుడూ అనకూడదనుకున్న మాటలను కూడా అంటుంటాము. మన మాటలను ప్రభావశీలము చేయడానికి, మన క్రోధమును ఇంకా పెంచడానికి మనమేదో రెండు మాటలు చెబుతాము. అవి మన మనసులోని మాటలు కాదు, అవతలి వారి గురించి మనము ఆ విధముగా ఆలోచించము కాని మనము ఆ మాటలను అనేస్తాము. అందుకే క్రోధము యొక్క వేగము ఆపడము ఆవశ్యకము. ఆపకపోతే ఏమవుతుందో భగవంతుడు ఈ విధముగా చెబుతున్నాడు-
క్రోధాద్భవతి సమ్మోహః(స్), సమ్మోహాత్స్మృతివిభ్రమః৷
స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ప్రణశ్యతి৷৷63॥
ఈ 62, 63 శ్లోకాలు జీవితానికి తాళం చెవి వంటివని గుర్తుపెట్టుకోండి. ఈ రెండు విషయాలను మీరు నిగ్రహించుకోగలిగితే జీవితంలో అన్ని చిక్కు ప్రశ్నలు విడిపోతాయి.
భగవంతుడు అర్జునుడికి ఈ విధంగా చెబుతున్నాడు- దీనికి ఆరంభము ఎక్కడ అవుతుంది? ధ్యాయతో విషయాన్పుంసః- విషయముల గురించి ఆలోచిస్తే వాటిపై ఆసక్తి పుడుతుంది. ఆసక్తి నుంచి దానిపై కోరిక వస్తుంది ఇంకా ఈ కోరికలకు విఘ్నములు కలిగినప్పుడు క్రోధము వస్తుంది. క్రోధము ఎందుకు వచ్చిందంటే మనము ముందుగా విషయముల గురించి ఆలోచన చేశాము దానివల్ల కోరికలు వచ్చాయి అవి పూర్తి కాకపోవడంతో క్రోధము వచ్చింది. అందుకే దీన్ని ఆరంభము నుంచే ఆపాలంటే కోరికలను ఆపాలి, ఆసక్తిని ఆపాలి. క్రోధము నేరుగా రావడం లేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. క్రోధము వచ్చినట్లయితే దాని వేగాన్ని ఎట్లా ఆపాలి అన్న విషయం ఇంతకుముందు మనము చెప్పుకున్నాము. కాని దానికి శాశ్వతంగా ఇంధనం దొరకకుండా చేయాలి. కామము, క్రోధము నుంచి మనము రక్షించుకోలేకపోయినట్లైతే ఏమవుతుంది?
క్రోధాద్భవతి సమ్మోహః- అర్జునా, క్రోధము వలన సమ్మోహము ఉత్పన్నము అవుతుంది. వాస్తవానికి ఈ మోహభావము క్రోధము, లోభము, మమత మరియు కోరికల నుంచి పుడుతుంది. కోరికలు పెరిగినా బుద్ధి మొహానికి గురవుతుంది, లోభము పెరిగినా బుద్ధిలో మోహము వస్తుంది, మమత పెరిగినా బుద్ధిలో మోహము వస్తుంది ఇంకా కోరికలు పెరిగినా మోహము వలన బుద్ధిలో వివేక శక్తి నశిస్తుంది.
ఈ కోరికలను తీర్చుకోవడానికి మనము చెడ్డ పనులను చేయడానికి కూడా వెనుకాడము. కోరికలను తీర్చుకోవడానికి అన్యాయ పూర్వకమైన ఏ పనులైతే చేయకూడదో వాటిని చేసేస్తాము. క్రోధముతో వచ్చిన సమ్మోహము వలన మనుషులు ఇటువంటి మాటలు మాట్లాడతారు, పనులు చేస్తారు. ఇవి మన పెద్దవారితో, మనకు ఆధరణీయులు అయిన వారితో చేయకూడనివి, కాని క్రోధము వలన జరిగిపోతుంటాయి.
క్రోధము వలన అనవసరమైన మాటలు మాట్లాడతారు. లోభము వలన మనుషులలో సత్యము-అసత్యము, ధర్మము-అధర్మము వంటి వాటి పై వివేకము పోతుంది. ఈ మోహం కలగడం వల్ల వారు అధర్మమును ధర్మముగా చెబుతారు, అసత్యమును సత్యముగా చెబుతారు. తమ లోభమును పూర్తి చేసుకోవడానికి తత్వమును వక్రీకరించి చెబుతారు. మమత వలన ఉత్పన్నమైన సమ్మోహము వలన వ్యక్తిలో పక్షపాత బుద్ధి వస్తుంది. ఎవరైనా వ్యక్తిపై మనకు మోహము ఉంటే అతడు తప్పు చేసినా మనము అతని వైపే ఉంటాము మరియు సత్యము వైపు ఉన్న వ్యక్తిని తప్పని చెబుతాము.
ఇక్కడ భగవంతుడు క్రోధము వలన వచ్చిన సమ్మోహము గురించి మాత్రమే చెప్పాడు. మమత, కోరికలు మరియు లోభము వల్ల వచ్చిన సమ్మోహము గురించి చెప్పలేదు. ఎందుకంటే అవి మూడు స్వార్థముతో కూడినవి. ఈ మూడింటి వల్ల అనిష్టము ఎక్కువగా ఉంటుంది. క్రోధము వలన అవతలి వారిపై అనిష్టము కూడా ఉండవచ్చును అందువలన అది ఎక్కువ భయంకరమైనది. అందుకే భగవంతుడు దాని యొక్క చింతన ఎక్కువగా చేశాడు.
