विवेचन सारांश
సంసార వృక్షం గురించిన వివరణ

ID: 7987
तेलुगू - తెలుగు
శనివారం, 27 సెప్టెంబర్ 2025
అధ్యాయము 15: పురుషోత్తమ యోగము
1/2 (శ్లోకము 1-6)
వివేచకులు: గీతా విశారద డా. ఆశూ గోయెల్ గారు


హనుమాన్ చాలీసా, దైవ ప్రార్థనలతో దీపప్రజ్వలన జరిపి, ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకృష్ణ ప్రార్ధన శ్లోకాలతో, ఆశు గోయల్ జీ ఈనాటి వివేచనను ప్రారంభించారు. ఆ కృష్ణ భగవానుని కృపవలన, మనకు భగవద్గీతను నేర్చుకునేటటువంటి భాగ్యం కలిగినది. మనం మన మానవ జీవితాన్ని విజయవంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఇహలోకం మరియు పరలోక లక్ష్యాలను సాధించడానికి మరియు జీవిత రహస్యాలను అర్థం చేసుకోవడానికి భగవద్గీత శుద్ధ ఉచ్చారణతో నేర్చుకుంటున్నాము. మనం శ్రీ కృష్ణుని వైపు ఏ విధముగా ఆకర్షింపబడ్డామో మనకు తెలియదు. మనం ఈ జన్మలో చేసిన మంచి పనుల ఫలితం కానీ, లేదా పూర్వ జన్మలో ఎవరైనా సాధువు లేదా మహాత్ముల యొక్క కృప ఫలితం కావచ్చు. మనం గీతను ఎంచుకోలేదని కేవలం భగవద్గీత మాత్రమే మనల్ని ఎంచుకుందని మనం తప్పక సంపూర్ణంగా విశ్వసించవలెను. భగవద్గీతను చదివేవాడు భగవంతునికి అత్యంత ప్రియమైన వాడు అని సాక్షాత్ భగవానుడే చెప్పారు.
య ఇమం పరమం గుహ్యం, మద్భక్తేష్వభిధాస్యతి।
భక్తింమయి పరాం కృత్వా, మామేవైష్యత్యసంశయః ॥ 18.68 ॥
నా యందు పరమభక్తి గలిగి, ఈ పరమగోప్యమైన గీతోపదేశమును అనగా గీతాశాస్త్రమును నా భక్తుల హృదయములలో పదిలపఱచువాడు నన్నే పొందును. ఇందేమాత్రమూ సందేహము లేదు. దీనిని మనం కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చును. మీరు భగవద్గీతను ఒక 100 నుండి 200 మందికి ప్రచారం చేస్తే, అందులో 4 లేదా 5 మంది మాత్రమే భగవద్గీత నేర్చుకోవడానికి వస్తారు, అంటే వారి మనస్సులలో భగవంతుని పట్ల నమ్మకం ఉంది. దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చును, ఇది కేవలం భగవంతుని సంకల్పం వల్ల మాత్రమే జరుగుతుంది. భగవద్గీత గురించి వేదవ్యాస మహర్షి ఈ విధంగా చెప్పారు.
గీతా సుగీతా కర్తవ్యా, కిమన్యైః శాస్త్రవిస్తరైః ।
యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిఃసృతా ॥
భగవద్గీతను పఠించాలి, ఆచరించాలి. ఎందుకంటే అది స్వయంగా పద్మనాభుడైన శ్రీమహావిష్ణువు ముఖపద్మం నుండి ఉద్భవించింది. భగవద్గీతను పఠించిన వారు ఇతర శాస్త్రాలను విస్తారంగా అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవద్గీత అన్ని శాస్త్రాల మరియు ఉపనిషత్తుల సారం. గురుదేవులు ఒకసారి ఈ విధంగా అన్నారు.
సర్వోపనిషదో గావో, దోగ్ధా గోపాలనందనః ।
పార్థో వత్సః సుధీర్భోక్తా, దుగ్ధం గీతామృతం మహత్ ॥
భగవానుడు అన్ని ఉపనిషత్తులను గోవుగా చేసి, తానే స్వయంగా గోపాలుడుగా మారి, అర్జునుడిని దూడగా చేసి, పాలు పితికి, ఆ గీతామృతాన్ని భగవద్గీత రూపంలో సమస్త మానవాళికి అందించారు. ఈ భగవద్గీతను భగవానుడు 5300 సంవత్సరాలకు పూర్వం, సమస్త మానవాళి సంక్షేమానికై అందించారు. గీతా ప్రెస్ వ్యవస్థాపకులు జయదయాళ్ గోయందకాజీ భగవద్గీతను పరిచయం చేసినప్పుడు, అన్ని శాస్త్రాలను అధ్యయనం చేసిన తరువాత, భగవద్గీతను చదివి ఆయన ముందుమాటలో ఈ విధంగా రాశారు, "మానవజాతికి సంక్షేమాన్ని కలిగించే, ఇటువంటి అత్యంత సరళమైన గ్రంథం మరొకటి లేదు." ఇది కేవలం హిందువులకు సంబంధించిన గ్రంథం మాత్రమే కాదు, భగవద్గీతలో మొత్తం 39 భక్తుల లక్షణాలను గురించి తెలుసుకున్నాము. ఇవి కేవలం హిందూ సాంప్రదాయానికి సంబంధించిన లక్షణాలు కాదు. అన్ని భూతాల పట్ల ద్వేష భావన లేకుండా ఉండటం, అందరితో స్నేహపూర్వకంగా మెలగటం, అందరి పట్ల కరుణ చూపటం, సుఖదుఃఖాల పట్ల సమానంగా వ్యవహరించటం, వీటిలో ఉపాసన పద్ధతి లేదు. జీవన విధానాన్ని గురించి భగవానుడు వివరించారు. మనం మానవ జీవితాన్ని ఏ విధంగా గడపాలి, ఆలోచనలను ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలి, ఎటువంటి చర్యలను మరియు ప్రతిచర్యలను చేయాలి అని భగవానుడు వివరించారు, అందువల్లనే ఇది సమస్త మానవాళికి చెందిన గ్రంథం అయినది.
మనం గత రెండు వారాల్లో భక్తి యోగ వివేచన పూర్తి చేసాము. ఇది అత్యంత సుందరమైన అధ్యాయం. దీనిలో మనం భగవద్భక్తునికి ఉండవలసిన 39 లక్షణాలను గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు 15వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఇందులో కొన్ని శ్లోకాలు త్రిష్టుప్ ఛందస్సులో కలవు. సాధారణంగా భగవద్గీతలోని శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సులో ఉంటాయి. అనుష్టుప్ ఛందస్సు అనేది ఒక సాధారణ శ్లోక ఛందస్సు, ఇది రెండు లైన్లలో ఉంటుంది. ఇందులో ప్రతి శ్లోకం నాలుగు పాదాలను కలిగి ఉంటుంది మరియు ప్రతి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. ప్రతి శ్లోకంలో మొత్తం 32 అక్షరాలు ఉంటాయి. త్రిష్టుప్ ఛందస్సు భిన్నంగా నాలుగు లైన్లలో ఉంటుంది. ప్రతి పాదంలో 11 అక్షరాలు ఉంటాయి. కాబట్టి పూర్తి శ్లోకం 44 అక్షరాలను కలిగి ఉంటుంది.  సంస్కృతం ఒక శాస్త్రీయ భాష. ప్రపంచంలో ఇటువంటి భాష మరొకటి లేదు. సమస్త భాషలకు మూలం సంస్కృతం. ఆంగ్ల భాషలోని మూడు అనే సంఖ్యకు మూలం సంస్కృతం నుండి స్వీకరించబడినది. ఇది సంస్కృత భాషలోని త్రీ నుండి వచ్చింది. సంస్కృత భాషలోని త్రీ (3) అనేక శబ్దాలకు మూలం. త్రీ అనే శబ్దం నుండే తీన్, త్రై వంటి, మూడు అనే సంఖ్యకు సంబంధించిన అనేక శబ్దాలు, మాతృ అనే పదం నుండి మదర్, పితృ అనే పదం నుండి ఫాదర్ అనే పదాలు జనించాయి. ఇది అతి చిన్నదైన అధ్యాయం అయినప్పటికీ దీని మహిమ అద్భుతమైనది. ఒకవేళ మీకు భగవద్గీతను పారాయణం చేసే సాంప్రదాయం ఉన్నట్లయితే, మీకు ఇది తెలిసే ఉంటుంది. మన వద్ద సంపూర్ణ భగవద్గీత పారాయణం చేసే సమయం లేక కేవలం ఒక ఆధ్యాయాన్ని మాత్రమే పారాయణ చేయగలిగే సమయం ఉన్నట్లయితే, 15వ అధ్యాయానికి పారాయణ చేసే సాంప్రదాయం ఉంది. దీనిని ఎప్పుడు పారాయణ చేయాలి? భోజనం చేయడానికి ముందు కనుక మనం పారాయణ చేయాలి అనుకుంటే 15వ అధ్యాయాన్ని పారాయణం చేయాలి. ఎవరైనా చనిపోబోతుంటే, వారికి 15వ అధ్యాయాన్ని వినిపించవలెను. వివాహం చేసుకునే ముందు, ప్రసవం కాబోయే ముందు, ఎవరైనా మరణించిన పిదుప, మరణించే ముందు, జన్మించక ముందు, జన్మించిన తర్వాత, అనగా ఈ 15వ అధ్యాయం మన జీవితంలోని ఎటువంటి సందర్భంలో అయినా పారాయణ చేయుటకు ఉత్తమమైనది. ఎందుకు ఈ అధ్యాయం అన్నివేళలా పారాయణకు అనువైనది? ఎందుకంటే ఈ అధ్యాయం యొక్క చివరి శ్లోకంలో ఈ అధ్యాయం గురించి ఈ విధముగా వివరింపబడినది.
ఇతి గుహ్యతమం శాస్త్రమ్, ఇదముక్తం మయా౽నఘ|
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్, కృతకృత్యశ్చ భారత ।।15.20।।
ఓ పుణ్యపురుషా! ఓ అర్జునా! అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్త్వమును తెలిసికొనిన మనుష్యుడు జ్ఞానియై కృతార్థుడు కాగలడు. ఈశ్వరుడు, ప్రకృతి మరియు జీవుడు ఈ మూడింటి గురించి, ఈ అధ్యాయంలో వర్ణింపబడినది మరియు భగవంతుడు తన అత్యున్నత రూపాన్ని ఈ అధ్యాయంలో వెల్లడించారు. అందువలనే దీన్ని పురుషోత్తమ యోగం అని అన్నారు.