భగవంతుడు క్రోధము వస్తూనే బుద్ధిలో మూర్ఖత వస్తుందని, తప్పు ఒప్పుల వివేకము పోతుందని, చిన్న పెద్ద అన్న వివేకం కూడా పోతుందని, ఏ వ్యక్తి నాకు ఎక్కువ ఉపకారి అని, అతడు ఇప్పటివరకు నాకు ఎంత ఉపకారము చేసి ఉన్నాడని ఆలోచించకుండా అతడి గురించి చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అతడి ఉపకారముల కారణముగా ఎవరినైతే నేను స్తుతించాలో వారితో ఈ క్రోధము వలన కలిగిన సమ్మోహముతో నేను తప్పు మాటలు మాట్లాడటానికి సిద్ధమవుతున్నాను.
మోహము కలిగినప్పుడు మూర్ఖత వలన స్మృతి నశిస్తుంది, అంటే శాస్త్రంలో ఇచ్చిన ప్రకారం ఏ సద్విచారములను నేను పాటించాలని అనుకున్నానో వాటన్నింటినీ మరచిపోతాను. నేను అలా మాట్లాడను, అలా చేయను అని ప్రతిన చేసినప్పటికీ ఆ మాటలు నా స్మృతిలోంచి వెళ్లిపోతాయి. నన్ను నేను ఉద్ధరించుకోవాలి కాని ఇక్కడ నన్ను నేను నాశనం చేసుకుంటున్నాను.
స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో- ఈ విషయము నుంచి చెదిరిపోయి మనల్ని మనము నాశనం చేసుకుంటున్నాము. స్మృతి నశించి పోవడంతో బుద్ధిలోని వివేకము కూడా నాశనము అయిపోతుంది. ఎవరైనా మంచి మాట చెప్పినా, మనము వారితో గొడవ పడతాము, వారు మన మంచి కోసం చెప్పినా వారిని శత్రువుగా చూస్తాము, వారితో ఇంకా విపరీతమైన మాటలు మాట్లాడతాము ఎందుకంటే బుద్ధి నాశనం అయిపోయింది. వారు నా హితము కోరి నా ఎదురుగా వచ్చినా వారిపై మనము శత్రుత్వముతో వ్యవహరిస్తాము. ఎందుకంటే బుద్ధి నాశనము అయిపోయింది.
బుద్ధినాశాత్ప్రణశ్యతి- బుద్ధి నాశనము కావడం వల్ల వివేకహీనుడైన మనిషి తన స్థితి నుంచి పతనమవుతాడు అని భగవంతుడు చెబుతున్నాడు.
విషయముల గురించి ధ్యానము చేసినట్లయితే రాగము పుడుతుంది. రాగముల నుంచి కోరికలు ఉత్పన్నము అవుతాయి. కోరికలలో విఘ్నములు కలిగితే క్రోధము వస్తుంది. క్రోధములో విఘ్నము వచ్చినట్లయితే సమ్మోహము కలుగుతుంది. బుద్ధిలో మోహము వస్తే బుద్ధిలోని స్మృతి నాశనము అవుతుంది. స్మృతి నాశనము అయితే మనిషి పతనమైపోతాడు. ఇదంతా ఒక క్రమము, ఎల్లప్పుడూ ఒకే విధంగా జరుగుతుంది. మధ్యలో దేనినీ తీసే వీలు లేదు.
ధ్యానము నుంచి బుద్ధి నాశనం వరకు ఒక చక్రం. ఇక్కడ ఏ బిందువు దగ్గర కొంచెం చేతనము వస్తుందో అక్కడ వెంటనే భగవంతుని స్మరించుకొని అక్కడి నుంచి తిరిగు దారిలో వెళ్లాలి. లేకపోతే పతనమనేది ఖశ్చితంగా జరుగుతుంది. ఒక సుందరమైన భజన ఈ విధంగా ఉన్నది-
మన జీవితాలు అలాగే వెళ్ళిపోతున్నాయి. చేతన వచ్చినప్పుడు మేలుకొని జాగ్రత్త పడాలి. లేకపోతే విషయములపై ధ్యానముగా చింతన చేయడం నుంచి మన నాశనం వరకు ఈ ప్రక్రియ ప్రారంభమైపోతుంది. భగవంతుడు ఇంకా ఇలా చెబుతున్నాడు-
రాగద్వేషవియుక్తైస్తు, విషయానిన్ద్రియైశ్చరన్৷
ఆత్మవశ్యైర్విధేయాత్మా, ప్రసాదమధిగచ్ఛతి৷৷64॥
ఎవరికైతే అంతః కరణము వారి వశములో ఉంటుందో, ఎవరికైతే మనసు మరియు బుద్ధిపై నియంత్రణ ఉంటుందో వారికి పతనము జరగదు. ఉత్తమ సాధువు హల్వా తింటారు మరియు మనము కూడా హల్వా తింటాము. కాని మనది, వారిది స్థితి ఒకలా ఉండదు. వారి మనసు దానిలో చిక్కుకోదు కాని మన మనసు అందులో ఇరుక్కుపోతుంది. భోగములు అనుభవించడంలో సమస్య లేదు, సమస్య అంతా మనసు వాటిలో ఇరుక్కుపోవడం లోనే ఉంది.
బ్రహ్మలీన పరమ శ్రద్ధేయ స్వామీ రామసుఖ దాస జీ మహారాజ చెక్కతో చేసిన కాష్ఠ పాత్రలో భోజనము చేసేవారు. ఆయనకు ఏడు ఇళ్ల నుంచి బిక్ష వచ్చేది. ఏ ఇంటిలో అయితే ఎవరికి గర్భపాతము కాలేదో, ఏ ఇంటిలో అయితే ఎవరూ కూడా కుటుంబ నియంత్రణ చేయించుకోలేదో అటువంటి ఏడు ఇళ్ల నుంచి కొంతమంది కూరలు, కొంతమంది మిఠాయిలు పంపిస్తూ ఉండేవారు. ఆయన శిష్యులు పూరీపై కూర, దానిపై పరమాన్నము, దానిపై మిఠాయిలు వేసి ఇస్తే ఆయన ఒక చెక్క స్పూన్ తో తినేవారు. తినే స్పూనులో ఏమి వస్తోందన్న ఆలోచన ఆయనకు కలిగేది కాదు. ఈ విషయము నుంచి స్వామీజీ భోజనము మరియు మన భోజనము ఒకటా కాదా అన్నది అర్థము చేసుకోండి.
ఒకసారి ఒక దార్శికుని ఎవరో ధనము మంచిదా లేక చెడ్డదా అని అడిగారు. దానికి ఆ దార్శనికుడు ధనము మంచి సేవకుడు మరియు చెడ్డ యజమాని అని సమాధానం చెప్పారు.
ఎవరి జీవితములో అయితే ధనమే ప్రధానంగా ఉంటుందో, వారికి తండ్రి, అన్నా ఎవరు పట్టరు. రూపాయలు అన్నింటికన్నా ఎక్కువ అవుతాయి. అటువంటి సిద్ధాంతము ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారి జీవితము నాశనము వైపు ఉంటుంది. జీవితమంతా వారు సుఖము కోసము పరిగెడుతూ ఉంటారు, కాని వారికి సుఖము దొరకదు.
ప్రసాదమధిగచ్ఛతి- అంటే అన్ని విషయములు ప్రసన్నతతో చెప్పు అని అర్థము. మనం గుడికి వెళ్ళినప్పుడు పూజారి మనకు ప్రసాదాన్ని ఇస్తారు. ఒక్కోసారి లడ్లు, ఒక్కోసారి కోవా దొరుకుతుంది. ఎప్పుడైనా అన్నదానము జరిగినప్పుడు అక్కడ అన్నము, పరమాన్నము ఉంటాయి. అన్నదానంలో వడ్డించిన భోజనం యొక్క రుచి వేరుగానే ఉంటుందని చాలామంది చెప్పగా మీరు విని ఉంటారు. ఇటువంటి భోజనము ఇంకెక్కడా ఉండదని అంటారు. ప్రసాదమునకు అర్థము ప్రసన్నత అయితే మరి గుడిలో ఇచ్చిన లడ్డుని ప్రసాదము అని ఎందుకు అన్నారు? అది వస్తువు. ఆ వస్తువుతో ప్రసన్నతకు ఉన్న సంబంధము ఏమిటి? ఎప్పుడు ప్రసాదము దొరికినా మనకు చాలా బాగా అనిపిస్తుంది అన్నది అనుభవంలోకి వచ్చినది. అనగా భగవంతునికి నివేదించి ఆయన ప్రసన్నతను మనము గ్రహణము చేస్తాము, అందువల్ల మనకు ప్రసన్నత దొరుకుతుంది.
చాలామంది తాము బట్టలను కుట్టించుకునే ముందు అదే థాను నుంచి ముందు భగవంతునికి బట్టలు కుట్టిస్తారు. భగవంతునికి ఆ బట్టలను సమర్పించిన తర్వాత తాము స్వయంగా వస్త్రములను తొడుక్కుంటారు. ఇప్పుడు ఈ వస్త్రములు భగవంతుని ప్రసాదం అయిపోతాయి.
మనము భోజనము వండుకుంటాము, దాన్ని భగవంతుని ముందు పెట్టి, గంట కొట్టి, భోజన మంత్రములను చదివి, దాన్ని మిగతా భోజనంతో కలిపి వేస్తాము. వండుకున్న వంట నేరుగా తిన్నట్లయితే అది భోజనం అవుతుంది. అదే భోజనాన్ని భగవంతునికి నివేదించినట్లయితే, అది ప్రసాదమవుతుంది. భగవంతుడు మనకు ఇచ్చినది ఆ భగవంతుని ప్రసాదం అవుతుంది.
గోస్వామి గారు ఇలా అన్నారు-
ప్రభు ప్రసాద పట భూషన ధరహిం
ఈరోజు ప్రసాదములో రుచి తక్కువ ఉన్నదని ఎవరైనా అంటే, వేరొకరు ప్రసాదములు రుచి చూడకూడదు అంటారు. ఈ విధముగానే భర్త, భార్య, కొడుకు, కూతురు కూడా ప్రసాదముగా దొరికిన వారే. ఎలా ఉన్నా అది చాలా బాగున్నట్లు. మన చుట్టూ ఉన్న వారందరూ ఆ భగవంతుని ప్రసాదమే.