15.1

శ్రీ భగవానువాచ
ఊర్ధ్వమూలమధః(శ్) శాఖమ్,అశ్వత్థం(మ్) ప్రాహురవ్యయమ్।
ఛన్దాంసి యస్య పర్ణాని,యస్తం(వ్ఁ) వేద స వేదవిత్॥15.1॥

శ్రీ భగవానుడు పలికెను - ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్యశాఖగా(కాండముగా), వేదములే పర్ణములు(ఆకులు)గా గల ఈ సంసారరూప-అశ్వత్థవృక్షము నాశరహితమైనది(శాశ్వతమైనది). ఈ సంసార వృక్షతత్త్వమును మూలసహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎఱిగిన వాడు.

ఊర్ధ్వమూలమధః శాఖమ్,అశ్వత్థం ప్రాహురవ్యయమ్: ఈ శ్లోకంలో భగవానుడు ఈ విధంగా చెబుతున్నారు, "మూలమే పరమేశ్వరుడుగా, బ్రహ్మయే కాండముగా కల అశ్వత్థ వృక్షమే నాశనం లేని ఈ సంసారంగా చెప్పబడుచున్నది. వేదాలు దాని ఆకులుగా పరిగణింపబడుతున్నాయి. సంసార వృక్షములు మూలము నుండి తెలుసుకున్నవాడు వేదాలను సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు." మనలో ఎంత మంది దీనిని అర్థం చేసుకోగలిగారు? కేవలం శ్లోకాలు చదవడం ద్వారా మనం భగవద్గీతలో అర్థం చేసుకోలేము, భగవద్గీత అనేది మన జీవితానికి దిశా నిర్దేశం చేసే, మంత్రపూరితమైన 700 శ్లోకాల సహిత గ్రంథం. ఈ 700 శ్లోకాలు, అన్ని వేదాల మరియు సమస్త ఉపనిషత్తుల సారంతో నిండి ఉన్నాయి. దీనిలో ఒక ముఖ్యమైన సూత్రం ఏమిటంటే, దీనిని మనం కేవలం మహాపురుషుల, ఆచార్యుల దృక్కోణం నుండి మాత్రమే అర్థం చేసుకోవలెను. దీనిని కేవలం మనం శ్లోకాల వలే చదువుతూ ఉంటే, మనకు వీటి భావము అర్థం కాదు. మహాపురుషులు దీనిని లోతుగా అధ్యయనం చేసి, దాని సారాన్ని మనకు వివరిస్తారు, కనుక వారి ద్వారా దీనిని మనం అధ్యయనం చేయగలిగితే, మనం దీనిని సరిగ్గా అర్థం చేసుకోగలము. భగవానుడు ఈ విధంగా వివరిస్తున్నారు, "అర్జునా! ఈ సంపూర్ణ విశ్వం తల క్రిందులుగా ఉన్న రావి చెట్టు వంటిది. దాని మూలం పైకి మరియు శాఖలు కిందకి ఉన్నాయి. తలక్రిందులుగా ఉన్న చెట్టును ఏ విధంగా ఊహించగలం? మన మానవ శరీరాన్ని తీసుకుందాం. దానికి చేయి నరకబడినా, కాలు నరకబడినా లేదా మరేదైనా అవయవం దెబ్బతిన్నా కూడా మనం జీవించే ఉంటాం. కానీ ఏదైనా కారణం చేత మన తల తెగిపోతే మాత్రం మనం జీవించి ఉండలేము. ఎందుకంటే మన మానవ శరీరానికి మూలం తల, మిగతా అవయవాలు లేకపోయినా, మానవుడు జీవించి ఉండగలడు. కానీ, మన శరీరానికి మూలంగా కల శిరస్సు లేకుండా మాత్రం జీవించడం అసాధ్యం. మూలంగా కల శిరస్సు, మన శరీరంలో పైన ఉంటుంది. కింద ఉన్న అవయవాలు అన్ని శాఖల వంటివి. భగవంతునిచే నిర్మించబడిన విశ్వం కూడా ఈ విధంగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఊర్ధ్వమ్ మరియు అధః పదాల అర్థము ఎత్తును బట్టి నిర్ణయించబడదు. ఇక్కడ  ఊర్ధ్వమ్ అనగా ఉన్నత స్థితిగా పరిగణించాలి. రెండవ తరగతి చదువుతున్న విద్యార్థి మూడవ తరగతికి వెళ్ళాడు. రెండవ తరగతి చదువుతున్నప్పుడు అతని తరగతి గది రెండవ అంతస్తులో ఉంది మరియు మూడో తరగతి గది మొదటి అంతస్తులో ఉంది. అతని తరగతి గది యొక్క అంతస్తును బట్టి, అతను కింద స్థాయి తరగతికి వెళ్ళాడు అని చెప్పలేము. వాస్తవానికి అతడు పైతరగతికి వెళ్ళాడు. ఇక్కడ పైన లేదా కింద అనేది దిశను బట్టి కాక, ఆ విద్యార్థి యొక్క జ్ఞానాన్ని బట్టి నిర్ణయించబడింది. దీనిని మనం ఒక కథ రూపంలో తెలుసుకుందాం.
స్వామి రామ్ తీర్థ అనే ఒక సాధువు ఉండేవారు, ఆయన స్వామి వివేకానందుని సమకాలికులు. ఆయన ఆ శతాబ్దంలో అద్వైత వేదాంతం గురించి తెలిసిన జ్ఞాని, లాహోర్ విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్ గా ఉండేవారు. ఆయన చదువుకునే రోజుల్లో, పరీక్షల్లో పది ప్రశ్నలకు గాను ఆరు ప్రశ్నలను రాయవలసి ఉండగా, ఆయన పది ప్రశ్నలకు సమాధానం రాశారు. అప్పుడు ఆ పేపర్లో తప్పులు కనిపెట్టమని, ఆ పరీక్ష పేపర్లు లండన్ కు పంపించారు. వారు ఆయన పేపర్లో తప్పులు కనిపెట్టటంలో విఫలం అవ్వటం చేత, ఆయనకు వందకు వంద మార్కులు వేయడం జరిగింది. ఆ రోజుల్లో ఇది చాలా అరుదుగా జరిగే విషయం. తరువాత ఆయన సన్యాసం తీసుకుని స్వామి రామ్ తీర్థగా మారారు. సన్యాసిగా మారకముందు ఆయన పేరు రామ్ గా ఉండేది. ఆయన ఒక రోజు అమెరికా వెళ్ళవలసివచ్చింది. ఆ రోజుల్లో ఓడ ద్వారా అమెరికా చేరుకోవడానికి 14 రోజుల సమయం పట్టేది. ఆయన అమెరికా ప్రయాణానికి సిద్ధమై, ఆ ఓడలో తన సామానులను చేర్చారు. ఆయనను సాగనింపడానికి ఆయన శిష్యులు కూడా కొందరు వచ్చారు, అంతలో ఒక మహారాజు ఆ ఓడలో ప్రయాణానికి బయలుదేరుతారు. అది చూసిన స్వామీజీ, ఒకే ఓడలో ఇద్దరు మహారాజులు ప్రయాణించలేరు అని, ఆయన తన టికెట్ను రద్దు చేయమని కోరతారు. దానికి వారు ఓడ బయలుదేరే సమయమయింది కావున, టికెట్ రద్దు చేయడం వీలవదు అని చెబుతారు. అప్పుడు ఆయన ఆ ఓడలో ప్రయాణించడానికి నిరాకరించి ఓడ ఎక్కరు. ఓడ వెళ్ళిపోతుంది. తర్వాత ఆయన శిష్యుడు, మరొక టికెట్ను బుక్ చేసి ఇస్తారు. ఆ తర్వాత రోజు ఆయన మరొక ఓడలో ఎటువంటి సామాను, డబ్బు లేకుండా మరియు ఆయన చేరవలసిన ప్రదేశం యొక్క చిరునామా కూడా లేకుండా ప్రయాణం సాగిస్తారు. ఆయన ఆ 14 రోజులు ఏమి ఆహారాన్ని స్వీకరించారు? అనే వివరం మనకి తెలియదు. 14 రోజుల తర్వాత, ఓడ అమెరికా చేరిన తర్వాత, ఆయన అలానే ఆ ఓడలో కూర్చొని ఉంటారు. అప్పుడు కెప్టెన్ వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి ఎవరు అయినా వస్తున్నారా అని అడుగుతారు. దానికి ఆయన సమాధానంగా అవును, ఖచ్చితంగా నన్ను తీసుకొనివెళ్లడానికి వస్తారు అని చెబుతారు. అందుకు ఆ కెప్టెన్ ఎవరు వస్తున్నారు అని అడుగుతారు? అందుకు ఆయన మీరు ఎందుకు నన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్ళకూడదు అని అడుగుతారు. దానికి ఆ కెప్టెన్, తప్పకుండా, అని చెప్పి, ఆయనను తన ఇంటికి తీసుకొని వెళ్తారు. కెప్టెన్ సంతోషంగా ఆయనను తన ఇంటికి తీసుకొని వెళ్తారు. అక్కడ ఆయనకు పూర్తి శాకాహార భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంతలో అక్కడకు కెప్టెన్ యొక్క కొడుకు వస్తాడు. అతను తన తండ్రిని సరళరేఖ అంటే ఏమిటి అని అడుగుతాడు. దానికి ఆ కెప్టెన్, ఆ ప్రశ్నను గణిత ప్రొఫెసర్ అయిన రామ్ తీర్థజీని అడగమంటారు. దానికి ఆయన నేను దీనికి తప్పకుండా సమాధానం చెబుతాను అయితే కేవలం పరీక్షలో ఉత్తీర్ణత కోసం దీని సమాధానాన్ని కోరుకుంటున్నావా లేక నిజమైన సమాధానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతారు. దానికి ఆ కెప్టెన్ పరీక్ష కోసం ఒక సమాధానం మరియు నిజమైన సమాధానం వేరుగా ఉంటాయా అని అడుగుతారు. దానికి సమాధానంగా రామ్ తీర్థజీ ఈ విధంగా చెబుతారు. రెండు బిందువులను కలుపుతూ గీసే అత్యంత చిన్నదైన మార్గం సరళ రేఖ. ఇది అందరూ తెలిపే నిర్వచనం. అయితే మనం ఒక టేబుల్ ని తీసుకొని, దానిమీద రెండు బిందువులను కలుపుతూ గీస్తే, సరళ రేఖ వస్తుంది. ఆ టేబుల్ కి ఆధారం భూమి, మనం అదే భూమి ఒక సరళరేఖను గీసి దానిని రెండు వైపులా పొడిగించుకుంటూ పోతే ఏమి జరుగుతుంది? అది సరళరేఖ అవుతుందా లేక వృత్తంగా మారుతుందా అని అడుగుతారు. అప్పుడు ఆ క్యాప్టెన్ వెంటనే న్యూయార్క్ యూనివర్సిటీలో కల తన స్నేహితునికి, జరిగినదంతా చెప్పి, మనం మన విద్యార్థులకు అసంపూర్ణంగా బోధిస్తున్నాము అని చెబుతాడు. వెంటనే న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అక్కడకు వస్తారు. వారి మధ్య చర్చ జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్న అనేకమంది ప్రొఫెసర్ లకు, రామ్ తీర్థజీకు చర్చ జరుగుతుంది. అప్పుడు ఆయన, ఈ విశ్వంలో శూన్యము తప్ప మరొకటి లేదు అని చెబుతారు. దాని తర్వాత ఏడు రోజులు రామ్ తీర్థజీ శూన్యము పైన అమెరికాలో వివిధ ప్రదేశాల్లో ఉపన్యాసము చేస్తారు మరియు ఆయన అమెరికా చేరుకున్న రోజు నుండి 12వ రోజున ఆయనకు అమెరికా అధ్యక్షుడు విందు ఏర్పాటు చేస్తారు. ఏ వ్యక్తి అయితే ఎటువంటి సామాన్లు, డబ్బు మరియు చిరునామా లేకుండా అమెరికాను చేరుకున్నారో, ఆ వ్యక్తికి కేవలం 12 రోజులలో, అమెరికా అధ్యక్షుడు విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘటన జ్ఞానానికి గల ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది.
ఈ శ్లోకంలో రావి చెట్టు తలకిందులుగా ఉంది అనగా, మనకు ఈ దిశలు అన్ని కేవలం ఈ భూమిపైన మాత్రమే పని చేస్తాయి, దానిని దాటితే అక్కడ ఈ దిశలు ఏవి పని చేయవు. అశ్వత్థ అనే పదంలో “అ” అనగా లేదు, "శ్వ” అనగా రేపు, “స్థ” అనగా స్థిరం, ఏది అయితే నిరంతరం మార్పు చెందుతూ ఉంటుందో, దానిని "అశ్వత్థ" అని అంటారు. ఈ సంసారం ఒక క్షణం ముందు ఉన్నట్లుగా ఇప్పుడు ఉండదు మరియు ఇప్పుడు ఉన్నట్లుగా మరుక్షణం ఉండదు. ప్రతి క్షణం మారుతూ ఉండేదే సంసారం. అశ్వత్థ అనే పదానికి రెండవ అర్థం రావి చెట్టు. భగవానుడు ఇక్కడ రావి చెట్టుని ఎందుకు ఉదాహరణగా ఇచ్చారు? ఎందుకంటే రావి చెట్టుకు ఒక ప్రత్యేకత కలదు. రావి చెట్టులో చంచల స్వభావం ఎక్కువ. గాలి వీచనప్పటికీ దానిలో కదలిక అనేది జరుగుతుంది. మిగతా చెట్ల యొక్క ఆకులు గాలి వీస్తే కదులుతాయి. కానీ, రావి చెట్టు యొక్క ఆకులు గాలి వీచినా, వీచకపోయినా కదులుతూనే ఉంటాయి. ఈ ప్రపంచంలో కూడా ఏదీ స్థిరంగా ఉండదు. కావున, ఇక్కడ భగవానుడు మనకు రావి చెట్టును ఉదాహరణగా చెప్పారు. ఈ సృష్టిలో చంచల గుణం సహజమైనదే, కానీ ఇక్కడ మరో అద్భుతం కలదు, ఈ సృష్టిలో ఏది నాశనం చేయలేనిది. కరోనా వచ్చినప్పుడు అనేక లక్షల మంది చనిపోయారు, అయినప్పటికీ ప్రపంచ జనాభా ఇప్పటికీ 8.2 బిలియన్లకు పైగా ఉంది. అదే విధంగా ప్రపంచ జనాభా ఎన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ భూమి బరువు ఒక గ్రాము కూడా పెరగదు మరియు తరగదు. పదార్థం ఎప్పటికీ నాశనం కాదు, మనం ఒక కాగితాన్ని ముక్కలుగా చింపినా, కాల్చినా, నీటిలో నానబెట్టినా దాని రూపం మారుతుంది తప్ప, నాశనం కాదు. దాని ఆకారంలో మాత్రమే పరివర్తన వస్తుంది. కాగితాన్ని కాల్చివేసినప్పుడు కార్బన్ ఏర్పడుతుంది. తద్వారా అది తన రూపాన్ని మార్చుకుంటుంది, కానీ పదార్థాన్ని మాత్రం ఎప్పటికీ నాశనం మాత్రం చేయలేము. చెట్టు నుండి తయారుచేసిన కాగితాన్ని కర్బన పదార్ధంగా మార్చగలిగాము, కానీ దానిని నాశనం మాత్రం చేయలేము. ఇదే విధంగా ఈ బ్రహ్మాండం కూడా ఎప్పటికీ నాశనము కాదు, కేవలం దాని రూపాన్ని మాత్రమే మార్చుకుంటుంది. ఒక రూపంలో ఉన్న పదార్థం మరొక రూపంలోకి మారుతుంది. మనం చనిపోయిన తర్వాత మట్టిగా మారుతాము. ఎందుకు? మన శరీరంలో గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి అనే పంచభూతాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం మన శరీరాన్ని కాల్చి వేస్తామో, పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరం, పంచభూతాలలో కలిసిపోతుంది. ఇక్కడ ఏదీ నాశనం కాలేదు కేవలం పరివర్తన మాత్రమే జరిగింది.
ఛన్దాంసి యస్య పర్ణాని,యస్తం వేద స వేదవిత్: చెట్టుకు ఉన్న ఆకులు వేదాల వంటివి. మనం ఆకులను లెక్కించగలమా? లేదు, అవి అనంతమైనవి. వేదాలు కూడా అనంతమని భగవానుడు ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు. దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి, వేదాలను తెలుసుకున్నవాడు అని భగవానుడు తెలిపారు. ఇక్కడ "అర్థం చేసుకున్న" అర్థం సందర్భాన్ని బట్టి మారుతుంది. దీన్ని మనం ఒక సంఘటన ద్వారా తెలుసుకుందాం. మన పూజ్య స్వామీజీ, 30 సంవత్సరాలు క్రితం ఒకసారి చెన్నై వెళ్లారు. అక్కడ ఒక ఐదు సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. అతను ఆంగ్ల వార్తాపత్రిక తీసుకొని చదువుతూ కనిపించాడు. ఆ సంఘటనను చూసిన స్వామీజీ ఆశ్చర్యపోయి, "నీకు ఆంగ్లం చదవడం వచ్చా?" అని అడుగుతారు. దానికి ఆ పిల్లవాడు, "అవును నేను చదవగలను" అని సమాధానం ఇస్తాడు. స్వామీజీ ఎంతో కుతూహలముతో, "ఏది చదివి వినిపించు" అని స్వామీజీ అడుగుతారు. ఆ పిల్లవాడు ఈ విధంగా వార్తాపత్రికను చదవటం ఆరంభిస్తాడు. "టి హెచ్ ఈ టి ఐ ఎం ఈ ఎస్ ఐ ఎన్ డి ఐ ఏ" దానికి స్వామీజీ, "ఏంటి చదివావా?" అని అడుగుతారు. ఆ పిల్లవాడు అవును అని అంటాడు. అతను కేవలం ఐదు సంవత్సరాల పిల్లవాడు కావున, అతను తాను చదవగలిగినంత మాత్రమే చదువుతాడు. తను ఏబిసిడి లను నేర్చుకున్నాడు కావున అక్షరాలను మాత్రమే చదవగలిగాడు. తాను ఇంకా పదాలను నేర్చుకోలేదు కావున అతను పదాలను చదవలేడు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఆంగ్లం చదవగలడా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం, "అవును చదవగలడు.". అతను మనం అడుగుతున్న కోణంలో ఆ దినపత్రికను చదవలేడు. ఇదే విధముగా మనం కూడా నాకు తెలుసు అనే పదానికి సమాధానమును, మన మానసిక స్థితిలో మనకు తెలిసిన ఉన్న జ్ఞానాన్ని బట్టి మాత్రమే మనం ఇవ్వగలము. ఒక జర్నల్ ను తీసుకుందాం, దానిలో ఒక చిన్న పిల్లవాడు కేవలం అక్షరాలను మాత్రమే చదవగలడు, కాస్త పెద్ద పిల్లవాడు పదాలను చదవగలడు, మనం వాక్యాలను చదవగలం, కానీ ఒక పీహెచ్డీ చేసిన వ్యక్తి, దాని అసలైన అర్ధాన్ని కూడా గ్రహించగలడు. ఒకటే విషయాన్ని వివిధ రకాల వ్యక్తులు, వివిధ రకాలుగా అర్థం చేసుకుంటారు. ఒక వ్యక్తి తాను స్వీకరించగలిగే జ్ఞానం అనేది, ఆ వ్యక్తి స్థాయిని బట్టి నిర్ణయించబడుతుంది.

15.2

అధశ్చో౽ర్ధ్వం(మ్ ) ప్రసృతాస్తస్య శాఖా, గుణప్రవృద్ధా విషయప్రవాలాః |
అధశ్చ మూలాన్యనుసన్తతాని, కర్మానుబన్ధీని మనుష్యలోకే ।।15.2।।

ఈ సంసారవృక్షమును త్రిగుణములనెడిజలములు తడుపుచుండును. ఆ జలములచే వృద్ధిపొందు శాఖలే దేవమనుష్యతిర్యగ్యోనులలో జన్మించుప్రాణులు, చిగుళ్లే విషయభోగములు. ఈ శాఖలు, చిగుళ్ళు సర్వత్ర వ్యాపించియున్నవి. మనుజులను కర్మాను సారముగా బంధించు అహంకార మమకార వాసనలనెడి వేర్లు, ఊడలు అన్నిలోకములలోను క్రింద, పైన వ్యాపించి ఉన్నవి.

ఈ సంసార వృక్షం అనేది మూడు గుణములు అనే నీటి చేత వృద్ధి చేయబడుతుంది. దేవ, మనుష్య, జంతు యోనులలో జన్మించే ప్రాణులే శాఖలు. వృక్షానికి మూలం పరమాత్ముడు, ఇక్కడ మనం పరమాత్ముడు అనగా సర్వోన్నతమైన శక్తి అయిన పరబ్రహ్మ అనే భావనతో చూడాలి. ఆ పరమాత్మ నుండి మూలకాండము అయిన బ్రహ్మ, సత్వ, రజో, తమో గుణముల ద్వారా సమస్త విశ్వం యొక్క విస్తరణ చేస్తున్నారు. ఏ ఇద్దరి వ్యక్తుల చేతి వేళ్ళు ఒకేలా ఉండవు, వారు మాట్లాడే విధానం, వారి స్వభావం, వారి రంగు, వారి ఆలోచనలు అన్ని భిన్నంగా ఉంటాయి. ఇది కేవలం వ్యక్తుల గురించి ప్రస్తావించినది కాదు, ఈ సృష్టిలో ఉన్న 84 లక్షల యోనిలలో జన్మించిన అనంతమైన జీవులన్నింటిలోనూ ఈ వైవిధ్యం కలదు. కేవలం మన కంటి ఉపరితలంపై నివసించే సూక్ష్మజీవుల సంఖ్య, ఈ ప్రపంచంలోని 8.2 బిలియన్ల జనాభాకు సమానంగా ఉండవచ్చు. ఇంకా మనకు 84 లక్షల జీవరాసులు కలవు. అదేవిధంగా, 14 లోకాలు కలవు. సత్యలోకము, తపోలోకము, జనలోకము, మహర్లోకము, స్వర్గలోకము, భువర్లోకము, భూలోకము వంటి ఊర్వలోకములతోపాటు అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ వంటి అధోలోకాలు కూడా కలవు. భూచర, జలచర, తిర్యచర,స్వేద, యోని, అంధజ, ఉభిజ జీవులతో పాటు రెండు కాళ్ల, నాలుగు కాళ్ల, ఆరు కాళ్ల, ఎనిమిది కాళ్ల మరియు అంతకంటే ఎక్కువ కాళ్లతో నడిచే జీవులు, మొక్కలు, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు, వైరస్ లు వంటి అన్ని జీవరాసులు కూడా సత్వ, రజో, తమో గుణముల నుండి సృష్టించబడ్డాయి. మనుష్య యోనులకు కింద ఇతర జీవులు, జంతురాశుల యోనులు మరియు పైన, భూలోకముకు పైన కల పితృలోకము మరియు గంధర్వలోకము వంటి దేవయోనులు కలవు. భూలోకానికి పైన ఆరు లోకాలు మరియు కింద ఏడు లోకాలు కలవు. ఇన్ని లోకాలలోని యోనులలో నివసించే అన్ని జీవరాసులు కూడా అశ్వత్థ వృక్షం అనే సంసార వృక్షానికి శాఖలుగా కలవు. అహంకారము, ఆకర్షణ మరియు కామము వంటి లక్షణాల కారణంగా ఆత్మ, "శబ్దం, స్పర్శ, రూపం, రుచి మరియు వాసన" అనే ఐదు గుణాలలో చిక్కుకుంటుంది. ఈ ఐదు గుణాలలో చిక్కుకున్న ఆత్మ, కొన్నిసార్లు దేవుడిగా, కొన్నిసార్లు మనిషిగా, మరికొన్నిసార్లు మూఢయోనులలో జన్మ తీసుకుంటుంది. ఇదే విధముగా లక్షల యోనులలో జీవాత్మ జన్మలను తీసుకుంటూనే ఉంటుంది.

15.3

న రూపమస్యేహ తథోపలభ్యతే, నాన్తో న చాదిర్న చ సంప్రతిష్ఠా |
అశ్వత్థమేనం( మ్ ) సువిరూఢమూలమ్, అసఙ్గశస్త్రేణ దృఢేన ఛిత్త్వా ।।15.3।।

ఈ సంసారవృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణంపబడిన రీతిగా లభ్యముగాదు. ఏలనన ఇది ఆదియు, అంతము, సరియైన స్థితియు లేనిది. కనుక అహంకారమమకారవాసనారూపములైన ధృఢమైన వేర్లు, ఊడలు గల ఈ సంసారరూప అశ్వత్థవృక్షమును నిశితమైన వైరాగ్యమనెడి శస్త్రముతో ఖండించి.