భగవంతుడు రాముడిని వెనక్కు తీసుకురావడానికి భరతుడు చిత్రకూటమునకు వెళ్లాడు. భగవంతుడు రాముడు వెనక్కి రానప్పుడు భరతుడు ఆయన చరణ పాదుకులను ప్రసాదముగా కోరాడు మరియు వాటిని ఆయన తన తలపై ఉంచుకొని తీసుకువెళ్లాడు. నంది గ్రామములో భగవంతుని సింహాసనంపై వాటిని ఉంచి 14 సంవత్సరముల వరకు అయోధ్య రాజ్యమును నడిపించాడు. ఆ భగవంతుని ప్రసాద రూపములో మనము గ్రహించేవన్నీ మనకు ప్రసన్నతను ఇస్తాయి.
ప్రసాదే సర్వదుఃఖానాం(మ్), హానిరస్యోపజాయతే৷
ప్రసన్నచేతసో హ్యాశు, బుద్ధిః(ఫ్) పర్యవతిష్ఠతే৷৷65॥
ప్రసాదములో రుచి చూడకూడదు అన్న భావము మనసులో ఉంచుకుని ఏది దొరికినా అది భగవంతుని ప్రసాదము అనుకుంటే జీవితంలో ఏదీ చెడ్డగా అనిపించదు. జీవితాల్లో దారుణమైన సంఘటనలు జరిగిన సాధకులు కూడా ఉంటారు. మనతో దుఃఖము పంచుకోవడానికి ఇతరులు వస్తూ ఉంటారు, వచ్చి మరేమీ పరవాలేదు అంటారు. భగవంతుని ఇచ్ఛ ప్రకారమే జరిగిందంటారు. ఇందులో కూడా భగవంతుడు కొంత మంగళకరమైనది చేసి ఉంటాడు. కొడుకు చనిపోయినప్పుడు భగవంతుడు మంచి చేశాడు అన్నది ఎవరో మహా పురుషులు మాత్రమే చెప్పగలరు. భగవంతుడు చేసేవన్నీ అందరి మంచి కోసమే చేస్తాడు అన్న భావనను ఉంచుకుంటే జీవితంలో దుఃఖములేమీ మిగలవు. ఏ బాధకు కారణము మిగలదు. ఇదే సూత్రము. భగవంతుడు నా కోసము ఏదైతే సునిశ్చితము చేసాడో అది నాకు కళ్యాణకారకము. ఆ సమయంలో నేను ఎంతో కంగారు పడ్డాను కాని జరిగినదంతా మంచి కోసమే జరిగిందని మనమందరము అంటూ ఉంటాము. ఏ విషయాలనైతే మనము భయంకరమైనవి అని నమ్మామో, అవే తరువాత బాగా అనిపిస్తుంటాయి. ప్రసన్నత అన్ని దుఃఖములను నాశనము చేస్తుంది. అనుకూలత-ప్రతికూలతలను గురించి ఆలోచించకూడదు.
మోసము ద్వారా పాండవుల సంపదనంతా లాక్కున్నప్పుడు ద్రౌపది మీరు ఎంతో ధర్మశీలురు, దీనివల్ల మీకు ఏమి దొరికింది? అని యుధిష్ఠిరుడుని అడిగింది.
నాకు మంచే జరగాలన్న ఉద్దేశంతో నేను ధర్మాన్ని పాటించడం లేదు. ధర్మాన్ని పాటించాలి కాబట్టి అలా చేశాను. దీని పరిణామము బాగుంటుందా లేక చెడుగా ఉంటుందా అన్న ఆలోచన ఈరోజు ఎందుకు చేయాలి? ఇప్పుడు ఉన్నది అన్నింటికన్నా మంచిది. ముందు ముందు కూడా ఏమి జరిగినా అది మంచే అవుతుంది అని యుధిష్ఠర మహారాజు అన్నాడు. ధర్మాన్ని పాటించడంలో అనుకూలత-ప్రతికూలత గురించి ఆలోచించకూడదు.
ప్రసాదాన్ని పంటికి తగలనివ్వకని గురుద్వారాలలో ఒక సామెత ఉంటుంది. దీని మూల అర్థము అందులో ఉన్న పదాల నుంచి వచ్చినది కాదు. దీని అర్థము మంచి, చెడుల గురించి ఆలోచన చేయవద్దని. ప్రసాదములో ప్రపంచ భావన సమాప్తం అయిపోతే కళ్యాణ భావము వస్తుంది. జీవితంలో ఏమేమి జరుగుతున్నాయో వాటిలో భగవంతుని కృప ఎంతో ఉంటుంది అంటూ భావించాలి.
తేరే ఫూలోం సే భీ ప్యార,
తేరే కాఁటోం సే భీ ప్యార।
సీతారామ సీతారామ కహియే,
జాహి విధి రాఖే రామ,
తాహి విధి రహియే।
నా మనసుకు అనుకూలముగా వస్తే మంచి విషయము. అనుకూలముగా లేకపోతే ఇంకా మంచి విషయము. ఎందుకంటే అది వారి మనసులోని భావము అయిపోయింది. వారు నిశ్చితము చేసుకున్నవి అన్నీ కళ్యాణదాయకమైనవి. ఈ భావముతో ఉన్నట్లయితే ఏ దుఃఖములు కాని లేదా బాధలు కాని మిగలవు. భగవంతుడు నాకు ఏమి చేసినా అది నా మంచికే.