ఈ సంసార వృక్షం అనేది, వర్ణింపబడినట్లుగా ఒక వృక్షంలా లేదు. అనగా దానికి ఆది మరియు అంతం లేదా ఒక స్థిరమైన ఆకారం కానీ లేవు. తలక్రిందులుగా ఉన్న రావిచెట్టు అనేది కేవలం ఊహాజనితమైనది మాత్రమే. అంతేకానీ ఇది అదే విధముగా పరిమితమైనదిగా మనం దీనిని ఊహించరాదు. ఈ బ్రహ్మాండం అనంతమైనది. ఒక పరిమితమైన దాని నుండి అపరిమితమైన దానిని మనం ఊహించలేము. అహంకారము, మమకారము మరియు కామము అనే దృఢమైన ఊడల వంటిదే ఈ సంసారం. దానిని నిర్లిప్తత అనే ఆయుధంతో నరికి వేయవలెను. భగవంతుడు ఈ సంసారాన్ని చదరంగంలా చేసి, మనల్ని పావులుగా ఉంచి ఆటలాడుతూ ఉంటాడు.  దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు మరియు ఈ సృష్టి మొత్తంలోని 84 లక్షల జీవరాశులలో భగవానుడు మేధో శక్తిని కేవలం మానవులకు మాత్రమే ఇచ్చాడు. మానవుడు మాత్రమే కర్మలను చేయగలడు. పుణ్య కర్మలు, పాప కర్మలు మరియు క్రియారహితతత్వం ఏదైనా సరే కేవలం మానవునికి మాత్రమే సాధ్యం. మానవునికి మాత్రమే ఈ అర్హత కలదు. అందుకే మన శాస్త్రాలలో ఈ విధముగా ఉన్నది, మనుష్య జన్మ దొరకటం బహు దుర్లభమైనది మరియు ఇది ఎంతో అదృష్టం. ఇది దేవతలకు కూడా సాధ్యం కానిది. దీవెనలు ఇవ్వడం ద్వారా దేవతలకు పుణ్యకర్మ గాని, మనలను కరవడం చేత కుక్కకు పాపకర్మ కానీ అంటవు. పాపము మరియు పుణ్యము అనుభవించడానికి మాత్రమే మానవజన్మ తీసుకుంటారు.  నేను అంటే ఈ శరీరము కాదు మరియు ఈ బుద్ధి కాదు. మనం పుట్టినప్పుడు, మన శరీరం ఎలా ఉండేది? మనం చిన్నగా ఉన్నప్పుడు తీసిన ఫోటోని అది మనదే అని, మనకు తెలియకపోతే మనమే మనల్ని గుర్తుపట్టలేము. మనం ఈ శరీరమే అయితే, మరి మనం మన చిన్నప్పటి ఫోటోని ఎందుకు గుర్తుపట్టలేదు? ఈ శరీరము మనము పుట్టినప్పుడు ఒక రకంగా, ఐదు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక రకంగా, పాతిక సంవత్సరాల వయసులో ఒకరకంగా, 60 ఏళ్ల వయసులో ఒకరకంగా, 80 ఏళ్ల వయసులో ఒకరకంగా మారుతూ ఉంటుంది. శరీరం నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది. ప్రతి మూడు సంవత్సరాలకి, 8 బిలియన్లకు పైగా కణాలు మానవ శరీరంలో మారుతూ ఉంటాయి. మనం మమత కారణంగా మన శరీరంతో సంబంధాన్ని కలిగి ఉంటాము, దీనిని మన సొంతంగా భావిస్తాము, మరియు ఈ శరీరానికి సంబంధించిన సంబంధాలను కూడా నా అని భావిస్తాము. నా కొడుకు, నా బిడ్డ, నా భార్య అంటూ ప్రతిదీ తనకు సంబంధించినదిగా భావిస్తాము మరియు నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఏసీ కావాలి, కాఫీ కావాలి అంటూ అనేక రకాలైన కోరికలతో ఉంటాము. ఇటువంటి అహంకారము, కామము మరియు మమకారములో చిక్కుకున్న కొన్ని లక్షల జన్మలను తీసుకున్నాము. ఆదిశంకరాచార్యులు భజగోవిందం స్తోత్రములో ఈ విధముగా చెప్పారు.
పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం |
ఇహ సంసారే బహు దుస్తారే, కృపయా పరే పాహి మురారే ‖
మనం ఇప్పటికే ఎన్నో లక్షల జన్మలు ఎత్తాము, మరలా జన్మ, మరలా మరణం, మరలా తల్లి గర్భంలోనికి ప్రవేశం, ఈ సంసారం బహు దుర్లభమైనది. దీని నుండి బయటపడడానికి మనం ఏమి చేయవలెను? దీనిని వైరాగ్యం అనే ఆయుధంతో ఖండించవలెను. దీనిపైన ఒక కథ కలదు.
మనమందరం శుకదేవ్ మహాముని గురించి వినే ఉంటాము. ఆయన పరీక్షిత్ మహారాజుకు ఏడు రోజులు భాగవతం వినిపించారు. ఆయన మహర్షి వేదవ్యాస్ యొక్క కుమారులు, ఆయన ఏనాడు నగరంలోనికి అడుగుపెట్టలేదు, కేవలం అడవిలో తపస్సు చేసుకుంటూ జీవించేవారు. ఆయన నైష్టిక బ్రహ్మచారి. ఒకనాడు ఆయనకు ఆయన తపస్సు వల్ల కొంత అహంకారం కలుగుతుంది. ఆయన తన తండ్రి అయిన మహర్షి వేద వ్యాసుడిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. దానికి వేదవ్యాస మహర్షి, దీని సమాధానం కోసం నీవు మిథిలా నగరంలోని జనకమహారాజుని కలవమని చెబుతారు. దానికి శుక మహాముని ఆశ్చర్యపోయి నేను బ్రహ్మచారిని మరియు తపస్విని. నేను ఒక ఒక గృహస్థుడు అయిన క్షత్రియ రాజుని జ్ఞానం కోసం సంప్రదించటమా? అని అడుగుతారు. దానికి వ్యాస మహర్షి అవును, నీవు వెళ్లి ఆయనను కలువు. ఆయన నీకు ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారు అని అంటాడు. శుక మహర్షి ఏనాడు ఏ నగరంలోనూ అడుగుపెట్టలేదు. తాను అయిష్టంగానే మిథిలా నగరానికి బయలుదేరుతాడు. మిథిలను చేరిన తర్వాత ఆయన ద్వారపాలకులను కలిసి జనక మహారాజుని కలవాలి అని చెబుతారు. దానికి ఆ ద్వారపాలకుడు ఆయనను తన గురించి తాను పరిచయం చేసుకోమని అడుగుతారు. దానికి సమాధానంగా శుక మహర్షి తన గురించి, "నేను తత్వవేత్తను, తత్వనిష్టను, వేదవ్యాస మహర్షి యొక్క కుమారుడిని, ఆయన యొక్క సర్వోన్నతమైన శిష్యుడను, బ్రహ్మచారిని, అత్యంత జ్ఞానిని, మహాత్ముడను, వేద పండితుడను, సన్యాసిని, సకల శాస్త్రాలను అనుసరించే వాడిని, గొప్ప జ్ఞానిని, సర్వాశ్రమాతీతుడను, గుణాతీతుడను, సరస్వతీ రూప జ్ఞానిని, శుకదేవ్ మహర్షిని" అని పరిచయం చేసుకుంటారు. ఆ ద్వారపాలకుడు అదే విధముగా జనకమహారాజుకు వివరిస్తాడు. సాధారణంగా జనక మహారాజు ఋషులను, మహర్షిలను ఎంతో గౌరవిస్తారు. మరియు తానే స్వయంగా వెళ్లి, వారిని తన రాజమందిరానికి ఆహ్వానిస్తారు. కానీ ఈసారి ఆ విధముగా జరగలేదు. ఆయన ఆ ద్వారపాలకుడు చెప్పినదంతా విని తాను వేరే పనిలో ఉన్నాను అని శుక మహర్షిని వేచి ఉండమని చెబుతారు. ఆ ద్వారపాలకుడు ఆశ్చర్యపోయి, శుక మహర్షికి అదే విధముగా చెబుతారు. ఏనాడు నగరంలోనికి అడుగుపెట్టని శుక మహర్షి మొట్టమొదటిసారి మిథిలా నగరానికి వస్తారు. ఆయన దీనిని ఘోర అవమానంగా భావిస్తారు. నీవు సరిగానే నా గురించి వివరించావా? అని ఆ ద్వారపాలకుడుని అడుగుతారు. దానికి ఆ ద్వారపాలకుడు అవును, నేను మీరు చెప్పిన విధముగానే మహారాజుకు తెలిపాను అని చెబుతాడు. శుక మహర్షి అక్కడే నిలబడి వేచి ఉంటారు. ఆ ద్వారపాలకులు వారిని ఒక చెట్టు వద్ద విశ్రాంతి తీసుకోమని చెబుతారు. అందుకు శుక మహర్షి నిరాకరించి నిలబడే వేచి ఉంటారు. అలా కొన్ని గంటలు గడుస్తాయి. ద్వారపాలకుడు మరొకసారి మహారాజుకు ఆ విషయాన్ని గుర్తు చేస్తాడు. అయినప్పటికీ జనకమహారాజు అదే విధముగా మహర్షిని వేచి ఉండమని చెబుతారు. ఇదే విధముగా ఒక రోజు, రెండు రోజులు గడుస్తాయి, ప్రతిరోజు ద్వారపాలకుడు వెళ్లి ఇదే విషయాన్ని మహారాజుకు తెలుపుతూనే ఉండేవాడు, ప్రతిరోజు కూడా జనకమహారాజు ఇదే విధముగా చెప్పేవారు. అలా మొత్తం ఏడు రోజులు గడుస్తాయి.  ఈ ఏడు రోజులు కూడా ద్వారం వద్ద శుక మహర్షి నిలబడి ఆహారము మరియు నీరు లేకుండా అలాగే నిలబడి ఉంటారు.
ఏడవ రోజున ఆయన అకస్మాత్తుగా తాను తప్పు చేశాను అని గ్రహిస్తారు. నేను ఆయన నుండి జ్ఞానం స్వీకరించడానికి వచ్చాను అనగా, నేను ఆయన శిష్యుడను అని గ్రహిస్తారు. ఇప్పుడు ఆయన ద్వారపాలకుడి వద్దకు వెళ్లి, జ్ఞానం కోసం తపన ఉన్న, తత్వశాస్త్ర ఆకాంక్షకల శుక మహర్షి మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని మహారాజుకు తెలుపమంటారు. ద్వారపాలకుడు ఈ వార్తను తెలిపిన వెంటనే జనకమహారాజు, "వారిని ఎందుకు నిలబెట్టారు?" అని శుక మహర్షిని తీసుకురావడానికి స్వయంగా పరిగెత్తుకుంటూ వెళ్తారు. "పూజా సామాగ్రిని తీసుకురండి, స్వాగతం చెప్పడానికి కావలసిన ఏర్పాట్లు చేయండి." అంటూ పరిగెత్తుతూ శుక మహర్షిని చేరుకొని దయచేయండి అని అంటారు. ఆయనను లోపలికి తీసుకొనివెళ్లి, ఆసనం పైన కూర్చుండబెట్టి, ఆయన కాళ్లు కడిగి, భోజనం స్వీకరించి విశ్రాంతి తీసుకోమని కోరతారు. తరువాత శుకమహర్షి మహారాజు వద్దకు వెళతారు. అప్పుడు మహారాజు, "ఈ రోజు మిథిలా నగరానికి పవిత్ర దినము, మిథిల వార్షికోత్సవం, ఈ రోజు మేము మా కులదేవతను పూజిస్తాము. ప్రతి సంవత్సరము శ్రేష్టుడైన బ్రహ్మచారి కులదేవతను పూజించడానికి ఉపయోగించే నూనెను నగరానికి తీసుకురావలసి ఉంటుంది. అతను నగరమంతా తిరిగి ఆ నూనెను తీసుకొని వస్తాడు." అని చెబుతారు. మీరు శ్రేష్టుడైన బ్రహ్మచారి మీ వంటి వారు ఈ ప్రపంచంలో మరొకరు లేరు. కావున మీరు కులదేవత పూజకు ఉపయోగించే నూనెను తీసుకొని రండి అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్లి, ఆ నూనెను తీసుకొని రావడానికి కావలసిన రాగి పాత్రను ఆయనకు ఇస్తారు. దాని బరువు సుమారు 15 కేజీలు ఉంటుంది. ఈ నూనె తీసుకువచ్చే క్రమంలో, సైన్యం మీ వెంట వస్తుంది, నగరం మొత్తం మీకు స్వాగతం పలుకుతుంది అని చెబుతారు. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ పాత్ర నుండి ఒక్క చుక్క నూనె కూడా కిందకి కారకూడదు. ఒక్క చుక్క నూనె కిందకి కారినా కూడా, ఆ నూనె కులదేవత పూజకు యోగ్యమైనది కాదు అని చెబుతారు. శుక మహర్షి ఆ పాత్రను తీసుకొని బయలుదేరుతారు. నగరం చుట్టూ సైనిక దళాలు మోహరించబడి ఉంటాయి. నగరం అంతా తివాచీలు పరిచి, సుగంధ పరిమాళాలు చల్లుతూ, నృత్య ప్రదర్శనలతో కోలాహలంగా ఉంటుంది. ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారు. ఆ మార్గం అంతా హర్షద్వానాలు వినిపిస్తున్నాయి. శుక మహర్షికి ఆ భారీ పాత్రతో, ఆ కోలాహలంలో, నూనెను తీసుకొని రావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఆయన చేతులు మొద్దు బారుతాయి. మహారాజు, శుక మహర్షి ముందుకు వచ్చి, ఈ రోజు మిథిలా నగరం అందంగా అలంకరించబడి ఉంది, ఇది అత్యంత సుందరమైన నగరం, నగరం అంతటా కూడా పాటలు మరియు నృత్య ప్రదర్శనలు జరిగాయి. మీకు మా నగరం ఏ విధముగా అనిపించింది అని అడుగుతారు. దానికి శుక మహర్షి, మీరు ఒక చుక్క నూనె అయినా కిందపడకూడదు అనే షరతుపెట్టారు. పూర్తి సమయం నా శ్రద్ధ కేవలం ఈ నూనె కింద పడకుండ జాగ్రత్త పడటం పైననే ఉంది. అవును, నిజమే ఈ నగరం అంతట మీరుచెప్పినవి జరిగాయి. కాని, నాకు ఏమీ గుర్తు లేదు అని అన్నారు. అప్పుడు జనక మహారాజు మీ మొదటి ప్రశ్నకి సమాధానం దొరికింది అని చెబుతారు. నేను ఇంకా మిమ్మల్ని ఏమి ప్రశ్న వేయలేదు అని శుక మహర్షి చెబుతారు. ఈ సంసారంలో జీవిస్తూ, ఏ విధంగా పరమాత్మ పైన మనసు లగ్నం చేయాలి? ఇదే కదా మీరు నన్ను అడగాలని అనుకున్న ప్రశ్న అని, మీ మనసు ఈ నగరం మొత్తం తిరిగిన పిదప కూడా ఈ నూనె పాత్ర పైననే లగ్నం అయినట్లుగానే, నేను ఈ రాజ్యంలో ఉండి పాలన చేస్తున్నప్పటికీ, ఇది నా మనసులో లేదు. నేను కేవలం పైకి మాత్రమే ఇవి అన్నీ నిర్వహిస్తున్నాను, కానీ నా మనసు ఆ పరమాత్మ పైనే ఉంటుంది అని అంటారు.  మనం ఈ ప్రపంచంలో నీటి పైన కమలం వలె జీవించాలి. అది నీటిలోనే పుడుతుంది, నీటిలోనే బ్రతుకుతుంది. కానీ ఒక్క నీటి చుక్క కూడా తనపైన ఉండనివ్వదు. మనం దానిపైన నీరు పోసినప్పటికీ, వాన పడినప్పటికీ ఒక్క నీటి చుక్క కూడా దానిని అంటదు, కిందకి పడిపోతుంది. మనం ఈ లోకంలో జీవించాలి అంటే ఎన్నో పనులను చేయవలసి ఉంటుంది. ఆఫీస్ కి వెళ్ళాలి, వంట ఉండాలి, పిల్లల్ని కూడా పెంచాలి. ఇలా ఎన్ని పనులను చేస్తూ ఉన్నప్పటికీ, మన మనసు మాత్రం పరమాత్మతోనే అనుసంధానించి ఉంచాలి. ఒకవేళ మనం ఈ సంసారాన్ని మన మనసుతో అనుసంధానించబడితే, అది మన మనసులోకి వస్తుంది. మన మనసు భగవంతునితో అనుసంధానించబడితే, ఈ ప్రపంచంలో అన్ని వ్యవహారాలను చూసుకుంటున్నప్పటికీ సంసారం మన జీవితంలోనికి ప్రవేశించదు. ఇదే విధముగా జనక మహారాజు, శుక మహర్షికి ఏడు రోజులలో ఏడు ఉపదేశాలను ఇచ్చారు. వైరాగ్యము అనే శస్త్రముతో మనం అహంకారము, అనురాగము మరియు కామము యొక్క మూలములను నరికి వేయవలెను.