నాస్తి బుద్ధిరయుక్తస్య,న చాయుక్తస్య భావనా৷
న చాభావయతః(శ్) శాన్తిః(ర్),అశాన్తస్య కుతః(స్) సుఖమ్৷৷66॥
ఎవరి మనసులో అయితే శాంతి ఉండదో వారికి సుఖము ఉండదు. ఎవరి మనసులో అయితే భగవంతుని భావన ఉండదో వారి మనసులో శాంతి ఉండే అవకాశమే లేదు. అప్పుడప్పుడు ఎవరింట్లో అయినా యాక్సిడెంట్ వల్ల కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే భగవంతుడి చిత్రపటాలను, విగ్రహాలను మాకు దీనివల్ల జరిగినది ఏమిటని తీసి బయట పెట్టేస్తుంటారు. వారి బుద్ధి ఎటువంటిది?
అన్ని మంచి జరగాలని మాత్రమే భగవంతుడికి పూజ చేస్తున్నారు. మంచి జరగకపోతే భగవంతుణ్ణి మార్చేస్తుంటారు. ఇది బుద్ధులోని కృపణత (లోభము). వారి బుద్ధి భగవంతునితో కాక, సుఖముతో ముడిపడి ఉంది. సుఖము దొరికితే భగవంతుడు ఉన్నట్లు మరియు సుఖము దొరకక పోతే భగవంతుడు లేనట్లు. ఈ సంసారంలోని అనుకూలత-ప్రతికూలత, రెండు కూడా అశాంతిని ప్రధానము చేస్తాయి.
భార్యాభర్తలు ఇరువురూ పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్లారు. సినిమా చూస్తూ ఉండగా భార్యకు నేను గ్యాస్ పొయ్యి కట్టానా లేదా అన్న అనుమానము వచ్చింది. అప్పుడు ఆమెకు సినిమా చూడటం వల్ల సుఖము దొరకడం లేదు, మనసులో అశాంతి ఉన్నది. ఆమెకు ఇప్పుడు అక్కడ కూర్చోవడం కూడా కష్టంగా మారింది. సాధ్యమైనంత వరకు సినిమాను వదిలిపెట్టి ఇంటికి వెళ్లాలని ఆలోచిస్తోంది. మనసులో శాంతి ఉన్నప్పుడే అన్ని సుఖాలు దొరుకుతాయి.
అశాన్తస్య కుతః సుఖమ్- అందుకే సంసార సుఖాలలో శాంతి ఎప్పుడూ లభించదు.
మూడు రకాల జీవనశైలులు ఉంటాయి. ఒకటి నికృష్టము, రెండవది మధ్యమము మరియు మూడవది ఉత్కృష్టము.
నికృష్ట శైలి- ఇక్కడ ఆదాయము తక్కువ ఖర్చు ఎక్కువ ఉంటుంది. 50 పైసలు సంపాదిస్తే రూపాయి ఖర్చు పెడతారు. ఒక వ్యక్తి బ్యాంకు నుంచి అప్పు తీసుకొని ఎంతో అందమైన ఇల్లు కట్టాడు. అనుకున్నది 10 లక్షలయితే 25 లక్షలు ఖర్చు పెట్టాడు. రోజు రోజు ఇల్లు ఎవరు కడతారని అనుకున్నాడు. రోజూ కానప్పటికీ ఒకరోజు మాత్రం ఇలా ఎందుకు చేయాలి? అటువంటి వ్యక్తికి సుఖము కాని శాంతి కాని దొరకవు.
మధ్యమ శైలి- డబ్బు బాగా ఆర్జిస్తాడు అలాగే ఖర్చు కూడా బాగా పెడతాడు. సుఖాలు అధికంగా ఉంటాయి కాని అప్పుడు కూడా శాంతి లభించదు. జనులు ఎంత అధికముగా సుఖానికి కావలసిన సాధనాలను పోగు చేసుకుంటారో జీవితంలో అంతే ఉద్రిక్తత పెరుగుతుంది. రక్తపోటు వ్యాధి పేదవారిలో కనిపించదు. ఇది రాజ రోగము. సంపద పెరిగిన కొలది శాంతి దూరమవుతుంది.
ఉత్కృష్ట శైలి- తక్కువ ఆదాయము మరియు తక్కువ ఖర్చు. ఇది శాంతిని, సుఖాన్ని ఇస్తుంది. చాలామంది చెబుతుంటారు ఈ పని చేస్తే చాలా డబ్బు వస్తుందని, అని అటువంటి వారి ఆవశ్యకత ఏమీ లేదు.
మన దగ్గర ఎవరైనా సాధువు-సన్యాసి కావాలి అనుకుంటే, ఆరంభంలో వారితో కఠిన ఉపవాసము, నియమపాలన చేయిస్తారు. గురువులు ఆ వ్యక్తి యొక్క సహనాన్ని కూడా పరీక్షిస్తారు మరియు ఎప్పుడైనా తక్కువ దొరికినా దానితోనే అతడు గడుపుతాడు అన్న విషయాన్ని నిశ్చితం చేసుకుంటారు. కటిక నేలపై కూడా తేలికగా నిద్రించ గలుగుతారు. కొన్ని రోజులపాటు తినడానికి ఏమీ దొరకకపోయినా దానిని సహించగలిగిన శక్తి ఉందా లేదా అన్నది చూస్తారు. లేకపోతే సాధువు అవ్వడానికి అనర్హుడు.
తక్కువ డబ్బు ఉన్న రోగి నిరాశకు గురయ్యే అవకాశం లేదు. ఎవరి దగ్గర అయితే ధనము-సుఖము అధికముగా ఉంటాయో వారి నిరాశాగ్రస్తులు అవుతారు. సుఖముల కోసము శాంతిని కాకుండా, శాంతి కోసం సుఖములను త్యాగము చేయాలి. మనము దీనికి విపరీతముగా చేస్తాము. సుఖము కోసము శాంతిని త్యాగము చేస్తాము. రాత్రి నిద్రను త్యాగం చేస్తాము. ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడవేస్తాము.