15.4


తతః(ఫ్)పదం (న్) తత్పరిమార్గితవ్యం(య్ఁ) ,
యస్మిన్గతా న నివర్తన్తి భూయః।
తమేవ చాద్యం(మ్) పురుషం(మ్) ప్రపద్యే,
యతః(ఫ్ )ప్రవృత్తిః(ఫ్)ప్రసృతా పురాణీ॥15.4॥

అనంతరము ఆ పరమపదరూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగ అన్వేషింపవలెను. ఆ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగిరారు. అట్టి పరమేశ్వరునినుండియే ఈ పురాతన సంసారవృక్షపరంపర విస్తరించియున్నది. అట్టి ఆదిపురుషుడైననారాయణునే శరణుపొంది, దృఢనిశ్చయముతో ఆ పరమేశ్వరుని మనన, నిధిధ్యాసాదులు చేయవలెను.

వైరాగ్యము అనే శస్త్రముతో, మమతాను రాగాలను తెంపుకున్నప్పటికీ, అది ఆగదు. ఒక దానిని తెంపితే మరొకదానిలో ఇరుక్కుపోవచ్చు. మనమందరం జీవితంలో సాధన చేస్తాము. కొందరు నేను తీపి పదార్థాలను తినను అని అంటారు, కానీ కొన్ని సందర్భాలలో తినేస్తారు. ఒకచోట విడిచిపెట్టగలిగితే, మరొకచోట ఇరుక్కుపోతాము. ఒకచోట ఇరుక్కుపోతే, మరొకచోట విడిచిపెట్టగలము. ఈ విధముగా కొన్ని లక్షల జన్మల నుండి మనం మరలా మరలా జన్మిస్తూ, మరణిస్తూ, తిరిగి తల్లి గర్భంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ జనన మరణ చక్రం నుండి బయటపడిన వారు ఆ పరమాత్ముడిని చేరుకుంటారు.

15.5

నిర్మానమోహా జితసఙ్గదోషా, అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః |
ద్వన్ద్వైర్విముక్తాః(స్) సుఖదుఃఖస ఞ్జ్ఞైః(ర్), గచ్ఛన్త్యమూఢాః (ఫ్)పదమవ్యయం(న్) తత్ ।।15.5।।

దురభిమానమును, మోహమును త్యజించినవారును, ఆసక్తియను దోషమును జయించినవారును, ప్రాపంచికవాంఛలనుండి పూర్తిగా మఱలినవారును, పరమాత్మ స్వరూపమునందు నిత్యస్థితులైనవారును, సుఖదుఃఖాదిద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు.

ఓ అర్జునా! ఈ విధముగా మమతానురాగాలను త్వజించినవారు, నేను అనే మోహాన్ని జయించి, నేను అంటూ ఏమీ లేదు, అంతా కేవలం ఆ పరమాత్ముడు మాత్రమే, నా జన్మ, నా కార్యాలు, అన్ని ఆ భగవంతుని కంటే భిన్నమైనవి కాదు. నేను కేవలం ఈ సంసారంలో భర్తగా, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక ఉద్యోగిగా లేదా ఒక సైనికుడిగా వివిధ రకాలైన పాత్రలలో ఉన్నాను. ఏ విధముగా అయితే, ఒక నాటకములో రాముడు, రావణుడు, హనుమంతుడు వంటి వివిధ రకాలైన పాత్రలు ఉంటాయో, అదే విధంగా యోగులైన వారికి ఈ సంసారంలో నేను కొడుకును కాదు, నేను తండ్రిని కాదు, నేను కేవలం కొడుకు పాత్రలో లేదా తండ్రి పాత్రలో ఉన్నాను. భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి, నేను వివిధ పాత్రలను పోషిస్తున్నాను అని భావిస్తారు. ఒకసారి మనం జిలేబి తిన్నాము అనుకుందాం, మనకు దాని రుచి చాలా బాగా నచ్చుతుంది. మనం ఏ పని చేస్తున్నా, మనకు ఆ జిలేబి రుచి గుర్తు వస్తూ ఉంటుంది. వారం రోజులు అయినా, నెల రోజులు అయినా, ఐదు సంవత్సరాల తరువాత కూడా మనం, "ఈ జిలేబి కాదు, నాతో రండి. నేను చూపిన చోట జిలేబి తినండి. అది చాలా అద్భుతంగా ఉంటుంది" అని అంటాము మరియు ఆ జిలేబి గురించి వర్ణించే సమయంలో మన నోటిలో లాలాజలం కూడా ఊరుతుంది. ఇక్కడ మనం జిలేబి తిననప్పటికీ, దాని రుచి మన ఆలోచనలలో ఇంకా ఉంది. ఇది జిలేబి వలన కాదు, ఇది కేవలం జిలేబి తినాలి అనే కోరిక వలన జరిగింది. అదే విధముగా, మనం సుఖాలను అనుభవించిన తరువాత ఆ వాసనలో చిక్కుకొనిపోతాము. ఆ పరమాత్మున్ని మనసులో స్థిరము చేసుకున్న వారికి ఎటువంటి కోరికలు ఉండవు. వారి సమస్త కామములు ధ్వంసం అయిపోతాయి. మనము ప్రతిరోజు నిర్దిష్ట సమయానికి టీ కావాలి, అది కూడా ఫలానా బ్రాండ్ టీ మాత్రమే కావాలి లేదా ఈ సమయానికి నేను టీవీ చూస్తాను, నాకు ఏసీ కావాలి వంటి సూక్ష్మమైన వాసనలలో ఇరుక్కుపోయి ఉన్నాము. నేను టీవీ లేకుండా, ఫోన్ లేకుండా, ఉండలేను. ఇంటర్నెట్, వాట్సాప్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ లేకుండా ఉండలేను. ఇటువంటివి అన్నీ కోరికల కిందకే వస్తాయి.జ్ఞాని అయినవాడు ఇటువంటి కోరికలు మరియు సుఖదుఃఖముల నుండి విముక్తిని పొందుతాడు. అతను శాశ్వతమైన పరబ్రహ్మ అయిన నన్నే చేరుకుంటాడు అని భగవానుడు చెబుతున్నారు.