మన కన్నా సంపన్నుల దగ్గర ఉన్న సుఖాలను చూసి మనము వారిపై ఈర్ష పడతాము. ఇతరులలో ఉన్న అశాంతిని చూడగలిగినట్లయితే ఎప్పుడు మన మనసులో అశాంతి కలుగదు.
ఇన్ద్రియాణాం(మ్) హి చరతాం(య్ఁ), యన్మనో౽నువిధీయతే৷
తదస్య హరతి ప్రజ్ఞాం(వ్ఁ), వాయుర్నావమివామ్భసి॥2.67॥
మన మనసు ఎల్లవేళలా అన్ని విషయాలపై ఆసక్తితో ఉండదు. ఒక సమయంలోనే మనము కంటి ద్వారా రసాన్ని ఆస్వాదిస్తున్నాము, ముఖం ద్వారా కూడా రసాన్ని తీసుకుంటున్నాము అంటూ ఉండదు. భగవంతుడు చెబుతున్నది ఏమిటంటే ఏ సమయంలో నీవు ఏ ఇంద్రియము ద్వారా ఏ విషయము యొక్క ఆనందము పొందుతున్నావో అదే నిన్ను ముంచి వేస్తుంది. మనసు ఎక్కడ ఏ ఇంద్రియముతో ఇరుక్కుంటుందో, అక్కడే దాని పతనము అవుతుంది.
బ్రహ్మలీన స్వామీ శరణానన్ద జీ మహారాజ గారు ఇచ్చిన సూత్రము ప్రకారము దేనిపైనైతే దృష్టి పెడతారో, దానికి మనసు ఇవ్వవలసి ఉంటుంది. అనగా అన్నిటితో మీ దృష్టిని పంచవద్దు. మనము దీనికి విపరీతముగా చేస్తాము. కళ్ళతో అన్ని వైపులా చూస్తూ, ఎటువైపు చూస్తున్నాయో అక్కడ ఉన్న అన్ని వస్తువులను అత్యధిక ధ్యానముతో చూస్తాము. వెళ్లి అన్ని వస్తువుల అవలోకనము చేస్తాము. మన ఫోను స్క్రీన్ కూడా ఆవశ్యకత కన్నా అధికముగా చూడవద్దన్నది గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఏ ఇంద్రియములతో మన మనసు ఇరుక్కుని ఉంటుందో అదే మనల్ని ముంచి వేస్తుంది.
తస్మాద్యస్య మహాబాహో, నిగృహీతాని సర్వశః৷
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యః(స్),తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా৷৷68॥
యా నిశా సర్వభూతానాం(న్), తస్యాం(ఞ్) జాగర్తి సంయమీ৷
యస్యాం(ఞ్) జాగ్రతి భూతాని, సా నిశా పశ్యతో మునేః৷৷69॥
చిన్నపిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ చెత్తకుండీ దగ్గరకు చేరుకుంటాడు. దాని నుంచి కొంత చెత్తను తీసి దానితో ఆడుతుంటాడు. రెండో పిల్లవాడు వచ్చి మొదటి వాని నుంచి ఆ చెత్తను లాక్కుంటుంటాడు. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య చెత్తను తీసుకోవడానికి తగువు మొదలవుతుంది మరియు ఇద్దరు పిల్లలు ఏడుస్తుంటారు. తల్లి వచ్చి ఇది చెత్త అని, బొమ్మలతో ఆడుకోమని నచ్చచెబుతుంది. దానికి పిల్లలు ఇద్దరు ఒప్పుకోరు. అది చెత్త అన్న విషయం పిల్లలిద్దరికీ అర్థము కావడం లేదు. వారికి కేవలం అది కావాలి.
ఇదే విధముగా మనము జీవితమంతా ఈ సంసారంలోని భోగములపై వెచ్చిస్తాము. యోగులు ఇది అంతా చెత్త అని, వీటిని వదిలిపెట్టమని చెబుతున్నారు. మనం ఇది చాలా మంచిదని చెబుతాము. యోగి మాత్రము ఇది మంచిది కాదని చెబుతాడు. ఇది నీ మనసును బంధిస్తుంది మరియు ఆ కోరికలలో కట్టి పడేస్తుంది. కోట్ల జన్మల నుంచి ఇదే చక్రము తిరుగుతోంది, ఇందులోనే తిరుగుతూ ఉంటావు.
పునరపి జననం పునరపి మరణం,
పునరపి జననీ జఠరే శయనమ్।
సంసారము దుఃఖాలయము మరియు సంసార రూప దుఃఖములో మళ్లీ మళ్లీ దారితప్పి తిరుగుతూ ఉంటావు, అందులో నుంచి బయటపడు. ఎవరైతే సంయమనముతో ఉంటారో వారికి సంసారంలోని ఈ భోగములన్నీ చీకటి సమానంగా కనిపిస్తాయి. అతడి అవస్థను చూసి అతడికి ఏమీ తెలియదని అనుకుంటుంటారు. ఈయన ఇక్కడే కూర్చుని ఉంటారు, ఈయన ఆశ్రమంలో ఫ్యాను గాని, ఏసీ గాని లేవు, ఈయనకు సుఖం అంటే ఎలా తెలుస్తుంది? ఈయన మంచి పదార్థములు కూడా తినరు. ఈయన ఎండిపోయిన రొట్టెలను తింటాడు, ఈయనకు సుఖముల గురించి ఏమి తెలుసును? ఈయన మహాత్ముడు, ఈయనకు ఏమీ తెలియదు అనుకుంటుంటారు. నిజానికి ఈయనకు అన్నీ తెలుసు కాని ఈయనకు ఇవన్నీ చెత్తగా అనిపిస్తాయి. ఏ విషయంలో సంసారికి సుఖము దొరుకుతుందో ఆ సుఖములు యోగికి రాత్రితో సమానము మరియు ఏ విషయములతో యోగికి సుఖము దొరుకుతుందో అవి మిగిలిన మనుషులందరికి రాత్రితో సమానము.