15.6

న తద్భాసయతే సూర్యో, న శశాఙ్కో న పావకః| యద్గత్వా న నివర్తన్తే,తద్ధామ పరమం(మ్) మమ ।।15.6।।

స్వయంప్రకాశస్వరూపమైన నాపరంధామమును సూర్యుడుగాని, చంద్రుడుగాని , అగ్నిగాని ప్రకాశింప జేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మఱల ఈ జగత్తున ప్రవేశింపరు. అనగా జన్మింపరు.

శాశ్వతమైన పరబ్రహ్మను చేరిన వారు తిరిగి ఈ లోకానికి రారు. ఆ పరంధామము స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దానిని సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, లేదా అగ్నికాని ప్రకాశింపజేయలేరు అని భగవానుడు తెలిపారు. ఇప్పుడు మనం ఒక కృష్ణ భజనను చేసుకుందాం.
మే నహీ, మేరా నహీ, యహ్ తన్ కిసీ కా హై దియా ।
జో భీ అపనే పాస్ హై, వహ్ ధన్ కిసీ కా హై దియా ॥

దేనే వాలే నే దియా, వహ్ భీ దియా కిస్షాన్ సే ।
మేరా హై యహ్ లేనే వాలా, కహ్ ఉఠా అభిమాన్ సే ।
మే, మేరా యహ్ కహ్నే వాలా, మన్ కిసీ కా హై దియా ॥

మే నహీ, మేరా నహీ, యహ్ తన్ కిసీ కా హై దియా ।
జో భీ అపనే పాస్ హై, వహ్ ధన్ కిసీ కా హై దియా ॥

జో మిలా హై వహ్ హమేశా, పాస్ రహ్ సకతా నహీ ।
కభ్ బిఛడ్ జాయే యహ్ కోయీ, రాజ్ కహ్ సకతా నహీ ।
జిందగానీ కా ఖిలా, మధువన్ కిసీ కా హై దియా ॥

మే నహీ, మేరా నహీ, యహ్ తన్ కిసీ కా హై దియా ।
జో భీ అపనే పాస్ హై, వహ్ ధన్ కిసీ కా హై దియా ॥

జగ్ కీ సేవా ఖోజ్ అపనీ, ప్రీతి ఉన్సే కీజియే ।
జిందగీ కా రాజ్ హై, యహ్ జానకర్ జీ లీజియే ।
సాధనా కీ రాహ్ పర, యహ్ సాధన కిసీ కా హై దియా ॥

మే నహీ, మేరా నహీ, యహ్ తన్ కిసీ కా హై దియా ।
జో భీ అపనే పాస్ హై, వహ్ ధన్ కిసీ కా హై దియా ॥

జో భీ అపనే పాస్ హై, వహ్ సబ్ కిసీ కా హై దియా ।
మే నహీ, మేరా నహీ, యహ్ తన్ కిసీ కా హై దియా ।
జో భీ అపనే పాస్ హై, వహ్ ధన్ కిసీ కా హై దియా ॥

మే నహీ, మేరా నహీ, యహ్ తన్ కిసీ కా హై దియా ।
జో భీ అపనే పాస్ హై, వహ్ ధన్ కిసీ కా హై దియా ॥
మన శరీరం మనది కాదు, అది ఎవరో ఇచ్చిన వరం. మన దగ్గర ఉన్న ధనం, సంపద, బంధువులు అన్నీ కూడా మనం సంపాదించుకున్నవి కాదని, పరమాత్మ ప్రసాదమని గ్రహించాలి. ఇచ్చిన వాడు ఎంత వినయంతో ఇచ్చాడో, కానీ మనం మాత్రం ‘ఇది నాది’ అని అహంకరిస్తాము. నిజానికి ‘నా శరీరం, నా మనసు’ అని అనుకునే ఆ భావన కూడా ఆయన ఇచ్చిందే. మనకు లభించినవి మన దగ్గర ఎప్పటికీ ఉండవు. అవి ఎప్పుడైనా దూరమైపోతాయి, ఎవరూ దాన్ని ఆపలేరు. జీవితం అనేది ఒక తోటలో వికసించే పువ్వులా ఉంటుంది. అది కూడా తాత్కాలికమే, కానీ దానిని కూడా పరమాత్మనే ఇచ్చాడు. అందువల్ల, మనం జగత్తుకు సేవ చేయడమే ధర్మమని తెలుసుకోవాలి. పరమాత్మ పట్ల ప్రేమను పెంచుకోవాలి. ఇదే జీవిత రహస్యం అని తెలుసుకొని జీవించాలి. సాధన మార్గంలో ఉన్న సాధన కూడా ఆయన ప్రసాదమే. మన దగ్గర ఉన్న ప్రతిదీ ఆయన ఇచ్చిన వరమని అర్థం చేసుకుంటేనే మన జీవితం సార్థకమవుతుంది అని హరి నామ సంకీర్తనతో ఆశు గోయల్ జీ ఈ వివేచనను ముగించారు.

ప్రశ్నోత్తరములు
ప్రశ్న 1: మనిషి తన ప్రవృత్తితో సంబంధం లేకుండా, గుణాతీతుడు ఏ విధముగా కాగలడు?
సమాధానం: ఇది కేవలం పరిస్థితులకి సంబంధించిన విషయం. మనం మొదటిగా తామసిక ప్రవృత్తి నుండి రాజసిక ప్రవృత్తికి మరియు తర్వాత రాజసిక ప్రవృత్తి నుండి సత్వ ప్రవృత్తికి చేరుకోవలెను. సత్వ ప్రవృత్తి నుండి నిస్వార్ధతత్వమునకు చేరుకోవలెను. అనగా మన కర్మల యొక్క ఫలితాన్ని త్వజించటం అలవర్చుకోవలెను. ఈ విధముగా మనము గుణాతీతులం కాగలము.

ప్రశ్న 2:
శ్లోకానికి మరియు మంత్రానికి కల భేదం ఏమిటి?
సమాధానం: అన్ని మంత్రాలు శ్లోకాలు కాగలవు, కానీ అన్ని శ్లోకాలు మంత్రాలు కాలేవు. శ్లోకంలో చరణాలు మరియు చంధస్సు ఉంటుంది. సంస్కృతం నేర్చుకున్న ఎవరైనా శ్లోకాలను రాయగలరు కానీ, ఋషుల ద్వారా వెల్లడింపబడినవి మాత్రమే మంత్రాలుగా పరిగణింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్రుడు, శ్రీరామ జయ మంత్రాన్ని సమర్ధ రామదాసు ప్రభువు, హరే రామ్ మంత్రాన్ని నారదముని ఇచ్చారు. ఇలా ప్రతి మంత్రం సిద్ధి కలిగి ఉంటుంది. అందువలన దానిని జపించిన వారికి దాని ప్రయోజనం కలుగుతుంది. భగవద్గీతలోని శ్లోకాలు భగవంతుని ద్వారా వచ్చినవి. కావున అవి మంత్రపూరితమైనవి.