జాగర్తి ప్రథమ వచనములో వస్తుంది. తస్యాం జాగర్తి సంయమీ-యోగి మేల్కొంటాడు- అందువలన ఇది ఏక వచనము. యస్యాం జాగ్రతి భూతాని- అనగా ఇక్కడ అందరూ మేల్కొంటారు. ఇది బహువచనము, రెండింటి అర్థము ఒక్కటే.
మోహ నిశా సబ సోవన హారా,
దేఖహిం స్వప్న అనేక ప్రకారా
జేహి జగ జఙ్గమ జాగహి జోగీ
పరమారథీ ప్రపఞ్చ వియోగీ।
ఎవరైతే మోహము యొక్క మత్తులో ఉన్నారో వారందరూ నిద్రలో ఉన్నారు. ఆ మోహము అనే అంధకారములో వారందరూ సుఖము అనే స్వప్నములను చూస్తున్నారు.
ఆపూర్యమాణమచలప్రతిష్ఠం(మ్),
సముద్రమాపః(ఫ్) ప్రవిశన్తి యద్వత్৷
తద్వత్కామా యం(మ్) ప్రవిశన్తి సర్వే,
స శాన్తిమాప్నోతి న కామకామీ৷৷70॥
భగవంతుడు మూడు స్థితులను గురించి చెప్పాడు-
1. కోరికలు ఉన్నాయి, భోగములు అందుబాటులో లేవు
2. కోరికలు ఉన్నాయి, భోగములు కూడా అందుబాటులో ఉన్నాయి
3. కోరికలు లేవు, భోగములు మాత్రము అందుబాటులో ఉన్నాయి- ఇది యోగి యొక్క స్థితి
ఒకసారి మహాత్ముడు బుద్ధుని యొక్క ఒక శిష్యుడు రెండవ శిష్యుడ్ని గట్టిగా పట్టుకొని లాక్కుని వస్తున్నాడు. లాక్కురాబడుతున్నవాడు పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు. బుద్ధుని దగ్గరకు వచ్చిన తరువాత మొదటివాడు ఇతడిని వెంటనే మఠం నుంచి వెళ్ళగొట్టండి అని చెప్పాడు. మహాత్ముడు ఎందుకని అడుగగా, ఇతడు ఎంతో భయంకరమైన అపరాధము చేసాడు అని చెబుతాడు. ఇతడు మీరు పెట్టిన నియమాలను ఉల్లంఘించాడు, ఇతడిని వెంటనే వెళ్ళగొట్టండి.
మీరు స్త్రీ స్పర్శను నిషేధించారు. ఇతడు ఒక స్త్రీని తన భుజములపై మోసుకొని తీసుకువచ్చాడు. బుద్ధుడు రెండవ శిష్యుడ్ని అసలు విషయం ఏమిటో నీవు చెప్పు అని అడిగారు. అతడు దానికి అసలు విషయము ఏమీ లేదు. ఒక స్త్రీ మునిగిపోతోంది. మునిగిపోతున్నది స్త్రీనో లేక పురుషుడో కూడా నాకు తెలియదు. నేను ఆమెను రక్షించడానికి నదిలోకి దూకాను. దగ్గరకు వెళ్ళిన తరువాత చూస్తే స్త్రీ అని తెలిసింది. ఆమె స్పృహ తప్పుతుంటే చూసి భుజాలపై వేసుకొని తీసుకువచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఆమెను భూమిపై పెట్టాను. ఆమె కొంచెం సరైన తర్వాత మేము వచ్చేసాము. ఇతడు ఏమేమి మాటలు నిరర్ధకముగా మాట్లాడుతున్నాడో తెలియదు.
అప్పుడు బుద్ధుడు నాకు ఇంకా వేరే ఏదో కనిపిస్తోంది అన్నాడు. ఇతడు స్త్రీని తీసుకువచ్చి అక్కడే దింపేశాడు కాని నీవు మాత్రం ఇంకా మోస్తూనే ఉన్నావు. ధ్యాన యోగ్యమైన విషయము ఏమిటంటే కోరికల యొక్క ప్రవృత్తి మహత్మపూర్ణమైనది, కేవలం వస్తువులే కాదు. ఏ కోరికలు లేకుండా ఇతడు స్త్రీని స్పర్శించాడు, కాని ఎవరైతే స్త్రీని స్పర్శించలేదో అతడి మనసులో వికారము ఉన్నది మరియు వికారము కారణముగా స్పర్శించనప్పటికీ అతడు ఆ భోగములో ఇరుక్కున్నాడు.
నది సముద్రాన్ని ప్రభావితము చేయదు మరియు యోగిని భోగములు ప్రభావితము చేయవు.
యోగి సముద్రానికి సమానమైన వాడు. ఎన్ని నదులు వచ్చి అందులో కలిసినా దానిలో ఏ విధమైన అలజడి కలుగదు.
విహాయ కామాన్యః(స్) సర్వాన్, పుమాంశ్చరతి నిఃస్పృహః৷
నిర్మమో నిరహఙ్కారః(స్), స శాన్తిమధిగచ్ఛతి৷৷71॥
ఏషా బ్రాహ్మీ స్థితిః(ఫ్) పార్థ, నైనాం(మ్) ప్రాప్య విముహ్యతి৷
స్థిత్వాస్యామన్తకాలే౽పి, బ్రహ్మనిర్వాణమృచ్ఛతి৷৷72॥
అర్జునుడు ఇలా అడిగాడు-
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ
భగవంతుడు దీని గురించి చెప్పడమే కాకుండా, దీని తరువాత వచ్చే విషయాలను గురించి కూడా చెప్పాడు. ఇంకా అంతకాలములో అతడు నాకు ప్రాప్తిస్తాడని కూడా చెప్పాడు. అన్ని షరతులను పూర్తి చేస్తే ఇక వారు మోహములో పడరు. భగవంతుడు ఆస్వాసన కూడా ఇచ్చాడు, ఎవరికి ఏది అంతిమ అభీష్టము అవుతుందో, అదే బ్రహ్మ నిర్వాణము అవుతుంది. అందరికీ బ్రహ్మ నిర్వాణము ఒకేలా ఉండదు. కొంతమందికి కైవల్యము కావాలి, కొంతమందికి ఆనందం కావాలి, కొంతమందికి మోక్షము కావాలి, కొంతమందికి నిర్వాణము కావాలి, కొంతమందికి వైకుంఠ నివాసము కావాలి.
భగవంతుడు చెప్పాడు- అన్ని సూత్రములను మనపై మనము సొంతంగా ప్రయోగించుకోవాలి. ఇవి వేరొకరిని అంచనా వేయడానికి కాదు. మనము అన్ని సూత్రములను వింటాము మరియు న్యాయాధీశులముగా ఇతడు ఈ విధముగా చేయడం లేదని మిగిలిన వారికి చెబుతాము. మన ఆలోచనలన్నీ వేరొకరి గురించి చేసినప్పుడే మొత్తం అంతా అలజడి అవుతుంది. సూత్రాలను మనపైనే ప్రయోగించుకోవాలి మరియు మన జీవితాన్ని ఉత్తమంగా చేసుకోవాలి అన్నది భగవంతుని అభిప్రాయము.
హరినామ సంకీర్తనతో ఈనాటి వివేచన సత్రము సమాప్తము అయినది.
ప్రశ్నోత్తరములు
ప్రశ్నకర్త- ఇందూ దీదీ
ప్రశ్న- మంచి, చెడు కుటుంబ సభ్యులలో మనము ఎవరికి తోడ్పాటు గా ఉండాలి?
సమాధానము- మనము ఇద్దరికీ తోడ్పాటు గానే ఉండాలి. ఇదే ధర్మ విషయము. ద్యూత క్రీడ కోసము ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడుని పిలిచినప్పుడు, అందరూ వారించినా యధిష్ఠిరుడు వినలేదు. ఆయన ఆజ్ఞను అవమానించడం అధర్మ విషయమని అన్నాడు. అంటే నేను అలా చేయలేను నేను వెళ్లవలసిందే. అధర్మం చేసేవారి కారణంగా మన కర్తవ్యం మారదు.
ప్రశ్నకర్త- ఇందూ దీదీ
ప్రశ్న- ఎవరైనా వ్యక్తి మన పై క్రోధము చూపిస్తే మనము ఏమి చేయాలి?
సమాధానము- ఎవరిలోనూ మార్పు తీసుకువచ్చే అధికారము మనకు లేదు. భగవంతుడు కేవలము ఆత్మ నియంత్రణ మరియు ఆత్మలో మార్పు కోసము చెప్పాడు. భగవంతుడు కూడా అర్జునునికి సమస్త జ్ఞానమును ప్రసాదించిన తరువాత ఇలా అన్నాడు-
ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా।
విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు।।18.63।।
యథేచ్ఛసి తథా కురు- అనగా నీవు కోరుకున్నట్లు చెయ్యి.
ప్రశ్నకర్త- దుర్గాప్రసాద్ భయ్యా
ప్రశ్న- సుఖము మరియు శాంతి ఒకదానికొకటి పూరకాలా లేక సరాసరి భిన్నమైనవా?
సమాధానము- రెండు వేరు. సుఖము వల్ల కలిగేది శాంతి మరియు శాంతి వలన కలిగేది సుఖము.
సుఖము వల్ల కలిగేది శాంతి- అనగా నాకు ఇది దొరికితే అప్పుడు నాకు శాంతి కలుగుతుంది. ఈ ప్రకారముగా శాంతి కోసం చేసే అన్వేషణ ఎప్పటికీ పూర్తి కాదు.
శాంతి వలన కలిగేది సుఖము- ఎవరికైతే ఏమీ అక్కరలేదో, ఎవరైతే శాంతముగా ఉన్నారో అందువలన వారు సుఖముగా ఉన్నారు.
ప్రార్థన, హనుమాన్ చాలీసా పఠనముతో ఈనాటి వివేచన కార్యక్రమము పరిపూర్ణమైనది.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం(య్ఁ) యోగశా
స్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే సాఙ్ఖ్యయోగో నామ ద్వితీయో౽ధ్యాయః॥२॥