ప్రశ్న 3:
 మనం ఈ సంసారంలో ఇరుక్కుపోయి ఉన్నాము. మన చుట్టూ అబద్ధాలు, మోసము, కోపము దురాశ వంటి దుర్లక్షణాలు అనేకం ఉన్నాయి. మరి మనము పూర్తి సమయం వీటి మధ్య గడిపి, కేవలం 40 నిమిషాల పాటు భగవద్గీత చదవటం ద్వారా, అది మనకు ఏ విధముగా సంక్షేమాన్ని కలిగిస్తుంది? మరియు మనల్ని భ్రాంతి నుండి బయటపడవేస్తుంది?
సమాధానం: ఇది నూటికి నూరు శాతం సాధ్యపడుతుంది. మనం ఎప్పుడైతే భగవద్గీత మార్గంలోనికి వస్తామో, భగవద్గీతను చదివేవానికి భగవంతుని ప్రాప్తి తప్పక లభిస్తుంది. దీనిని నేను ఒక కథ ద్వారా వివరిస్తాను. ఒకసారి నేను స్వామి రాందాస్ మహారాజ్ తో రిషికేష్ లో ఉన్నాను. అప్పుడు స్వామీజీ ప్రవచనం చెబుతూ మధ్యలో, ఇక్కడ ఉన్న మీరందరికి కూడా భగవంతుని ప్రాప్తి తప్పక లభిస్తుంది అని అన్నారు. స్వామీజీ భగవత్ సాక్షాత్కారం పొందిన వారు. ఆయన నోటి నుండి ఈ మాట వెలువడగానే, అక్కడ ఉన్న 2000 మంది ఆశ్చర్యపోయారు. అప్పుడు వారు ఇది ఎప్పుడు జరుగుతుంది? అని అడుగుతారు. దానికి స్వామీజీ సమాధానంగా కొందరు ఈ జన్మలో, మరి కొందరు తదుపరి జన్మలో, ఇంకొందరు 10 జన్మలలో భగవంతుడిని చేరుకుంటారు. కానీ ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆయనను చేరుకుంటారు అని చెబుతారు. గీతా పాఠకునికి భగవత్ ప్రాప్తి నిశ్చయం అని స్వామీజీ చెప్పారు. కాబట్టి, ఇప్పుడు మనం ఈ మార్గంలోనికి వచ్చాము. ఎంత కాలంలో భగవంతున్ని చేరుకుంటాము అనేది, మన వేగాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది, కానీ ఒకనాటికి తప్పకుండా మనం భగవంతుణ్ణి చేరుకోవటం తథ్యం.
మీరు ప్రతిరోజు భగవద్గీత 40 నిమిషాల క్లాస్ వింటూ మరియు శని, ఆదివారాల్లో వివేచనకు గనక హాజరు కాగలిగితే, కేవలం మూడు నెలలలో మీరు భగవద్గీత యొక్క ఫలితాన్ని చూడగలరు. దాని ఫలితం మీ జీవితంలో కనిపించడం మొదలవుతుంది. తద్వారా మీరు ఆశ్చర్యపోతారు మరియు మీరు భగవద్గీతను అవగాహన చేసుకోవడం మొదలుపెట్టి, దానిని మీ జీవితాలలోకి అన్వయించుకుంటారు.

ప్రశ్న 4:
 భగవంతుడు 84 లక్షల జీవరాశులలో మనకు మానవ జీవితాన్ని ప్రసాదించారు. దాని పరమార్ధం ఏమిటి?
సమాధానం: 84 లక్షల జీవరాశులలో కేవలం మానవునికి మాత్రమే, కర్మలను తొలగించుకొని, మోక్షాన్ని పొందే అర్హత ఉంది. ఈ అర్హత దేవతలకు మరియు జంతువులకు లేదు. ఇది కేవలం మానవునికి మాత్రమే కలదు.

ప్రశ్న 5:
 మనం ఈ ప్రపంచంలో కేవలం కొన్ని పాత్రలు పోషించడానికి వచ్చాము. మరి మనం తీసుకునే నిర్ణయాలు కూడా కేవలం భగవంతుడి సంకల్పమేనా?
సమాధానం: ఈ సృష్టి అంతా భగవంతుని శక్తి ద్వారా జరుగుతుంది కానీ, భగవంతుని చిత్తం ద్వారా కాదు. ఏ విధముగా అయితే మీరు మీ పిల్లవానికి కొంత పాకెట్ మనీని ఇచ్చి, అతను దానిని సద్వినియోగం చేసుకుంటాడు అని అనుకుంటారో, అదే విధముగా భగవానుడు కూడా మనకు ఆలోచన శక్తి, తెలివితేటలు, ఇంద్రియాలు, హృదయం అన్నీ ఇచ్చాడు. ఇది కేవలం దీనిని మనం సద్వినియోగ పంచుకోవడానికి ఇచ్చారు. దీనితోపాటు మనకు వాటిని ఉపయోగించుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చారు. దానిని దుర్వినియోగపరిస్తే మనం తిరిగి జన్మలను ఎత్తవలసి ఉంటుంది. సద్వినియోగపరుచుకుంటే మనకు శాశ్వతమైన భగవత్ ప్రాప్తి లభిస్తుంది.

ప్రశ్న 6:
మనం ఏదైనా పనిని చేసేటప్పుడు దానిపైన మనసును ఏ విధముగా లగ్నము చేయాలి? నా మనసు కార్యము పైన శ్రద్ధ మరియు ఏకాగ్రతను పెట్టలేకపోతుంది.
సమాధానం: ఇది కేవలం మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదు, ఇది మన అందరి సమస్య. మనం మన జీవితాలలో అనేక విషయాలను చూస్తూ ఉంటాము. తద్వారా మన మనసులను అనేక రకములైన వ్యర్థములతో నింపుకొని ఉంటాము. అది వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందువల్లనే భగవంతుడు మనకు అటువంటి వ్యర్ధమైన ఆలోచనల, సంఘటనల నుండి దూరంగా ఉండమని చెప్పారు. ఒకసారి స్వామి శరణానంద్ మహారాజ్ ఈ విధంగా చెప్పారు. మన చూపు ఎక్కడ ఉంటుందో, మన దృష్టిని అక్కడ పెట్టాలి, అనగా మన చూపు ఎక్కడ ఉంటుందో, మన మనసును అక్కడ లగ్నం చేయాలి అని అర్థం. మనం తాబేలు వలే ఉండాలి. తాబేలు తనకు అవసరమైనప్పుడు మాత్రమే దానికి కావలసిన అవయవాలను కాళ్లు మరియు తలను బయటకు తీస్తుంది. మనం కూడా మనకు అవసరమైన విషయాల మీద మాత్రమే మన ఇంద్రియాల దృష్టిని ప్రసరించాలి.

ప్రశ్న 7:
మనం మోక్షం సాధించిన తర్వాత మనకు ఉనికి ఉండదు కదా, మరి అక్కడ ఆనందాన్ని అనుభవించేది ఎవరు?
సమాధానం:
మనం మోక్షం సాధించిన తర్వాత, అక్కడ మనకు ఆనందాన్ని అనుభవించడానికి ఇంద్రియాలు ఉండవు. మనమే స్వయంగా ఆనందస్వరూపంగా మారుతాము. మనం ఒక సముద్రాన్ని చూసాము అనుకుందాం. మనం మన చేతిని పెట్టి, అందులోనుంచి ఒక నీటి చుక్కను బయటకు తీశాము. ఆ నీటి చుక్కకు రసాయన పరీక్ష జరిపినచో, అది సముద్రపు నీటి బిందువు అని తేలుతుంది. మన చేతిని మరలా ఆ సముద్రంలో పెట్టినచో, ఆ నీటి బిందువు ఆ సముద్రంలో కలిసిపోతుంది. ఇప్పుడు ఆ నీటి బిందువు ఆ సముద్రం నుండి వేరుగా లేదు. అదే విధముగా మనం భగవంతుని నుండి వెలువడిన వివిధ భగవంతుని రూపాలం. మనం తిరిగి ఆ భగవంతున్ని చేరుకోవలెను.

ప్రశ్న 8:
సంస్కృతం చదవటం రాని వారు లేదా వృద్ధులు భగవంతుడిని చేరాలి అనుకుంటే మార్గం ఏమిటి?
సమాధానం:
 సంస్కృతం చదవటం రానివారు, భగవద్గీతను మరొకరు చదువుతుండగా వినటం ద్వారా భగవంతుడికి చేరువకావచ్చు మరియు వారు రామనామ జపం చేయవచ్చు.

ప్రశ్న 9: హిందూ సంప్రదాయంలో ద్వైత, అద్వైత మరియు విశిష్టాద్వైత అని మూడు సిద్ధాంతాలు కలవు, వీటిలో భగవద్గీత ఏ సిద్ధాంతాన్ని అనుసరించింది?
సమాధానం:
భగవద్గీత అన్ని సిద్ధాంతాలను అధిగమించింది. అన్ని సాంప్రదాయాలకు సంబంధించిన సూత్రాలు ఇందులో కలవు. కావున భారతదేశంలోని అన్ని వర్గాల వారు, భగవద్గీతను ఈ సృష్టిలోని ఏకైక దైవ గ్రంథంగా అంగీకరిస్తున్నారు. భగవద్గీత మానవుడికి ఉండవలసిన మంచి లక్షణాలను గురించి వివరించింది. భగవద్గీతలో ఏ వర్గానికి చెందిన వారిని కానీ, శాఖకు చెందిన వారిని కానీ ఖండించలేదు, ప్రశంసించలేదు. కావున భగవద్గీత అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైన గ్రంథం.

ప్రశ్న 10: 
భగవంతున్ని పొందడానికి సులభమైన మార్గం భక్తి అని అంటారు కదా. అటువంటప్పుడు మనకు జ్ఞానమార్గముతో పని ఏముంది?
సమాధానం:
మన మనసు చాలా చంచలమైనది, మనం ఈ జన్మలో మరియు పూర్వజన్మలో అనేక విషయాలను గురించి తెలుసుకొని ఉన్నాము. మనం ప్రతి ఒక్క విషయంలోనూ ప్రాథమిక అవగాహనను కలిగి ఉండటం అవసరం. ఒకవేళ ఒక పిల్లవాడి జీవిత లక్ష్యం, మంచి వ్యాపారవేత్త కావాలి అని అనుకుందాం. కానీ అతను పాఠశాలకు వెళ్లినప్పుడు అతనికి గణితము, సైన్స్ మరియు ఆంగ్లము వంటి అనేక పాఠాలతో పాటు వివిధ రకాలైన కళలు మరియు ఆటలు కూడా నేర్పుతారు. ఇదే విధముగా మనము కూడా భగవద్గీతలోని ప్రతి ఒక్క అంశము పైన ప్రాథమిక జ్ఞానం కలిగి ఉండాలి. తరువాత సాధనకు మనకు అనువైన మార్గం ఎంచుకోవచ్చు.

ప్రార్థన మరియు హనుమాన్ చాలీసా పఠనముతో ఈనాటి వివేచన కార్యక్రమము ముగిసినది.